సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్య మంగళవారం రాత్రి హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన మంగళవారంరాత్రి 9.30 గంటల సమయంలో స్కూటర్ (ఏపీ15హెచ్5270)పై అడిక్‌మెట్‌లోని తన నివాసానికి వెళ్తుండగా.. విద్యానగర్ చౌరస్తాలో వెనుక నుంచి వేగంగా దూసుకు వచ్చిన జీహెచ్‌ఎంసీ డింపింగ్ వాహనం (ఏపీ11వీ8385) ఢీకొట్టింది. దీంతో స్కూటర్ మీంచి పడిపోయిన భూమయ్యపై నుంచి లారీ చక్రాలు వెళ్లటంతో అక్కడికక్కడే మృతిచెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేసిన భూమయ్య మూడేళ్ల కిందట ఉద్యోగ విరమణ పొందారు. దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఏపీటీఎఫ్, డీటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పొషించారు.
తెలంగాణ జనసభను మొదట్లో ఆయనే స్థాపించారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ స్థాపించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ.. గద్దర్ తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న తెలంగాణ ప్రజాఫ్రంట్ నేతలు వేదకుమార్, జేఏసీ నాయకులు ఎం.నరసయ్య, మందకృష్ణమాదిగ ఓయూ ప్రొఫెసర్ లక్ష్మణ్ తదితరులు ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు.
రోడ్డుబైఠాయింపు
సంఘటనా స్థలికి చేరుకున్న ఆయన భార్య కుమార్తెలు మృతదేహాన్ని తరలిం చకుండా అడ్డగించారు. డీసీపీ రావాలంటూ డిమాండ్ చేశారు.
పాలేర్ల ఉద్యమమే ప్రాణప్రదం
గోదావరిఖని: కరీంనగర్‌జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య, రత్నమ్మలకు ఏడుగురు కుమారుల్లో ఆకుల భూమయ్య పెద్దవాడు. 1948లో జన్మించిన భూమయ్య 6వ తరగతి వరకు కాచాపూర్‌లో, హెచ్‌ఎస్‌సీ పెద్దపల్లిలో చదివారు. పీయూసీ కరీంనగర్‌లో, డిగ్రీ జమ్మికుంటలో చదివాడు. అక్కడే బీఈడీ చేసే సమయంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉత్తర తెలంగాణ కార్యదర్శిగా వ్యవహరించారు. మొదటిసారిగా దొరలకు వ్యతిరేకంగా పాలేర్లు తమకు వేతనాలు పెంచాలని చేసిన ఉద్యమానికి మల్లోజుల కోటేశ్వరరావు, లచ్చిరెడ్డితో కలిసి నాయకత్వం వహించారు. 1973లో రామగుండం మండలం గుడిపెల్లి జయ్యారంలో టీచర్‌గా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించారు. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయనను ఇబ్బందులకు గురిచేయడానికి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ అనే సంస్థకు సూపర్‌వైజర్‌గా నియమించింది. ఆనాటి నుంచి ఆయన హైదరాబాద్‌లోనే నివాసముంటున్నారు.