బ్రహ్మాండమైన ఈ గెలుపు జగన్‌మోహన్‌రెడ్డి స్వార్జితం. ఇది చారిత్రకం. ఇది ఘన విజయం కాదు జన విజయం. దేవుడికి ఆయన నచ్చారు. ప్రజలు ఆయనని మెచ్చారు. సగౌరవంగా బంగారు సింహా సనం అప్పగించారు. జగన్ తొమ్మిదేళ్ల దీక్ష, కఠోర పరిశ్రమ ఫలించింది. ఆయన చిత్తశుద్ధి ప్రజల మనసులని సూటిగా హత్తుకుంది. అన్నా, తమ్ముడూ, బిడ్డా అంటూ జనం ప్రేమగా దీవించారు. ప్రతి దీవెనా స్వాతి చినుకులా కురిసి, ఓటుగా ప్రతిఫలించింది. దాంతో పొజిషన్‌లో ఉన్నవారు అపోజిషన్‌లోకి వెళ్లి ఒక మూలన సర్దుకోవలసిన దుర్గతి పట్టింది. ఇది వారి స్వయంకృతం. ఇక్కడ అప్రస్తుతం. నాడు బుద్ధుడు ఆత్మీయుల్ని పక్కనపెట్టి, రాజ మందిరాన్ని వదిలి విశాల ప్రపంచంలోకి వచ్చాడు.
అంతకుముందే జరారుజా మరణాల వైనం తెలుసుకున్నాడు. ఈ లోకంలో రకరకాల కారణాలతో మనుషులకి సంభవిస్తున్న దుఃఖాన్ని అడుగడుగునా చూశాడు. జగన్‌మోహన్‌రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో అడుగడుగునా రాష్ట్ర ప్రజల సమస్యలు చూశాడు. వారి దుఃఖం చూశాడు. విలయ తాండవం చేస్తున్న అవినీతిని, ఆశ్రిత పక్షపాతాన్ని కళ్లారా చూశాడు. ‘నేనున్నా, నేనున్నా... ఏడవకండేడవకండి’ అంటూ కోట్లాదిమంది కన్నీళ్లు తుడిచాడు. ఆ మహా పాదయాత్రకి వెనక తండ్రి పెట్టిన చెరగని ఒరవడి ఉంది. వేల మైళ్ల యాత్రకి జగన్ సంకల్ప బలం ఉంది. పతితులు, భ్రష్టులు, బాధాసర్పదష్టుల, దగాపడిన తమ్ముల ఆక్రందనలు ఒకవైపు, పాలకుల ఎద్దేవాలు, ఎగతాళి కూతలు మరోవైపు! వీటి మధ్య రాష్ట్రం కొసనించి కొసదాకా నడిచి నడిచి నడిచి... ప్రజల సమస్యల్ని, పాలకుల అరాచకాలని ఆకళింపు చేసుకు న్నారు జగన్. ప్రజానీకానికి చిరునవ్వుతో అభయం ఇస్తూ ముందుకు సాగారు.
మట్టిని, మట్టి మనుషుల్ని తట్టి పలకరించారు. మొత్తంగా స్కాన్ చేసు కుని మనసులో నిక్షిప్తం చేసుకున్నారు. వీరందరికీ మంచి చేయాలన్న కసి పెంచుకున్నారు జగన్. సమ యం వచ్చింది. ప్రజలు అంతే కసిగా స్పందించారు. లేకపోతే అన్ని ఓట్లా? అన్ని సీట్లా? అవసరానికి మించినన్ని. ‘అన్నా! నీకు అడ్డులేదు. నువ్ తలపెట్టిన మంచి పనులన్నీ చెయ్’ అంటూ ఆదేశిస్తూ ఆశీర్వదించారు. ఈ మెజారిటీ ఎంతటిదంటే, దీనితో అయిదేళ్లు కాదు, జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా పదేళ్లు పాలించవచ్చునని ఒక పెద్దాయన ఆనందంతో మునకలు వేస్తూ అన్నాడు. తథాస్తు! కులం బలం లేదు. మీడియా తాలూకు వీర బాకాలు అసలే లేవు. తొమ్మిదేళ్లు వాడిపోకుండా, కొత్త చిగుళ్లు తొడుగుతూ బతికి బట్ట కట్టడం ఆయనకే చెల్లింది.
ఇప్పుడే అసలు సిసలు బాధ్యత మొదలైంది. అడుగడుగునా చెప్పిన మాటలు నెరవేర్చాలి. నిన్నటిదాకా ఒట్టిపోయిన ఖజానాని సరిచేసుకోవాలి. నిన్న∙వినయంగా చెప్పిన మాటలు నిలుపుకోవాలి. ఇంతటి అఖండ విజయం ఇచ్చిన వారికి ఎన్నో ఆశలుంటాయ్. జగన్ రావాలని కలవరించిన అశేష ప్రజానీకానికి కనుల పండువగా ప్రమాణ స్వీకారోత్సవం జరగాలని ఆశిద్దాం. గెలుపుకి దోహదపడ్డ జగన్ సన్నిహిత కుటుంబ సభ్యులకు ఏపీ ప్రజల తరఫున అభివాదాలు. చివరిదాకా ఈ ధీరుడు ఆత్మస్థైర్యంతో నిలబడ్డారు. గెలుపు సొంతం చేసుకున్నారు. రూలింగ్ పార్టీ కలికంలోకి కూడా రాకుండా పోయింది. చేపలు పట్టేసిన చెరువులా నిశ్శబ్దం ఆవరించింది. రెండ్రోజుల్లో భయంకరమైన ఫలితాలు రానున్నవేళ ఆంధ్రా ఆక్టోపస్‌నంటూ లగడపాటి గాంధోళి ఫార్స్‌కి తెర తీశారు. టీడీపీ ఎందుకు గెలవనున్నదో లగడపాటి విశ్లేషించడం కులం దురదకి పరాకాష్టగా విశ్లేషకులు అభివర్ణించారు. మరో అయిదేళ్లపాటు టీడీపీ వార్తల్లో కూడా ఉండదని అనుభవజ్ఞుల అంచనా. జగన్‌మోహన్‌రెడ్డి స్టేట్‌లో సెంట్రల్‌లో నూతన ఒరవళ్లతో కొత్తశకం ఆవిష్కరిస్తారని ఆశిద్దాం.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment