జంగవమ్మ జ్ఞాపకాలు | Story On Sentence To Death To Bhumaiah And Kista Goud | Sakshi
Sakshi News home page

జంగవమ్మ జ్ఞాపకాలు

Published Thu, Jun 20 2019 9:20 AM | Last Updated on Thu, Jun 20 2019 9:20 AM

Story On Sentence To Death To Bhumaiah And Kista Goud - Sakshi

బాలనాగమ్మ కథలో నాగమ్మకు అన్నీ కష్టాలే.. ఇక్కడ కూడా నాగమ్మ ఎన్నో కష్టాలను, కన్నీళ్లను చూసింది. ఆమెపేరు నాగమ్మ అయినందుకు కావచ్చు. దేశచరిత్రలో చీకటి రోజులుగా మిగిలిన ఎమర్జెన్సీ పిడుగు ముత్తునూరు నాగమ్మ కుటుంబం పైన పడింది. గిన్నెదరి హత్యకేసులో విచారణ పూర్తయిన సమయంలోనే ఎమర్జెన్సీ అమలు కావడంతో భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష తప్పలేదు. వారిద్దరికీ వేసిన ఉరిశిక్షను అమలు చేసేందుకు న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే వారికి క్షమాభిక్ష పెట్టాల్సిందిగా దేశంలోని వివిధ సంఘాలన్నీ రాష్ట్రపతిని కలిశాయి. చివరకు ఎమర్జెన్సీ సమయంలో ప్రశ్నించే గొంతులను అణచివేసే చట్టాలు అమ లు చేయడంతో 1975 డిసెంబర్‌ 1న ఆ ఇద్దరికీ ముషీరాబాద్‌ సెంట్రల్‌ జైలులో ఉరిశిక్ష అమలుచేశారు. ఎమర్జెన్సీ సమయంలో వేసిన ఈ శిక్ష దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉరిశిక్ష పడిన వారిలో ఒకరైన భూమయ్య భార్య ఇప్పుడు పూజారి జంగవమ్మగా జగిత్యాల ప్రాంతంలోని గొల్లపల్లి మండలం రాజోలుపల్లిలో  అనాథగానే జీవితాన్ని గడుపుతోంది.   1975 జూన్‌ 25 విధించిన ఎమర్జెన్సీ సందర్భంగా నాగమ్మ జ్ఞాపకాలపై.. సాక్షి ఆమెను కలిసింది. కొసగంటి నాగమ్మ.. పూజారి జంగవమ్మగా చుట్టుపక్కల గ్రామాల్లో సంవత్సరీకాల (తద్దినాలు) పౌరోహిత్యంతో రోజులు వెళ్లదీస్తున్న ఆమె ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను ఇలా వివరించింది. 

ఉరిశిక్ష పై ఉత్తరం వచ్చింది...
1973 ఆదిలాబాద్‌ జిల్లా తిర్యాని మండలం గిన్నెదరి గ్రామానికిచెందిన పెద్ద భూస్వామిని తన భర్త భూమయ్యతో పాటు ఆయన స్నేహితుడు కిష్టాగౌడ్‌లు చంపారు. ఈ కేసు హైకోర్టు విచారించిందని ఆ ఇద్దరికీ ఉరిశిక్ష వేస్తున్నట్లు వైజాగ్‌ సెంట్రల్‌ జైలు నుంచి లేఖ అందింది. భూమయ్యను హత్యకేసులో జైలుకు తీసుకెళ్లిన తర్వాత ఓసారి వరంగల్‌ సెంట్రల్‌జైలుకు వెళ్లి కలిసాను. ఆ తర్వాత దాదాపు ఏడాదికి భూమయ్య, కిష్టాగౌడ్‌లకు ఉరిశిక్ష వేస్తున్నట్లు ఉత్తరం అందింది. ఆతృతతో ఆయనను చూసేందుకు వెళ్లాలని ఎంత ప్రయత్నించినా బస్‌ చార్జీలు దొరకలేదు. దీంతో ఆయనను కలవలేకపోయాను. భూమయ్య జైలుకు వెళ్లిన తర్వాత పుట్టినిల్లు పుట్నూరుకు మూడేళ్లబాబు శంకరయ్యతో కలిసి చివరిసారిగా కలవాలని ఎంత ప్రయత్నించినా బస్సు చార్జీలు దొరకలేదు. భూమయ్య, కిష్టాగౌడ్‌లను ముషీరాబాద్‌ జైలులో ఉరితీసినట్లు ఎవరో రేడియో విని తెలిపారు. ఆ మరునాడు నాలుగురోజులకు అందిన ఉత్తరం తీసుకొని ముషీరాబాద్‌ జైలుకు వెళ్లాను. పోలీసులు తనను అనేక విధాలుగా ప్రశ్నించి చివరికి జైలునుంచి వచ్చిన ఉత్తరం చూపించడంతో భూమయ్యను పూడ్చిపెట్టిన స్థలాన్ని మాత్రం చూపించారు. కనీసం ఆయన జ్ఞాపకంగా ధరించిన బట్టలైనా ఇవ్వాలని జైలు అధికారులను వేడుకున్నా కనికరించలేదు. బట్టలతోపాటు అలాగే పూడ్చిపెట్టామని జైలుసిబ్బంది తెలిపారు. 

రెండుసార్లు వాయిదా... ఆందోళనలో పాల్గొన్న అటల్‌ బిహరీ వాజ్‌పేయ్‌...
భూస్వామి లచ్చుపటేల్‌ హత్యకేసులో మరణశిక్ష ఖాయమైన తర్వాత ముందుగా వైజాగ్‌ సెంట్రల్‌జైలులో ఇద్దరికీ ఉరిశిక్ష వేసేందుకు తేది ఖరారు చేశారు. అప్పటికే విద్యార్థి ఉద్యమాలు బలంగా ఉండడంతో హక్కుల సంఘాల సహకారంతో వైజాగ్‌ న్యాయస్థానం ముందు వారిద్దరికీ మరణశిక్ష ఆపాలంటూ ఆందోళనలు చేపట్టారు. మరోసారి రాజమండ్రి జైలులో ప్రయత్నించగా తిరిగి బంద్‌ పిలుపు ఇవ్వడంతో శిక్షను వాయిదా వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలుచేస్తున్న ఉరిశిక్షను రద్దు చేయాలని ఢిల్లీలో అటల్‌ బిహారీ వాజ్‌పేయ్, శ్రీశ్రీ, జయప్రకాశ్‌ నారాయణ, జార్జ్‌ఫెర్నండేజ్, కేజీకన్నాభిరామ్, ఎస్‌.జైపాల్‌రెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్‌గుప్త, పత్తిపాటి వెంకటేశ్వర్లు ఇలా పెద్ద సంఖ్యలో మేధావులంతా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. అప్పటికే ఇలాంటి సంఘటనలు శ్రీకాకుళం జిల్లాలో జరిగాయి. శ్రీకాకుళం జిల్లా తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంత రమణారెడ్డి, శంకర్‌రెడ్డి, రామకృష్ణలకు సెషన్‌కోర్టు మరణశిక్ష విధించగా హైకోర్టు మరణశిక్షను రద్దు చేసి ఆ ముగ్గురిపై సాధారణ శిక్షను అమలుచేశారు.

సరిగ్గా తాళ్లపాలెం లాంటి సంఘటనగానే గిన్నదరిలో జరిగిన లచ్చుపటేల్‌ హత్యకేసును చూడాలంటూ ప్రజాసంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి.  అయితే 1972లో జరిగిన స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఒడిశా ప్రభుత్వం మరణశిక్షలను రద్దు చేసిందని దీని ఆధారంగా భూమయ్య, కిష్టాగౌడ్‌ల మరణశిక్షను రద్దు చేయాలంటూ పలు సంఘాలు డిమాండ్‌లు చేశాయి. ఈ సమయంలోనే 1975, మే11న ఆ ఇద్దరికీ విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ జస్టిస్‌ చిన్నప్పరెడ్డి, జస్టిస్‌ గంగాదర్‌రావులు ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఇక ఆ ఇద్దరూ విడుదల అవుతారని భావించారు. ఆ తర్వాత జూన్‌ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల పాత తీర్పును తిరిగి అమలు చేస్తూ డిసెంబర్‌ 1న ఉరిశిక్ష విధించారు. దేశంలో ప్రజాస్వామిక హక్కులు రదై్దనసమయంగా ఎమర్జెన్సీ సమయాన్ని వర్ణిస్తుంటారు. 

కొసగంటి భూమయ్య, గున్నాల కిష్టాగౌడ్‌లు ఎవరు..?
ఎమర్జెన్సీ సమయంలో ఉరిశిక్షకు గురైన భూమయ్య జంగం పౌరోహితుడు. పెద్దపల్లి డివిజన్‌లోని వెల్గటూర్‌ మండలం ముత్తునూరు గ్రామానికి చెందిన భూమయ్య పౌరోహితం కోసం ఆదిలాబాద్‌ జిల్లాలకు వెళ్లేవాడు. ఆ సమయంలో తిర్యాని మండలంలోని గడలపల్లికి చెందిన గున్నాల కిష్టాగౌడ్, అంబారావు సహకారంతో లచ్చుపటేల్‌ ఆకృత్యాలను తెలుసుకున్నారు. కిష్టాగౌడ్, భూమయ్యలు కలిసి లచ్చుపటేల్‌ను గ్రామ భూస్వామిగా పేర్కొంటూ హతమార్చారు. ఆ తర్వాత ధర్మారం పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి ఆదిలాబాద్‌ జిల్లా కోర్టులో విచారణ జరిపి వరంగల్, ముషీరాబాద్‌ జైళ్లకు తరలించారు. అక్కడి నుంచి విచారణ పూర్తికావడంతో వైజాగ్‌ జైలులో ఉన్న విప్లవకారులు భూమయ్య, కిష్టాగౌడ్‌లకు మద్దతుగా నిలిచి వారిని తమవారిగా, విప్లవపార్టీల కార్యకర్తలుగా ప్రకటించుకున్నారు. అప్పటివరకు ఆ ఇద్దరికీ ఎలాంటి విప్లవపార్టీతో సంబంధం లేకుండానే గిన్నదరి భూస్వామిని హతమార్చి జైలుకెళ్లారు. ఆ తర్వాత 1980లో ఏర్పడిన పీపుల్స్‌వార్‌ పార్టీ భూమయ్య, కిష్టాగౌడ్‌లను అమరవీరులుగా పేర్కొంటూ నివాళులర్పించింది. 
కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి
ఫోటోలు: సతీష్‌రెడ్డి, సాక్షి పెద్దపల్లి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement