మొలకెత్తిన బుట్టను కిందికి తెస్తున్న యువతి(ఫైల్)
- తీజ్ వేడుకలకు వేదిక కానున్న బద్దిపడగ
- తండాలో వెల్లివిరుస్తున్న ఆనందోత్సవాలు
- దేవుడు కరుణించాలని తొమ్మిది రోజుల పాటు పూజలు
నంగునూరు: బంజారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే తీజ్ పండుగ ఉత్సవాలకు బద్దిపడగలోని జేపీ తండా వేదిక కానుంది. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యవతులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం ఈ పండుగ ఆనవాయితీ. తాము చేసిన పూజలకు దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాడని, దీంతో మంచి పంటలు పండుతాయని గిరిజనుల నమ్మకం.
అలాగే తమ ఆరాధ్యదైవమై సంత్ సేవాలాల్ మహరాజ్ పిల్లాపాపలను సల్లంగా చూస్తాడని వారి నమ్మకం. ఈ పండుగ సందర్భంగా మొలకెత్తిన ధాన్యాన్ని భక్తి శ్రద్ధలతో గురువారం చెరువులో నిమజ్జనం చేస్తామని తండా వాసులు తెలిపారు.
తీజ్ ఉత్సవాల నిర్వహణ ఇలా..
ఫిబ్రవరి 15న సేవాలాల్ మహరాజ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆషాఢ, శ్రావణ మాసంలో లంబాడాలు తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. వేడుకల్లో భాగంగా పెళ్లి కాని తొమ్మిది మంది యువతులు సేవాలాల్ మహరాజ్ ప్రతిమను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అలంకరిస్తారు. పూరిపాక ఏర్పాటు చేసి మొదటి రోజు గోధుమలను బుట్టలోపోసి అందులో ఎరువు వేసి ప్రతి రోజూ పూజలు నిర్వహిస్తారు.
తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్ష తీసుకొని రోజుకు నాలుగు పూటలా మొలకలకు నీళ్లు పోస్తూ ఉదయం, సాయంత్రం టెంకాయ కొట్టి నైవేద్యం సమర్పిస్తారు. అలాగే మూడు పూటల మంగళహారతులు ఇస్తూ వారం రోజుల పాటు నియమ, నిష్టలతో పూజలు నిర్వహిస్తారు. రాత్రి పూట యువతులతో పాటు మహిళలు, యువకులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ భక్తి శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తారు. తొమ్మిదవ రోజున ఉదయం కుల పెద్ద ప్రత్యేకంగా చేసిన వంటకాన్ని సేవాలాల్ మహరాజ్‌కు నైవేద్యంగా సమర్పించి అందరికి ప్రసాదం అందజేస్తారు.
బతుకమ్మను పోలిన ఉత్సవం
తొమ్మిది రోజుల వేడుకల్లో భాగంగా చివరి రోజు గిరిజనమంతా కొత్త బట్టలు వేసుకొని మొలకెత్తిన ధాన్యాన్ని గ్రామ కూడలిలో ఏర్పాటు చేసి ముఖ్య అతిథులతో కొబ్బరి కాయలు కొట్టించి పూజలు చేస్తారు. అనంతరం పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ సంబురాల్లో మునిగితేలుతారు. రాత్రి వరకు ఉత్సవాలు నిర్వహించి చెరువులో నిమజ్జనం చేయడంతో తీజ్ ఉత్సవాలు ముగుస్తాయి.
ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి
బంజారాలకు ‘ తీజ్ ’ పెద్ద పండగ. ప్రభుత్వం గత సంవత్సరం నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ సంవత్సరం నిధులు మంజూరు చేయలేదు. బతుకమ్మ పండగ మాదిరిగా నిర్వహించే తీజ్ ఉత్సవాలకు నిధులు విడుదల చేయాలి.