సాక్షి, హైదరాబాద్: దక్షిణాది విస్తరణకు, 2019 లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే బీజేపీకి నాంది అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయడు, మహాకూటమిపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేకులకు కోవర్టుగా మారిందన్నారు. టీడీపీ తెలంగాణ ధోఖా పార్టీ అంటూ అభివర్ణించారు. తెలంగాణ అభివృద్దికి, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలపై చర్చలు జరగాలని, వాటిపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా మురళీధర్ రావు ఏమన్నారంటే ఆయన మాటల్లోనే
ఒంటరిగా ఎదుర్కోలేకనే కూటమి
‘తెలంగాణలో చంద్ర గ్రహణం రాకూడదు. ఫలితాలను చంద్రబాబు నిర్దేశించాలనుకుంటారు. కానీ తెలంగాణలో ఆయన నిర్దేశించే రాజకీయాలు రావు, రాకూడదు. చంద్రబాబు ముక్త్ తెలంగాణ కావాలి, చంద్రబాబు లేని రాజకీయాలు మాత్రమే ఉండాలి. తెలంగాణ ప్రజలను ఒంటిరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ మహా కూటమి తయారు చేసింది. కాంగ్రెస్ నేతలను బెంగళూరు, ఢిల్లీలో కలిసిన చంద్రబాబు.. తెలంగాణలో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో వారితో ఎందుకు పాల్గొనడం లేదు. నరేంద్ర మోదీ సర్కార్ తెలంగాణకు ఇచ్చిన నిధులను ప్రజలకు వివరిస్తాము. తెలంగాణలో మోదీ, అమిత్ షా విస్తృతంగా పర్యటన చేస్తారు. జాతీయ ముఖ్య నేతలతో వందకు పైగా సభలు నిర్వహిస్తున్నాము.
గిరిజన రిజర్వేషన్‌లు ఇవ్వలేకనే..
మత ఆధారిత రిజర్వేషన్లకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకమే. నిజాం గులాంగిరిని, ఖాసీం రజ్వీ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. టీఆర్‌ఎస్ గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేకే ముస్లింలతో ముడిపెడుతున్నారు. దేశంలో జరిగే ఎన్నికలు కుటంబ రాజకీయాలకు, జాతీయవాద రాజకీయాలకు మధ్య జరిగే పోరాటం. రాజస్తాన్‌లో కాంగ్రెస్ నాయకులు భారత్ మాతాకు జై అనొద్దు, సోనియా గాంధీకి జై అనాలన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అర్థమవుతోంది దేశమంటే కాంగ్రెస్‌కు ఎంత అభిమానమో’ అంటూ మురళీధర్ రావు కాంగ్రెస్, టీడీపీలప ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment