సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆలోచనల్లో పడింది. కొత్తగా ఏర్పాటు చేసుకున్న పార్టీని సొంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ప్రజాకూటమి పేరుతో వెళ్లడం, పార్టీకి ఒక్కసీటు రాకపోగా, పోటీ చేసిన 8 స్థానాల్లోనూ డిపాజిట్ దక్కని పరిస్థితి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న పంచాయతీ ఎన్నికల విషయంలో పార్టీ ఎలా ముందుకు సాగాలన్న ఆలోచనల్లో పడింది. పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలా? వద్దా? అన్న గందరగోళం నెలకొంది.
సొంతంగా పోటీ చేస్తే ఎంతమేరకు నెగ్గుకురాగలుగుతాం, సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలోపేతం లేని పార్టీని ఎలా ప్రజల వద్దకు చేర్చాలన్న దానిపైనే ప్రధాన దృష్టి సారించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో పార్టీని నడపడం కంటే కాంగ్రెస్‌లో విలీనం చేస్తే సరిపోతుందన్న వాదనలను కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. రేపు పంచాయతీ ఎన్నికల్లోనూ బోర్లా పడితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని పేర్కొంటున్నారు. అయితే పార్టీ ముఖ్య నేతలు కొందరు మాత్రం పంచాయతీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయడం ద్వారానే పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లవచ్చన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాకూటమి పేరుతో కాంగ్రెస్‌తో కలిసినా సరిపోయేదని, అందులోకి టీడీపీ రావడం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరిస్థితుల కారణంగా ఎన్నికల్లో దారుణమైన దెబ్బ తినాల్సి వచ్చిందన్న భావనను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.
చంద్రబాబు లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి మరోలా ఉండేదని పేర్కొంటున్నారు. పార్టీ పోటీ చేసిన 8 స్థానాల్లో కనీసం ఒక్క స్థానంలో అయినా తమకు ప్రజలు అనుకూలంగా తీర్పునిచ్చే అవకాశం ఉండేదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క సీటు అయినా ఉంటే అది టీజేఎస్‌కు ఎంతో బలంగా ఉండేదని, దాంతో పంచాయతీ ఎన్నికలకు వెళితే పార్టీ బలోపేతం అయ్యేదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా టీజేఎస్ ఎలా ముందుకు సాగాలన్న భవిష్యత్తు కార్యాచరణపై మరో వారంలో స్పష్టత వస్తుందని ఆ వర్గాలు అంటున్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే పార్టీ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాలని కోదండరాం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment