ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఆంక్షలు, షరతులు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్, ఓయూ జేఏసీతోపాటు వివిధ తెలంగాణ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మంగళవారం బంద్ ప్రశాంతంగా ముగిసింది. విద్యా సంస్థలు బంద్ పాటించాయి. పలుచోట్ల దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు మూసి ఉంచారు. ర్యాలీలు, మానవహారాలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు.
ఉట్నూర్‌లో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రామారావు ఆధ్వర్యంలో బంద్‌కు మద్దతుగా దుకాణాలు మూసివేయించారు. పాత బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఎలాంటి ఆంక్షలు, షరతులు విధించొద్దని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టును కట్టరాదని, దీనివల్ల 3 లక్షల మంది ఆదిమ గిరిజనులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉమ్మడి రాజధాని కేవలం మూడేళ్లు మాత్రమే సరిపోతుందని వివరించారు. ఉమ్మడి హైకోర్టు విద్యా వ్యవస్థలో ఉమ్మడి విధానం ఉండరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సర్పంచ్ బొంత ఆశరెడ్డి, తెలంగాణ విద్యార్థి వేదిక ప్రధాన కార్యదర్శి రాహుల్ పాల్గొన్నారు. సిర్పూర్, జైనూర్, కడెం, ఖానాపూర్‌లలో పాక్షికంగా జరిగింది. నిర్మల్‌లో పెట్రోల్‌బంక్‌లను మూసిఉంచారు.
తాంసిలో ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కాగజ్‌నగర్, చెన్నూర్‌లలో పాఠశాలలను మూసిఉంచి బంద్‌కు మద్దతు పలికారు. ఆసిఫాబాద్‌లో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దినకర్‌ల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లను మూయించారు.
బంద్ ప్రశాంతం
Published Wed, Feb 12 2014 3:09 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement