సాక్షి, హైదరాబాద్: ప్రజా కూటమి పొత్తులో తెలంగాణ జన సమితి (టీజేఎస్) సొంతంగా 4 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. మరో 4 స్థానాల్లో టీజేఎస్ పోటీ చేస్తున్నా, అక్కడ స్నేహపూర్వక పోటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. కోదండరాం చర్చలు జరిపినా కాంగ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ 4 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. టీజేఎస్‌కు 8 స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ మొదట్లో చెప్పినప్పటికీ 6 స్థానాలపైనే స్పష్టత ఇచ్చింది. మరో 2 స్థానాలను నామినేషన్ల చివరిరోజు వరకూ దాటవేస్తూ వచ్చింది. కాంగ్రెస్ వైఖరిని గ్రహించిన టీజేఎస్ 14 స్థానాల్లో అభ్యర్థులకు బీ– ఫారాలు ఇచ్చి నామినేషన్లు వేయించింది.
గురు వారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఉదయం నుంచి కాంగ్రెస్ నేతలతో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పలుమార్లు భేటీ అయ్యారు. తమకు ఇస్తామన్న 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా చూడాలని కోరారు. తొలుత కేటాయించిన మల్కాజిగిరి, వర్ధన్నపేట, సిద్దిపేట స్థానాలు గాక అంబర్‌పేట్‌లో కాంగ్రెస్ తమ అభ్యర్థిని పోటీ నుంచి విరమింపజేయించి టీజేఎస్‌కు ఇచ్చింది. వరంగల్ ఈస్ట్, దుబ్బాక, ఆసిఫాబాద్, ఖానాపూర్ స్థానాలను కూడా ఇవ్వాలని కోదండరాం కోరినా కాంగ్రెస్ తమ అభ్యర్థులను పోటీ నుంచి విరమింపజేయలేదు.
దీంతో ఈ 4 చోట్ల స్నేహపూర్వక పోటీ తప్పలేదు. టీజేఎస్ నామినేషన్లు వేసిన 14 స్థానాల్లో 8 స్థానాలపై స్పష్టత వచ్చింది. ఇక స్టేషన్ ఘన్‌పూర్ నుంచి నామినేషన్ వేసిన టీజేఎస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థే పోటీలో ఉన్నారు. చర్చల అనం తరం కాంగ్రెస్ అంబర్‌పేట్‌లో తమ అభ్యర్థిని విరమింపజేసి టీజేఎస్‌కు కేటాయించగా, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్, చెన్నూ రు, అశ్వరావుపేట్, మెదక్ స్థానాల్లో స్నేహపూర్వక పోటీకి టీజేఎస్ ప్రతిపాదించినా కాం గ్రెస్ ససేమిరా అనడంతో టీజేఎస్ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
అసంతృప్తిలో టీజేఎస్..
సీట్ల సర్దుబాటు వ్యవహారంలో కాంగ్రెస్ వైఖరి పట్ల టీజేఎస్ తీవ్ర అసహనంతో ఉంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి నెలకొందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి కోసం తమ పార్టీని ఫణంగా పెట్టినట్లు అయిందన్న అసంతృప్తిలో ఉన్నారు. టీజేఎస్ అడ్వొకేట్ విభాగం నేతలు గురువారం పార్టీ కార్యాలయంలోనే ఈ విషయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో ఇవ్వకుండా, స్నేహపూర్వక పోటీ పేరుతో తమ అభ్యర్థులకు నష్టం కలిగించే పరిస్థితిని కాంగ్రెస్ తెచ్చిందన్నారు. ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ పార్టీ కనికరించలేదని కోదండరామే స్వయంగా పేర్కొనడంతో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ తీరుపై భగ్గుమన్నాయి. పొత్తు పేరుతో కాంగ్రెస్.. తమ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేసిందన్నారు. సీట్ల వ్యవహారంలోనే ఇలా ఉంటే రేపు ప్రజా ఆకాంక్షల అమలుకు కాంగ్రెస్ ఎంత మేరకు సహకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment