కరీంనగర్ జిల్లాలో టీపీఎఫ్ నేత ఆకుల భూమయ్య అంత్యక్రియలు
పెద్దపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా కాచాపూర్ గ్రామంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఉద్యమకారులు, విప్లవాభిమానులు, బంధుమిత్రులు ఆయనకు అశ్రునివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమయ్య భౌతిక కాయాన్ని బుధవారం రాత్రి కాచాపూర్‌కు తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం తన ఇంటి ఆవరణలో భూమన్న పార్థివదేహాన్ని ఉంచారు. జిల్లా నలుమూలలకు చెం దిన ఉపాధ్యాయులు, తెలంగాణవాదులు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు, మాజీ మావోయిస్టులు శ్రద్ధాంజలి ఘటించారు.
హక్కుల సంఘాలు, ప్రజాసంఘాల నేతలు.. రగల్‌జెండా కళాకారులు ఎర్రై దండాలంటూ భూమన్నకు కన్నీటి వీడ్కోలు పలికారు. విప్లవోద్యమాలకు జీవి తాన్ని అంకితం చేసిన మహానేతగా పలువురు కీర్తిస్తూ అంతిమ యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా సీపీఐ మావోయిస్టు పార్టీ రీజినల్ బ్యూరో కార్యదర్శి ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్, భూమన్న మరణాన్ని ఎస్‌ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) చేసిన దారుణ హత్యగా వర్ణిస్తూ పంపిన లేఖను విరసం నేత వరవరరావు చదివి వినిపించారు. దేశంలో అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ కంటే బయట ఉన్న మేథావులే ప్రమాదకారులని చిదంబరం చేసిన వ్యాఖ్యలను రుజువు చేస్తూ భూమయ్య హత్య జరిగిందని వరవరరావు అన్నారు. భూమయ్య అంత్యక్రియల్లో ప్రజాఫ్రంట్, టీజేఎస్, టీఎన్జీవో, పౌరహక్కుల నాయకులు, బంధుమిత్రుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భూమయ్య చితికి ఆయన కుమార్తెలు చారుమతి, కవిత నిప్పంటించారు.