సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనపై ఇంకా ఊగిసలాట కొన సాగుతోంది. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న జాబితా ప్రకటన.. శనివారమైనా విడుదలౌతుందా లేదా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఖరారు చేసిన 74 స్థానాల అభ్యర్థులను శనివారం ఉదయం ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సీ కుంతియా ప్రకటించినా.. కూటమికి కేటాయించే స్థానాలపై స్పష్టత లేకపోవడంతో ఈ వ్యవహారంలో సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఖరారయ్యాయని చెబుతున్న స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల నుంచి పలు అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో జాబితా ప్రకటన ఆదివారానికి వాయిదా పడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసింది.
సీట్లపై అస్పష్టత.. అభ్యంతరాలు..
కూటమిలోని టీడీపీ, టీజేఎస్, సీపీఐలతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన కాంగ్రెస్ పార్టీ.. ఉమ్మడిగా కూటమి అభ్యర్థుల జాబితాపై ఈనెల 8న ప్రకటన చేస్తామని పేర్కొంది. అయితే అది సాధ్యం కాలేదు. కూటమి పక్షాలకు కేటాయించే స్థానాల సంఖ్యపై కొంత స్పష్టత ఇచ్చినా, ఏయే స్థానాలు కేటాయించారన్న దానిపై అస్పష్టత నెలకొనడంతో జాబితా ప్రకటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘ కసరత్తుల అనంతరం 74 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, తమ తొలి జాబితాను భాగస్వామ్య పార్టీల జాబితాలతో కలిపి ఈ నెల 10న ఉదయం విడుదల చేస్తామని కుంతియా ప్రకటించారు.
అయితే టీడీపీ కోరుతున్న స్థానాల విషయంలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఆ పార్టీ ఆశిస్తున్న శేరిలింగంపల్లి స్థానాన్ని కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ బలంగా కోరుతున్నారు. అలాగే ఎల్బీ నగర్ సీటును టీడీపీ కోరుతుండగా, అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సుధీర్‌రెడ్డి బలంగా ఉండటం.. పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌లోని ఆశావహుల మధ్యే పోటీ ఎక్కువగా ఉండటంతో ఎటూ తేలడంలేదు.
లక్ష్మయ్యకు ఓకే అయితే, మరి కోదండరామ్..?
పటాన్‌చెరు స్థానాన్ని కచ్చితంగా కాంగ్రెస్‌కే కేటాయించాలని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దాన్ని టీజేఎస్‌కు కట్టబెట్టడంపైనా జిల్లా నేతల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పోటీ చేయనున్న జనగామను పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయిస్తారని, అక్కడి నుంచి ప్రొఫెసర్ కోదండరాం పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరగడం గందరగోళానికి తావిచ్చింది. కాగా, ఈ స్థానం నుంచి పొన్నాలే పోటీలో ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే కోదండరాంకు ఏ స్థానం కేటాయిస్తారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
సీపీఐ.. ఊరుకుంటుందా..?
ఇక వరంగల్ వెస్ట్ స్థానాన్ని టీడీపీకి కేటాయిస్తారన్న వార్తల నేపథ్యంలో జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి వర్గం ఆందోళనకు దిగింది. దీంతో ఈ స్థానంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. ఇక కొత్తగూడెం విషయంలోనూ సీపీఐ, కాంగ్రెస్ మధ్య వివాదం రాజుకుంటోంది. ఈ స్థానాన్ని తమకే కేటాయించాలని సీపీఐ కోరుతుండగా, ఇప్పటికే మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్‌రావుకు టికెట్ ఖరారైందని కాంగ్రెస్ వర్గాలు ప్రచారం మొదలుపెట్టడంతో వివాదం ముదురుతోంది. వీటితో పాటే మరికొన్ని స్థానాలపై ఎటూ తేలకపోవడంతో శనివారం అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందా లేదా అనేదానిపై అయోమయం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment