Uganda brings anti-LGBTQ law including death penalty - Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కులను వదలరు.. ఇక దొరికితే చంపేస్తారక్కడ!

Published Tue, May 30 2023 1:37 PM | Last Updated on Tue, Oct 17 2023 1:58 PM

Uganda Brings Anti LGBTQ law including death penalty - Sakshi

స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మన దగ్గర సర్వోన్నత న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ పరిధిలోని అంశమని, అయితే వాళ్ల హక్కుల పరిరక్షణ బాధ్యత మాత్రం ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అయితే.. ఇది సహేతుకం కాదని కేంద్రం వద్దంటోంది. స్వేచ్ఛా హక్కులో భాగంగా వివాహ హక్కు కల్పించాలని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్వలింగసంపర్క వ్యతిరేక చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆసక్తికర చర్చకు దారి తీసింది ఆఫ్రికా దేశం ఉగాండా.


తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టానికి ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) ఆమోద ముద్ర వేశారు.దీంతో.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా నిలిచింది ఉగాండా. ఆఫ్రికా ఖండం మొత్తంలో 30 దేశాల్లో సేమ్‌ సెక్స్‌ రిలేషన్స్‌ అనేది నేరం. అందుకుగానూ కఠిన శిక్షలే ఉంటాయి. కానీ, ఉగాండా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా.. మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. 

👉 ఉగాండా చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల బంధం తీవ్ర నేరం. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక సుఖవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అలాంటి రిలేషన్‌షిప్‌లో కొనసాగితే.. తీవ్రంగా పరిగణిస్తారు. జైలు శిక్ష లేదంటే దేశ బహిష్కరణ లాంటి శిక్షలు అమలు చేస్తారు. మరోవైపు అనధికారికంగా.. సంఘం నుంచి సామాజిక బహిష్కరణతో పాటు రాళ్లతో తరిమి తరిమి కొట్టి చంపిన దాఖలాలు, మూక హత్యల ఘటనలూ అక్కడ నమోదు అయ్యాయి. 

ఉగాండా తాజా చట్టం ప్రకారం..  ఒకే లింగానికి చెంది ఉండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే పరస్పర శృంగారంలో పాల్గొనడం, బంధంలో కలిసి జీవించడం, వివాహాలు.. లాంటి నేరాలు చేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారక్కడ. అలాగే హోమో సెక్సువాలిటీని ప్రమోట్‌ చేసినందుకుగానూ 20 ఏళ్ల జైలు శిక్ష సైతం విధిస్తారు.
   
👉 గోల్డ్‌ పెన్‌తో  అధ్యక్షుడు యోవెరీ ముసెవెని చట్టం ప్రతులపై సంతకం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే.. ఉగాండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.  

👉 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉగాండా తాజా నిర్ణయాన్ని మానవ హక్కులకు సంబంధించిన విషాదకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు.  మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తుంది. అందుకు తగ్గట్లే ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా ఆలోచన చేస్తామని ప్రకటించారాయన. 

👉అంతేకాదు సొంత దేశంలో పలు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి కూడా. మరోవైపు ఉగాండా స్ఫూర్తితో కెన్యా, టాంజానియాలు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

👉 ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేకచట్టంపై చర్చ ఈనాటిది కాదు. 2014లో ఉగాండా చేసిన ప్రయత్నాలను గమనించిన పాశ్చాత్య దేశాలు సహాయం నిలిపేయడం, ఆంక్షలు విధించడం, భద్రతా సహకారంపై కోతలు విధించడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. 

👉 అంతకు ముందు 2009లో.. kill the gays(గేలను చంపేయడం) లాంటి ప్రతిపాదనను తీసుకురాగా.. ప్రపంచ దేశాలు, కీలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక అడుగు వెనకేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే చట్టానికి అధ్యక్షుడి ఆమోద ముద్ర పడేలా చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement