సిటీలో మంచి పేరున్నవాడు సైకాలజిస్టు. కొందరు సింపుల్‌గా ‘పిచ్చి డాక్టర్’ అని కూడా అంటారు. పిచ్చి ఆయనకని కాదు, పిచ్చి వారికి డాక్టరని గ్రహించాలి. మొన్న సాయంత్రం ఆ క్లినిక్ వైపు వెళ్లాను. పిచ్చి డాక్టర్ నాకు మంచి మిత్రుడు. అక్కడికి వెళితే మంచి కాలక్షేపం. అదో కొత్త లోకం.
సరిగ్గా అప్పుడే కోటిరెడ్డి అనే పేషెంట్‌ని తీసుకొచ్చారు. నిజానికి ఈ బాపతు వాళ్లని పేషెంట్ అనడానికి లేదు. వాళ్ల నాన్నగారు యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేసి రిటైరయ్యారట. ఇప్పుడు డెభ్బై ఏళ్లు. జనరల్ హెల్త్‌లో వంక పెట్టాల్సింది లేదు. పళ్లు, కళ్లు బాగున్నాయ్. గొప్ప చెప్పుకోదగ్గ బట్టతల కూడా కాదు. బీపీ, షుగర్ లాంటివి కూడా లేవు. విషయాలన్నీ వాళ్లబ్బాయ్ దగ్గర రాబట్టాడు డాక్టరు.
ఈ పిచ్చి డాక్టర్లు చాలా తెలివిగా పేషెం ట్‌ని మచ్చిక చేసుకుని, వాళ్ల బుర్రని స్వాధీనం చేసుకుంటారు. ‘ఆ.. కోటిరెడ్డి గారూ! ఎట్లా ఉన్నారు? ఈ మధ్య రావడమే మానేశారు’ అన్నాడు చొరవగా మా ఫ్రెండు. ఆయన కొంచెం పెద్దగా నవ్వి, ‘తమ బొంద నేనసలెప్పుడూ ఇటు రాలేదు. మీ వెధవ మొహం చూడటం ఇప్పుడే. నా ధోరణిలో తేడా వచ్చిందని మా పండుగాడు ఏవేవో కబుర్లు చెప్పి మీ దగ్గరకి లాక్కొచ్చాడు’ అనగానే డాక్టర్ షాక్ తిని, తేరుకుని, అనవసరపు నవ్వునవ్వి– ‘చెప్పండి... ఏవిటి సమస్య’ అన్నాడు.
‘నాకేం సమస్య లేదు. ఈ మధ్య కొన్నాళ్లుగా ఏదో కొత్త భాష మాట్లాడుతున్నారు. అదేదో మంగోలియన్ జోన్ భాషకి కొద్దిగా కలుస్తోంది. పూర్తిగా అది కూడా కాదు. కొన్ని మాటలు పూర్తిగా కత్తిరించుకు పోతున్నాయ్. వాళ్లు వాళ్లు ఏమనుకుంటున్నారో మూడో వాడికి చచ్చినా అర్థం కాదు. మధ్య మధ్య ఊళ్ల పేర్లు, నాయకుల నామధేయాలు, పార్టీ పేర్లు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయ్. వాళ్ల ముఖ కవళికల్ని బట్టి పరస్పరం తీవ్రంగా ద్వేషించుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. నాకీ సమస్య ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు’ అంటూ కోటిరెడ్డి నిట్టూర్చాడు. పెదవులు విరిచాడు నిస్పృహగా. డాక్టరు ఆయనవంక నిశితంగా చూస్తూ ‘ఎప్పట్నించీ అన్నారు ఈ సమస్య’ అని అడిగాడు. ‘దాదాపు ఏడాదిగా.
అయితే మరీ మొన్న ఉగ్రదాడి, మన బాంబుదాడి తర్వాత తీవ్రమైంది. అసలే మైందో, అసలేమంటున్నారో, కౌంటర్లేమిటో, దేశభక్తుడెవడో, కుట్రదారుడెవడో సర్వం కలగాపులగం అయిపోయి బుర్రని ఇనపతెడ్లతో కెలికేసినట్టు అయిపోయింది. పులిమీద పుట్రలాగా దానిమీద డేటా చోరీ బాపతు ప్రకంపనలు రేగాయ్. అంతే! తర్వాత తెలుగు, ఇంగ్లిష్ భాషా పదాలన్నీ కప్పల బెకబెకల్లా వినిపిస్తున్నాయ్’ వివరంగా చెప్పగా విని మా ఫ్రెండు చాలా లైట్‌గా తీసుకుని తేలిగ్గా నవ్వేస్తూ, ‘ఏం లేదు రెడ్డిగారూ, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. దట్సాల్’ అన్నాడు.
ఆ ముక్కతో కోటిరెడ్డి రెచ్చిపోయాడు. ఒక్క క్షణం కంట్రోల్ చేసుకున్నాడు. ‘అయితే సరే, నేను తికమకపడ్డా. నీకేం అర్థమైందో చెప్పు. ఉగ్రదాడిని మోదీ ఏమన్నాడు. విమాన దాడిలో పైలట్ల పాత్ర గొప్పదా, మోదీ పాత్ర గొప్పదా? నిజంగా అవన్నీ జరిగాయా? సృష్టించారా? అసలీ భూమ్మీద ఆత్మాహుతి దాడులు చేసే మనుషులు ఉన్నారా? అసలు పాకిస్తాన్ మన సరిహద్దు దేశమేనా? మధ్యలో చైనాలాంటి దేశాలున్నాయా? తర్వాత డేటా అంటే ఏమిటి? పోలీసంటే ఎవరు? ఎవరికెవరు కాపలా? రెండు తెలుగు రాష్ట్రాలకి ఇనపకంచె వేసి కరెంటు పెట్టేసి మొత్తం ఆ రాష్ట్రాన్ని వీళ్లు, ఈ రాష్ట్రాన్ని వాళ్లు జైల్లో పెట్టేస్తారా? చెప్పండి డాక్టర్.
వాళ్లు మాట్లాడుతోంది నిజంగా తెలుగు భాషై, అది మీకు అర్థమైతే నాకు విప్పి చెప్పండి. అర్థమై కూడా చెప్పకపోయారో మీ తల వేయి వక్కలవుతుంది’ అంటూ కోటిరెడ్డి వికటాట్టహాసం చేశాడు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment