ఒకనాటి మద్రాసు చలన చిత్ర రంగంలో పి. పుల్లయ్య చాలా ప్రసి ద్ధులు. నాటి ప్రముఖ నటి శాంత కుమారి భర్త. మంచి దర్శకులు, అభి రుచిగల నిర్మాత. ఆయన సందర్భానికి తగిన విధంగా, కోపం స్పష్టంగా వ్యక్తమయ్యే రీతిలో బూతు ముక్కల్ని ధారాళంగా వాడేవారు. అందులో తరతమ భేదం ఉండేది కాదు. ఈ విషయంలో పుల్ల య్యకి పెద్ద పేరుండేది. అప్పట్లో మద్రాస్ విజయ వాహిని స్టూడియోలో నాలుగు మైనాలు రెండు పంజరాల్లో సందడి చేస్తుండేవి. స్టూడియో యజమా నులు నాగిరెడ్డి చక్రపాణి స్వయంగా ఆ చిలకల ఆల నాపాలనా చూస్తుండేవారు. ఎవరైనా వాటిని పలక రిస్తే మర్యాదగా బదులు పలికేవి. కొన్ని ప్రశ్నలకు వినయంగా జవాబులు చెప్పేవి. ఉన్నట్టుండి వాటి ధోరణి మారింది. నాగిరెడ్డి చక్రపాణి ఎప్పటిలా ముద్దుగా పలకరిస్తే ముతకగా మాట్లాడుతున్నాయ్. వాళ్లు చెవులు మూసుకుని, విన్న మాటలు నమ్మలేక అక్కడి స్టూడియో పరివారాన్ని పిలిపించారు. చిల కల ధోరణిపై పంచాయితీ పెట్టారు. ఆరా తీయగా, మొన్న రెండు కాల్షీట్లపాటు పుల్లయ్యగారి సినిమా సెట్లో ఈ పంజరాలున్నాయని తేలింది. నాగిరెడ్డి, చక్రపాణి తలలుపట్టుకుని, ఇప్పుడేం చేద్దామని ఆలోచించి చివరకు రెండు పంజరాల్ని పక్షులతో సహా పుల్లయ్యకి బహూకరించి, ఒడ్డున పడ్డారట. ఇలాంటి పిట్టకథలు అనేకం చెన్నపట్నం సినిమా వాడలో ప్రచారంలో ఉండేవి.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రసంగాలు వింటుంటే తెలిసిన ఎవరికైనా పుల్లయ్య గారి చిలకపలుకులు గుర్తుకొస్తాయి. సాహిత్యంలో తిట్టువేరు, బూతు వేరు. తిట్టులో కారం ఉంటే, బూతులో అశ్లీలత తొణుకుతుంది. కేసీఆర్ పలుకు బడి తిట్టుకోవకే వస్తుంది కానీ బూతు పరిధిలోకి రాదు. ఈ సత్యం ఏ కోర్టుకు వెళ్లినా గట్టిగా నిలు స్తుంది. మైకు ముందుకొచ్చినవారు ఒక విజ్ఞతతో వ్యవహరించాలి. ఇతరత్రా వేదికలు వేరు, ఓట్లు అడుక్కునే వేదికలు వేరు. ముష్టివాడికి ధాష్టీకం పని కిరాదు. చంద్రబాబు మన పక్క రాష్ట్రం ముఖ్య మంత్రి. ఎంత చెడ్డా ఒక పార్టీ అధినేత. ఇంకా ఆయన బలం చెప్పాలంటే– కొడుకు రాష్ట్ర మంత్రి. సొంత బావమరిది అగ్రశ్రేణి హీరో మాత్రమే కాదు, రాష్ట్రంలో మంత్రులను శాసించగల ఎమ్మెల్యే. కేసీఆ ర్‌ని నిన్న మొన్నటిదాకా ‘నువ్వు’ అని సంబోధించిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇప్పటికీ టీడీపీకి తెలంగాణలో మంచి క్యాడర్ ఉంది. ఇప్పటికీ అక్కడ క్కడా కరెంటు స్తంభాల్లా ఓ క్రమంలో తెలుగుదేశం మనుషులు ఇతర కండువాలు కప్పుకుని ఉన్నారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇన్ని భుజకీర్తులున్న చంద్రబాబుని అలా నిండు సభలో అలా తేలిగ్గా మాట్లాడటం కొంత వినసొంపుగా లేదని కొందరు పెద్దమనుషులు అనుకున్నారు. మోదీతో నాలుగున్న రేళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగారు, ఒకే గొడుగులో నడిచారు, ఇలాంటి నాజూకు పదజాలం వాడితే బావుండేది కదా, వేరే అన్యక్రియా పదాలు వాడటం దేనికని కొందరి అభిప్రాయం. ‘నేత వస్త్రాల ముతక సన్నం చెప్పేటప్పుడు నంబర్లు వాడతారు. వంద నూటిరవై అంటే సూపర్ ఫైన్. ఎనభై, అరవై కొంచెం ముతకే గానీ మన్నిక బావుంటుంది. నలభై కౌంటు బరువెక్కువ. ఇక ఇరవై అంటే కొంచెం మోటు, కాస్త బాగా నాటు. ఇదిగో... మా కేసీఆర్ వాడినమాట ఇట్టా ఉంది..’ అని ఓ ఖద్దరు ధరించిన పెద్దాయన వ్యాఖ్యానించి, ముగించాడు.
‘ఎంతైనా సాటి నేతని నిజాలే కావచ్చుగానీ అంతలా దండెతో దూదిని ఏకినట్టు ఏకడం అవసరమా?’ అని మరొకాయన నీళ్లు నవుల్తున్నట్టు అన్నాడు. ఇంకొకాయన గొంతెత్తి ‘.. మరి ఇదే కేసీ ఆర్ ఓవైసీలతో కలిసిమెలసి నడుస్తున్నాడుగదా. ఆళ్లు యీళ్లు రెండు మెట్రో రెలుపట్టాల్లా, ఎటంటే అటు తిరుగుతూ పోవడం లేదా. ఆ పట్టాలు దూరా న్నుంచి చూస్తే దూరంగా కలిసినట్టు కనిపిస్తాయ్ గానీ దగ్గరికెళ్లి చూస్తే, టచ్ మీ నాట్ అన్నట్టు ఎడం ఎడంగా పోతుంటాయ్. అసలప్పుడే కదా రైలు క్షేమంగా ముందుకెళ్లేది. మరి ఇద్దరూ కావడిలో కుండల్లా, సుఖంగా లాభంగా వూగుతా రాజ్యం ఏలుకోవడం లేదా? అయితే, వాళ్లిద్దర్నీ జోడించి ఎవరైనా ఎద్దేవా చేస్తే కేసీఆర్‌కి ఎట్టా వుంటది? కేసీఆర్ అవతారం మారిందని మర్చిపోకూడదు. కృష్ణావతారంలోకొచ్చి, ‘లక్ష్మణా విల్లందుకో’ అంటే జనం మెచ్చరు. కొలుపుల్లో కొందరికి పూనకా లొస్తాయ్. కొందరు కాంట్రాక్ట్‌మీద తెప్పించుకుం టారు. ఆ పైత్యాన్ని కొలుపు కాగానే దింపుకోవాల. ఉద్యమ సభలు వేరు. ఇవి మనల్ని అద్దంలో చూపే సభలు. మూడో కన్ను తెరుస్తానని బెదిరింపొకటి. అంటే అవతలివారి అవకతవకలు, బొక్కలు బయట పెడతాననేగా... నాకూ ముతక మాటలొస్తున్నాయ్.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment