ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా కంచిలి, పలాసలో ప్రజా శ్రేయస్సుకు దారితీసే రెండు పనులు ప్రారంభించారు. కిడ్నీ బాధితుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి–కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను పలాస సమీపంలో రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార కార్యక్రమాన్ని ప్రారంభించాక ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజలందరూ గమనించాల్సిన ఒక మంచి విషయం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు, తాము రాజకీయాలు చేసే ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం లేకుండా హఠాత్తుగా అప్పుడప్పుడూ వచ్చే ‘నాన్ లోకల్ లీడర్లు’ అని జగన్ గారు వ్యగ్యం జోడించి మాట్లాడారు.
ఈ నాయకులు అత్యధిక రోజులు హైదరాబాద్ నగరంలో తమ కుటుంబ సభ్యులతో కాపురం ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కాని, ప్రశాంతంగా ప్రగతిపథంలో నడుస్తున్న స్వరాష్ట్రంలోకి అప్పుడప్పుడూ హడావుడిగా ప్రవేశించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నాలే ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. భారత పౌరుడు ఎవరైనా దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్థిరపడి, నివసించడానికి రాజ్యాంగం, చట్టాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
అయితే, కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు కొనడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి కొన్ని షరతులు, ఆంక్షలు వర్తిస్తాయి. దేశంలో ఎక్కడైనా ప్రముఖులు, సామాన్యులు నివసించే వీలుంది. తమను చట్టసభకు పంపించిన రాష్ట్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ‘ప్రజా నాయకులు’ నివసించడం చట్టబద్ధమేగాని రెండు ప్రాంతీయపక్షాల అధ్యక్షులుగా సొంత రాష్ట్ర ప్రజలకు నిరంతరం అందుబాటులో లేకపోవడం ఇతరులు తప్పుపట్టే విషయమే.
పార్లమెంటు సభ్యులు సైతం సొంత రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులు ఉంటున్నారే!
జాతీయ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు ఏటా కొన్ని మాసాలు హాజరయ్యేందుకు వీలుగా అక్కడ ఎంపీలకు ప్రభుత్వం గృహ నివాస సౌకర్యం కల్పిస్తోంది. రాజ్యసభ, లోక్ సభ సభ్యులైన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర స్థానాలైన రాష్ట్ర రాజధానుల్లో కూడా పాలనాపరమైన పనుల కోసం ఉండాల్సిరావడంతో అనేక మంది ఎంపీలు సొంత లేదా అద్దె ఇళ్లలో కొన్ని రోజులు అక్కడ బస చేస్తుంటారు. పార్టీల రాష్ట్ర అధ్యక్షులు లేదా చట్టసభల సభ్యులు నిరంతరం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజల మధ్య తిరగాల్సిన సందర్భాలు, అవసరాలు ఉంటాయి. అయితే, మాజీ సీఎం చంద్రబాబు మాదిరిగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసాన్ని శాశ్వత బసగా మార్చుకోవడం ఐదు కోట్ల ఆంధ్రులు మెచ్చే విషయం కాదు.
రెండు దశాబ్దాల క్రితం చట్ట సవరణ చేయక ముందు రాజ్యసభకు పోటీచేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచి పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికవ్వాలనుకుంటున్నారో అక్కడ నివాసం ఉంటున్నట్టు రుజువులు చూపించాల్సి వచ్చేది. అంటే, తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీచేయదలచిన నాయకుడు ఆ రాష్ట్రంలో ఎక్కడైనా నివాసం ద్వారా ఓటు హక్కు కలిగి ఉండాలనే నిబంధన 2003 వరకూ ఉండేది. ఈ కారణంగా 1991 జూన్ మాసంలో నాటి పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేరిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పటికీ పార్లమెంటు ఏ సభలోనూ సభ్యులు కాదు.
మంత్రి అయిన నేత ఎవరైనా ఆర్నెల్లలోగా పార్లమెంటుకు ఎన్నికవ్వాలనే నిబంధ ప్రకారం డాక్టర్ సాబ్ అదే ఏడాది ఆగస్టులో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నిబంధన ప్రకారం అస్సాం రాజధాని నగరం గౌహాతిలోని దిస్పూర్‌లో నందన్ నగర్, వార్డ్ నం.15లోని 3989 నంబర్ ఇంట్లో అద్దెకుంటున్నట్టు రాజ్యసభకు వేసిన నామినేషన్ పత్రాల్లో మన్మోహన్ రాశారు.
ఈ ఇల్లు అస్సాం కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా భార్య, అస్సాం మంత్రి హేమప్రభా సైకియాది. మన్మోహన్ ఆ ఇంట్లో అద్దెకు ఉంటూ తద్వారా లభించిన ఓటుతో అస్సాం నుంచి కొన్నిసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో రాజ్యసభకు ఎన్నికకు ‘స్థానికత నిబంధన’ తొలగించి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పోటీచేసే అవకాశం కల్పించారు. ఇలా ‘స్థానికత’ తప్పనిసరి అయినప్పుడు నాయకులు స్థానికంగా నివసించాలేగాని తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి దూరంగా, ముఖ్యంగా తాను రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాష్ట్రంలో శాశ్వత నివాసం లేకుండా పొరుగు రాష్ట్రంలో నివసించడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది.
వెస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment