sree ramana
-
కొండల్రావ్... ఆనప్పాదా?
అక్షర తూణీరం ఆయన పేరు చెప్పగానే తెలుగు మేస్టారు ఆయన మాటలు గుర్తొచ్చి నవ్వు తెప్పిస్తాయి. రావి కొండల్రావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అన్నిటికీ మించి ప్రఖ్యాత నటి రాధాకుమారిని కట్టుకున్న భర్త. కొండల్రావు నాటక రచయిత, స్టేజ్ నించి వెండితెరకెక్కిన నటుడు, పత్రికా రచయిత, పత్రికా సంపాదకులు, దర్శకులు, ప్రయోక్త ఎందరో ప్రముఖులకు తలలో నాలుక, కళాప్రపూర్ణ బిరుదుని సార్థకం చేసుకున్న విలక్షణ వ్యక్తి మొన్న జూలై 28న 88వ ఏట కాలధర్మం చెందారు. కొండల్రావ్ శ్రీకాకుళం నించి వస్తూ వస్తూ తనకు చిన్నప్పుడు చదువు చెప్పిన తెలుగు మేస్టారిని భుజాల మీద ఎక్కించుకు వచ్చారు. మేస్టారి మేనరిజమ్స్‌ని రకరకాలుగా ప్రదర్శిస్తూ దర్శింపచేస్తూ తెలుగు మేస్టారిని మద్రాసు, ఆంధ్రా, రాష్ట్రాలలో ప్రాచుర్యం తెప్పించి, ఆ పాత్రని చిరంజీవిగా కొండల్రావ్ నిలబెట్టారు. ఇంతకుమించిన గొప్ప గురుదక్షిణ మరొకటి ఉండదు. నాలుగిళ్ళ సావిడి, కుక్కపిల్ల దొరికింది కొండల్రావుకి పేరు తెచ్చిన నాటకాలు. తెలుగు మేష్టారు ఓ రోజు శిష్యుడి ఇంటిముందు ఆగారు. ఇంటిమీద ఆనప్పాదు ఆనూపంగా అల్లుకుని వుంది. తెరచాప చూసి ‘కొండల్రావ్..! ఆనప్పాదా?’ అని ప్రశ్నించారు. శిష్యుడు క్షణం తడబడకుండా ‘కాయట్లేదు మేష్టారూ’ అని వినయంగా స్పష్టంగా జవాబు యిచ్చాడు. దాంతో తెలుగు మేస్టారు తోక తొక్కిన త్రాచులా లేచారు. రాస్కెల్ నేనడిగిందేమిటి, నువ్ చెప్పేదేమిటి? కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు అది ఆనప్పాదైతే ఆనప్పాదని లేదూ బీరపాదైతే బీరపాదని, కాదూ చిక్కుడైతే చిక్కుడనీ లేదూ నాశార్థం పాదైతే నాశార్థం పాదు, నీ శార్ధం పాడైతే ఆ పాదూ అని చెప్పి అఘోరించాలి. కాయట్లేదు మేష్టారూ ఏమిట్రా బటాచోర్ ! ఏవిరా, నీ ఇంటికాయలు తినే ఇంతవాణ్ణి అయానా దొంగరాస్కెల్! అసలు నేనేమడిగాను, నువ్వేం చెప్పావ్! అయ్యారండి కొంచెం మీరు జడ్జిమెంటింగ్ ఉండాలి... వీడు నా క్లాసు మీటు (తెలుగు మేస్టారు ఇంగ్లిష్‌లో పరమపూర్, ఇంగ్లిష్ మీద చాపల్యం మెండ్. క్లాస్‌మీట్ అంటే స్టూడెంట్ అని భావించాలి) వీడిని కొండల్రావ్ ఆనప్పాదా అని అడిగినపుడు వాడేం చెప్పాలండీ... అని మేస్టారు మళ్ళీ మొత్తం లూప్ వేస్తారు. ఇలాగే మనిషి మనిషికీ చెప్పి వేష్టపడడంతో యీ ఫార్స్ వినోదాన్ని పంచుతుంది. విషాదం కూడా తొంగి చూస్తుంది. ఈ మహత్తర సన్నివేశాన్ని సంగీత కోవిదుడు ప్రతి సభలోనూ ఎలాగ సరికొత్త సంగతులతో కొత్త మెరుపులు అద్దు తాడో.. రావి కూడా అలాగే మనోధర్మంతో పలుకులకి నగిషీలు చెక్కేవారు. ఈ సంకీర్తన గంటసేపు జనరంజకంగా నడిచేది. మన కథల మేష్టారు కాళీపట్నం రామారావు. రావి కొండల రావు ఒకే ప్రాంతం వారు. ఒకే బడి విద్యార్థులు కూడా ‘ఆ తెలుగు మేస్టారు నాకూ అయ్యవారే. కానీ కొండల్రావ్ భూత ద్దంలోంచి చూపిస్తూ వేదిక లెక్కించి హాస్యం జోడించి మేష్టా రుని నవ్వుతాలు చేశారు’ అని కాళీపట్నం ఒకసారి చాలా సౌమ్యంగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. కళాకారుడు కళా ప్రపూర్ణుడు అయినవాడు అంతమాత్రం చనువు చొరవ తీసుకోవడంలో తప్పేముంది? గురుభక్తితోనే యింతటి అక్షరా భిషేకం చేశాడని అనుకోవచ్చు. 1965లో ఆదుర్తి సుబ్బారావు అంతా కొత్తవారలే, కొత్త తారలే అంటూ తేనెమనసులు సినిమా తీశారు. హీరో కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి రావి కొండల్రావ్ ఆ వరదలో వచ్చినవారే! చందమామ ఆవరణలో రచన నించి నిర్మాణ నిర్వహణలు దాకా రక్తి కట్టించారు. డాల్టన్ ప్రెస్ నుంచి వచ్చిన ‘‘విజయచిత్ర’’ సినిమా పత్రిక ఎవర్ గ్రీన్ సినిమా మ్యాగజైన్. గాసిప్స్ గాలి కబుర్లు లేకుండా మల్టీకలర్లో చక్కని ఘుమఘుమలతో వచ్చేది. విజయచిత్రకి దాదాపు పాతికేళ్లు ఎడిటర్‌గా పనిచేసిన ఘనత కొండల్రావ్ది. బాపు రమణలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నడిపిన జ్యోతి మాసపత్రిక, సంపాదక వర్గంలో రావి వున్నారు. ‘సుకుమార్’ ఆయన కలం పేరు. బాపురమణ, వీఏకే, శ్రీశ్రీ, ఆరుద్ర, నండూరి ఇత్యాదులందరికీ సుకుమార్ చాలా ఆత్మీయులు. మద్రాస్ తెలుగు సాంస్కృతిక సంస్థలకు లోగోగా ఉండేవారు రావి కొండల్రావ్. అయన సినిమా కబుర్ల పుట్ట. కడదాకా ఆయన జ్ఞాపకశక్తి, నలుగురికీ చెప్పాలనే చాపల్యం సడలలేదు. కెరీర్లో లెక్కకి 500 సినిమాలలో కనిపించినా, ఒక పాతిక వేషాలు ఎన్నదగినవి. ఆయన రాసిన తెలుగు సినిమా చరిత్ర, నాగావళి నించి మంజీరా దాకా జ్ఞాపకాల కబుర్లు వాసి కెక్కాయి. అది మద్రాస్ ఎయిర్‌పోర్టు. అన్నగారు ఎదురుపడితే నమస్కరించారు కొండల్రావ్. ఆయన చిరునవ్వు నవ్వి ‘బ్రదర్! దుర్యోధనుడు లాంటి నెగెటివ్ క్యారెక్టర్‌కి ఎవరైనా శృంగార భరిత డ్యూయెట్ పెడతారా’ అని సూటిగా అడిగారు. వెంటనే తడుముకోకుండా ‘ఛీ.. ఛీ ఎవరూ పెట్టరండీ’ అన్నారు రావు కరాఖండిగా. యన్టీఆర్ విశాలంగా నవ్వి ‘మేం పెట్టాం బ్రదర్.. వినండి’ అంటూ చేతిలో ఉన్న టేప్‌రికార్డర్ మీట నొక్కారు. ‘చిత్రం... విభళారే చిత్రం’ (పాట) ఇవ్వాళే రికార్డ్ చేశాం. మన రెడ్డిగారు రాశారంటూ వినిపించారు. కొండల్రావుకి మొహం ఎట్లా పెట్టాలో అర్థం కాలేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో చెబుతుండేవారు. అన్ని రంగాలలో సత్కీర్తి గడించిన కొండల్రావ్ ధన్యజీవి. ఆయనతో ఉన్న వేల వేల జ్ఞాపకాలకు అంజలి ఘటిస్తూ.... (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
అన్నదాతా! సుఖీభవ!
అక్షర తూణీరం మన గణాంకాలలో జనాభాలో ఎనభై శాతం మంది వ్యవసాయంపై జీవిస్తు న్నారని చెప్పుకోవడమేగానీ దానికి తగిన ప్రోత్సాహం లేదు. రైతు మట్టి మీద మమకారంతో, తను కాడికింద పారేస్తే తిండి గింజలు ఎవరు పండి స్తారనే బెంగతో కొన్ని వందల సంవ త్సరాలుగా లాభ నష్టాలతో పని లేకుండా కాడి మోస్తున్నాడు. రైతు అమాయకత్వాన్ని తరతరా లుగా మన రాజకీయ నాయకులు చక్కగా వాడుకుంటున్నారు. బస్తీ వాసుల్లాగా పల్లెవాసులు రోడ్లు అడగరు. వీధి దీపాలు కోరరు. చదువులకి బళ్లు, వైద్యానికి ఆసుపత్రులు ఆశించరు. రకరకాల ధాన్యాలు, కూరలు, పళ్లు, పాలు రైతు కష్టంలోంచే వస్తాయి. ఆరుగాలం కష్టించి పండిస్తే దళారులు సిల్కు లాల్చీల మడత నలగకుండా, సింహ భాగం జేబుల్లో వేసుకుపోతారు. ఇన్నాళ్టికిగానూ ఓ మనసున్న మారాజు రైతు బతుకుల్ని క్షేత్ర స్థాయిలో అణువణువుగా పరిశీలించాడు. కరిగిపోయాడు. రైతు భరోసా పథకం ప్రారంభించాడు. పల్లెలు కూడా బస్తీల్లా కళకళలాడాలని ఆశించాడు. కొన్ని పనులు సఫలమై కార్య రూపం దాల్చాయి. ఇంకా కొన్ని రావల్సినవి ఉన్నాయి. నిజా నికి మన దేశంలో అతిపెద్ద పరిశ్రమ వ్యవసాయం. రైతులు, రైతుకూలీల గురించి పట్టించుకున్నవారు లేరు. వ్యవసాయానికి పెట్టుబడులు, మంచి విత్తనాలు, సరైన ఎరువులు పురుగుమం దులు లాంటి రైతు ప్రాథమిక అవసరాలు ఇప్పుడే అందుబాటు లోకి వస్తున్నాయి. వ్యవసాయం చదువులేని సెక్టార్ అవడం వల్ల, రైతుకి ఫలాలు చేరడంలో కొన్ని తరాల వ్యవధి పడు తోంది. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే– పంట మురుగు కాల్వల నిర్వహణని మెరుగుపరచవచ్చు. సాగులో నీటి పొదుపుని ప్రచారం చెయ్యొచ్చు. రైతులకి పంట చేలో ఎప్పుడూ నీళ్లు నిండుగా ఉండాలనే మూఢ నమ్మకం ఉంటుంది. నిజానికి అలా నీళ్లు నిల్వ ఉంటే, వాతావరణంలోంచి ఆక్సిజన్ మొక్క వేళ్లకు చేరదు. పైన నీటిపొర అడ్డుకుంటుంది. పంటచేనుకి నీరు అవసరమే గానీ దానికో పరిమితి ఉంది. యూరియా లాంటి ఎరువుల అతి వాడకంతో వచ్చే అనర్థాలను ప్రత్యక్షంగా రైతు లకు చూపాలి. ఒకనాడు వానపాముని ‘రైతు మిత్ర’గా పిలిచే వారు. సంప్రదాయ ఎరువులు పోయి రసాయనాలు రావడంతో వానపాములు ఇతర మేలు చేసే జీవాలు అడుగంటాయి. ఇప్పుడు తిరిగి వెర్మీ కల్చర్‌ని పునరుద్ధరించాలి. పచ్చి రొట్ట, ఎరువుల్ని విరివిగా వాడకంలోకి తెచ్చుకోవాలి. త్వర త్వరగా పెరిగే జీలుగు, జనుము, గ్లైడ్పీడియా, చిటికేశ్వరం లాంటి మొక్కలు మళ్లీ వ్యవసాయంలో భాగం కావాలి. రైతు భరోసా కేంద్రాలు దృశ్య మాధ్యమం ద్వారా రైతులకు వారానికి ఒకటి, రెండు క్లాసులు నిర్వహించాలి. మంచి విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి నేర్పాలి. మన నేలలకు అనువైన వ్యవసాయ యంత్రాలు రావాలి. ఒకప్పుడు బాగా ప్రచారంలోకి వచ్చిన ‘గోబర్‌గ్యాస్’ కనుమరుగైంది. దాంతో మంచి సహజ ఎరువు కూడా పోయింది. చిన్న రైతుకి అయినా కనీసం రెండు మూడు పశువులు, ఒక వంద బాతులు ఉండి తీరాలి. బాతులు పంట చేనుకి మంచి చేస్తాయి. ఆదాయం కూడా. రైతు కూలీల పరి స్థితుల్ని మెరుగు పరచాయి. నీళ్లలో, బురదలో, పనిచేసే కూలీ లకు అందుకు తగిన గ్లౌజు లుండాలి. కాళ్లకి కూడా తొడుగులుం డాలి. ఎండనుంచి కాపాడే టోపీలుండాలి. శ్రామికులకు మరీ ముఖ్యంగా లేవలేని తల్లులకు, అక్క చెల్లెమ్మలకు యజమాని ద్వారా పౌష్టికాహారం అందాలి. రాత్రి అన్నంలో తోడుపెట్టిన పాలబువ్వతోబాటు ఒక అరటిపండు, ఒక గుడ్డు ఇవ్వాలి. మహిళలకు కొంచెం నీడ అవసరానికి తగిన మరుగు ఉండాలి. వ్యవసాయం కూడా ఒక మంచి పరిశ్రమగా గుర్తింపు పొందాలి. శ్రామికుల కోసం సౌకర్యాలు పెరగాలి. రక్షణ కల్పించాలి. తెలుగు రాష్ట్రాలలో రైతులు కూడబలుక్కుని పంటలు వేయడం శుభసూచకం. అలాగే అందరూ ఆధునిక వ్యవసాయ రీతులపై చర్చించుకోవడం, సూచనలు పాటించడం చాలా ముఖ్యం. ప్రసార సాధనాలు, ప్రచార సాధనాలు విపరీతంగా వచ్చాయి. కానీ నిత్యకృత్యంలో అవేవీ రైతుకి సక్రమంగా ఉప యోగపడటం లేదు. మిగతా ప్రాంతాలతో చూస్తే ఇప్పటికీ మన రాష్ట్రంలో దిగుబడులు తక్కువగానే ఉంటున్నాయి. కనీసం పంట రెట్టింపు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భూమిని నాలుగంచెల విధానంలో సద్విని యోగం చేసుకొనే పద్ధతులు మన రైతులకు తెలుసు. చుట్టూ చేను గట్టుమీద కొబ్బరిచెట్లు, చేలో అరటితోట, దాని నీడన కంద పిలకలు, దానికింద అల్లం కుదుళ్లు పండించే రైతులు న్నారు. కొబ్బరిమానులకి ‘కోక్’ తీగెల్ని అల్లుపెడతారు. నిత్యం పరిశోధనలు జరగాలి. రైతులకి కొత్త ఆశలు మొలకెత్తేలా చూడాలి. వ్యవసాయం దండగ కాదు. పండుగ అనిపించేలా పాటుపడాలి. పశుసంపదని పెంచడం ద్వారా గ్రామాలకు కళ, కాంతి, ఆరోగ్యం తిరిగి తీసుకురావాలి. రైతుని ఆదరించి ప్రోత్సహించడంలోనే మానవజాతి భవిష్యత్తు ఉంది. మానవా ళికి అణ్వస్త్రాలకంటే అన్న వస్త్రాలు ముఖ్యం! ఇప్పుడు మీడియా మొత్తం సంచలనాల మీద దృష్టి పెట్టకుండా రైతుల వెల్ఫేర్పై శ్రద్ధ పెట్టాలి. దాన్ని మించిన దేశభక్తి లేదు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
శాపనార్థాలకి ఓట్లు రాలవ్
అక్షర తూణీరం చంద్రబాబు రెండుసార్లు వైఎస్ చేతిలో, ఒకసారి ఆయన కుమారుడు జగన్ చేతిలో ఓడిపోయారు. ఇట్లా రెండు తరాలమీద ఒకే నేత ఓడిపోవడం ఒక రికార్డు. అయితే జగన్ చేతిలో ఓటమి చరిత్రా త్మకం. ఓటమిలో చిత్రంగా స్వయంకృతాపరాధాలన్నీ అదే అంకెలతో తలకి చుట్టుకున్నట్టు ఇప్పుడు కూడా ఇంకో అంకె తగులుకోనున్నదా? తెలంగాణ అసెంబ్లీలోంచి పన్నెండుమంది ఎమ్మెల్యేలు ఏక్‌దమ్మున టీఆర్ఎస్లోకి జంప్ చేసి, కడిగన ముత్యాల్లా అధికార పార్టీ సభ్యులుగా మెరిసిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు పంచతంత్రం కథ గుర్తొస్తూ ఉంటుంది. వలలో పడి చిక్కుకుపోయిన పావురాలు, కూడబలుక్కుని ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి ఎగురుతాయి. ఆ దృశ్యం బాగుంటుంది. ఒక్కసారి వీళ్లంతా గుంపుగా లేచి బెంచీలు మారిపోవడం, పావురాల వ్యూహంగానే తోస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులంటే చంద్ర బాబు అభ్యర్థులే. చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టడం టీడీపీ కూకటివేళ్లతో సహా మట్టికరవడానికి ఒక ముఖ్య కారణం. ఇప్పుడు భవిష్యవాణి ఎలా వినిపిస్తోందంటే, అదే తీరున పన్నెండుమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఉదుటున వైఎస్సార్సీపీలో చేరిపోయి, జిందాబాద్ సీఎం జగన్! వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు హోరెత్తిస్తారని జనవాక్యం. ఇక మిగిలేది పట్టుమని పన్నెండు. ఇందులో నలుగురైదుగురు రాజకీయ రిటైర్మెంట్ తీసుకుంటారని వినికిడి. ఇక మిగిలేది ఏడుగురో, పంచ పాండవుల్లాగా ఐదుగురో, మంచం కోళ్లవలె నలుగురో? ‘మనం విమానంలో వచ్చాంగానీ ఓడలో రావల్సింది. మనవాళ్లు ఇంకా రెండు విమానాలకి సరిపడా అక్కడే మిగిలిపోయారు. పాపం వాళ్లు క్యాపిటల్ వంకన లండన్ పర్యటించాలనుకున్నవాళ్లే’ అంటూ టేకాఫ్ కాగానే అస్మదీయులు బాధగా నిట్టూర్చారట. ప్రపంచ ప్రసిద్ధ క్యాపిటల్ మహా నగరం ఒక ప్రహసనంగా చంద్రబాబు దర్శకత్వంలో సాగింది. ఐదేళ్ల తర్వాత అంతా ‘హుళక్కి’ అని తేలింది. అదేమన్నా అంటే పైనించి డబ్బు రాలేదంటూ మోదీకి శాపనార్థాలు పెడుతూ, ఆఖరికి వాటినే మానిఫెస్టోగా చేసుకున్నారు. జనం తను తిట్టే తిట్లని బాగా ఆస్వాదిస్తున్నారనీ, ఓట్లకి కొదవ లేదనీ బాబు భ్రమలో ఉండిపోయారు. కేసీఆర్, మోదీ, జగన్ ఈ త్రయాన్ని ప్రతి సభలో కలిపి అవాకులు చెవాకులు పేలడం మాత్రమే ఎన్నికల ప్రచారంగా సాగింది. జన సామాన్యం ఈ ధోరణిని అస్సలు హర్షించలేదు. జగన్‌ని గెలిపిస్తే ఇంటికో రౌడీ, వాడకో గూండా వస్తాడని బాబు హితవు పలికారు. రాష్ట్రం దోపిడీకి గురైపోతుందని పదే పదే బెంగతో వక్కాణించారు. నాకు వయసుకి మించిన రాజకీయ అనుభవం ఉంది. మా అబ్బాయి తల్లి గర్భంలో ఉండగానే నా ముఖతా ఎన్నో రాజకీయ పాఠాలు విని నేర్చుకున్నాడు. అందుకే మా బాబు దొడ్డిదారిన వచ్చీరాగానే మూడు మంత్రిత్వ శాఖల్ని ఐస్‌క్రీమంత ఆశువుగా బుగ్గన పెట్టుకుని చప్పరించి పడేశాడు. నిజమే, బాబు కొన్ని మాటలు అప్పుడప్పుడు తడబడ్డమాట నిజమే. గర్భవాసంలో ఉండగా కొన్ని స్పష్టంగా వినపడక ఆ తికమక ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వెయ్యకూడదో చెప్పడానికి చంద్రబాబు ఓ వంద కారణాలు సిద్ధం చేసుకున్నారు. వాటిని అన్నిచోట్లా వల్లిస్తూ జనానికి బోరు కొట్టించారు. దాదాపు పదేళ్లుగా జగన్‌ని సునిశితంగా పరిశీలిస్తున్న ఏపీ జనం చంద్రబాబు ఊకదంపుడుని ఖాతరు చెయ్యకపోగా ఓటు ఎవరికి వెయ్యాలో ఎవర్ని గెలిపించాలో అక్కడే తేల్చుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా జగన్‌ని ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జగన్‌పై చేసిన చౌకబారు విమర్శలు చంద్రబాబు అసహనానికి అద్దంపట్టాయ్. జగన్ పార్టీని ‘కోడికత్తి పార్టీగా’ అవహేళన చేస్తూ జనంమీద తిరగడం, జగన్ మౌనం చంద్రబాబు స్థాయిని దిగజార్చాయి. ఏపీ ఓటర్లు జగన్మోహన్రెడ్డికి ఒకసారి పవర్ ఇవ్వాలనే కాదు, బాబుని పదవీచ్యుతుడిని చెయ్యాలని బిడ్డలమీద ప్రమాణాలు చేశారు. దానికి సాక్ష్యం అన్ని సీట్లు! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
23 : 3 : 23
అక్షర తూణీరం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే తాను మొన్న అభిజన్ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రోహిణీ కార్తెలో ఒక్కసారిగా బ్లేజ్‌వాడ చల్లబడింది. ఉత్సవానికి కొన్ని గంటల ముందు, తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ప్రజలు ఆనందించారు. వేసవిలో వెన్నెల కాసిందని అనుకున్నారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిది రుష్యశృంగ పాదమని భావించేవారు. మొన్న జనం చినుకుల్లో తడుస్తూ, మట్టివాసనని ఆఘ్రాణిస్తూ వైఎస్ అధికార పీఠంపై పాదంపెడితే వానలకి కొరత ఉండదని ఆనందంగా ఊపిరి పీల్చు కున్నారు. సకాలంలో వర్షాలుంటే దానికి మించిన సౌభాగ్యం ఉండదు. చంద్రబాబు హయాంలో లాగా రెయిన్గన్లతో లక్షల హెక్టార్ల పంటని కాపాడలేరు. మీడియాలో నీళ్ల చిమ్మెనలు చూపిస్తే, ఎండిన నేలలు పచ్చబారవు. పొలిటికల్ ఇండస్ట్రీలో నలభై ఏళ్ల అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబు అతి ఘోర పరాజయం పొందినవేళ హైవోల్టేజీ షాక్‌కి గురయ్యారు. మన పాలన ఇంత ఘోరంగా ఉందా? ప్రజల్లో ఇలాంటి స్పందన ఇంత ఘాటుగా రావడమేంటని చంద్రబాబు ఆత్మ విచారణకి దిగారు. చివరి ఆరునెలలూ పూర్తిగా ఆత్మస్తుతికి, పరనిందకి అంకితమైపోయిన మాజీ ముఖ్యమంత్రి అసలే పాజిటివ్ థింకర్ అవడంతో తానే స్టేటు తానే సెంట్రల్ అనుకున్నారు. ఊహ మంచిదే కానీ ఒక్కోసారి ఫలించదు. అంతఃపురంలోంచి బయటికొచ్చి జనవాణిని స్పష్టంగా వింటే ఎన్నికల ఫలితాలు అర్థం అయ్యేవి. ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఆశువుగా చెప్పుకున్నారు. అదీ చక్కగా వినసొంపుగా, అలంకారాలతో జనం మాట్లాడుకున్నారు. మహిళలైతే మరింత సొగసుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఓ పెళ్లికి చిలకలూరిపేట వెళ్లాల్సి వచ్చింది. తలంబ్రాల ఘట్టం అయ్యాక అక్కడి బాజాభజంత్రీలతో ఇష్టాగోష్టికి దిగాను. ‘ఇక్కడ ఎవరు మీకు’ అని అడిగితే ప్రత్తిపాటి పుల్లారావు గారండీ అని చెప్పారు. ‘గెలుస్తారా, మంత్రి కూడా కదా’ అన్నాను. వాళ్లంతా ఒక్కసారి మొహమొహాలు చూసుకున్నారు. ఒక్క క్షణం ఆగి, ‘మాచెడ్డ కష్టమండీ’ అన్నాడొక పెద్దాయన. ధైర్యం పుంజుకున్న రెండో ఆయన, ‘మా పుల్లన మంచి మెజార్టీతో ఓడిపోతే ప్రభలు కట్టుకు కొండకి వస్తామని కోటయ్య సామికి మా వోళ్లంతా మొక్కారండీ’ అంటూ చేతులు భక్తిగా జోడించాడు. శృతి పెట్టెని శబ్దం చేస్తూ కట్టిపెట్టిన కుర్రాడు, ‘ఇట్టాంటి మేళాలు పదన్నా ఎళ్తాయండీ ప్రభల్తో’ అన్నాడు ఉత్సాహంగా. అబ్బా! మన మంత్రి పుల్లారావు గారికి జనంలో ఇంతటి పలుకుబడి ఉందా అని నివ్వెరపోయా. అయిదేళ్లు పగలూ రాత్రీ కష్టించి పోగు చేసుకున్న పేరు ప్రతిష్ట. జన సామాన్యపు ధోరణిని సరిగ్గా అంచనా వేసుకుంటే పార్టీ అడుగంటుతుందని నాలాంటి అమాయకుడికి కూడా అర్థం అవుతుంది. భజనల్లో కూచుంటే కాదు, జనంలో భుజకీర్తులు, కిరీటం లేకుండా తిరి గితే మన పాలన సౌడిభ్యం బాగా తెలుస్తుంది. ‘మా బెజవాడ రేవుల్లో దోసెడు ఇసుక లేదు. మొత్తం తోడేశారు. టీడీపీ రంగు, కృష్ణలో ఇసుక రంగు ఒకటే అయింది. దాంతో వాళ్లకి దానిమీద అభిమానం ఎక్కువైంది. కనక దుర్గమ్మ కొండమీంచి అంతంత కళ్లు పెట్టుకు చూస్తుంది గానీ ఆ తల్లి పలకదు ఉలకదు..’ అని ఒక పెద్దాయన బాధగా నిట్టూ ర్చాడు. ఉదాసీనంగా వూకొట్టి, బయలుదేరుతుంటే, ‘దుర్గమ్మ ఆడకూతురు కదా, ఓర్పు సహనాలు ఎక్కువ.. జై భవాని!’ అన్నాడు రోషంగా. నిజంగానే నేను ఉలిక్కిపడ్డాను. ఒక నిస్సహాయతలోంచే ఇలాంటి మాటలు సామాన్య ప్రజల్లోంచి వస్తాయి. వారి నాడి పట్టడానికి ఇదొక చిన్న శాంపిల్. కిందటిసారి ఎన్నికల తర్వాత చంద్రబాబు 23 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలని కొనేసి సొంత దొడ్లో కట్టేసుకుంటే అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. రేట్లు కూడా చెప్పుకున్నారు. వైఎస్ పార్టీని కుంగెయ్యాలని గట్టి ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో స్పీకర్‌కి ముఖ్యమంత్రి కంటే, ప్రధాని కంటే ఎక్కువ అధికారం, గౌరవం ఇవ్వబడినాయి. ఈ కొనుగోలు సరుకులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇదంతా గమనిస్తున్న సామాన్య ఓటర్లకి గౌరవనీయ స్పీకర్ కోడెల ఘోరంగా ఓడిపోనున్నారని మూడు నెలల ముందే తెలుసు. ఓటేసి రాగానే కాలవల్లో, చెరువుల్లో స్నానాలు చేసి తడి వస్త్రాలతో ఇళ్లకు వచ్చామని ఓ పెద్ద రైతు సంతోషంగా చెప్పాడు. చంద్రబాబు సొంత మీడియాతోనే దెబ్బ తిన్నాడని అనుభవజ్ఞులు తేల్చారు. 23: 3: 23 దేవుడు ప్రసాదించిన నిష్పత్తిగా తేల్చారు. అయినా ఆయన మబ్బులు వీడి రాలేకుండా ఉన్నారు. నలభై ఏళ్ల అనుభవం చంద్రబాబుని వదలడం లేదు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ప్రతి దీవెనా ఒక స్వాతి చినుకు!
బ్రహ్మాండమైన ఈ గెలుపు జగన్మోహన్రెడ్డి స్వార్జితం. ఇది చారిత్రకం. ఇది ఘన విజయం కాదు జన విజయం. దేవుడికి ఆయన నచ్చారు. ప్రజలు ఆయనని మెచ్చారు. సగౌరవంగా బంగారు సింహా సనం అప్పగించారు. జగన్ తొమ్మిదేళ్ల దీక్ష, కఠోర పరిశ్రమ ఫలించింది. ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులని సూటిగా హత్తుకుంది. అన్నా, తమ్ముడూ, బిడ్డా అంటూ జనం ప్రేమగా దీవించారు. ప్రతి దీవెనా స్వాతి చినుకులా కురిసి, ఓటుగా ప్రతిఫలించింది. దాంతో పొజిషన్లో ఉన్నవారు అపోజిషన్‌లోకి వెళ్లి ఒక మూలన సర్దుకోవలసిన దుర్గతి పట్టింది. ఇది వారి స్వయంకృతం. ఇక్కడ అప్రస్తుతం. నాడు బుద్ధుడు ఆత్మీయుల్ని పక్కనపెట్టి, రాజ మందిరాన్ని వదిలి విశాల ప్రపంచంలోకి వచ్చాడు. అంతకుముందే జరారుజా మరణాల వైనం తెలుసుకున్నాడు. ఈ లోకంలో రకరకాల కారణాలతో మనుషులకి సంభవిస్తున్న దుఃఖాన్ని అడుగడుగునా చూశాడు. జగన్మోహన్రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశాడు. వారి దుఃఖం చూశాడు. విలయ తాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశాడు. ‘నేనున్నా, నేనున్నా... ఏడవకండేడవకండి’ అంటూ కోట్లాదిమంది కన్నీళ్లు తుడిచాడు. ఆ మహా పాదయాత్రకి వెనక తండ్రి పెట్టిన చెరగని ఒరవడి ఉంది. వేల మైళ్ల యాత్రకి జగన్ సంకల్ప బలం ఉంది. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల, దగాపడిన తమ్ముల ఆక్రందనలు ఒకవైపు, పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు మరోవైపు! వీటి మధ్య రాష్ట్రం కొసనించి కొసదాకా నడిచి నడిచి నడిచి... ప్రజల సమస్యల్ని, పాలకుల అరాచకాలని ఆకళింపు చేసుకు న్నారు జగన్. ప్రజానీకానికి చిరునవ్వుతో అభయం ఇస్తూ ముందుకు సాగారు. మట్టిని, మట్టి మనుషుల్ని తట్టి పలకరించారు. మొత్తంగా స్కాన్ చేసు కుని మనసులో నిక్షిప్తం చేసుకున్నారు. వీరందరికీ మంచి చేయాలన్న కసి పెంచుకున్నారు జగన్. సమ యం వచ్చింది. ప్రజలు అంతే కసిగా స్పందించారు. లేకపోతే అన్ని ఓట్లా? అన్ని సీట్లా? అవసరానికి మించినన్ని. ‘అన్నా! నీకు అడ్డులేదు. నువ్ తలపెట్టిన మంచి పనులన్నీ చెయ్’ అంటూ ఆదేశిస్తూ ఆశీర్వదించారు. ఈ మెజారిటీ ఎంతటిదంటే, దీనితో అయిదేళ్లు కాదు, జగన్మోహన్రెడ్డి ఏకంగా పదేళ్లు పాలించవచ్చునని ఒక పెద్దాయన ఆనందంతో మునకలు వేస్తూ అన్నాడు. తథాస్తు! కులం బలం లేదు. మీడియా తాలూకు వీర బాకాలు అసలే లేవు. తొమ్మిదేళ్లు వాడిపోకుండా, కొత్త చిగుళ్లు తొడుగుతూ బతికి బట్ట కట్టడం ఆయనకే చెల్లింది. ఇప్పుడే అసలు సిసలు బాధ్యత మొదలైంది. అడుగడుగునా చెప్పిన మాటలు నెరవేర్చాలి. నిన్నటిదాకా ఒట్టిపోయిన ఖజానాని సరిచేసుకోవాలి. నిన్న∙వినయంగా చెప్పిన మాటలు నిలుపుకోవాలి. ఇంతటి అఖండ విజయం ఇచ్చిన వారికి ఎన్నో ఆశలుంటాయ్. జగన్ రావాలని కలవరించిన అశేష ప్రజానీకానికి కనుల పండువగా ప్రమాణ స్వీకారోత్సవం జరగాలని ఆశిద్దాం. గెలుపుకి దోహదపడ్డ జగన్ సన్నిహిత కుటుంబ సభ్యులకు ఏపీ ప్రజల తరఫున అభివాదాలు. చివరిదాకా ఈ ధీరుడు ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. గెలుపు సొంతం చేసుకున్నారు. రూలింగ్ పార్టీ కలికంలోకి కూడా రాకుండా పోయింది. చేపలు పట్టేసిన చెరువులా నిశ్శబ్దం ఆవరించింది. రెండ్రోజుల్లో భయంకరమైన ఫలితాలు రానున్నవేళ ఆంధ్రా ఆక్టోపస్‌నంటూ లగడపాటి గాంధోళి ఫార్స్‌కి తెర తీశారు. టీడీపీ ఎందుకు గెలవనున్నదో లగడపాటి విశ్లేషించడం కులం దురదకి పరాకాష్టగా విశ్లేషకులు అభివర్ణించారు. మరో అయిదేళ్లపాటు టీడీపీ వార్తల్లో కూడా ఉండదని అనుభవజ్ఞుల అంచనా. జగన్మోహన్రెడ్డి స్టేట్‌లో సెంట్రల్లో నూతన ఒరవళ్లతో కొత్తశకం ఆవిష్కరిస్తారని ఆశిద్దాం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇక వలలు పనిచేయవ్!
పెద్ద చెరువులో ముగ్గురు గజ వేటగాళ్లు వేటకు దిగారు. ముగ్గురూ మూడు పెద్ద వలల్ని వాలులో, వీలులో పన్నారు. చెరువు నిండా చేపలైతే పుష్కలంగానే ఉన్నాయ్. కొంచెం కండపట్టిన చేపలకే చెలామణీ. ఆ ముగ్గురు వేటగాళ్లు చెరువులో ఎగిరి పడుతున్న చేపల చప్పుళ్లకి లొట్టలు వేస్తున్నారు. బుట్టలకొద్దీ ఆశలు పెంచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ దారిన వెళ్తున్న మూరెడు చేప నీళ్లమీదికి ఎగిరింది. ఆకాశం నించి రెప్పపాటులో వాలుగా చెరువు మీదికి దిగిన డేగ తటాలున చేపని గాలిలోనే ముక్కునపట్టి తిరిగి రయ్యిన పైకి లేచింది. వేటగాళ్లు ముగ్గురూ ఆ దృశ్యం చూసి ఒక్కసారి నిరాశపడ్డారు. ‘అబ్బా! వీసెడు చేప. వలలో పడాల్సింది. డేగ నోట పడింది’ అనుకుంటూ నిట్టూర్పులు విడిచారు. దీన్నే కదా ‘ప్రాప్తం’ అంటారని మనసున తలచారు. ముగ్గురూ చెరువున పడి నీళ్లని చెదరగొడుతున్నారు. అట్టడుగున బురదలో నక్కి మేతలు తింటున్న చేపల్ని పైకి లేపుతున్నారు. వాటిని తాము పన్నిన నూలు వలల దిశగా నడిపే యత్నం చేస్తున్నారు. కొన్ని అమాయకంగా నీళ్లలో ఈదుతూ వల గండంలో పడబోతున్నాయ్. కొన్ని వేటగాళ్ల మర్మం తెలిసి ఎదురీది ఇంకోవైపుకి వెళ్తున్నాయ్. చెరువులో మునికాళ్లమీద కూర్చుని చేతులతో అడుగునున్న బురదని కెలుకుతున్న వారికి చేపలు తగుల్తున్నాయి. తృటిలో జారిపోతున్నాయి. ఇదొక విచిత్రమైన వేట. నేలమీద తిరిగే జంతు వుల, పిట్టల భాషలు, సైగలు వేటగాళ్ల కెరుక. అందుకని నమ్మించి, దగా చేసి ఉచ్చుల్లో, బుట్టల్లో సులువుగా వేసుకుంటారు. ఇవి జలచరాలు. వాటి మాటలు, కదలికలు వాటికే ఎరుక. ‘చేపల మెదళ్లు తెలిస్తేనా, ఈ ప్రపంచాన్నే జయిస్తాం అలవోకగా’ అనుకున్నారు ఆ ముగ్గురు వేటగాళ్లూ. ‘ఈ చెరువులోవన్నీ నా వలలో పడితేనా నేనే రాజుని’ అని ఎవరికి వారు కలలు కంటున్నారు. చెరువులో వీరు లేపిన అలలన్నీ సద్దుమణిగాయి. వలలు ఎత్తే పొద్దెక్కింది. మళ్లీ ఆఖరుసారి చెరువుని తట్టిలేపి, చేపల కదలికల్ని పసిగట్టి వలల్ని చుట్టసాగారు. ఎవరికీ వల బరువుగా తగలడం లేదు. చేపల బరువు ఏ మాత్రం తోచడం లేదు. వలని పైకి లాగుతున్న కొద్దీ నిరాశ ఎదురవుతోంది. తెల్లారు జామునించి వలలో చిక్కిన చేపలేమైనట్టు– అంటూ తలబద్దలు కొట్టుకుంటుంటే, గంట్లు పడిన వల, ఆ దారిన బయటపడిన చేపల లెక్కా తేలింది. ముగ్గురిదీ అదే అనుభవం. కష్టమంతా నీళ్ల పాలైందని వాపోయారు. వేటగాళ్లకి పెద్ద సందేహం వచ్చింది. చెరువులో చేపలుంటాయ్. పీతలు, నత్తలు ఉంటాయ్. ఉంటే బురద పాములుంటాయ్. ఇంకా చిన్న చేపల్ని తినేసే జాతి చేపలుంటాయి. కానీ ఇట్లా గట్టి వలతాళ్లని కొరికేసే జీవాలు ఏ నీళ్లలోనూ ఉండవని తెగ ఆలోచన చేశారు. ఎలుకలకు, ఉడతలకు పదునైన పళ్లుంటాయ్ గానీ వాటికి నీళ్లంటే చచ్చే భయం. వాటికి ఈత రాదు. పైగా అట్టడుగుకు వెళ్లి మరీ వలల్ని పాడు చేశాయ్. బంగారం లాంటి చేపల్ని నీళ్లపాలు చేశా యని వారు తిట్టుకున్నారు. నిస్త్రాణగా వలల్ని భుజాన వేసుకుని, ఖాళీ బుట్టలతో ఇంటిదారి పట్టారు. ఎండ మిటమిటలాడుతోంది. నీడలో ఒక చెట్టుకింద ఆ ముగ్గురూ ఆగారు. ఒక సాధువు ఆ నీడకే వచ్చాడు. వారి భుజాన వలల్ని చూసి సాధువు నవ్వాడు. ‘ఎందుకా నవ్వు’ అని అడిగారు వేటగాళ్లు. ‘గంట్లుపడ్డ మీ వలల్ని చూస్తే నవ్వొచ్చింది’ అన్నాడు సాధువు. ‘ఇది ఎవరిపనో చెప్పండి స్వామీ’ అని అడిగారు. ‘చేపల పనే’ అంటూ తిరిగి నవ్వాడు సాధువు. వేటగాళ్లు నవ్వి, ‘అయ్యా మేం పిచ్చివాళ్లం కాదు. చేపలకు పళ్లుంటాయా ఎక్కడైనా’ అన్నారు. ‘ఉండేవి కావు. కానీ అవసరాన్నిబట్టి వస్తాయ్’ అన్న సాధువు మాటకి వేటగాళ్లు అర్థం కానట్టు చూశారు. ‘మీరు వాటిని వలలో వేసుకోవడానికి ఎన్నెన్ని క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నారో కదా. మరి వాటిని అవి రక్షించుకోవడానికి నోట్లో నాలుగు పళ్లు మొలిపించుకోలేవా? అలాగే మీ ఊరి చెరువులో చేపలకు పళ్లు వచ్చాయ్. ‘తాడెక్కేవాడుంటే తలదన్నే వాడుంటాడు’ అని వివరించాడు సాధువు. ‘వలలు కొన్ని తరాల తర్వాత పని చేయవు నాయనలారా!’ అంటూ కదిలాడు సాధువు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బెయిల్దారి మేస్త్రీ
ఎన్నికలు జోరందుకు న్నాయ్. పూర్తిగా సెగ అందుకున్నాయ్. మనకి ఎన్నికల ప్రచారమంటే పరస్పరం రాళ్లు విసురు కోవడమే! పనికిరాని వాగ్దానాలు చేయడమే. పార్టీ మానిఫెస్టో అంటే బ్రిలియంట్ ఐడియాస్. పార్టీ నాయకులు ఎవరెన్ని మాటలైనా జారుతున్నారు గానీ, రోజుకో గంట మద్యపానం నిషేధిస్తామని కూడా మాట జారడం లేదు. మన నేతలు పూర్తి సామాజిక స్పృహతో ఉంటున్నారు. కొందరు కుల రాజకీయాలని విమ ర్శిస్తారు. ఇంకొందరు ‘పవర్ పాలిటిక్స్’ అంటూ వ్యాఖ్యానిస్తారు. శొంఠి లేని కషాయం ఉండనట్టు కులం, పవర్ లేని రాజకీయాలు ఉండజాలవు. ఉన్నా మనజాలవు. పవర్‌లేని పాలిటిక్స్ ప్రభుత్వాన్ని నడపడ మంటే గంగాజలంతో బార్ నడపడం లాంటిదేనని ఒక పెద్దాయన వ్యాఖ్యానించారు. ‘మాకే ఓటే యండి. ఇతరులకు వేసి మోసపోకండి’– ఇదే నినాదాన్ని నేతలంతా సర్వత్రా ప్రతిధ్వనింప చేస్తు న్నారు. ఓటర్లు తడబడుతున్నారు. ఇంత వరకు పవర్ పగ్గాలు పట్టుకోని జగన్మోహన్రెడ్డి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని, దేశాన్ని దోచేస్తారో చంద్ర బాబు అంకెలతో సహా చెబుతున్నారు. బహుశా గెలిచాక జగన్‌కి ఉన్న స్కోప్, అవకాశాలను పదే పదే బాబు లెక్కలు వేసుకుంటున్నట్టు డౌటుగా ఉందని మావూరి ఓటరు అంటున్నాడు. చంద్ర బాబు చెప్పడమేగానీ టెక్నాలజీని బొత్తిగా వాడు కోవడం లేదని మరో ఓటరు వాపోయాడు. ‘నేని ప్పటికి ఇరవై రెండు బాబుగారి ఎన్నికల సభలు విన్నా. నాకు స్పీచి కంఠతా వచ్చేసింది. ఒక్క పదం మారదు. నరేంద్ర మోదీని, కేసీఆర్‌ని, జగన్‌ని కల గలిపి వారిపై నోరు పారేసుకోవడం ఒకే క్రమంలో నడుస్తూ, ఆ విధంగా స్పీచి ముందుకు నడుస్తుంది. చంద్రబాబు ప్రచార సభలు ఇలాగే సాగితే ప్రత్య ర్థులకి ఎక్కువ మేలు జరుగుతుందని అనుభవ జ్ఞులు స్పష్టం చేస్తున్నారు. నిన్నటి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండనే ఉంటుంది. ఇతరేతర కారణాలవల్ల చంద్ర బాబు సర్కార్ మీద మరి నాలుగింతల వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క రంగానికి చెప్పుకో తగ్గ మేలు జర గలేదు. ఇక అమరావతి క్యాపిటల్ ఒక కట్టుకథ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాధారమైన ఆనకట్టలు, దూరాల నుంచి తగ్గించి రవాణా సౌకర్యాలు పెంచే వారధులు వంతెనలు, సామాన్యుడికి అస్సలు అందుబాటులో లేని వైద్య మరియు విద్యా సదు పాయం ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు. పరి పాలన చల్లగా ఉండాలంటే బహుశా క్యాపిటల్ ఎయిర్ కండిషన్ చేయించడమని బాబు భావించి నట్టున్నారు. వీటిని సామాన్యజనం కూడా ఆ గాలి మేడలు మాకెందుకు అనేశారు. జగన్మోహన్రెడ్డి పవర్లోకి వస్తే, ఇంటికో రౌడీ తయారవుతాడట. ఎవ్వరికీ భద్రత ఉండ దట. ఇవన్నీ చంద్రబాబు ఎన్నికల బూచి కబుర్లు. పుట్టని బిడ్డకు పేర్లు పెట్టడమంటే ఇదే. మొన్న ఒక సభలో రెండు చేతులూ తిప్పుతూ, ఏవో నీతి వాక్యాలు వల్లిస్తుంటే సభలోంచి ఒకాయన ‘అవన్నీ ఎందుకులే బాబూ? ప్రస్తుతం అందరం బెయిల్ దారి మేస్త్రీల మేలే’ అని ఎద్దేవాగా అన్నాడు. అంటే బెయిల్ మీద కాలక్షేపం చేస్తున్న వాళ్లమేనని ఆయన ఉద్దేశం. ఇందాకటి ఓటర్ అనేదేంటంటే చంద్రబాబు ఈ విధంగా ఒకే లూప్ వేసుకుంటూ జనాన్ని హింసించడం కంటే, వ్యాన్ మీద ఆయన బొమ్మని నిలబెట్టి చిన్న మూమెంట్స్ సెట్ చేసి మైకులో స్పీచ్ వినిపిస్తే ఆయనకి బోలెడు టైం కలిసొస్తుంది కదా అని. ఇంకా చాలా టెక్నాలజీ టిప్స్ చెప్పాడు. జగన్ ద్వారా పరోక్షంగా కేసీఆర్ ఏపీ స్టీరింగ్ తిప్పుతాడట. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తాడట. మోదీ కూడా ఆ పనిలోనే ఉంటాడట. ఈ చంద్రబాబు ఈక్వేషన్లు ఎవ్వరికి అర్థం కావడం లేదు. అంటే, ఆంధ్రులు వెర్రిబాగుల వారా? బుర్ర తక్కువ వారా? చంద్రబాబు చెప్పింది కరెక్టే అయితే నెలలు తిరక్కుండా నాయకత్వాన్ని మార్చగల స్తోమత తెలుగువారికి ఉంది. అవసరమైతే చంద్రబాబే సారధ్యం వహించవచ్చు. ముందే ఇలాంటి ఊహా గానాలతో తెలుగువారిని అనవసరంగా భయపెట్టి గెలుపు సాధించాలనుకోవడం రాజమార్గం కాదేమో! ‘చేటపెయ్యని’ చూపించి పాలు పిండు కోవాలనుకోవడం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
భేతాళ కథ
సిటీలో మంచి పేరున్నవాడు సైకాలజిస్టు. కొందరు సింపుల్‌గా ‘పిచ్చి డాక్టర్’ అని కూడా అంటారు. పిచ్చి ఆయనకని కాదు, పిచ్చి వారికి డాక్టరని గ్రహించాలి. మొన్న సాయంత్రం ఆ క్లినిక్ వైపు వెళ్లాను. పిచ్చి డాక్టర్ నాకు మంచి మిత్రుడు. అక్కడికి వెళితే మంచి కాలక్షేపం. అదో కొత్త లోకం. సరిగ్గా అప్పుడే కోటిరెడ్డి అనే పేషెంట్‌ని తీసుకొచ్చారు. నిజానికి ఈ బాపతు వాళ్లని పేషెంట్ అనడానికి లేదు. వాళ్ల నాన్నగారు యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసి రిటైరయ్యారట. ఇప్పుడు డెభ్బై ఏళ్లు. జనరల్ హెల్త్‌లో వంక పెట్టాల్సింది లేదు. పళ్లు, కళ్లు బాగున్నాయ్. గొప్ప చెప్పుకోదగ్గ బట్టతల కూడా కాదు. బీపీ, షుగర్ లాంటివి కూడా లేవు. విషయాలన్నీ వాళ్లబ్బాయ్ దగ్గర రాబట్టాడు డాక్టరు. ఈ పిచ్చి డాక్టర్లు చాలా తెలివిగా పేషెం ట్ని మచ్చిక చేసుకుని, వాళ్ల బుర్రని స్వాధీనం చేసుకుంటారు. ‘ఆ.. కోటిరెడ్డి గారూ! ఎట్లా ఉన్నారు? ఈ మధ్య రావడమే మానేశారు’ అన్నాడు చొరవగా మా ఫ్రెండు. ఆయన కొంచెం పెద్దగా నవ్వి, ‘తమ బొంద నేనసలెప్పుడూ ఇటు రాలేదు. మీ వెధవ మొహం చూడటం ఇప్పుడే. నా ధోరణిలో తేడా వచ్చిందని మా పండుగాడు ఏవేవో కబుర్లు చెప్పి మీ దగ్గరకి లాక్కొచ్చాడు’ అనగానే డాక్టర్ షాక్ తిని, తేరుకుని, అనవసరపు నవ్వునవ్వి– ‘చెప్పండి... ఏవిటి సమస్య’ అన్నాడు. ‘నాకేం సమస్య లేదు. ఈ మధ్య కొన్నాళ్లుగా ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారు. అదేదో మంగోలియన్ జోన్ భాషకి కొద్దిగా కలుస్తోంది. పూర్తిగా అది కూడా కాదు. కొన్ని మాటలు పూర్తిగా కత్తిరించుకు పోతున్నాయ్. వాళ్లు వాళ్లు ఏమనుకుంటున్నారో మూడో వాడికి చచ్చినా అర్థం కాదు. మధ్య మధ్య ఊళ్ల పేర్లు, నాయకుల నామధేయాలు, పార్టీ పేర్లు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయ్. వాళ్ల ముఖ కవళికల్ని బట్టి పరస్పరం తీవ్రంగా ద్వేషించుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. నాకీ సమస్య ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు’ అంటూ కోటిరెడ్డి నిట్టూర్చాడు. పెదవులు విరిచాడు నిస్పృహగా. డాక్టరు ఆయనవంక నిశితంగా చూస్తూ ‘ఎప్పట్నించీ అన్నారు ఈ సమస్య’ అని అడిగాడు. ‘దాదాపు ఏడాదిగా. అయితే మరీ మొన్న ఉగ్రదాడి, మన బాంబుదాడి తర్వాత తీవ్రమైంది. అసలే మైందో, అసలేమంటున్నారో, కౌంటర్లేమిటో, దేశభక్తుడెవడో, కుట్రదారుడెవడో సర్వం కలగాపులగం అయిపోయి బుర్రని ఇనపతెడ్లతో కెలికేసినట్టు అయిపోయింది. పులిమీద పుట్రలాగా దానిమీద డేటా చోరీ బాపతు ప్రకంపనలు రేగాయ్. అంతే! తర్వాత తెలుగు, ఇంగ్లిష్ భాషా పదాలన్నీ కప్పల బెకబెకల్లా వినిపిస్తున్నాయ్’ వివరంగా చెప్పగా విని మా ఫ్రెండు చాలా లైట్‌గా తీసుకుని తేలిగ్గా నవ్వేస్తూ, ‘ఏం లేదు రెడ్డిగారూ, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. దట్సాల్’ అన్నాడు. ఆ ముక్కతో కోటిరెడ్డి రెచ్చిపోయాడు. ఒక్క క్షణం కంట్రోల్ చేసుకున్నాడు. ‘అయితే సరే, నేను తికమకపడ్డా. నీకేం అర్థమైందో చెప్పు. ఉగ్రదాడిని మోదీ ఏమన్నాడు. విమాన దాడిలో పైలట్ల పాత్ర గొప్పదా, మోదీ పాత్ర గొప్పదా? నిజంగా అవన్నీ జరిగాయా? సృష్టించారా? అసలీ భూమ్మీద ఆత్మాహుతి దాడులు చేసే మనుషులు ఉన్నారా? అసలు పాకిస్తాన్ మన సరిహద్దు దేశమేనా? మధ్యలో చైనాలాంటి దేశాలున్నాయా? తర్వాత డేటా అంటే ఏమిటి? పోలీసంటే ఎవరు? ఎవరికెవరు కాపలా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఇనపకంచె వేసి కరెంటు పెట్టేసి మొత్తం ఆ రాష్ట్రాన్ని వీళ్లు, ఈ రాష్ట్రాన్ని వాళ్లు జైల్లో పెట్టేస్తారా? చెప్పండి డాక్టర్. వాళ్లు మాట్లాడుతోంది నిజంగా తెలుగు భాషై, అది మీకు అర్థమైతే నాకు విప్పి చెప్పండి. అర్థమై కూడా చెప్పకపోయారో మీ తల వేయి వక్కలవుతుంది’ అంటూ కోటిరెడ్డి వికటాట్టహాసం చేశాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జనం కోసం నడిచి.. నడిచి.. నడిచి
అక్షర తూణీరం పాదయాత్ర... సుదూర పాదయాత్ర.. అలుపెరు గని పాదయాత్ర ఒక అపూర్వ ఘట్టం. జనం మధ్యలోంచి, ప్రజల గుండె చప్పుళ్లు వింటూ, వారి నిరాశా నిస్పృహల్ని, ఆవేదనల్ని, ఆర్తనాదాల్ని సాకల్యంగా అర్థం చేసుకుంటూ, దగాపడిన తెలు గింటి ఆడపడుచుల కన్నీళ్లు తుడుస్తూ, ఇడుపుల పాయ నించి ఇచ్ఛాపురం దాకా జనం కోసం ఆ కొస నించి ఈ కొస దాకా నడిచి.. నడిచి.. నడిచి – సత్సం కల్పయాత్ర విజయ యాత్రగా ముగిసింది. 3,648 కిలోమీటర్ల దారిలో అణువణువునా నేలతల్లిని స్పృశిస్తూ, 2,516 పొలిమేరల నీళ్లు రుచిచూసి, అన్ని గ్రామాల గాలిపీల్చి సంకల్ప దీక్షతో జగన్మోహన్ రెడ్డి విజేతగా నిలిచారు. ఇది ఆయన తెలుగుతల్లికి ఇచ్చిన నీరాజనం. 3,648 కిలోమీటర్లు నడిచి, అడు గడుగునా ఆగి, గతాన్ని అడిగి తెలుసుకుని, భవిష్య త్తుకి భరోసా ఇచ్చి అడుగు ముందుకు వేయడం జగనన్న దిన చర్య. నవంబర్ 6, 2017న కదిలిన పాదం జనవరి 9, 2019న ఆగింది. మూడు సంవత్సరాలు ఈ నడకలో మారాయి. గ్రీష్మాలు, వసంతాలు వచ్చాయి, వెళ్లాయి. ఏ మార్పులు వచ్చినా జగనన్న లక్ష్యంలో మార్పులేదు. అన్నివర్గాల ప్రజల గోడుని వినాలి. వారిని నిండు గుండెతో ఓదార్చాలి. నిండు దోసి లితో భరోసా ఇవ్వాలి. నాలుగున్నరేళ్లుగా సాగు తున్న ఒట్టి మాటల్ని కట్టి పెట్టించి, గట్టి మేల్ తల పెట్టే దిశగా జగనన్న ఆలోచనలు పల్లవించాయి. ‘నేనున్నా... ఏడవకండేడవ కండని’ ఎలుగెత్తి అరుస్తూ ఆంధ్రప్రదేశ్ నలు చెరగుల్ని ఊరడించారు. తెలుగు జాతి పక్షాన ఆ నేతకు శుభాభినందనలు. జన సామాన్యం హితం కోసం తన మనసుని, గుండెని, పాదాలని బొబ్బలెత్తించుకున్న జగనన్నకి మేలగుగాక! చంద్రబాబు హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన పనులకు కోసెడు దూరం. ఉన్నట్టుండి ఒక సర్కస్ డేరా రంగుల్లో వెలుస్తుంది. మెరుపులు, మేళాలు, లైటింగ్ దిగుతాయి. డేరాలో కొందరు పిచ్చి పిచ్చి ఫీట్లు చేస్తారు. గడసానులు తీగెమీద నడుస్తారు. దీనంగా తిండి చాలక ఎండుపడ్డ అడవి జంతువుల్ని కొరడా ఝళిపిస్తూ గ్యాలరీ ముందు గుండ్రంగా తిప్పుతారు. కోతులు సైకిళ్లు తొక్కు తాయ్. చిలుక రివాల్వర్ పేలుస్తుంది. అంతా కనికట్టు! బఫూన్ పిచ్చి అల్లరితో వినోద పరుస్తాడు. చెక్కల బావిలో మోటార్ బైకు చక్కర్లు కొడుతుంది. ఉన్నట్టుండి బఫూన్ పులినోట్లో తలకాయ పెడతాడు. రోజూ రెండు ఆటలు ఒకే క్రమంలో సాగుతాయ్. ఇక్కడ కలెక్షన్లు పడిపోగానే ఇంకో టౌన్లో వెలుస్తుంది రంగుల డేరా. మళ్లీ మేళాలు... మళ్లీ ప్రచార హోరు... షరా మామూలే! రాయలసీమ కరువు జిల్లాల్లో రెయిన్గన్లతో లక్షల హెక్టార్ల భూమిని రక్షించామని ప్రచారం చేసుకున్న చంద్ర బాబు తీరు సర్కస్ డేరాని తలపించిందని జగన్ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నిజం, చంద్రబాబు ఎంతటి వాగ్దానాన్నైనా ఇచ్చేస్తారు. సానుకూలంగా దాన్ని గాలికి వదిలేస్తారు. జగన్ పాదయాత్ర పొడుగునా చంద్రబాబు, ఆయన సహచరులు రకరకాల విమర్శలు, వ్యాఖ్యా నాలు చేస్తూనే ఉన్నారు. ఇవి సామాన్య జనంలో అధిక ప్రచారం కల్పించి విజయానికి దోహద పడ్డాయ్. అన్నిచోట్లా్ల ఆగి, స్థానిక సమస్యల్ని మనసు కెక్కించుకోవడం, వాటి పరిష్కారాల గురించి చర్చిం చడం విలక్షణమైన చర్య. అన్ని ప్రాంతాల ప్రజలు, వారి సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై జగన్ స్పష్టమైన అవగాహన సాధిం చుకున్నారు. ఇది నేతకు కావల్సిన మొట్టమొదటి లక్షణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జగనన్న అరచేతిలో ఉంది. ఏ ప్రాంతం అయినా ఆయనకు కొట్టిన పిండి. రహదార్లు, రోడ్లు, నీటి వసతులు, పండే పంటలు, విద్యా వసతులు, వైద్య సదుపాయాలు ఇంకా సమస్త విషయాలమీద సుస్పష్టమైన అవ గాహన ఉంటుంది. నిజంగా ప్రజలకి పాటుపడాలనే స్థిర చిత్తం ఉన్న నేతకి సరైన అవగాహన ఉంటే ఇక కానిదేముంటుంది? శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
దూరదృష్టి
అక్షర తూణీరం ‘‘దేశమంటే మట్టికాదోయ్! దేశమంటే వోటర్లోయ్’’ అని గురజాడని మార్చి రాసుకోవాలంటూ పార్క్ బెంచీ మీద కూర్చున్న ఓ పెద్దాయన ప్రారంభించాడు. మాట తీరులో వుపన్యాస ధోరణి కనిపిస్తోంది. చేతికర్రకి మించిన పెద్దరికం కనిపిస్తోంది. ముఖం నిండా కట్టుడివి పెట్టుడివి కనిపిస్తున్నా ఆయనలో ఆత్మవిశ్వాసం ఏమాత్రం సడల్లేదు. ‘‘ఎందుకన్నానంటే, మనం నాలుగేళ్లుగా చూస్తున్నాం. ఎన్నికలు, గెలిచే మాయోపాయాలు, ఎన్నికలు పండించుకోడానికి కావల్సిన ఎరువు పోగేసుకోడం మీడియాల్ని కట్టుకోవడం, కుల సమీకరణాలను జాగ్రత్త చేసుకోడం, వ్యూహరచనలతోబాటు మేనిఫెస్టో రచనలు వీటితోనే నేతలకు పొద్దు గడిచి పోతోంది’’. పెద్దాయన తీవ్ర కంఠంతో వక్కాణిస్తుంటే, తలపండిన నలుగురు చుట్టూ కూర్చుని ఔనన్నట్టు తలలూపుతున్నారు. ఒకరిద్దరికి వాటంతటవే తలలూగుతున్నాయి. ‘‘ఆలికి అన్నం పెట్టడం వూరికి వుపకారమా చెప్పండి. ఎక్కడో చిన్న రోడ్డువేస్తే అత్యవసరమైన చిన్న వంతెన కడితే, కూలిపోడానికి సిద్ధంగా వున్న పాఠశాల భవనానికి కాసిని పూతలు పెడితే నేతలు బోలెడు సందడి చేస్తున్నారు. అన్నిరకాల మాధ్యమాల్లోనూ యిక ఆ వార్తలే వూదరగొట్టి వదుల్తున్నారు’’. ప్రసంగానికి స్పందన బావుంది. మరి ఎందుకు ఆపుతాడు? సాయంత్రం యింకా దోమల మేళ, చలివేళ కాలేదేమో ఆయన ధోరణి నిరాఘాటంగా సాగుతోంది. మునుపు ఒక పార్టీ అంటే కొంతమంది నాయకులు అందులో వుండేవారు. ఇప్పుడు ‘‘పార్టీ’’ అంటే ‘‘ఏకో నారాయణ’’! ఒక్కడే వుంటాడు. ఆయనే మాట్లాడతాడు. ఆయనే విని ఆనందిస్తాడు. ఆయనే నిర్ణయాలు తీసుకుంటాడు. అందరూ చచ్చినట్టు ఆమోదిస్తారు. తెలంగాణలో కేసీఆర్ అయినా, ఏపీలో చంద్రబాబు అయినా, ఢిల్లీలో మోదీ అయినా యిదే వరస. నాలుగేళ్లనాడు మోదీ వస్తున్నాడు...యింకేవుంది పొడిచేస్తాడని అంతా కలలు కన్నారు. ఆఖరికి మహావ్యవస్థలన్నిటినీ పొడిచేసి వదిలేశాడంటున్నారు. ఆయన చాలా అద్భుతాలు చేశానని డోలక్ వాయించి మరీ అరుస్తున్నాడు. ప్రజలకు ఏ ఒక్క అద్భుతం ద్యోతకం కావడం లేదు. ఈ నిరాశామయ వాతావరణం యిట్లా వుండగా, ఒకర్నొకరు నోటికొచ్చిన విధంగా దూషించుకోడం, వాటినీ వీటినీ పొద్దస్తమానం వింటూ కూర్చోడం రోతగా లేదూ...’’ పెద్దాయన స్వరం గద్గదమైంది. నెహ్రూల పాలన అడుగంటడానికి యిదిగో అదిగో అని యాభై ఏళ్లు పట్టింది. న.మో. గ్రాఫ్ పడిపోడానికి యాభై నెలలే ఎక్కువైంది. తపస్సంతా పదే పదే వృథా చేసుకున్న విశ్వామిత్రుడిలా మోదీ మిగిలిపోనున్నాడని నాకు అనుమానంగా వుంది. విశ్వామిత్రుడు భ్రష్టుపట్టిన వైనాలు చెప్పండని శ్రోతలు అభ్యర్థించారు. ఇవ్వాళ పొద్దులేదు. మరో రోజు చెప్పుకుందామని పెద్దాయన సమాధాన పరిచాడు. మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఒకర్నొకరు ఎందుకు వుతికి ఆరేసుకుంటున్నారో మనకి అర్థం కాదు. అయితే అదంతా రాజకీయమేనని మాత్రం అస్పష్టంగా స్పష్టం అవుతోంది. చంద్రబాబు జన్మ నక్షత్రంలో చిన్న దోషం వుందిట! అందుకని అప్పట్నించి అంటే పదవి సంగ్రహించినప్పట్నించి, యిప్పటిదాకా ఆయన ఏది తలపెట్టినా నీలాపనిందలైపోతున్నాయిట! ఇట్లాగని నాకో జ్యోతిషవేత్త చెప్పారు. ‘‘అయితే దానికేం విరుగుడు లేదా’’ అని ఒక శ్రోత వుత్కంఠతో అడిగాడు. పెద్దాయన ప్రశాంతంగా నవ్వి, ‘‘లేకేం వుంది. చాలా పెద్ద పండితులు విరుగుడు చేస్తామని వచ్చారట. అయితే ఆ క్రతువు చేయడానికి పన్నెండు గంటలు పడుతుంది. చాలా దీక్షగా వుండాలి. ఆ కాసేపు పదవి తీసి పక్కన పెట్టన్నారు. అబ్బో! పన్నెండు గంటలా, ఇంకా తక్కువలో కుదర్దా అన్నాడాయన. ఏవుంది, పన్నెండు మందితో పన్నెండు కుండాల్లో పన్నెండుమంది రుత్విక్కులతో చేయిస్తే గంటచాలు అనగానే అయితే ఇరవై నలుగుర్ని రప్పించండన్నారట చంద్రబాబు. లేదండీ యీ క్రతువు తెల్సినవారు పన్నెండుగురే వున్నారని చెప్పార్ట. ఆయన నిట్టూర్చి అయితే వద్దులెండి(మనసులో రిస్కెందుకు అనుకుని) నేనీ విధంగానే ముందుకు పోతానన్నారట!’’ అని ముగించి లేచాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రుణ మాఫియా
మాది చిన్న గ్రామం. అక్షరాలొచ్చిన ప్రతివారూ ప్రామిసరీ నోటు రాయడం నేర్చుకు తీరాలనేవారు మా నాన్న. అది చారిత్రక అవసరమని నొక్కి వక్కాణించేవారు. పదేళ్లు వచ్చేసరికి నాన్న బ్రహ్మోపదేశంతోపాటు ప్రోనోటు బుర్రకి పట్టించారు. మా పల్లెటూళ్లో కలం, తెల్ల కాగితం, నోటు బిళ్ల, కటిక్కాయ అన్నీ సింగిల్ విండో పద్ధతిలో మా ఇంట్లో దొరికేవి. రాతగాడు కూడా సమకూరేసరికి, ఇక రుణదాత దొరికితే చాలు లావాదేవీ పూర్తి అయ్యేది. ఆన ఫలానా సంవత్సరం ఫలానా నెల ఫలానా తేది, వారి యొక్క కుమారు ఫలానా వారికి వ్రాయించి ఇచ్చిన ప్రామిసరీ నోటు. ఈ రోజు నా అక్కర నిమిత్తం అనగా కుటుంబ ఖర్చుల నిమిత్తం మీ వద్ద అప్పుగా తీసుకున్న రొక్కం రూ–లు. దీనికి నెలకి నూటికి వడ్డీ అయిదణాల డబ్బు. తర్వాత ముగింపు వాక్యాలుంటాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ధర్మవడ్డీ అది. ‘డబ్బు’ అంటే అయిదు దమ్మిడీలు. వ్యవసాయ ఖర్చుల నిమిత్తం అని రాస్తే ఉత్తరోత్తర సమస్య కావచ్చని కుటుంబ ఖర్చులని రాయిస్తారు. పెళ్లి, పేరంటం, అనారోగ్యం, గాలివాన ఏదైనా కావచ్చు. నాన్న చేసిన బ్రహ్మోపదేశం మర్చిపోయాగానీ ప్రోనోటుపదేశం ఇప్పటికీ బుర్రలో ఉండి, నా సొంతానికి ఎంతో ఉపయోగంగా ఉంది. మోదీ పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు నాకందుకే ఈ శతాబ్దపు దౌర్జన్యం అనిపించింది. ప్రోనోటు మాటలే కరెన్సీ నోటు మీద ఉంటాయి. మూడు సింహాల ముద్ర, రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటాయి. కోట్లాదిసార్లు మాట తప్పి పాపం మూటకట్టుకుంది మోదీ సర్కార్. దక్కిన అసలు ఫాయిదాలు మాత్రం శూన్యం. రుణం అంటే పరపతి. రుణం అంటే నమ్మకం. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణం అంటే స్పష్టంగా చేతికి దక్కిన ఆదాయమే. కాకపోతే లాంఛనంగా, ‘షరతులు వర్తిస్తాయ్’ అని ఓ మాట అనుకోవచ్చు. బ్యాంకులు జాతీయమయ్యాక రైతులకు రుణాలివ్వడం మొదలుపెట్టాయి. అప్పటిదాకా చేలగట్లు తప్ప వేరే దారి తెలియని చిన్నాచితకా రైతులు అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. రకరకాల లోన్లు పుట్టే మహదవకాశం వచ్చింది. మొదట్లో కొంచెం భయం ఉండేది. మన రాజకీయ నాయకులు ఎన్నికల వేళ ‘రుణ మాఫీ’ తారకమంత్రాన్ని ప్రప్రథమంగా జపించడం మొదలుపెట్టారు. ఆ మాట రైతాంగానికి కొండంత అండగా మిగిలేది. అసలు అపోజిషన్ గొంతులు ఓడిన మర్నాటినుంచీ రుణమాఫీ చెయ్యాలంటూ ఇంటాబయటా నినాదాలు పెట్టడం, మాఫీ జరగ్గానే వాళ్ల అకౌంట్లో వేసుకోవడం మామూలైపోయింది. అప్పట్నించి రైతులు రుణాలు చెల్లించక్కర్లేదనే భరోసాతోనే అప్పులు చేస్తున్నారు. ఇది ఎన్నేళ్లుగా, ఎంత ఉదారంగా సాగుతోందో మనకి తెలుసు. కేసీఆర్ రైతుబంధు స్కీము పెట్టి డబ్బు పంచేశారు. అది అద్భుతంగా పేలింది. డబ్బున్న బంధువుల్ని నాలుగువేలు అప్పడిగితే, ఓ వెయ్యో, అర వెయ్యో చేతిలోపెట్టి నువ్ మళ్లీ ఇవ్వక్కర్లేదని ముందే చెప్పేస్తారు. కేసీఆర్ ఇచ్చిన టచ్ అదే. అందరికీ అప్పులిస్తున్నారు. రైతన్నలకి ఎందుకివ్వరాదు. అసలు వాళ్లకి భూములు కొనుక్కోవడానికి కూడా 80 శాతం రుణాలివ్వాలి. వ్యాపారాలకి, పరిశ్రమలకి, ఇళ్లకి, కార్లకి ఇవ్వడం లేదా? ఓ ఇరవై సంవత్సర వాయిదాల మీద బాకీ చెల్లించి భూమికి సొంతదారుడవుతాడు. అప్పు చెల్లించలేకపోతే బ్యాంకులే భూమిని స్వాధీనం చేసుకుని పండించుకుంటాయ్. వ్యవసాయం పుట్టినప్పటినుంచి రైతుకి కన్నీళ్లే మిగులుస్తూ వస్తోంది. అది ఏ రకమైన పంటయినా కావచ్చు. ఏలకులు, లవంగాలు లాంటి ఖరీదైన సుగంధ ద్రవ్యాలు పండించినా, టీ కాఫీ తోటలు వేసినా, ఇతర వాణిజ్య పంటలు పండించినా రైతుకి నిట్టూర్పులే మిగుల్తాయి. రెండేళ్ల దిగుబడి ఒక్కసారిగా రానే రాదు. కారణం– వ్యవసాయ పరిశ్రమలో నేల, రైతు శ్రమతోబాటు ప్రకృతి చెప్పినట్టు వినాలి. వాన ఎండ గాలి పాటు అన్నీ కార్తెలకి తగ్గట్టుండాలి. వీటిని శాసించి నియంత్రించే ఉపగ్రహాన్ని కక్ష్యలో పెట్టగలిగితే అప్పుడు రైతే రాజు. అందాకా అత్యధిక ఓటర్లుగా ఉన్న రైతులకు మన నేతలు జోలలు పాడుతూ ఉండాల్సిందే. ఆదాయం రెట్టింపు చేస్తానని ఒకరు, ఎకరాకి కోటి తెప్పించే మార్గం ఉందని ఇంకోరు రైతాంగాన్ని మభ్యపెడుతూనే ఉంటారు. ఈ రుణమాఫియా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంటుంది. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పోలింగ్ మర్నాడు...
ఓటమిలో చాలా రకాలుంటాయ్. ఇది మాత్రం కూటమికి భయంకరమైన ఓటమి. తెలంగాణలో చంద్రబాబు కింగ్‌మేకర్‌గా వెలిగిపోదామని ఉత్సాహపడ్డారు. అనేక రోడ్‌షోల్లో అదే అరిగిపోయిన రికార్డుని వేసుకుంటూ పరమబోరు కొట్టించారు. రాహుల్ సరసన కూర్చుని మహాసభల్ని అడ్రస్ చేయడానికి చంద్రబాబు సంకోచించలేదు. ఇదంతా బీజేపీని గద్దె దింపడానికేనని పదే పదే చెప్పారు. జనం విని, ఆవలించారు. కోదండరాం కూటమిలో చేరడం, అయ్యో పాపం అనిపించుకోవడం ఘోరం. గద్దర్ సరేసరి. వీళ్లంతా వ్రతాలు పాడు చేసుకుని, కళావిహీనంగా మిగిలారు. వీళ్లంతా ఒకే తాటిమీద నడవడం, ఒకే వేదిక మీద నుంచే ఒకే మైకులో మాట్లాడటం ఒక ‘చారిత్రక ఛండాలం’ అన్నాడొక పెద్దాయన. ఈ కూటమి కెమిస్ట్రీలోంచి పనికిమాలిన ఫలితాలొచ్చాయ్. చేతికందిన పార్టీలన్నింటినీ తెచ్చి ఒక బీకర్లో వేశారు. దాని ఫలితం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికీ ఈ దేశ ప్రజమీద అతి చొరవ తీసుకుంటోంది. ఆ నైజానికి స్వస్తి పలకాలని ఒకాయన వాపోయాడు. మొన్న చిత్తుగా ఓడిన కూటమి పార్టీలు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. పోలింగ్ అయ్యాక కూడా ఓటర్ల నాడిని కనీసం గురికి బెత్తెడుగా అయినా పట్టుకోలేకపోయారు. పైగా ఓటింగ్ మెషీన్లు దగా చేశాయని అర్థంలేని ప్రకటనలు. ఇవన్నీ హాస్యాస్పదంగా ఉంటాయ్. పోలింగ్ అయిన మర్నాడు తీరిగ్గా బస్సెక్కి నగరం దాటి వెళ్లాను. ఒక బంజారా తండా దగ్గర దిగాను. తండా మొదట్లో ఒక రావి చెట్టుని ఆనుకుని ఓ పెద్దాయన జోగుతున్నాడు. మధ్య మధ్య మెడమీద పాకుతున్న చీమల్ని దులుపుకుంటున్నాడు. నేను అటూ ఇటూ దిక్కులు చూసి, ఆ పక్కనే ఉన్న బండరాయిమీద చతికిలబడ్డాను. ఆయన లేచి కూర్చుని ఎవరు ఏమిటన్నట్టు నా వంక చూశాడు. కుశల ప్రశ్నలతో మాటలు మొదలుపెట్టాను. నాలుగు ప్రశ్నలయ్యాక, ‘అసలు సంగతికి రాకూడదూ’ అన్నాడు సూటిగా. వయసు, దానికి తగ్గ అనుభవం నిలువెల్లా తొణికిసలాడుతోంది. నేను ఎంపిక చేసుకుందామనుకుంది సరిగ్గా ఇలాంటి ఓటర్నే. ఆడబోయిన తీర్థం ఎదురైంది. ‘... ఎవరు గెలుస్తారు?’ అని సూటిగా అడిగాను. ‘మా వాళ్లంతా కారుకే వేశారు. మరి మా వాళ్లంటే మంద.. ఒకే తీరు. తేడాలుండవ్. మీ పట్నం వాళ్లకి సొంత ఆలోచనలుంటాయ్. అందుకని మీ ఆలోచనలు మేక పెంటికల్లా విడివిడిగా ఉంటాయ్’. ఆ పోలిక నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. ‘... అంతో ఇంతో చేశాడు. ఇంకా చేస్తన్నాడు. ఎవడైనా అంతే. ఇంకా తింటం అంటారా. వీళ్లే నయం. ఈ నాలుగేళ్లలో గుంటలు పూడ్చుకున్నారు. ఇహ మెరకలేసుకోవడమే కాబట్టి కూత్తి తక్కువే తింటారు’. ఆ పెద్దాయన అంచనాకి నాకు నవ్వొచ్చింది. ‘పాపం ఇంటిల్లిపాదీ రాష్ట్రానికే చాకిరీ చేస్తున్నారు గదా’ అనగానే ‘అదేకదా వచ్చిన విమర్శ’ అన్నాను. ‘అదేంది? నాకిప్పుడు నలుగురు బిడ్డలున్నారు. నాకు ఐదెకరాల భూమి ఉంది. అందరూ పొలంలో తలోపనీ చేసుకుంటారు. ఓ కూతురుంది. అది గోచీ బిగించి తాడిచెట్టుకి పాకిందంటే ఉడత లెఖ్ఖ. కల్లుగీతలు గీసేవాళ్లు దాన్ని నివ్వెరపాటుగా చూస్తారు. పనికొచ్చేవాడు పనిచేస్తే తప్పా? కేసీఆర్ రాగానే నీళ్లమీద పడ్డాడు. కరెంటుని ముందే చక్కపెట్టాడు. పొలాలకి డబ్బు పంచాడు. కాస్త గుక్క తిప్పుకోనియ్యాలి కదా. ఒక్కమాట చెబుతా విను. దేశానికి సొరాజ్జం తెచ్చామని చెప్పి కాంగ్రెసోళ్లు గాంధీ, నెహ్రూల పేర్లు చెప్పుకుని యాభై ఏళ్లు హాయిగా ఏలారు. ఈయన ఉద్యమం నడిపాడు. రాష్ట్రం తెచ్చాడు. ఇంకోసారి సీటిస్తే ఏమవుతుందనిపించింది. నేను కుర్రతనం నించి ఎర్రజెండా పట్టుకు పెరిగినవాణ్ణి. నాకన్నీ తెలుసు. నా బీడు భూమికి చెమ్మ తగుల్తుందని నేననుకోలేదు. తగిలింది. అంతమంది కలిసి పాలిస్తే అది కుక్కలు చింపిన విస్తరవుతుంది. శానామంది నాలాగే అనుకున్నారు. ఫలితాలు దానికి తగ్గట్టే ఉంటాయ్’. నేను సంతృప్తిగా లేచి కదిలాను. నా సర్వే పూర్తయింది. ‘ఇలాంటి ఫలితాలు నాలో ఉన్న కమ్యూనిస్టుకి అక్కసుగానే ఉంటది. అందుకే వాడు గొర్రె కసాయి వాణ్ణే నమ్ముద్ది’ అని అరుస్తున్నాడు. దూరానికి ఆ మాటలు వినిపించాయి. వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు -
మోసపోకండి!
మనకి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ‘ఎన్ని కల వాగ్దానాలకి’ ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. ఆ వాగ్దానాలు కార్య రూపం దాల్చడానికి ఎంత అవకాశం ఉంటుందో, కాక పోవడానికి అంతకు మూడు రెట్లు అవకాశం ఉంటుంది. స్వతంత్రం వచ్చీ రాకుండానే నెహ్రూ ప్రతిపాదించిన పంచవర్ష ప్రణాళికలు హాస్యాస్పదంగానూ, ఓ సామెతగానూ మిగిలాయి. శంకుస్థాపన శిలాఫలకాల మీద బోలెడు సెటైర్లు, కావల్సినన్ని కార్టూన్లు వస్తుండేవి. అమలు కాని వాగ్దానాలు, శుష్కప్రియాలు, తీపి కబుర్లు– ఇలాంటివన్నీ కలిసిపోయి ఎజెండాలైనాయి. అవే రంగు మార్చుకుని మానిఫెస్టోలు అయినాయి. ఇందిరాగాంధీ ‘గరీబీహటావో’ దేశాన్ని పదేళ్లపాటు నిరాటంకంగా పాలించింది. తర్వాత ఎవరెవరో ఎన్నెన్నో ఏకపద, ద్విపద నినాదాలు రచించారు. కానీ అవి జనానికి ఎక్కలేదు. ఇది కూడా వ్యాపార ప్రకటనల్లాంటివే. రూల ర్కి, ఓటర్‌కి నడుమ వారధిలా ఉండాలి. ఆ రెండు ముక్కలూ మంత్రాక్షరిలా పనిచేయాలి. ‘ఓన్లీ విమల్’ అనే రెండు మాటలు కస్టమర్లని పట్టేసింది. తెగ చుట్టేసింది. ‘ఐ లవ్ యూ రస్నా’ పిల్లల్నే కాదు పెద్దల్ని కూడా నోరూరిస్తుంది. ఒక ఫోమ్ పరుపుల కంపెనీ మీకు అత్యంత నమ్మకమైన స్లీపింగ్ పార్టనర్ అనే విశేషం తగిలించి జనాన్ని తెగ ఆకర్షించింది. ఈ రాజకీయ వార్తావరణంలో నిత్యం సంగ తులు వింటుంటే సగటు ఓటర్లకి హాస్యాస్పదంగా తోస్తోంది. జన సామాన్యానికి ఏమేమి ఆశలు పెడితే ఓట్లు రాలుతాయో అంతుపట్టడం లేదు. ధనిక వర్గాన్ని పడగొట్టడం మాటలు కాదు. పేద, బలహీన వర్గాలను మాటల్తో హిప్నటైజ్ చేయడం తేలికేనని రాజకీయ పార్టీలన్నీ గట్టిగా నమ్మతాయ్. పాపం, వేరే దిక్కులేక ఆ వర్గాలు పదే పదే నమ్మేసి నాలిక్క రుచుకుంటూ ఉంటాయి. ఎలుగుబంటి, నక్క కథలో లాగా అన్నిసార్లూ నక్కే లాభం పొందినట్టు రాజకీయమే చివరకు నెగ్గుతూ ఉంటుంది. ఎలుగు, నక్క ఉమ్మడి వ్యవసాయానికి దిగు తాయి. పై పంట నాది, మధ్య మొదటి పంటలు నువ్ తీసుకో అంది నక్క. ఆ సంవత్సరం వరి పంట వేస్తే ఎలుగుకి గడ్డి మిగిలింది. నక్కకి ధాన్యం దక్కింది. ఎలుగు మరు సంవత్సరం తెలివిగా ఈసారి పై పంట నాది అన్నది. సరేనని ఆ ఏడు వేరుశనగ వేస్తే, మళ్లీ నక్క పంటే పండింది. మూడో ఏడు కోరుకునే చాన్సు నక్కకి వచ్చింది. మధ్యపంట నాకిచ్చి, తుది మొదలు నువ్వు తీసుకోమంది. ఆ సంవత్సరం చెరకుతోట వేసింది. ఎలుగుకి ఆకులు వేర్లు దక్కాయి. మన లీడర్లు బహిరంగంగానే ఏ మాటలతో ఓట్లు రాల్తాయో ఆలోచన చేస్తుంటే భలే ఆశ్చర్యం వేస్తుంది. పైగా ‘మేం చేస్తాం, మేం ఇస్తాం’ అని వాగ్దానాలు చేస్తుంటే మరీ అగ్గెత్తుకొస్తుంది. వాళ్ల సొంతసొత్తు తీసి పంచుతామన్నట్టు మాట్లాడ తారు. జనం డబ్బు, జనం కోసం ఖర్చు చేయడం కూడా మహా త్యాగంలా చెబుతారు. పైగా రాబడికి పోబడికి మధ్య ఎన్నివేల కోట్లు తరుగు పోతుందో ఒక్కసారి సామాన్యులు సుమారుగా లెక్కవేసినా గుండె పగిలిపోతుంది. ఈ దేశభక్తికి ప్రజాసేవకి ఎందుకింత డిమాండు ఉందో తేటతెల్లం అవుతుంది. ఇటీవల నినాదాలు వింటుంటే కనీసం మాటల్లోనైనా కొత్త ఐడియాలు అస్సలు లేవు. ‘‘చానల్ లోగో కప్పేస్తే అన్ని తెరలూ ఒకేలా ఉంటున్నాయ్. పత్రికల పైతల కొట్టేస్తే అన్ని డైలీలు ఒకటే’’నని ఓ పెద్దమనిషి చిరాకుపడ్డాడు. నాకు గుర్తొస్తోంది, చాలా రోజుల క్రితం ఒక పత్రికలో పెద్దక్షరాలతో ఒక వ్యాపార ప్రకటన వచ్చింది. ‘మిగిలిన పత్రికలు చదివి మోసపోకండి! మా పత్రికనే చదవండి!’ అని. జనం ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. మీరు ఇంతవరకూ నష్టపోయింది చాలు. డబ్బు వీజీగా రాదని ఓ శ్రేయోభిలాషి మనల్ని నిమిషా నికోసారి దిగులు పడేట్టు చేస్తుంటాడు. పార్టీ నినా దాలు కూడా సినిమా పల్లవుల్లా ‘క్యాచీ’గా ఉండాలి. ప్రస్తుతం మన రాజకీయ నేతలందరూ భావదా రిద్య్ర రేఖకి దిగువన కొట్టుమిట్టాడుతున్నారు. పాపం! వారిని ఉద్ధరించండి! శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పుల్లయ్యగారి చిలకపలుకులు
ఒకనాటి మద్రాసు చలన చిత్ర రంగంలో పి. పుల్లయ్య చాలా ప్రసి ద్ధులు. నాటి ప్రముఖ నటి శాంత కుమారి భర్త. మంచి దర్శకులు, అభి రుచిగల నిర్మాత. ఆయన సందర్భానికి తగిన విధంగా, కోపం స్పష్టంగా వ్యక్తమయ్యే రీతిలో బూతు ముక్కల్ని ధారాళంగా వాడేవారు. అందులో తరతమ భేదం ఉండేది కాదు. ఈ విషయంలో పుల్ల య్యకి పెద్ద పేరుండేది. అప్పట్లో మద్రాస్ విజయ వాహిని స్టూడియోలో నాలుగు మైనాలు రెండు పంజరాల్లో సందడి చేస్తుండేవి. స్టూడియో యజమా నులు నాగిరెడ్డి చక్రపాణి స్వయంగా ఆ చిలకల ఆల నాపాలనా చూస్తుండేవారు. ఎవరైనా వాటిని పలక రిస్తే మర్యాదగా బదులు పలికేవి. కొన్ని ప్రశ్నలకు వినయంగా జవాబులు చెప్పేవి. ఉన్నట్టుండి వాటి ధోరణి మారింది. నాగిరెడ్డి చక్రపాణి ఎప్పటిలా ముద్దుగా పలకరిస్తే ముతకగా మాట్లాడుతున్నాయ్. వాళ్లు చెవులు మూసుకుని, విన్న మాటలు నమ్మలేక అక్కడి స్టూడియో పరివారాన్ని పిలిపించారు. చిల కల ధోరణిపై పంచాయితీ పెట్టారు. ఆరా తీయగా, మొన్న రెండు కాల్షీట్లపాటు పుల్లయ్యగారి సినిమా సెట్లో ఈ పంజరాలున్నాయని తేలింది. నాగిరెడ్డి, చక్రపాణి తలలుపట్టుకుని, ఇప్పుడేం చేద్దామని ఆలోచించి చివరకు రెండు పంజరాల్ని పక్షులతో సహా పుల్లయ్యకి బహూకరించి, ఒడ్డున పడ్డారట. ఇలాంటి పిట్టకథలు అనేకం చెన్నపట్నం సినిమా వాడలో ప్రచారంలో ఉండేవి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రసంగాలు వింటుంటే తెలిసిన ఎవరికైనా పుల్లయ్య గారి చిలకపలుకులు గుర్తుకొస్తాయి. సాహిత్యంలో తిట్టువేరు, బూతు వేరు. తిట్టులో కారం ఉంటే, బూతులో అశ్లీలత తొణుకుతుంది. కేసీఆర్ పలుకు బడి తిట్టుకోవకే వస్తుంది కానీ బూతు పరిధిలోకి రాదు. ఈ సత్యం ఏ కోర్టుకు వెళ్లినా గట్టిగా నిలు స్తుంది. మైకు ముందుకొచ్చినవారు ఒక విజ్ఞతతో వ్యవహరించాలి. ఇతరత్రా వేదికలు వేరు, ఓట్లు అడుక్కునే వేదికలు వేరు. ముష్టివాడికి ధాష్టీకం పని కిరాదు. చంద్రబాబు మన పక్క రాష్ట్రం ముఖ్య మంత్రి. ఎంత చెడ్డా ఒక పార్టీ అధినేత. ఇంకా ఆయన బలం చెప్పాలంటే– కొడుకు రాష్ట్ర మంత్రి. సొంత బావమరిది అగ్రశ్రేణి హీరో మాత్రమే కాదు, రాష్ట్రంలో మంత్రులను శాసించగల ఎమ్మెల్యే. కేసీఆ ర్ని నిన్న మొన్నటిదాకా ‘నువ్వు’ అని సంబోధించిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికీ టీడీపీకి తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఇప్పటికీ అక్కడ క్కడా కరెంటు స్తంభాల్లా ఓ క్రమంలో తెలుగుదేశం మనుషులు ఇతర కండువాలు కప్పుకుని ఉన్నారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇన్ని భుజకీర్తులున్న చంద్రబాబుని అలా నిండు సభలో అలా తేలిగ్గా మాట్లాడటం కొంత వినసొంపుగా లేదని కొందరు పెద్దమనుషులు అనుకున్నారు. మోదీతో నాలుగున్న రేళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగారు, ఒకే గొడుగులో నడిచారు, ఇలాంటి నాజూకు పదజాలం వాడితే బావుండేది కదా, వేరే అన్యక్రియా పదాలు వాడటం దేనికని కొందరి అభిప్రాయం. ‘నేత వస్త్రాల ముతక సన్నం చెప్పేటప్పుడు నంబర్లు వాడతారు. వంద నూటిరవై అంటే సూపర్ ఫైన్. ఎనభై, అరవై కొంచెం ముతకే గానీ మన్నిక బావుంటుంది. నలభై కౌంటు బరువెక్కువ. ఇక ఇరవై అంటే కొంచెం మోటు, కాస్త బాగా నాటు. ఇదిగో... మా కేసీఆర్ వాడినమాట ఇట్టా ఉంది..’ అని ఓ ఖద్దరు ధరించిన పెద్దాయన వ్యాఖ్యానించి, ముగించాడు. ‘ఎంతైనా సాటి నేతని నిజాలే కావచ్చుగానీ అంతలా దండెతో దూదిని ఏకినట్టు ఏకడం అవసరమా?’ అని మరొకాయన నీళ్లు నవుల్తున్నట్టు అన్నాడు. ఇంకొకాయన గొంతెత్తి ‘.. మరి ఇదే కేసీ ఆర్ ఓవైసీలతో కలిసిమెలసి నడుస్తున్నాడుగదా. ఆళ్లు యీళ్లు రెండు మెట్రో రెలుపట్టాల్లా, ఎటంటే అటు తిరుగుతూ పోవడం లేదా. ఆ పట్టాలు దూరా న్నుంచి చూస్తే దూరంగా కలిసినట్టు కనిపిస్తాయ్ గానీ దగ్గరికెళ్లి చూస్తే, టచ్ మీ నాట్ అన్నట్టు ఎడం ఎడంగా పోతుంటాయ్. అసలప్పుడే కదా రైలు క్షేమంగా ముందుకెళ్లేది. మరి ఇద్దరూ కావడిలో కుండల్లా, సుఖంగా లాభంగా వూగుతా రాజ్యం ఏలుకోవడం లేదా? అయితే, వాళ్లిద్దర్నీ జోడించి ఎవరైనా ఎద్దేవా చేస్తే కేసీఆర్‌కి ఎట్టా వుంటది? కేసీఆర్ అవతారం మారిందని మర్చిపోకూడదు. కృష్ణావతారంలోకొచ్చి, ‘లక్ష్మణా విల్లందుకో’ అంటే జనం మెచ్చరు. కొలుపుల్లో కొందరికి పూనకా లొస్తాయ్. కొందరు కాంట్రాక్ట్మీద తెప్పించుకుం టారు. ఆ పైత్యాన్ని కొలుపు కాగానే దింపుకోవాల. ఉద్యమ సభలు వేరు. ఇవి మనల్ని అద్దంలో చూపే సభలు. మూడో కన్ను తెరుస్తానని బెదిరింపొకటి. అంటే అవతలివారి అవకతవకలు, బొక్కలు బయట పెడతాననేగా... నాకూ ముతక మాటలొస్తున్నాయ్. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
పంచతంత్రం
మహానుభావుడు ఏ మధుర క్షణాల్లో సృష్టించా డోగానీ పంచతంత్రం ఒక విలక్షణమైన వేదం. ఎప్ప టికీ మాసిపోదు. ఎన్నటికీ డాగు పడదు. సృష్టిలో మనిషి ఉన్నంతకాలం పంచతంత్రం ఉంటుంది. అది ఏమాత్రం విలువలు మారని గణిత శాస్త్రం. ‘కాకి–రత్నాలహారం’ ఎంత గొప్ప కథ. ఒక అల్ప జీవికి రాజభటులను సమకూర్చిన సన్నివేశం అది. ఒక చీమ నీళ్లలో కొట్టుకుపోతుంటే పావురం పండు టాకుని అందించి ఒడ్డుకు చేరుస్తుంది. తర్వాత బోయ ఆ పావురానికి బాణం ఎక్కుపెట్టినపుడు చీమ వాడిని కుట్టి గురి తప్పిస్తుంది. మిత్రుడు ఎంతటి చిన్నవాడైనా, మనసుంటే రక్షించగలడు. ఇదే మిత్ర లాభం. ఇవన్నీ జంతువులమీదో, పక్షులమీదో పెట్టి చెప్పినా, అవన్నీ మన కోసం చెప్పినవే. మిత్రలాభం, భేదం, సంధి, విగ్రహం, అసంప్రేక్షకారిత్వం అనే అయిదు తంత్రాలను మనం జీర్ణించుకుని, జీవితా నికి అన్వయించుకోగలిగితే తిరుగుండదు. ఇది ఏ రంగంలో ఉన్నవారికైనా వర్తిస్తుంది. ఇక జాగ్రత్తపడా ల్సింది విజయానంతరం ఆవహించే అహంకారం గురించి. మృగరాజుగా పేరొందిన సింహం ఒక కుందేలు దెబ్బకి జలసమాధి అయిన ఉదంతం మనకో నీతి నేర్పుతుంది. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు నిత్యం వీటిని పఠించుకోవాలి. అందులో ఆ సందర్భంలో తను ఏ జీవికి పోలతాడో సరిగ్గా అంచనా వేసుకోవాలి. దాన్నిబట్టి అడుగు ముందుకో వెనక్కో వెయ్యాలి. ఈ మధ్య రాజకీయాల్ని గమనిస్తుంటే– ఇక ఎన్నికలు.. ఎన్నికలు మరియు ఎన్నికలు తప్ప ఏమీ వినిపించడం లేదు. ప్రజకి నైరాశ్యం వచ్చేసింది. చాలా నిరాసక్తంగా ఉన్నారు. ఓటర్లు చాలా ఉదాసీ నంగా ఉన్నారు. నాయకులు బాణాలు ఎవరిమీద ఎక్కుపెడుతున్నారో, ఎందుకు పెడుతున్నారో తెలి యదు. చూస్తుంటే నిత్యం ఒక పద్మవ్యూహం, ఒక ఊబి, ఒక ఉచ్చు పరస్పరం పన్నుకుంటున్నట్టని పిస్తుంది. చివరికి ఎవరికెవరు వలవేస్తున్నారో, ఇంకె వరు ఉరి వేస్తున్నారో బోధపడదు. నేను ఈ చిక్కుల ముగ్గులోంచి బయటపడలేక, అనుభవం పండిన ఓ రాజకీయ నేతని కలిసి బావురు మన్నాను. ఆయన చిత్రంగా నవ్వి ‘‘మేం మాత్రం ఏం చెబుతాం. ఒక సాంప్రదాయం, ఒక నడక, ఒక నడత ఉంటే స్థితిగతులు విశ్లేషణకి అందుతాయి గానీ, ఈ ఇసుక తుఫానులో ఏమి అంచనా కట్ట గలం’’ అన్నాడు. ఒక్కసారి శ్వాస పీల్చుకుని ‘‘చద రంగం ఆడేటప్పుడు బలాలు ఓ పద్ధతి ప్రకారం ప్రవర్తిస్తాయ్. పులి జూదంలో పందెం ప్రకారం అవి నడుస్తాయ్. పందెపుగవ్వల ఆజ్ఞ ప్రకారం పావులు చచ్చినట్టు నడుస్తాయ్. ఆ పావులు పాము నోట్లో పడచ్చు, నిచ్చెనెక్కచ్చు’’ అని నావంక చూసి మళ్లీ ప్రారంభించాడు.ఏమాత్రం నాగరికత యెరగని అడవిలో కూడా ‘జంగిల్ లా’ ఒకటుంటుంది. సింహం బక్క ప్రాణుల్ని ముట్టదు. అది ఆకలితో అలమటిస్తున్నా ఆపదలో ఉన్నా దాని నైజం మార్చుకోదు. చచ్చినా దిగజారదు. మరి నక్క ఉందంటే దానికో జీవలక్షణం ఉంటుంది. అదలాగే బతికేస్తుంది. ఆత్మరక్షణకి కొమ్ములతో పొడిచేవి కొమ్ములతోనే పొడుస్తాయి. పంజా విసిరేవి, కాళ్లతో తన్నేవి, కోరలతో పీకేవి ఉంటాయి. అవి సదా అలాగే చేస్తాయి. ఎటొచ్చీ కోతులు మాత్రం మనకు అందుతాయ్. చాలా దగ్గర లక్షణాలుంటాయ్. నిశ్చలంగా ఉన్నా, చెరువు నిర్మ లంగా వున్నా కోతులు సహించ లేవు. ఒక రాయి విసిరి చెదరగొట్టి ఆనందిస్తుంది కోతి. అలాగే ఇప్పుడు మనం ఉండేది కూడా అడవే కదా. రాజకీయాలకి వస్తే ఇదంతా డబ్బుమీద నడిచింది, నడుస్తోంది, నడు స్తుంది. కుల బలం పదవిని కట్టపెట్టదు. కావల్సింది ధన బలం. చాలా మంది డబ్బేం చేసుకుంటారు. వెళ్తూ కట్టుకెళ్తారా అంటారు. దేన్నీ కట్టుకెళ్లం. చదువుని, కీర్తిని, పొగడ్తల్ని ఇక్కడే పారేసి వెళ్తాం. అందు కని డబ్బుని ‘‘వేదాంతీ’కరించకూడదు. దేవుడు ఓ తిక్కలో ఉండగా మనిషిని చేశాడు. అందుకే అవ యవాలుగానీ, మెదడుగానీ ఏదీ సక్రమంగా కుద ర్లేదు. ఇలాంటి మెదడుకి రాజకీయం కలిస్తే ఇహ చెప్పేదేముంది?! ఇక్కడ నీతి నియమాలుండవు. అనుభవం అస్సలు వర్కవుట్ కాదు. ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూ ఉంటుంది. పాత అనుభవాలకి అస్సలు విలువలేదు’’ అని పెద్దాయన ముగించాడు. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఎవరి గోష్టి వారిదే!
అక్షర తూణీరం రాహుల్ గాంధీ వయోలిన్ వాయిస్తూ మురిసిపోతు న్నారు. మధ్యలో జారిపోయిన కమాన్ని సోనియమ్మ తిరిగి దారిలో పెట్టి ఆనందబాష్పాలు విడుస్తున్నారు. దేశంలో ఎవరికి తోచిన విధంగా వారు సందడి చేస్తున్నారు. ఎవరేమి చేసినా అందరి దృష్టి రానున్న ఎన్నికలమీదే. ఇదంతా ఒక వాద్య గోష్టిని తలపిస్తోంది. ఈ మహా బ్యాండ్‌లో ఎక్కడా శ్రుతి కలవదు. లయ నిలవదు. మన విద్వాంసులందరినీ ఇలా ఊహిస్తూ పోతే– ప్రధాని మోదీ గోష్ఠి పెద్ద కాబట్టి ఘటం వాయిస్తూ స్పష్టంగా వినిపిస్తున్నారు. తరచుగా తని ఆవృతంలో ఘన వాదనలో ఆయనకున్న నైపుణ్యాన్ని తిరగేసి, మరగేసి, ఎగరేసి వాయించి మరీ ప్రదర్శిస్తున్నారు. మోదీ ముక్తాయిం పులకి, తీర్మానాలకి జనం బెంబేలెత్తుతున్నారు. మూడేళ్లలో ఘటం బాగా నునుపు తేలింది. స్వరస్థానాల మీద మోదీకి పట్టు దొరికింది. అస్తమానం అరుణ్ జైట్లీ కంజరతో సహకరిస్తున్నారు. నాలిక తెగిపోతుందేమో అనేట్టు మోర్ సింగ్‌తో అనుసరిస్తున్నారు రాజ్‌నాథ్ సింగ్. శ్రుతి మీద ధ్యాస పెట్టి తాళం వేస్తున్నారు అమిత్ షా. కాంగ్రెస్ నేత రాహుల్ వయోలిన్ వాయించుకుంటూ తన వాదనకి తనే మురిసిపోతున్నారు. మధ్య మధ్య జారిపోయిన కమాన్‌కి సోనియమ్మ తిరిగి దారిలో పెట్టి ఆనందబాష్పాలు జారవిడుస్తున్నారు. కాస్త హిందూస్థానీ, కొంచెం ఇటాలియన్, మరికొంచెం అయోమయం కలిసి కొత్త ధ్వనులు వినవస్తున్నాయి. పాపం విద్వాంసుల పరంపర లోంచి వచ్చినా ఎందుకో కళ అబ్బలేదని కొందరు జాలి పడుతున్నారు. ఇక మిగిలిన పుంజీడు వామపక్షులు మూల పడేసిన తబలా ముక్కల్ని తలొకటి తీసుకుని గొడవ పడకుండా శక్తికొద్దీ చప్పుడు చేస్తున్నారు. కామ్రేడ్స్ మాత్రం వాళ్ల దెబ్బకే ఆకాశం ఎరుపెక్కిందని నమ్ముతూ, తన్మయ త్వంలో కాళ్లా చేతులా వాద్యగోష్ఠి సాగిస్తు న్నారు. ఇక అరుణోదయానికి ఆట్టే వ్యవధి లేదనే ప్రగాఢ నమ్మకంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకి వస్తే– కేసీఆర్ తలాడిస్తూ నాదస్వరం వినిపిస్తున్నారు. తరచూ దక్షిణాత్య సన్నాయి కర్రకి హిందూస్థానీ రాగాలు మప్పి లౌక్యం ప్రద ర్శిస్తున్నారు. డోలుతో కేటీఆర్ తండ్రికి సహకరిస్తున్నారు. సోలో వాదనకి చొరవ చేసి తరచూ బాదిపారేసి చప్పట్లు గెలుచుకుంటున్నారు. జనం భయపడి ఆ కర్ణక ఠోరాన్ని భరిస్తున్నారు. కోదండరామ్ నాగస్వరం అనే పాముబూరా ఊదుకుంటూ తిరుగుతున్నారు. ఆయన దగ్గర బుట్ట లేదు. బుట్టలో పాము లేదు. అయినా ఆ నాగస్వరం ఆగదు. లేని పాము పడగ విప్పదు. చంద్రబాబు ట్రంపెట్తో ప్రపం చాన్ని ఆకట్టే పనిలో ఉన్నారు. ఆ సొంత బాకాకి దాష్టీకం, బుకాయింపు తప్ప సంగ తులు లేవు. జగన్మోహన్రెడ్డి మ్యాజిక్ ఫ్లూట్తో జనాన్ని కూడగడుతున్నారు. ఉన్న ట్టుండి చేతులకి గజ్జెలు చుట్టుకుని, డోలక్ మీద సినిమా ట్యూన్లు వాయిస్తూ పవన్ కల్యాణ్ రంగప్రవేశం చేశారు. తీరా సమయం వచ్చినప్పుడు ఏఏ వాద్యాలు జట్టుకడితే గోష్టి జనప్రియం అవుతుందో చూడాలి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కొంపలు ముంచే కొత్తదేవుళ్లు
అక్షర తూణీరం ప్రభుత్వాలకి, పోలీస్ శాఖకి ఇలాంటి డేరాలు మొలకెత్తగానే తెలుస్తుంది. రకరకాల ప్రలోభాలతో వాటిని పెంచి పోషిస్తున్నారు. చివరకు ఎవరో బలైపోతారు. మన నింగీ నేలా సదా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. ఉగ్గుపాలతో తత్త్వాన్ని రంగరించి పోసే జాతి మనది. ఈ జన్మ జాతకం మీద కన్నా పై జన్మ సుఖాల మీద వ్యామోహం ఎక్కువ. అందుకే దొంగ స్వాముల, బాబాల పంట పండుతోంది. అన్నీ చూస్తూనే ఉంటారు, కథలన్నీ వింటారు– అయినా కానీ, మళ్లీ మాయలో పడుతూనే ఉంటారు. తాజాగా డేరాబాబా ఘోరాలు వెలుగులోకి వచ్చాయ్. ఈ లోగా ఎన్ని ప్రాణాలు, ఎన్ని మానాలు మట్టి కలిసిపోయాయో తెలియదు. ఒక పుట్ట, ఒక పొద రాత్రికి రాత్రి పెరిగి పెద్దదవదు. చాలా వ్యవధి, అనుకూల పరిస్థితులు కలసి పుట్టకోటలవుతాయి. దాదాపు పాతికేళ్ల క్రితం గుర్మీత్ రామ్‌రహీమ్ బాబా సాదాసీదా గురువుగా ఆవిర్భవించారు. పంజాబ్, హరియాణాలలో బాబా ఒక వర్గంపై పట్టు సాధించారు. ఆయన చెప్పిందే శాసనంగా చెలామణీ అయ్యే స్థాయికెదిగారు. ఆ తర్వాత ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతూ వచ్చింది. 2007లో ఈ దైవాంశ సంభూతుడికి నాటి యూపీఏ ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. బదులుగా బాబా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కి తన ఆశీస్సులిచ్చారు. ఇలాంటి విషయాల్లో రాజకీయ పార్టీలన్నీ ఏకతాటి మీద నడుస్తాయి. తరువాతి ఎన్నికల్లో డేరాబాబా భాజపాకి అండగా నిలిచారు. ఇలాంటి నేపథ్యంలో, ప్రభుత్వాలు బాబా దుశ్చర్యల్ని ప్రశ్నించలేకపోయాయ్. సమాంతర ప్రభుత్వాన్ని అన్ని హంగులతో నడుపుతున్న కొత్త దేవుణ్ణి చూసీచూడనట్టు వదిలెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాయి. తృటిలో గురి తప్పింది గానీ లేకుంటే ఏ పద్మవిభూషణ్ తోనో ఢిల్లీ సర్కారు తనని తాను సన్మానించుకోవలసిన మాట! దేవుడికి ధన్యవాదాలు, కనీసం ఇరవై ఏళ్లకైనా డేరాల పాపం పండింది. ఓటు బ్యాంకు రాజకీయాల దృష్ట్యా ఉదాసీనతగా వ్యవహరించే ప్రభుత్వాలకు మైనస్ మార్కులు బాగానే పడతాయి. మతాన్ని అడ్డుపెట్టుకునే స్వాముల్ని, బాబాల్ని అస్సలు ఉపేక్షించకూడదు. భింద్రెన్‌వాలే నుంచి ఇప్పటిదాకా కావల్సినన్ని అనుభవాలు. అన్నీ చేదు అనుభవాలే. చంద్రస్వామి తాంత్రిక గురువుగా ప్రభుత్వ గౌరవాలు పొందారు. ఒక దశలో తీహార్ జైలు జీవితమూ చూశారు. అప్పుడు ఆయనతో పాటు ఇంకో పదిమంది నేరస్థులు ఒకే డార్మిటరీలో ఉండేవారు. అక్కడో భయంకరమైన శిక్ష పడింది చంద్రస్వామికి. అక్కడే శిక్ష అనుభవిస్తున్న ఒక రౌడీ షీటర్ చంద్రస్వామిని అనరాని మాటలు అనేవాడట. కొట్టేవాడు, తిట్టేవాడు. ‘‘మేమంతా రౌడీలం, ముద్ర వేసుకుని తప్పుడు పనులు చేస్తున్నాం. కానీ నువ్వేంటి... దేవుణ్ణని నమ్మించి జనాన్ని దగా చేస్తున్నావ్’’ అంటూ ఓ లెంపకాయ కొట్టేవాడు. దారుణం ఏమిటంటే ఆ షీటర్ ఎప్పుడు కొడతాడో, కొట్టడో తెలియదు. ఒక్కోసారి పరగడుపున, మరోసారి అర్ధరాత్రి నిద్ర లేపి వడ్డించేవాడట. అధికారులకు చెబితే శిక్ష ఇంకా పెరుగుతుంది. ఆ విధంగా నరకాన్ని చూపించాడట. మన ప్రభుత్వాలకి, పోలీస్ శాఖకి ఇలాంటి డేరాలు మొలకెత్తగానే తెలుస్తుంది. రకరకాల ప్రలోభాలతో వాటిని పెంచి పోషిస్తున్నారు. చివరకు ఎవరో బలైపోతారు. ఒక్కోసారి నేతలు కూడా. ఇందుకు ఉదాహరణ ఇందిరాగాంధీ. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
కుళ్లు కడిగేస్తా
అక్షర తూణీరం అంటూ ధీమాగా గర్జిస్తు న్నారు మోదీ. మంచిదే. అసలు మన దేశంలో ‘నల్ల కుళ్లు’ ఎందుకు పేరుకు పోయిందో ఏలినవారు గమ నించాలి. మన ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయో, అందుకై ఆ డబ్బుని వినియోగించడం లేదు. కొంత ఇంకిపోతోంది, కొంత ఆవిరై పోతోంది. ఇంకొంత డబ్బు పక్కదారి పడుతోంది. దీన్ని ఎవరం కాదనలేం. ఆదాయపన్ను, ఆస్తి పన్ను, వ్యక్తి పన్ను, వృత్తి పన్ను, సేవా పన్ను, రోడ్డు పన్ను, వాణిజ్య పన్ను... ఇలా నలభై రకాలు. ఏ పన్నుకీ జవాబుదారీతనం లేదు. గుంతల వీధులు, వెలగని వీధి దీపాలు, ప్రవహించని మురుగు ఇదే కదా మన పట్టణాల వైభవం. మహా మహా కార్పొరేషన్లలో కూడా సౌకర్యాల కొరత తీవ్రంగా కనిపిస్తూ, నిత్యం పన్ను చెల్లింపుదారులని అసహనానికి గురిచేస్తుంటాయ్. గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మరీ ఘోరం. అసలక్కడ ప్రభుత్వంగాని, ప్రజా సౌకర్యాల ప్రసక్తిగాని లేనే లేదు. రోడ్లు, దీపాలు, మురుగు మార్గాలు మచ్చుకి కూడా కనిపించవు. అందుకే పన్ను కట్టడమంటే పోగొ ట్టుకోవడమే అనే భావన జన సామాన్యంలో ఉంది. ప్రజలంతా ఎగవేతదార్లు కారు. టెలిఫోను బిల్లులు, కరెంటు చార్జీలు, కేబుల్ టీవీ డబ్బులు చెల్లించేవారు ఆదాయపు పన్నుని ఎందుకు ఎగ్గొట్టాలనుకుంటు న్నారు? అందుకు రకరకాల వ్యూహ రచనలు చేస్తు న్నారు? పెద్దలు ఆలోచించాలి. పాపం ఉద్యోగులైతే ట్యాక్స్ చెల్లించి వేతనం తీసుకోవాలి. వృత్తి పన్నుతో నాకు ఒనగూడే ప్రయోజనమేంటని తరచూ ఉద్యోగులు బుర్ర గోక్కుంటూ ఉంటారు. విలాసాలన్నీ నల్లకుళ్లుతోనే సాధ్యమని ఆర్థికవేత్త లంటారు. మన ఆర్థిక వ్యవస్థ జోడు గుర్రాల సవారి అనుకుంటే, అందులో బ్లాక్ మనీ చీకట్లో పరిగెత్తే గుర్రం. దానికి దారి డొంక ఉండదు. నల్లడబ్బు కలుపుగడ్డిలా మన నేలలో ఏపుగా పెరుగుతుంది. దానికి మన రాజ కీయ రంగం ఎరువులు వేస్తే, అధికార గణం నీరు పోస్తోంది. కొందరు అక్కడక్కడ దేశభక్తులు ఉంటారు గానీ, వాళ్లని చేతకాని వాళ్లంటారు. ‘పార్టీ ఫండ్స్’ మొత్తం నల్లకుళ్లులోంచే పుడతాయి. తిరుమల హుండీలో సగందాకా దానితోనే నిండుతుంది. నాడు మోదీ ప్రచార సభలకు, ఆర్భాటాలకు ఖర్చయిన కోట్లాది రూపాయలకు దారేదో, లెక్కెంతో అందాజ్‌గా నైనా చెప్పగలరా? అర్ధరాత్రి జ్ఞానోదయమైన బుద్ధుడిలా ఉన్నట్టుండి ‘కుళ్లుని కడిగేస్తా’నని మోదీ గర్జించటం ఏమాత్రం శ్రుతిశుద్ధంగా లేదు. సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, మేధావి జీడీ నాయుడు ఈ ప్రభుత్వానికి పన్ను చెల్లించే ప్రసక్తే లేదని శపథం చేశారు. ప్రభుత్వం మీద నిత్యం పత్రికలలో వచ్చే విమర్శలను జాగ్రత్తగా కత్తిరించి, దస్త్రాలు చేసేవారు. తనని కలిసిన వారికి వాటిని చూపించి వినోదించేవారు. జీడీ నాయుడు అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా మోటారుకారు దగ్గర్నించి సైకిల్ టైరు దాకా రూపొందించారు. వాటికి నాటి ప్రభుత్వం అడ్డదిడ్డంగా ట్యాక్స్ వేసి ధరలు పెంచేశారు. కోయంబత్తూర్‌లో ఆయన మ్యూజియం చూస్తే గొప్ప తనం బోధపడుతుంది. నల్లకుళ్లు కడిగేవేళ, పన్ను చెల్లించేవారికి సౌకర్యా లేమిస్తారో చెప్పాలి. ఇవ్వలేనప్పుడు పన్ను తిరిగి ఇచ్చె య్యాలి. అభద్రతా భావం ఉన్నంత కాలం దాచుకోవా లనే తాపత్రయం ఉంటుంది–ఎడారి ఒంటె నీళ్లు దాచుకున్నట్టు. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
రెండు పాత్రల నిష్క్రమణ
అక్షర తూణీరం డెబ్బయ్ నాలుగు రోజులు ఆమె మృత్యువుతో పోరాడారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యం, వైద్యసేవలు తమ శాయశక్తులా ఆమెను బతి కించడానికి శ్రమించాయి. అయినా జయలలిత తిరిగి మామూలు మనిషి కాలేకపోయారు. ఎన్ని మానవ ప్రయత్నాలున్నా, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ‘ఆ కొర్రగింజంతా ఉంటే తప్ప’ మనిషికి మనుగడ ఉండదని నిర్ధారణ అయింది. చివరిరోజు వైద్యులు కూడా భగవంతుడి మీద భారం వేశారు. జయలలిత అంతిమ ఘడియలు ఒక సందేశం ఇచ్చి ముగిశాయి. యాభై ఏళ్ల పాటు జయ జనంలో ఉన్నారు. తెలుగు, తమిళ వెండితెరలకు వెలుగులందించారు. నేపథ్యగాయనిగా ప్రసిద్ధికెక్కారు. ఎంజీఆర్ సాహచర్యంలో రాజకీయాలలో రాటు తేలారు. ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషలలో అనర్గళంగా, మాటల కల్తీ లేకుండా స్వచ్ఛంగా మాట్లా డేవారు. ఇష్టాయిష్టాలు రెండూ ఘాటు గానే ఉండేవి. గుచ్చుకున్న ముల్లుని తీసి, భస్మం చేసి పానీయంలో కలిపి సేవించే నైజం జయలలితది. అపర చాణక్యం. ఒక దశలో ఘన చరిత్రగల హిందూ పత్రికని కట్టడి చేయాలని ఆమె ప్రయ త్నించింది. గొప్ప రాజనీతిజ్ఞురాలు. కిందటి ఎన్నికలలో ఆమె గెలుపొందడం ఒక అసాధారణ విషయం. ప్రత్యర్థుల అంచనాలు తలక్రిందులయాయి. ముందస్తు సర్వేలు ఉల్టాపల్టాలైనాయి. తమిళ నాట ఒక వర్గానికి ఆమె ఆరాధ్యదేవత. బడుగు బలహీన వర్గాలకు అమ్మ పథ కాలు వరాలుగా దోహదపడ్డాయి. జయలలిత అంతిమ సంస్కారాలను చూసేందుకే ఉన్నట్టు, అవికాగానే కడశ్వాస వదిలారు చో రామసామి. రామసామి బహుముఖ ప్రజ్ఞావంతుడు. మంచి రచయిత, నాటక రచయిత. ప్రయోక్త, పత్రికా రచయిత. అన్నిటికీ మించి గొప్ప సృజనశీలి. ఒక నాటకంలో ఆయన ధరించిన చో పాత్ర ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అదే రామసామి పేరు ముందు చేరిపోయింది. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ ఆయన రచించిన నాటకం. దాన్నే తరువాత సినిమాగా తీశారు. దాన్నే తెలుగులో నాగభూషణం టైటిల్ రోల్ పోషిస్తూ సినిమా తీశారు. చో కారుకి మూడు టైర్లు. నాలుగోది ఆయన సెటైరు. దాంతో సాగుతారని సరదాగా అంటుంటారు. ‘తుగ్లక్’ పత్రికను ప్రారంభించి సమకాలీన రాజకీయ, సాంఘిక అంశాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తమిళ ప్రజలకు చేరువయ్యారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, నిర్మొగమాటంగా తన కలం గళంతో మాట్లాడగలరు. ఆయన ఏ పార్టీకి చెందరు. అన్ని పార్టీలు ఆయనకు చెందుతాయి. ఆరోజుల్లో జయలలిత ఇంట జరిగిన వివాహం పెద్ద విశేషం, విచిత్రం. మద్రాసు ప్రజలు నెల్లాళ్లపాటు సీరియల్‌గా ఈ పెళ్లిని చూశారు. అప్పుడే చోని మీకు పెళ్లిసందడి చూస్తుంటే ఏమనిపిస్తోందని ఒక చానల్ వారడిగారు. ‘‘నిండా సంతోషంగా ఉంది. ఆ తల్లులు (జయ, శశికళ) ఒంటి మీద ధరించిన నగలను చూస్తుంటే నాకెంతో ధైర్యం వస్తోంది. ఆ నగలతో దేశం ప్రపంచ బ్యాంకు రుణాన్ని అవలీలగా తీర్చేయవచ్చనిపిస్తోంది.’’ అని జవాబిచ్చారు రామసామి. ఆయనకు పుట్టుకతో వచ్చిన లోపం దేహం మీద ఎక్కడా వెంట్రుక మొలవక పోవడం. ఈ లోపం వల్ల ఎన్నో సమస్యలని చెప్పేవారు. దేశంలో తొమ్మిది మందిమి లెక్కతేలాం. మాదో క్లబ్ ఉందని చెప్పేవారు. చో ప్రసిద్ధ నటి రమ్య కృష్ణ మేనమామ. రమ్యకృష్ణ తల్లి చో రామసామి సోదరి. మంచి చిత్రకారిణి. తమిళనాడు ఏకకాలంలో ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కోల్పోయింది. అందుకు ప్రగాఢ సానుభూతి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇకపై గోదానాలు, సువర్ణదానాలు
అక్షర తూణీరం ఒకప్పుడు సంపదంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు. పెద్ద నోట్లు రద్దు! ఎక్కడ విన్నా ఇవే కబుర్లు. నోట్ల రద్దు ప్రకటన కొందరిపై పిడుగుపాటు ప్రభావాన్ని చూపింది. కొందరికి చల్లని జల్లుగా అనిపించింది. ప్రధాని మోదీ నిజంగా ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా నల్ల కుబేరులు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. డెబ్బై ఏళ్లలో మూడు తరాల నల్లకుబేరులు పుట్టి పెరిగారు. వాళ్లకి తెలియకుండా ప్రభుత్వం ఏనాడూ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కథ అడ్డం తిరిగింది. డబ్బు కట్టల మీద హాయిగా నిద్రపోతున్న వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉత్త పీడకలగా కాసేపు కలగన్నారు. కానీ సొంత సెల్ఫోన్లు నిజమేనని ధృవీకరించాక పాముల మీద పడుకున్నట్టనిపించింది. ఏమిటి వన్నీ, కనీసం పాత వార్తాపత్రికలన్నా కాదు. కనీసం తూకానికి వేస్తే పదో పరకో వచ్చేది. ఈ రంగురంగుల కాగితం ముక్క పల్లీల పోట్లాలకి కూడా పనికిరావు. అప్పటిదాకా ఖరీదైన గులాబీ రెక్కల మీద పొర్లుతున్న ట్టుంది. ఏ పూల పరిమళాన్ని తలుచు కుంటే ఆ తావి సోకింది. ఆ కరెన్సీ మహత్యం ఉన్నట్టుండి నిర్జీవమైపో యింది. జగద్గురువు శంకరాచార్యులవారు భజగోవిందంలో చెప్పినట్టు – ఎంతటి ఆత్మీయుడైనా శవమయ్యాక భయం వేస్తుంది. పాపం! అదే జరిగింది. మనకి స్వాతంత్య్రం రావడానికి కొద్ది ముందు కరెన్సీ చెల్లదని ఒక వదంతి వచ్చింది. బ్రిటిష్ వారెళ్లిపోతే, వారి బొమ్మలతో వచ్చిన కరెన్సీకి కాలం చెల్లుతుందన్నారు. అప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ గురించి పెద్దగా తెలియదు. అలాగే పిచ్చి కాగితాల్లాగే వాటిని రెండేళ్లపాటు చూశారు. కానీ అనుకున్నట్టు ఆ నోట్లు రద్దు కాలేదు. తర్వాతి కాలంలో రెండుసార్లు పెద్ద నోట్లని రద్దు చేశారు గాని అవి మరీ పెద్ద నోట్లు. అసలు ఒక స్థాయి పౌరులు వాటిని దర్శించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఆ ప్రభావం సామాన్యుడిపై ఏ మాత్రం పడలేదు. ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాక అయిదువందల నోటుకి గొప్ప కీర్తి లేకుండా పోయింది. అసలు చాలాచోట్ల ఆ నోటిచ్చి సరుకు కొన్నాక తిరిగి చిల్లర రానే రాదు. కూరలు, పళ్లు, మందులు, పెట్రోలు ఇలాంటి నిత్యావసరాలు కొనేవేళ అది పెద్ద నోటు కానేకాదు. చాలా మంది బ్లాక్వీరులు రాత్రికి రాత్రి జీరోలయ్యారు. ఇప్పుడేం జరుగుతుంద న్నది సామాన్యుడి ప్రశ్న. అద్భుతాలేమీ జరగవు. పాత వాసన పోతుంది. కొత్త వాసన నిదానంగా ఆవరిస్తుంది. స్వార్థం అవినీతి నల్లధనానికి విత్తనాలు, ఎరువులు. దీనివల్ల దేశానికి ఎంతో కొంత మేలు జరిగేమాట వాస్తవం. లంచగొండితనం రూపుమాసిపోదు. ఇకపై బంగారు, వెండి కాయిన్స్ సమాంతర ఎకానమీని నడపచ్చు. ఒకప్పుడు సంప దంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు. లంచమా అంటే, శివశివా గోదానం అంటూ సెంటిమెంట్‌తో సరిపెట్టవచ్చు. గోదానమనగానే మోదీ కూడా సంతోషిస్తారు. ఈ అర్థరాత్రి నిర్ణయం వల్ల గొప్పవాళ్లు ఎందరు దారికొస్తారో తెలీదు గానీ, చాలామంది రైతులు దెబ్బతిన్నారు. అమరావతి రాకతో చుట్టుపక్కల జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రిజిస్ట్రేషన్ విలువకు చాలా రెట్ల ధర నడి చింది. బ్లాక్‌మనీ అని తెలియకుండానే రైతు గుమ్మంలోకి పెద్ద మొత్తంలో దిగింది. కొందరు వెంటనే స్థిరాస్తులు కొన్నా, కొందరు అటకల మీదే ఉంచారు. ప్రభుత్వం, ఆర్థిక మేధావులు అప్పుడే రైతులకు తగు సూచనలు చేసి ఉండాల్సింది. రైతులను నల్లకుబేరుల జాబితాలో చేర్చకూడదు. వీరికేదైనా దారి చూపాలి. పన్ను వసూలు చేసి వారి డబ్బును వదిలెయ్యచ్చు. నిజంగానే స్వచ్ఛభారత్‌లో తుక్కునోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. కొత్త నోట్లు త్రివర్ణ పతాకాల్లా రెపరెపలాడుతున్నాయి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
వీళ్లు తిన్నంత తినొచ్చు కానీ నో పార్సిల్స్..
అక్షర తూణీరం ఈసారి గవర్నర్‌గారికి బొత్తిగా పోర్షన్ లేకుండా పోయింది. చిన్న డైలాగైనా లేకపోయె. అక్కడ నవ నిర్మాణ దీక్షలోనూ ఆయనకి పాత్ర లేదు. ‘‘చూడండి, ఈ దేశం వెలిగిపోతోంది. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి స్ఫటిక స్వచ్ఛమైన, నీతి శుద్ధమైన అపార పారదర్శకమైన, ఆదర్శమైన సుపరిపాలన నా ప్రజలకు అందలేదు. భవిష్యత్తు కూడా ఇలాగే వెలుగులు విరజిమ్ముతుంది.....’’ ఎవరా అంటున్నదని ఉలిక్కిపడి చూశాను. భారతీయ జనతా పార్టీ గారు నరేంద్ర మోదీ మాస్క్ తగిలించుకుని అరుస్తున్నారు. ‘‘ఏ మాత్రం జంకు కొంకు లేకుండా, అంతలా శంఖం ఊదుకోవడం భాజపాకే చెల్లిందండీ. ఇన్ని కబుర్లు చెబుతారు. ఏది... రామ మందిరం ఏది? అసలా ప్రస్తావనే లేదు...’’ అంటూ ఓ సాధువు వేష్టపడ్డాడు. ప్రపంచం కళ్లు తిరుగుతున్నాయి. పేరెన్నికగన్న నగరాలు మన హైదరాబాదుని చూసి సిగ్గుపడుతున్నాయి. ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితే మీరు ఖాతరు చేయవద్దు. దద్దమ్మలు ఈర్ష్యతో అట్లాగే కూస్తారు విజయోత్సవ వేళ తెలంగాణ సందేశం. ఇక చంద్రబాబు శోక రసం నవ నిర్మాణ దీక్ష. ‘‘కట్టువస్త్రాలతో మనల్ని వీధిన పడే శారు. అప్పు నెత్తిన పెట్టారు. అయినా నేవున్నా, భయం లేదు. నాకు విజన్ ఉంది.’’ అంటూ సెంటర్లో రికార్డు వేస్తున్నారు. సెంటర్ అంటే గుర్తొచ్చింది. బెజవాడ బెంజి సర్కిల్ పేరు మార్చాలి. మాంఛి లాభసాటి తెలుగు పేరేదైనా పెడితే క్లిక్ అవుతుంది. ఎందుకంటే ‘బెంజి’ అనేది బూర్జువాకి ప్రతీక. బంగారు తెలంగాణ ఉత్సవాలకి రెండొందల యాభై కోట్లు అయితే అయింది గాని, ఆ వెలుగు కనిపించింది. ఈసారి గవర్నర్‌గారికి బొత్తిగా పోర్షన్ లేకుండా పోయింది. చిన్న డైలాగైనా లేకపోయె. అక్కడ నవ నిర్మాణ దీక్షలోనూ ఆయనకి పాత్ర లేదు– కృష్ణరాయ బారం సీన్లో సహదేవుడిలాగా. ‘‘ఎన్నికల ఖర్చు మీద నిఘా పెట్టినట్టు ఇట్లాంటి పబ్లిసిటీ వ్యయాల మీద కూడా నిఘా ఉండాలి. సంబురాలు మంచిదేగాని ప్రజాధనం దీపాల చమురుకి తగలబెడితే పాపం కదండీ’’ అని ఒక చాదస్తుడు వాపోయాడు. ‘‘కనీసం పగటి పూట మద్యపానం మీద నిషేధం పెట్టే ఆలోచన చేస్తారనుకున్నా. ఒక్కడికీ దమ్ములేదు.’’ అంటూ ఒక మాజీ దేశభక్తుడు బాధపడ్డాడు. ఇంతలో ఓ ఊరేగింపు నడిచింది. ‘‘తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన భిక్ష. సోనియాకి కాల్మొక్కి ధన్ వాదాలు చెప్పాలి. సోనియా గాంధీ – జిందాబాద్’’ అంటూ ఊరేగింపు నినదించింది. ఆ కాంగ్రెస్ ఊరేగింపుకి అరవై కాళ్లకంటే లేవు. మోదీ ‘గంగా జలం’ పోస్టాఫీసుల్లో అమ్మిస్తారట! బోలెడు పుణ్యం, అంటూ ఓ వెర్రివాడు వికటాట్టహాసం చేసి, మేం షారాయి, బ్రాండీ అమ్మిస్తాం. సవాల్– ఈల వేసు కుంటూ వెళ్లిపోయాడు. మంత్రులు, సామంత్రులు, సలహాదారులు ఏది మాట్లాడినా, పెద్దాయన మాటగానే వినిపిస్తారు. న్యూస్‌రీడర్లు వార్తలు వినిపించినట్టు నిమిత్తమాత్రంగా ఉంటారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి అప్పట్నించీ ఒకే ఒక్క మాట మీద ఉన్నారు. ‘‘మా నాయకుడి అభీష్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా.’’ రెండేళ్లుగా మాట తప్పలేదు. ‘‘అదే మన తక్షణ కర్తవ్యం’’ అంటూ మిగిలిన ఢిల్లీ తెలుగు గళాలు కోరస్ పాడతాయి. ఒక చాలా సీనియర్ ఐఏఎస్ చెప్పారు– ‘‘సహచరులు సలహాదారులు బయట సలహాల నించి నేతని కాపాడడానికే. వీళ్లు తిన్నంత తినొచ్చు కానీ నో పార్సిల్స్. ఇదే మన రాజ్యాంగ నియమం.’’ ఇంకా చాలా చెప్పారు– నగ్నసత్యాలు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
మూతపడిన పుస్తకం-నవోదయ
అక్షర తూణీరం వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాక పోయినా ఎందరో మహనీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. ఒక ఘన చరిత్ర, నవోదయ అంటే మంచి అభిరుచి. నవోదయ అంటే ఒక సంప్రదాయం. ఒక సరదా. అరవైయ్యేళ్ల ప్రస్థానంలో మంచి పుస్తకాలు అందమైన గెటప్‌లో వెలువడి తెలుగు పాఠకులను అలరించాయి. ప్రారంభంలో కమ్యూనిస్టు సాహిత్యం వైపు మొగ్గు చూపినా, 1960 వచ్చేసరికి బాపురమణలు నవోదయని పూర్తిగా ఆవహించేశారు. నవోదయ రామ్మోహనరావు కూడా ఆ నమ్మకంలోనే ఉండేవారు. బుక్ షాపుగా, ప్రచురణ సంస్థగా నవోదయ ఒక వెలుగు వెలిగింది. వావిళ్ల, ఆంధ్రపత్రిక లాగే మంచి వేదికగా పేరు తెచ్చుకుంది. వ్యాపారం కంటే పాప్యులారిటీ, గ్లామర్ ఎక్కువగా ఉండేవి. విజయవాడ, గుంటూరు నవోదయలు సాంస్కృతిక కేంద్రాలుగా బతికాయి. లాండ్మార్క్స్గా నిలిచాయి. కవులకు అకవులకు కూడా విజయవాడ నవోదయ అడ్డాగా ఉండేది. ఆకాశవాణి ప్రయోక్తలకు, పత్రికా ప్రముఖులకు, లెక్చరర్లకు ఏలూరు రోడ్ నవోదయలో హాజరు వేసుకోవడం ఒక వ్యసనం. కొందరికి కొన్ని సాయంకాలాలు ఫలించి అనంతర కార్యక్రమాలకు బీజాలు పడేవి. ఎక్కడో ఏ నడిజాముకో అవి మొల కలెత్తేవి. నవోదయ రామ్మోహనరావు అంత సరసు డేమీ కాదు. మాట పెళుసు. అయినా బలమైన అయస్కాంత క్షేత్రం ఆయన చుట్టూ ఉండేది. పుస్తకాల ఎంపికలో రామ్మోహనరావుది రాచ మార్గం. పుస్తక ప్రచురణలో ఆయన అభిరుచిని ఎవరూ వంక పెట్టలేరు. ముళ్లపూడి రచనలు, నండూరి నరావతారం, విశ్వరూపం, ఇంద్రగంటి కీర్తితోరణం, శ్రీకాంతశర్మ పుస్తకాలు, శంకరమంచి అమరావతి కథలు, శ్రీరమణ రచనలు- ఇలా వెరసి టైటిల్స్ తక్కువేగానీ అన్నీ నవోదయకి కితాబులే. ‘‘బాపు బొమ్మలకైతే హలో, నవో దయకి చలో’’ అనేవారు. మొత్తం తెలుగునాట ఎవరికి బాపు ముఖచిత్రాలు కావాలన్నా నవో దయ అధీకృత ఏజెంటులా వ్యవహరించేది. బాపు కార్టూన్ల పుస్తకాన్ని నవోదయ ప్రచురించింది. ఆయన బొమ్మల్ని మార్చి పరిమార్చి గ్రీటింగ్ కార్డ్స్‌ని వెలువరించారు. రామ్మోహనరావు పుస్తక ప్రియులకు చేసిన సేవ గణనీయమైంది. అమెరికా తెలుగు సంఘం రామ్మోహనరావు దంపతులను తానా సభలకు రావించి సత్కరించింది. ఒక పుస్తక వ్యాపారిగా తానా సత్కృతి అందుకున్న ఘనత ఆయనదే. వారి ఆధరువులు (ఆధర్స్ని రా. రావు ఇలా అనేవారు) కాకపోయినా ఎందరో మహ నీయులు నవోదయతో ఆత్మీయంగా ఉండేవారు. ఇందులో శ్రీశ్రీ, ఆరుద్ర, కాళీపట్నం కొన్ని శాంపిల్స్. యువజ్యోతి ఎమ్వీయల్ నవోదయ ఆప్తవర్గంలోని వారు. ఎప్పుడైనా యస్పీ బాల సుబ్రహ్మణ్యం లాంటివారు మద్రాసు మెయిల్ కోసం నవోదయ గోదాములో నిరీక్షించేవారు. పుస్తకాల దొంతరల మీద కూచుని ఆధార షడ్జమాన్ని ఆలపిస్తూ, రైలు ఆలస్యాన్ని హాయిగా ఆస్వాదిస్తూ, నూజివీడు మిత్రులతో యస్పీబాసు గడపడం ఒక సరదా. విశాలాంధ్ర రాఘవాచారి, ఉషశ్రీ, పన్నాల భట్టు, శ్రీకాంతశర్మ సాయంత్రాలు తప్పక హాజరు వేసుకునేవారు. వారు రాగానే ‘‘గడ్డి తింటారా?’’ అని మర్యాదగా అడిగేవారు. అంటే బృందావన్ హోటల్ ఇడ్లీలని భావం. అక్కడ నుంచి ఎస్టీడీలు ఉచితంగా చేసుకుని ఉదారంగా మాట్లాడుకోవచ్చు. రైలు రిజర్వేషన్ కౌంటర్. సినిమా టికెట్లు లభించును. నండూరి రామ్మోహనరావు ఈవెనింగ్ ఎడిషన్ కోసం వచ్చేవారు. అనగా క్వార్టర్ బాటిల్‌ని పేపర్లో చుట్టి ఇప్పించడం. నవోదయ షాపు చాలా జంటల్ని కలిపింది. ఫిక్షన్, నాన్ఫిక్షన్ చూస్తూ మనసులు విప్పేవారు. మూతపడడం బాధాకరమే. కానీ ఆ ప్రాభవం, వైభవం లేకుండా దేనికి? రెండుమూడు తరాలకి నవోదయ ఒక అక్షర జ్ఞాపకం. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
పులి సందేశం
అక్షర తూణీరం చిరుతపులి వయసులో పదునుగా ఉంది. మాంచి కసి మీద ఉంది. కానీ దొరికిపోయింది. వందమంది కలసినా దాన్నలా నిస్సహాయంగా చేయలేరు. కానీ పులి, ‘ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చి నట్టు’ దొరికిపోయింది. పొలంలో నీళ్ల బిందె కనిపిస్తే, దప్పిక తీర్చుకుందామని అందులో తల పెట్టింది. ఆ బిందె పులి తలకి పట్టేసింది. ఆ క్షణం నుంచి పులి బతుకు పిల్లి బతుకు కంటే కనాకష్టమైంది. ఊరు ఊరంతా తల మునిగిన పులిని కోతిని చూసినట్టు చూసి వినోదించారు. పులి తెలివి తక్కువతనం వార్త అయింది. చానల్స్ పులిరాజు గడిపిన దుర్భరమైన ఘడియలను ప్రత్యక్షంగా చూపి, ప్రేక్షకులను వినోదింప చేశాయి. గొప్పవాడు చిక్కుల్లో పడితే చూసేవాడికి సంబరంగా ఉంటుంది. ఎటుపోయి ఎటొస్తుందనే భయంతో పైకి జాలి నటిస్తారంతే. ఇదొక చిత్రమైన సందర్భం. పులికి వేరే సమస్య లేదు. లోకం కనిపించడం లేదు. ఏమి జరిగిందో ఆ ప్రాణికి అర్థం కావడం లేదు. చీకటి తెలియని కళ్లకి చీకట్లు కమ్మాయి. దేన్నీ వాసన పట్టలేకపోతోంది. గాండ్రించడానికి కాదు కదా, మూలగడానికి కూడా నోరు లేవడం లేదు. చిరుతపులి మనసు, శరీరాన్ని నిస్సత్తువ ఆవరించింది. దిక్కుమాలిన చావు చస్తానేమోనని భయం పట్టుకుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ‘‘అహో! నాకెట్టి దురవస్థ దాపురించినది. నేను భయపడు ప్రాణి ఈ నేలపై లేదు. నాకు భయపడని జీవి ఎక్కడా కనపడదు. దుర్గాదేవి వాహనాన్ని. భయమనేది నా ఒంటి చారల్లో గానీ చుక్కల్లో గానీ లేదు. అడవి జంతువులను వేటాడడం మాకు శైశవ క్రీడ. నరమాంసం మాకొక వేడుక. నా పేరు చాలు, సమస్త ప్రాణకోటికి వణుకు పుట్టిస్తుంది. ఆహా! నేడు లేవగానే ఏ గాడిద మొహము గాంచితినో? ఇట్లు నా మొహమును కోల్పోతిని’’ అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి మనసు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది. చిన్నప్పుడు అమ్మ కుందేలు పిల్లల్ని గోరుముద్దలుగా తినిపిస్తూ చెప్పిన వంశ చరిత్రలు గుర్తొచ్చాయి. ఏడు తరాల నాటి ముత్తాత, తన దూడకు పాలిచ్చి వస్తానంటే పోయి రమ్మని ఆవును పంపాడట. దయార్ద్ర హృద యులున్న వంశమని అమ్మ చెప్పేది. తరువాత కాలం పాడైపోయింది. అయిదు తరాల క్రితం మా ముత్తాత బంగారు కడియాన్ని ఆశ పెడుతూ దారిన పోయే దానయ్యలను దగ్గరకు రప్పించుకునేవారు. ఏం చేస్తారు పాపం! వార్ధక్యం వల్ల కదల్లేని స్థితి. ఉపాయశాలురున్న వంశం నాది. పులి జాతిపై ఎవ్వరూ జాలి పడరు. పుర్రెతో సహా మా చర్మాలను పరుచుకుని తపస్సులో కూచునే స్వాములకు ధర్మమున్నదా? ఇలాంటి తలపోతలతో మరోసారి తలమునకలైంది పులి. జీవితం బుద్బుద ప్రాయమని మొదటిసారి నమ్మింది. చావు భయంలో దేవుడు గుర్తొచ్చాడు. ఈ చీకటి గుహలోంచి నన్ను బయట పడెయ్యండి. కావాలంటే శనివారాలు ఉపోషాలుంటా. సోమవారం పూర్తి శాకాహారిగా ఉండి పోతా. అడవిలో అంకాళమ్మకి, పోలేరమ్మకి కోరినన్ని జింకల్ని లేళ్లని బలిచ్చి జాతర్లు జరిపిస్తా. ఏనుగుల్ని దిగ తుడుస్తానంటూ మనసులోనే మొక్కింది. పులికి ఒక్కసారి దుఃఖం పెల్లుబికింది. భోరున ఏడ్చింది. పుట్టగానే కూడా ఏడ్చిన జ్ఞాపకం లేదు. అయినా ‘తల తప్పేళా’ ఊడి రాలేదు. అందరూ ఆఖరికి పిచ్చిక పిల్లతో సహా తనని చూసి నవ్వుకుంటున్నాయని దాని ఊహ. మనిషి అసాధ్యుడు. నా అజ్ఞానంతో తనొక జ్ఞానం సంపాయిస్తాడు. బిందెలో నెత్తురు పోసి అవలీలగా షికారీతో పులుల్ని తోకపట్టి ఆడిస్తాడు. నేనెంత వెర్రి పీనుగుని!? గంటలకొద్దీ సాగిన నిర్వేదం తర్వాత అటవీ శాఖవారు చిరుతపులికి విముక్తి కలిగించారు. ఇంతకీ పులి ఇచ్చిన సందేశమేమంటే- రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా పవర్లో ఉన్నవారు తెలిసీ తెలియకా ఎక్కడంటే అక్కడ తలదూర్చకూడదు. ఆచితూచి, మన తలకి పడుతుందా లేదా చూసుకుని దిగాలి. దీన్ని సాక్షాత్తు దుర్గామాత సందేశంగా బీజేపీ వారు భావించాలి. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)