సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌పై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేతలు సంపత్ కుమార్, దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్‌లు గురువారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురైనట్టు ఆరోపించారు. కేటీఆర్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరారు.
పొంతన లేని ఫలితాలు వచ్చాయి
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని దగ్గరుండి గమనించినట్టు తెలిపారు. ప్రచారం అప్పటికీ.. పోలింగ్ డే రోజుకి ఏ మాత్రం పొంతన లేని ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు కలిసి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసినట్టు అనుమానం ఉందన్నారు. 2009 ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉన్నట్టు కేసీఆర్ అప్పట్లో చెప్పినట్టు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్, కవిత వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్‌లతో పాటు ఫోన్ నంబర్లపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరిపితే అందుకు కావాల్సిన ఆధారాలు తానే ఇస్తానని అన్నారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్దమైతే వాస్తవాలను నిరూపిస్తానని తెలిపారు. 2014లో తాము ఓడిపోయినప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయలేదని గుర్తుచేశారు. ఎగ్ న్యాక్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఓట్లను పంపించి ట్యాప్ చేశారని ఆరోపించారు.
రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించాలి
దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు పునాది లాంటివని అన్నారు. రాజ్యంగ బద్దమైన ఎన్నికలకు టీఆర్‌ఎస్ తూట్లు పొడించదని విమర్శించారు. ఎన్నికల కమిషన్ పాలక వర్గానికి పాలేరులా మారిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పు జరగలేదని సుప్రీం కోర్టు, హైకోర్టులలో చెప్పిన తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్.. 22 లక్షల ఓట్లను తీసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజత్ కుమార్‌కు లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వారికి కావాల్సిన వారిని గెలిపించుకుని మిగతా వారిని ఓడించారని ఆరోపించారు. ఈవీఎంలు మోరాయించిన అధికారులు పట్టించుకోలేదని అన్నారు. కౌటింగ్ ఫామ్‌లో ఓ లెక్క.. చివరగా తమకిచ్చిన పేపర్లలో వేరే లెక్కలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన చోట జామర్లు పెట్టమంటే ఎన్నికల అధికారులు నిరాకరించారని తెలిపారు.
తెలంగాణను అసెంబ్లీగా చేసుకుని పోరాడుతాం
అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజా క్షేత్రంలో ఫెయిల్ అయ్యామని కాంగ్రెస్ కాళ్లు పట్టుకుంటే తామే టీఆర్‌ఎస్‌కు అధికారం ఇచ్చే వాళ్లమని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోల్ అయిన ఓట్ల కంటే 1056 ఓట్లు ఎక్కువ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ చిన్న తమ్ముడని.. ఆయన పేరు కేడీఆర్ అని విమర్శించారు. 19 ఈవీఎంలను రీ కౌంటింగ్ పెట్టాలని కోరిన ఎన్నికల అధికారులు వినలేదని తెలిపారు. ప్రజలు మా వైపు ఉన్నారని.. ఈవీఎంలు టీఆర్‌ఎస్ వైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. భారతదేశంలోనే అతి ఖరీదయిన ట్యాంపరింగ్ తెలంగాణ ఎన్నికల్లో జరిగిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని పేర్కొన్నారు. తెలంగాణను అసెంబ్లీలాగా చేసుకుని తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment