ఇక వలలు పనిచేయవ్‌! | Sree Ramana Satirical Comments On Elections | Sakshi
Sakshi News home page

ఇక వలలు పనిచేయవ్‌!

Published Sat, May 18 2019 12:51 AM | Last Updated on Sat, May 18 2019 12:51 AM

Sree Ramana Satirical Comments On Elections - Sakshi

పెద్ద చెరువులో ముగ్గురు గజ వేటగాళ్లు వేటకు దిగారు. ముగ్గురూ మూడు పెద్ద వలల్ని వాలులో, వీలులో పన్నారు. చెరువు నిండా చేపలైతే పుష్కలంగానే ఉన్నాయ్‌. కొంచెం కండపట్టిన చేపలకే చెలామణీ. ఆ ముగ్గురు వేటగాళ్లు చెరువులో ఎగిరి పడుతున్న చేపల చప్పుళ్లకి లొట్టలు వేస్తున్నారు. బుట్టలకొద్దీ ఆశలు పెంచుకుంటున్నారు. ఉన్నట్టుండి ఆ దారిన వెళ్తున్న మూరెడు చేప నీళ్లమీదికి ఎగిరింది. ఆకాశం నించి రెప్పపాటులో వాలుగా చెరువు మీదికి దిగిన డేగ తటాలున చేపని గాలిలోనే ముక్కునపట్టి తిరిగి రయ్యిన పైకి లేచింది. వేటగాళ్లు ముగ్గురూ ఆ దృశ్యం చూసి ఒక్కసారి నిరాశపడ్డారు. ‘అబ్బా!  వీసెడు చేప. వలలో పడాల్సింది. డేగ నోట పడింది’ అనుకుంటూ నిట్టూర్పులు విడిచారు. దీన్నే కదా ‘ప్రాప్తం’ అంటారని మనసున తలచారు. ముగ్గురూ చెరువున పడి నీళ్లని చెదరగొడుతున్నారు. అట్టడుగున బురదలో నక్కి మేతలు తింటున్న చేపల్ని పైకి లేపుతున్నారు. వాటిని తాము పన్నిన నూలు వలల దిశగా నడిపే యత్నం చేస్తున్నారు. కొన్ని అమాయకంగా నీళ్లలో ఈదుతూ వల గండంలో పడబోతున్నాయ్‌. కొన్ని వేటగాళ్ల మర్మం తెలిసి ఎదురీది ఇంకోవైపుకి వెళ్తున్నాయ్‌. చెరువులో మునికాళ్లమీద కూర్చుని చేతులతో అడుగునున్న బురదని కెలుకుతున్న వారికి చేపలు తగుల్తున్నాయి. తృటిలో జారిపోతున్నాయి. 

ఇదొక విచిత్రమైన వేట. నేలమీద తిరిగే జంతు వుల, పిట్టల భాషలు, సైగలు వేటగాళ్ల కెరుక. అందుకని నమ్మించి, దగా చేసి ఉచ్చుల్లో, బుట్టల్లో సులువుగా వేసుకుంటారు. ఇవి జలచరాలు. వాటి మాటలు, కదలికలు వాటికే ఎరుక. ‘చేపల మెదళ్లు తెలిస్తేనా, ఈ ప్రపంచాన్నే జయిస్తాం అలవోకగా’ అనుకున్నారు ఆ ముగ్గురు వేటగాళ్లూ. ‘ఈ చెరువులోవన్నీ నా వలలో పడితేనా నేనే రాజుని’ అని ఎవరికి వారు కలలు కంటున్నారు. చెరువులో వీరు లేపిన అలలన్నీ సద్దుమణిగాయి. వలలు ఎత్తే పొద్దెక్కింది. మళ్లీ ఆఖరుసారి చెరువుని తట్టిలేపి, చేపల కదలికల్ని పసిగట్టి వలల్ని చుట్టసాగారు. ఎవరికీ వల బరువుగా తగలడం లేదు. చేపల బరువు ఏ మాత్రం తోచడం లేదు. వలని పైకి లాగుతున్న కొద్దీ నిరాశ ఎదురవుతోంది. తెల్లారు జామునించి వలలో చిక్కిన చేపలేమైనట్టు– అంటూ తలబద్దలు కొట్టుకుంటుంటే, గంట్లు పడిన వల, ఆ దారిన బయటపడిన చేపల లెక్కా తేలింది. ముగ్గురిదీ అదే అనుభవం.

కష్టమంతా నీళ్ల పాలైందని వాపోయారు. వేటగాళ్లకి పెద్ద సందేహం వచ్చింది. చెరువులో చేపలుంటాయ్‌. పీతలు, నత్తలు ఉంటాయ్‌. ఉంటే బురద పాములుంటాయ్‌. ఇంకా చిన్న చేపల్ని తినేసే జాతి చేపలుంటాయి. కానీ ఇట్లా గట్టి వలతాళ్లని కొరికేసే జీవాలు ఏ నీళ్లలోనూ ఉండవని తెగ ఆలోచన చేశారు. ఎలుకలకు, ఉడతలకు పదునైన పళ్లుంటాయ్‌ గానీ వాటికి నీళ్లంటే చచ్చే భయం. వాటికి ఈత రాదు. పైగా అట్టడుగుకు వెళ్లి మరీ వలల్ని పాడు చేశాయ్‌. బంగారం లాంటి చేపల్ని నీళ్లపాలు చేశా యని వారు తిట్టుకున్నారు. నిస్త్రాణగా వలల్ని భుజాన వేసుకుని, ఖాళీ బుట్టలతో ఇంటిదారి పట్టారు. ఎండ మిటమిటలాడుతోంది. నీడలో ఒక చెట్టుకింద ఆ ముగ్గురూ ఆగారు. ఒక సాధువు ఆ నీడకే వచ్చాడు. వారి భుజాన వలల్ని చూసి సాధువు నవ్వాడు.

‘ఎందుకా నవ్వు’ అని అడిగారు వేటగాళ్లు. ‘గంట్లుపడ్డ మీ వలల్ని చూస్తే నవ్వొచ్చింది’ అన్నాడు సాధువు. ‘ఇది ఎవరిపనో చెప్పండి స్వామీ’ అని అడిగారు. ‘చేపల పనే’ అంటూ తిరిగి నవ్వాడు సాధువు. వేటగాళ్లు నవ్వి, ‘అయ్యా మేం పిచ్చివాళ్లం కాదు. చేపలకు పళ్లుంటాయా ఎక్కడైనా’ అన్నారు. ‘ఉండేవి కావు. కానీ అవసరాన్నిబట్టి వస్తాయ్‌’ అన్న సాధువు మాటకి వేటగాళ్లు అర్థం కానట్టు చూశారు. ‘మీరు వాటిని వలలో వేసుకోవడానికి ఎన్నెన్ని క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నారో కదా. మరి వాటిని అవి రక్షించుకోవడానికి నోట్లో నాలుగు పళ్లు మొలిపించుకోలేవా? అలాగే మీ ఊరి చెరువులో చేపలకు పళ్లు వచ్చాయ్‌. ‘తాడెక్కేవాడుంటే తలదన్నే వాడుంటాడు’ అని వివరించాడు సాధువు. ‘వలలు కొన్ని తరాల తర్వాత పని చేయవు నాయనలారా!’ అంటూ కదిలాడు సాధువు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement