ఓటమిలో చాలా రకాలుంటాయ్. ఇది మాత్రం కూటమికి భయంకరమైన ఓటమి. తెలంగాణలో చంద్రబాబు కింగ్‌మేకర్‌గా వెలిగిపోదామని ఉత్సాహపడ్డారు. అనేక రోడ్‌షోల్లో అదే అరిగిపోయిన రికార్డుని వేసుకుంటూ పరమబోరు కొట్టించారు. రాహుల్ సరసన కూర్చుని మహాసభల్ని అడ్రస్ చేయడానికి చంద్రబాబు సంకోచించలేదు. ఇదంతా బీజేపీని గద్దె దింపడానికేనని పదే పదే చెప్పారు. జనం విని, ఆవలించారు. కోదండరాం కూటమిలో చేరడం, అయ్యో పాపం అనిపించుకోవడం ఘోరం. గద్దర్ సరేసరి.
వీళ్లంతా వ్రతాలు పాడు చేసుకుని, కళావిహీనంగా మిగిలారు. వీళ్లంతా ఒకే తాటిమీద నడవడం, ఒకే వేదిక మీద నుంచే ఒకే మైకులో మాట్లాడటం ఒక ‘చారిత్రక ఛండాలం’ అన్నాడొక పెద్దాయన. ఈ కూటమి కెమిస్ట్రీలోంచి పనికిమాలిన ఫలితాలొచ్చాయ్. చేతికందిన పార్టీలన్నింటినీ తెచ్చి ఒక బీకర్‌లో వేశారు. దాని ఫలితం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికీ ఈ దేశ ప్రజమీద అతి చొరవ తీసుకుంటోంది. ఆ నైజానికి స్వస్తి పలకాలని ఒకాయన వాపోయాడు.
మొన్న చిత్తుగా ఓడిన కూటమి పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. పోలింగ్ అయ్యాక కూడా ఓటర్ల నాడిని కనీసం గురికి బెత్తెడుగా అయినా పట్టుకోలేకపోయారు. పైగా ఓటింగ్ మెషీన్లు దగా చేశాయని అర్థంలేని ప్రకటనలు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంటాయ్. పోలింగ్ అయిన మర్నాడు తీరిగ్గా బస్సెక్కి నగరం దాటి వెళ్లాను. ఒక బంజారా తండా దగ్గర దిగాను. తండా మొదట్లో ఒక రావి చెట్టుని ఆనుకుని ఓ పెద్దాయన జోగుతున్నాడు. మధ్య మధ్య మెడమీద పాకుతున్న చీమల్ని దులుపుకుంటున్నాడు. నేను అటూ ఇటూ దిక్కులు చూసి, ఆ పక్కనే ఉన్న బండరాయిమీద చతికిలబడ్డాను.
ఆయన లేచి కూర్చుని ఎవరు ఏమిటన్నట్టు నా వంక చూశాడు. కుశల ప్రశ్నలతో మాటలు మొదలుపెట్టాను. నాలుగు ప్రశ్నలయ్యాక, ‘అసలు సంగతికి రాకూడదూ’ అన్నాడు సూటిగా. వయసు, దానికి తగ్గ అనుభవం నిలువెల్లా తొణికిసలాడుతోంది. నేను ఎంపిక చేసుకుందామనుకుంది సరిగ్గా ఇలాంటి ఓటర్‌నే. ఆడబోయిన తీర్థం ఎదురైంది. ‘... ఎవరు గెలుస్తారు?’ అని సూటిగా అడిగాను. ‘మా వాళ్లంతా కారుకే వేశారు. మరి మా వాళ్లంటే మంద.. ఒకే తీరు. తేడాలుండవ్. మీ పట్నం వాళ్లకి సొంత ఆలోచనలుంటాయ్. అందుకని మీ ఆలోచనలు మేక పెంటికల్లా విడివిడిగా ఉంటాయ్’.
ఆ పోలిక నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ‘... అంతో ఇంతో చేశాడు. ఇంకా చేస్తన్నాడు. ఎవడైనా అంతే. ఇంకా తింటం అంటారా. వీళ్లే నయం. ఈ నాలుగేళ్లలో గుంటలు పూడ్చుకున్నారు. ఇహ మెరకలేసుకోవడమే కాబట్టి కూత్తి తక్కువే తింటారు’. ఆ పెద్దాయన అంచనాకి నాకు నవ్వొచ్చింది. ‘పాపం ఇంటిల్లిపాదీ రాష్ట్రానికే చాకిరీ చేస్తున్నారు గదా’ అనగానే ‘అదేకదా వచ్చిన విమర్శ’ అన్నాను. ‘అదేంది? నాకిప్పుడు నలుగురు బిడ్డలున్నారు. నాకు ఐదెకరాల భూమి ఉంది. అందరూ పొలంలో తలోపనీ చేసుకుంటారు. ఓ కూతురుంది. అది గోచీ బిగించి తాడిచెట్టుకి పాకిందంటే ఉడత లెఖ్ఖ.
కల్లుగీతలు గీసేవాళ్లు దాన్ని నివ్వెరపాటుగా చూస్తారు. పనికొచ్చేవాడు పనిచేస్తే తప్పా? కేసీఆర్ రాగానే నీళ్లమీద పడ్డాడు. కరెంటుని ముందే చక్కపెట్టాడు. పొలాలకి డబ్బు పంచాడు. కాస్త గుక్క తిప్పుకోనియ్యాలి కదా. ఒక్కమాట చెబుతా విను. దేశానికి సొరాజ్జం తెచ్చామని చెప్పి కాంగ్రెసోళ్లు గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పుకుని యాభై ఏళ్లు హాయిగా ఏలారు. ఈయన ఉద్యమం నడిపాడు. రాష్ట్రం తెచ్చాడు. ఇంకోసారి సీటిస్తే ఏమవుతుందనిపించింది. నేను కుర్రతనం నించి ఎర్రజెండా పట్టుకు పెరిగినవాణ్ణి. నాకన్నీ తెలుసు.
నా బీడు భూమికి చెమ్మ తగుల్తుందని నేననుకోలేదు. తగిలింది. అంతమంది కలిసి పాలిస్తే అది కుక్కలు చింపిన విస్తరవుతుంది. శానామంది నాలాగే అనుకున్నారు. ఫలితాలు దానికి తగ్గట్టే ఉంటాయ్’. నేను సంతృప్తిగా లేచి కదిలాను. నా సర్వే పూర్తయింది. ‘ఇలాంటి ఫలితాలు నాలో ఉన్న కమ్యూనిస్టుకి అక్కసుగానే ఉంటది. అందుకే వాడు గొర్రె కసాయి వాణ్ణే నమ్ముద్ది’ అని అరుస్తున్నాడు. దూరానికి ఆ మాటలు వినిపించాయి.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు
Comments
Please login to add a commentAdd a comment