సాక్షి, హైదరాబాద్ : ప్రజలు అందించిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ట్విటర్ వేదికగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం అంటే దోచుకోవడం, దాచుకోవడమేనని పచ్చ పార్టీ వాళ్లు అనుకున్నారని, అందుకే ప్రజలు వారిని తరిమి కొట్టారన్నారు. మనం మాత్రం వారిలా కాకుండా దీన్నొక పవిత్ర బాధ్యతగా భావించాలని, ప్రజలిచ్చిన అఖండ మెజారిటీ వారికి సేవ చేసేందుకేనని అర్థం చేసుకోవాలన్నారు.
చూస్తున్నారా చంద్రబాబూ?
మద్యం బెల్ట్ షాపు ఒక్కటి కూడా కనిపించరాదని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తే వైన్ షాపుల లైసెన్సులు రద్దు చేయాలని చెప్పారన్నారు. ఇదో సాహసోపేత నిర్ణయమని, కానీ లిక్కర్ లాబీకి లొంగిపోయిన చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలన్నిటినీ గాలికొదిలిందని మండిపడ్డారు. దీంతో వీధికో బెల్టు షాపు తెరుచుకుందన్నారు. ‘తానేం చేసినా అడ్డుకోరాదని చంద్రబాబు ఒక ఉద్యమమే చేశారు. సీబీఐని బ్యాన్ చేశారు. ఐటీ దాడులను అడ్డుకున్నారు. ఈడీ ఎలా వస్తుందని గుడ్లురిమారు. కానీ సీబీఐని రాష్ట్రంలోకి అనుమతిస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. దొంగలను రక్షించేది లేదని తేల్చిచెప్పారు. చూస్తున్నారా చంద్రబాబూ?’ అని విజయసాయిరెడ్డి దెప్పిపొడిచారు.
Comments
Please login to add a commentAdd a comment