lgbtq communnity
-
స్వలింగ సంపర్కులను వదలరు.. చంపేస్తారక్కడ!
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మన దగ్గర సర్వోన్నత న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ పరిధిలోని అంశమని, అయితే వాళ్ల హక్కుల పరిరక్షణ బాధ్యత మాత్రం ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అయితే.. ఇది సహేతుకం కాదని కేంద్రం వద్దంటోంది. స్వేచ్ఛా హక్కులో భాగంగా వివాహ హక్కు కల్పించాలని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్వలింగసంపర్క వ్యతిరేక చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆసక్తికర చర్చకు దారి తీసింది ఆఫ్రికా దేశం ఉగాండా. తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టానికి ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) ఆమోద ముద్ర వేశారు.దీంతో.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా నిలిచింది ఉగాండా. ఆఫ్రికా ఖండం మొత్తంలో 30 దేశాల్లో సేమ్ సెక్స్ రిలేషన్స్ అనేది నేరం. అందుకుగానూ కఠిన శిక్షలే ఉంటాయి. కానీ, ఉగాండా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా.. మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. 👉 ఉగాండా చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల బంధం తీవ్ర నేరం. హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక సుఖవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అలాంటి రిలేషన్షిప్లో కొనసాగితే.. తీవ్రంగా పరిగణిస్తారు. జైలు శిక్ష లేదంటే దేశ బహిష్కరణ లాంటి శిక్షలు అమలు చేస్తారు. మరోవైపు అనధికారికంగా.. సంఘం నుంచి సామాజిక బహిష్కరణతో పాటు రాళ్లతో తరిమి తరిమి కొట్టి చంపిన దాఖలాలు, మూక హత్యల ఘటనలూ అక్కడ నమోదు అయ్యాయి. ఉగాండా తాజా చట్టం ప్రకారం.. ఒకే లింగానికి చెంది ఉండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే పరస్పర శృంగారంలో పాల్గొనడం, బంధంలో కలిసి జీవించడం, వివాహాలు.. లాంటి నేరాలు చేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారక్కడ. అలాగే హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేసినందుకుగానూ 20 ఏళ్ల జైలు శిక్ష సైతం విధిస్తారు. 👉 గోల్డ్ పెన్‌తో అధ్యక్షుడు యోవెరీ ముసెవెని చట్టం ప్రతులపై సంతకం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఉగాండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 👉 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉగాండా తాజా నిర్ణయాన్ని మానవ హక్కులకు సంబంధించిన విషాదకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తుంది. అందుకు తగ్గట్లే ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా ఆలోచన చేస్తామని ప్రకటించారాయన. 👉అంతేకాదు సొంత దేశంలో పలు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి కూడా. మరోవైపు ఉగాండా స్ఫూర్తితో కెన్యా, టాంజానియాలు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉 ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేకచట్టంపై చర్చ ఈనాటిది కాదు. 2014లో ఉగాండా చేసిన ప్రయత్నాలను గమనించిన పాశ్చాత్య దేశాలు సహాయం నిలిపేయడం, ఆంక్షలు విధించడం, భద్రతా సహకారంపై కోతలు విధించడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. 👉 అంతకు ముందు 2009లో.. kill the gays(గేలను చంపేయడం) లాంటి ప్రతిపాదనను తీసుకురాగా.. ప్రపంచ దేశాలు, కీలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక అడుగు వెనకేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే చట్టానికి అధ్యక్షుడి ఆమోద ముద్ర పడేలా చేసుకుంది. -
షాకింగ్ లవ్‌స్టోరీ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న 'ఇద్దరమ్మాయిలు'
చెన్నై: తమిళనాడులోని చెన్నైలో ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కుటుంబసభ్యుల సమక్షంలో తమిళ బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వీరి వివాహ వేడుక జరిగింది. ఇద్దరు తమ తండ్రుల ఒడిలో కూర్చుని పూలదండలు మార్చుకున్నారు. పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుబిక్ష సుబ్రమణి కాగా.. మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన టీనా దాస్. ఈ వివాహానికి తమ కుటుంబసభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని సుబిక్ష ఆనంద పరవశంలో మునిగిపోయారు. ఈమె తల్లిదండ్రులు కెనడాలోని కల్గేరీలో సెటిల్ అయ్యారు. సుబిక్ష భార్య టీనా దాస్ బంగ్లాదేశ్‌లోని కన్జర్వేటివ్ హిందూ కుటుంబానికి చెందినవారు. ఈమె కూడా కల్గేరీలోనే నివసిస్తున్నారు. ఆరేళ్లుగా తామిద్దరం ప్రేమించుకుంటున్నామని, పెద్దలను ఒప్పించడానికి ఇంత సమయం పట్టిందని సుబిక్ష చెప్పారు. బంధుమిత్రుల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో తమ పెళ్లి జరగడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. చార్టెట్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సుబిక్ష.. తాను బైసెక్సువల్ అని నిర్మొహమాటంగా చెప్పింది. 19 ఏళ్ల వయసులోనే తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రలకు తెలిపింది. మాకు అప్పటిదాకా తెలియదు.. సుబిక్ష తల్లి పూర్ణపుష్కల కల్గేరీలో ప్లే స్కూల్‌ను నడుపుతున్నారు. తాను మదురైలో పెరిగానని, తర్వాత ఖతార్‌లో కొన్నాళ్లు నివసించినట్లు ఆమె వెల్లడించారు. కెనడా వెళ్లిన తర్వాతే తమకు ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలిసిందని వివరించారు. సుబిక్ష ప్రేమ విషయం తెలిస్తే బంధువులు, స్నేహితులు తమను ఎక్కడ దూరం పెడతారో అని భయం వేసిందని చెప్పారు. ఎల్జీబీటీ కమ్యూనిటీ గురించి తెలియక తల్లిందడ్రులు తనను అర్థం చేసుకోలేకపోయారని టీనా దాస్ వెల్లడించారు. తనకు ఏదో వ్యాధి ఉందనుకున్నారని పేర్కొన్నారు. పెళ్లయితే అన్నీ సర్ధుకుంటాయని భావించి 19 ఏళ్ల వయసులో తనకు ఓ వ్యక్తితో పెళ్లి చేశారని వెల్లడించారు. ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. సుబిక్షను కల్గేరీలోనే కలిసినట్లు వివరించారు. చదవండి: జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..! -
ట్రాన్స్‌జెండర్ వైద్యురాలికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్‌కు ప్రభుత్వంలో కీలక పదవి లభించింది.అధ్యక్షుడు జోబైడెన్‌కు ఆరోగ్య రంగంలో సహాయకురాలిగా రాచెల్ లెవీన్ నియామకానికి అమెరికా సెనేట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ హక్కుల్ని పరిరక్షిస్తానని ఎన్నికల ప్రచారంలోనే మాట ఇచ్చిన బైడెన్ ఈ ఏడాది జనవరిలోనే రాచెల్‌ను అత్యున్నత పదవికి సిఫారసు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీపై వివక్ష ప్రదర్శించేవారు. ఆ వివక్ష సంకెళ్లను బద్దలు కొడుతూ బైడెన్ తీసుకున్న నిర్ణయానికి సెనేట్ మద్దతు ప్రకటించింది. ఆమె నియామకాన్ని 52–48 ఓట్లతో సెనేట్ ఖరారు చేసింది. ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు కూడా రాచెల్‌కు మద్దతు ఇచ్చారు. పెన్సిల్వేనియా స్టేట్ కాలేజీ ఆఫ్ మెడిసన్ పీడియాట్రీషన్‌గా పనిచేస్తున్న 63 ఏళ్ల రాచెల్ ఆరోగ్య రంగంలో అసిస్టెంట్ సెక్రటరీగా కరోనా వైరస్‌పై పోరాటానికి ఏర్పాటు చేసిన బృందానికి నేతృత్వం వహిస్తారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో పని చేస్తూ కరోనా కేసుల కట్టడిలో ఆమె చూపించిన ప్రతిభా పాటవాల్ని గుర్తించిన బైడెన్ రాచెల్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు. -
‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు
తిరువనంతపురం: చెన్నైలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. స్వలింగ సంబంధంలో ఉన్న 22 ఏళ్ల కేరళ మహిళను పోలీసు అధికారులు తన భాగస్వామి ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు ఓ మహిళా పోలీసుతో కలిసి వచ్చి 22 ఏళ్ల యువతిని తమతో బలవంతంగా తీసుకెళ్లారు. కోజికోడ్ నివాసి అయిన ఈ మహిళ ఓ యువతితో ప్రేమలో ఉంది. అయితే ఈ బంధాన్ని సదరు యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో ఆమె అక్టోబర్‌లో తల్లిదండ్రుల ఇంటి నుంచి వెళ్లిపోయి.. చెన్నైలో ఉంటున్న భాగస్వామి వద్దకు చేరుకుంది. 20 రోజుల తర్వాత పోలీసులు చెన్నై వెళ్లి ఆమెను తీసుకెళ్లి కేరళ కోర్టులో హాజరుపరిచారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సదరు యువతి తన ఇష్టం మేరకే మరో మహిళతో కలిసి జీవించడానికి చెన్నై వెళ్లింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సి ఉన్నప్పటికి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా తీసుకు రావడంతో ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. అంతేకాక పోలీసులు బాధితురాలికి, ఆమె భాగస్వామికి లీగల్ సాయం తీసుకునే అవకాశం కూడా కల్పించలేదు. (చదవండి: వివక్షపై విజయానికి రెండేళ్లు..) ఇక ఆదివారం కోర్టులో హాజరయిన సదరు యువతి చెన్నై వెళ్లిపోవడానికి ముందు 10 రోజుల పాటు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటానని మెజిస్ట్రేట్ ముందు తెలిపింది. ఇలాంటి సందర్బాల్లో తల్లిదండ్రులు, బంధువులు పోలీసుల సాయంతో ఎల్జీబీటీక్యూఐఏ యువత హక్కులు, స్వేచ్ఛను హరిస్తున్నారు. కేరళ బాధితురాలి విషయంలో కూడా ఇదే జరిగింది. మేజర్ అయిన యువతి తన ఇష్టం మేరకే చెన్నైలో ఉంటున్న భాగస్వామి దగ్గరకు వెళ్లింది. కానీ పోలీసులు మాత్రం తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సదరు యువతి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అయితే 2018లో ఇలాంటి కేసులో కేరళ హై కోర్టు బాధితురాలికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికి ఇలాంటి సంఘటనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. -
క్యాబ్ డ్రైవింగ్‌లో రాణించింది
ఆర్టికల్ 377ను సడలించినా.. సమాజంలో ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీని ఇంకా చిన్న చూపే చూస్తోంది సమాజం. ‘‘ఏ పనిలో పెట్టుకోరు, మాతో మర్యాదగా మాట్లాడరు, నోటి దురుసుతనమే కాదు చేయి కూడా చేసుకుంటారు. అందుకే చాలామంది ట్రాన్స్జెండర్లు భిక్షాటన, సెక్స్‌వర్క్‌లో దిగుతారు’’ అంటుంది హైదరాబాద్‌కు చెందిన ఓ ట్రాన్స్ ఉమన్ ఆవేదనగా. చుట్టూ ఉన్నవాళ్లు హేళన చేస్తున్నా, అడుగడుగునా అవమానపరుస్తున్నా ఆత్మవిశ్వాసం విడవకుండా ఇంకెంతోమంది ట్రాన్స్జెండర్లు పలురంగాల్లో రాణిస్తూ, తమను వెక్కిరిస్తున్న సమాజానికే పాఠం నేర్పుతున్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వాళ్లలో ముందు వరసలో ఉంటుంది రాణీ కిరణ్. ఒడిషా, భువనేశ్వర్‌కు చెందిన ఆమె కూడా తోటి ట్రాన్స్జెండర్లలాగే మొదట్లో రైళ్లల్లో భిక్షాటన చేసింది. చీదరింపులను ఎదుర్కొంది. ఆత్మాభిమానం దెబ్బతిని ఆ పనికి స్వస్తి చెప్పి ఆటోరిక్షా నడపడం స్టార్ట్ చేసింది. ఇక్కడా తిరస్కారమే ఎదురైంది. జనాలు ఆమె ఆటో ఎక్కడానికి సంకోచించేవాళ్లు. దాంతో పూట గడవక ఆటోకు బ్రేక్ వేయాల్సి ఇచ్చింది. ఆ టైమ్‌లోనే పూరీలో జరిగిన రథయాత్రలో అంబులెన్స్ నడిపే అవకాశం వచ్చింది. కాని ఎంతకాలం? పదిహేను రోజులే. తర్వాత మళ్లీ పని వెదుక్కోవాల్సిన స్థితి. అప్పుడే మేఘనా సాహూ అనే ట్రాన్స్ ఉమన్ గురించి తెలిసింది రాణీకి. ఊబర్‌లో ఫస్ట్ ట్రాన్స్ ఉమన్ డ్రైవర్ ఆమె. ఆ ప్రేరణతో కార్ డ్రైవింగ్ నేర్చుకొని, ఊబర్ వాళ్ల ఇంటర్వ్యూలోనూ నెగ్గింది. దాచుకున్న డబ్బు, కొంత లోన్ తీసుకొని సొంతంగా కారు కొనుక్కొంది. ఇప్పుడు భువనేశ్వర్‌లో ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న ఫస్ట్ అండ్ మోస్ట్ ఎఫీషియెంట్ ట్రాన్స్‌జెండర్ డ్రైవర్ తనే. మహిళా ప్యాసెంజర్లు చాలామంది రాణీ కారులోనే ప్రయాణించడానికి ఇష్టపడ్తారట. ‘‘మగవాళ్లు నడిపే టాక్సీ కన్నా రాణీ టాక్సీ చాలా సేఫ్ అన్నిరకాలుగా. జాగ్రత్తగా డ్రైవ్ చేస్తుంది. సురక్షితంగా గమ్యాన్ని చేరుస్తుంది’’ అంటారు భువనేశ్వర్‌లోని వర్కింగ్ విమెన్.‘‘ఎవరమైనా గౌరవంగా బతకాలనే కోరుకుంటాం. కొంతమందికి పుట్టు్టకతోనే అది ప్రివిలేజ్. మాలాంటి వాళ్లకు ఎంత కష్టపడ్డా దొరకదు’’ అంటుంది రాణీ కిరణ్. ఇప్పుడు రాణీ కిరణ్ చాలామందికి ఆదర్శం. ‘‘నా ప్రతి రైడ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ వస్తుంది’’ అని చెప్తుంది గర్వంగా! -
ఒబామా మెచ్చిన తలపాగా
ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జివాన్‌దీప్. శాన్ డియాగోకు చెందిన ఈయన ఎల్‌జీబీటీక్యూలు జరుపుకునే ప్రైడ్ మంత్ ఉత్సవాల్లో భాగంగా ధరించిన ఇంద్ర ధనుస్సు రంగుల తలపాగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాను ముగ్ధుడిని చేసింది. ప్రైడ్ మంత్ ఉత్సవాలు ప్రారంభమైన జూన్ 1న జివాన్‌దీప్ ట్విట్టర్లో పెట్టిన ఈ ఫోటోకు లక్షకుపైగా లైకులు 15వేలకు పైగా రీట్వీట్లు వచ్చాయి. బైసెక్సువల్ అయిన జివాన్ ఈ ఫోటోకు ‘బై సెక్సువల్ బ్రెయిన్ సైంటిస్టయినందుకు గర్వంగా ఉంది. నా గుర్తింపునకు సంబంధించిన అన్ని అంశాలను(తలపాగా, గడ్డం) వ్యక్తీకరించగలగడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇదే స్వేచ్ఛను ఇతరులు కూడా ప్రదర్శించేలా చూసేందుకు కృషి చేస్తాను’అని కేప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోకు తాజాగా ఒబామా కూడా లైక్ కొట్టారు. ‘జివాన్‌దీప్ మీరు గర్వపడే పని చేశారు . ఈ దేశంలో గేలకు మరింత సమానత్వం కల్పించేందుకు మీరు చేసిన కృషికి ధన్యవాదాలు...అన్నట్టు.. మీ తలపాగా అద్భుతంగా ఉంది. అందరికీ ప్రైడ్ మంత్ శుభాకాంక్షలు.’అని ఒబామా ట్వీట్ చేశారు. జూన్ 4న ఒబామా చేసిన ఈ ట్వీట్‌కు 3 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఒబామా, కెనడా ప్రధాని ట్రూడో ఎల్జీబీటీక్యూలకు మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. 1969 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ లు ప్రైడ్ మంత్ జరుపుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం అమెరికాలోని గ్రీన్విచ్ గ్రామంలోని ఒక బారులో గేలు సంబరాలు చేసుకుంటుండగా పోలీసులు దాడి చేశారు. దాంతో దేశ వ్యాప్తంగా గేలు హక్కుల కోసం ఉద్యమించారు.ఫలితంగా ఇతరులతో పాటు సమానంగా హక్కులు సాధించారు. ఆ ఘటనకు గుర్తుగా ప్రతీ జూన్‌లో ఎల్‌జీబీటీక్యూలు ప్రైడ్ మంత్ నిర్వహిస్తారు. -
రాహుల్‌తో మన మాట
న్యూఢిల్లీ: ‘అప్నీ బాత్ రాహుల్ కే సాథ్’ (రాహుల్‌తో మన మాట) పేరుతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారిని కలుసుకుని మాట్లాడి, దేశ భవిష్యత్తు, ప్రభుత్వాల పని, సమాజంలో రావాల్సిన మార్పులు తదితర విషయాలపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తొలిదశలో భాగంగా ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన ఏడుగురు విద్యార్థులు శుక్రవారం రాత్రి ఢిల్లీలోని ఓ చైనీస్ రెస్టారెంట్లో రాహుల్‌ను కలిశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను బ్రెయిలీ లిపిలోనూ విడుదల చేయడం, ఎల్జీబీటీక్యూలపై వివక్షను రూపుమాపేందుకు లింగ–తటస్థ మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, విద్యావ్యవస్థలో అసమానతలను దూరం చేయడం, సమాజంలో కుల వివక్షను నిర్మూలించడం తదితర విషయాలపై విద్యార్థులు సలహాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సమావేశమని చెప్పి తమను తీసుకొచ్చారనీ, పార్టీ అధ్యక్షుడే రావడంతో తామంతా అవాక్కయ్యామని ఈ భేటీలో పాల్గొన్న ఓ విద్యార్థి చెప్పాడు. రాహుల్ సామాన్యులతో బాగా కలిసిపోయే వ్యక్తి అనీ, తాము చెప్పినవన్నీ ఆయన సావధానంగా వినడమేగాక, మేనిఫెస్టోలో చేర్చేందుకు కూడా ప్రయత్నిస్తామన్నారని విద్యార్థులు వెల్లడించారు. -
‘ఎల్జీబీటీక్యూ’లకు ప్రత్యేక హాస్టల్
కాలేజీ క్యాంపస్‌లలో అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా హాస్టల్స్ ఉంటాయి. అయితే ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్ఎస్) మరో ముందడుగు వేసింది. లింగ నిర్ధారణ కాని వారు, ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా హాస్టల్ వసతి కల్పించింది. వారి హక్కులను గౌరవించింది. ఇలా ఎల్జీబీటీక్యూ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ హాస్టల్ ఏర్పాటు చేయడం దేశంలోనే మొదటి సారి. ‘వ్యక్తుల ఆత్మగౌరవాన్ని తప్పనిసరిగా పరిరక్షించాలి. హుందాగా జీవించే హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తింపు పొందింది...లింగ బేధం కారణంగా వివక్ష చూపరాదు, గౌరవ ప్రదంగా జీవించే హక్కు’ వారికి ఉంది’ సర్వోన్నత న్యాయస్థానం ‘స్వలింగ సంపర్కం’ కేసు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది. వాటిని అక్షరాల ఆచరించి చూపించింది టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (‘టిఐఎస్ఎస్’). ఇలా ప్రారంభమైంది.. జెండర్ న్యూట్రల్స్‌కు క్యాంపస్‌లో ప్రత్యేక హాస్టల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, గత సెప్టెంబర్‌లో జరిగిన విద్యార్థి సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. విద్యార్థి సంఘం ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చారు. హాస్టల్ ఏర్పాటుపై విద్యార్థులు, పాలక వర్గం, బోధనా సిబ్బంది చర్చలు జరిపారు. ప్రత్యేకంగా హాస్టల్ ఏర్పాటుకు యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వారి కోసం ప్రత్యేక వసతి సౌకర్యం కల్పించారు. ఈ హాస్టల్ ఏర్పాటులో విద్యార్థులు, బోధనా సిబ్బంది, యాజమాన్యం సమష్టి కృషి ఉందని విద్యార్థి వ్యవహారాల డీన్ ఆశా బానో తెలిపారు. ఈ హాస్టల్ అవసరాన్ని అందరం గుర్తించాం..అందుకే వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. నిర్ధారణకు కమిటీ ఏర్పాటు హాస్టల్ ఏర్పాటు నిర్ణయం అనంతరం ఓ కమిటీ నియమించారు. హాస్టల్లో ఎవరికి ప్రవేశం కల్పించాలనే అంశంపై కొన్ని నిబంధనలు రూపొందించారు. ప్రధానంగా అమ్మాయిల, అబ్బాయిల హాస్టల్లో చేర్చుకోవడానికి అవకాశం లేని వారికి ఇందులో ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు. అయితే అదే సమయంలో ఎల్జీబీటీక్యూ+ విద్యార్థులను మిగతా వారి నుంచి వేరు చేయాలనేది తమ ఉద్దేశ్యం కాదని గైడ్‌లైన్స్ కమిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ తెలిపారు. ఈ హాస్టల్లో ఉండాలా? వద్దా? అనేది విద్యార్థుల ఇష్టమన్నారు. ఇతరులు కూడా తమకు ఇష్టమైతే ఇక్కడ ఉండొచ్చన్నారు. రూమ్‌కు ఇద్దరు విద్యార్థులు ఉండేలా పది గదులను వీరికోసం కేటాయించారు. ప్రస్తుతం 17 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. మరో మూడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎవరైనా రావొచ్చు సాధారణంగా అమ్మాయిల హాస్టల్‌కు అబ్బాయిలను రానివ్వరు..అబ్బాయిల హాస్టల్లోకి అమ్మాయిలకు ప్రవేశం ఉండదు. అయితే ఈ హాస్టల్‌కు ఎవరైనా రావొచ్చు..రాత్రి పదిగంటలకు వరకు ఇక్కడ ఉండొచ్చు. అందరం కలవడం వల్ల అనేక అంశాలపై ఇక్కడ చర్చలు జరుగుతాయి..విద్యార్థులకు ఇదో కల్చరల్ సెంటర్‌గా ఉంటుందని హాస్టల్ విద్యార్థి అకుంత్ తెలిపారు. ‘నన్ను క్వీర్గా గుర్తించారు .(విపరీత/ వికృత స్వభావం ఉన్నవారు) ప్రస్తుతం అబ్బాయిల హాస్టల్లో ఉంటున్నా.. ఎలా ఉంటుందో చూద్దామని అప్పుడప్పుడూ జెండర్ న్యూట్రల్ హాస్టల్లో ఉంటున్నా. నా అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం, నా బాధలను చెప్పుకునేందుకు స్నేహితులు ఇక్కడ దొరికారని మిథున్ అనే వ్యక్తి తెలిపారు. ఇది తమకొక రక్షిత ప్రదేశంగా ఈ విద్యార్థులు భావిస్తున్నారు. హాస్టల్ ఏర్పాటయింది..అయితే తమ ఎజెండాలోని మరో అంశమైన ప్రత్యేక మరుగుదొడ్ల కోసం కృషి చేయనున్నట్లు దితి లేఖ అనే విద్యార్థి తెలిపారు. -
'గే'లకు మరణశిక్ష విధించాలి!
దేశంలో గే సంస్కృతిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని, అందుకు ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్, కీర్) కమ్యూనిటీకి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మదురైలో వెలసిన పోస్టర్లు ఆ కమ్యూనిటీకి చెందినవారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఆర్లాండ్లోని ఓ నైట్ క్లబ్లో ఓ ఉన్మాది 49 మందిని ఊచకోత కోసిన మర్నాడే ఈ పోస్టర్లు వెలిశాయి. అసహజ శృంగారాన్ని ఆచరించేవారు, ప్రోత్సహించేవారు 'సాంస్కృతిక టెర్రరిస్టులు' అని, వారికి మరణ శిక్ష విధించేందుకు వీలుగా ఇండియన్ పీనల్ కోడ్‌లోని 377వ సెక్షన్ సవరించాలని ఇండియన్ నేషనల్ లీగ్ అనే ముస్లిం పార్టీ డిమాండ్ చేసింది. ఐపీసీలోని 377వ సెక్షన్ బ్రిటిష్ కాలం నుంచి అమల్లో ఉంది. ఈ చట్టాన్ని 1860లో తీసుకొచ్చారు. ఈ చట్ట ప్రకారం మగ, ఆడ లేదా జంతువులతో ఎవరైనా అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడితే వారికి పదేళ్లవరకు జైలుశిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధించవచ్చు, జరిమానా కూడా విధించవచ్చు. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పూర్తిగా రద్దుచేయాలని భారతదేశంలోని గే ఉద్యమకారులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం ఎవరిపైనా ప్రయోగించకపోయినా చట్టం కారణంగా తమపట్ల ప్రజల్లో విద్వేష భావం పెరుగుతున్నదన్నది వారి వాదన. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా గే లకు మరణశిక్ష విధించాలనే డిమాండ్ తీసుకురావడం వారిలో భయాందోళనలను రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ అమెరికా కాలేజీ గోడలపై కనిపించిన ఈ పోస్టర్లను తక్షణమే తొలగించి, అందుకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని గోపీ శంకర్ అనే ఓ గే ఉద్యమకారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇలాంటి పోస్టర్లపై చర్య తీసుకునేందుకు చట్టం అనుమతించదని పోలీసులు చెబుతున్నారు. గేలకు వ్యతిరేకంగా తామేమీ కొత్తగా ఈ డిమాండ్‌ను తీసుకరాలేదని, ఇది ముందునుంచి ఉన్నదేనని, పైగా తాము వేసిన పోస్టర్ 2013లో ముద్రించిందని ఇండియన్ నేషనల్ లీగ్ స్పష్టం చేసింది. గేలు గుమిగూడేచోట గే సంస్కృతికి వ్యతిరేకంగా ఐఎన్ఎల్ కరపత్రాలను పంచుతోందని, ఈ చర్య వల్ల విద్వేషాలు పెరిగే ప్రమాదం ఉందని శంకర్ అంటున్నారు.