ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను: వైఎస్‌ జగన్‌ | YS JAGANMOHAN REDDY WITH INDIA TODAY | Sakshi
Sakshi News home page

అవినీతి కాంట్రాక్టులు రద్దు: వైఎస్‌ జగన్‌

Published Mon, May 27 2019 3:26 AM | Last Updated on Mon, May 27 2019 6:30 PM

YS JAGANMOHAN REDDY WITH INDIA TODAY - Sakshi

‘‘ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రతి కాంట్రాక్టునూ పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్‌ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం. తిరిగి టెండర్లు పిలుస్తాం’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మరో మూడు రోజుల్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ‘ఇండియా టుడే’ ప్రతినిధి రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. పగ తీర్చుకోవాలన్నది తన అభిమతం కాదని చెప్పారు. తనను కేసులతో వేధించిన వారిని దేవుడే శిక్షిస్తాడని పేర్కొన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...

రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత భారీ విజయం సాధ్యమవుతుందని మీరు ఊహించారా?
జగన్‌మోహన్‌రెడ్డి: ఇది ప్రజలు ఇచ్చిన గొప్ప విజయం. ఇదంతా దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్లే సాధ్యమైంది. నేను 14 నెలల పాటు 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినప్పుడే కిందిస్థాయి నుంచి ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉందని గ్రహించాను. మా పార్టీ అఖండ విజయం సాధించబోతోందని అవగతమైంది. ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే నేను చేసిన తొలి ప్రకటన మీకు గుర్తుండే ఉంటుంది. వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించబోతోందని చెప్పాను.  

సర్దేశాయ్‌: మీ పార్టీని చీల్చుతూ 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తమ పార్టీలోకి తీసుకున్నారు. మీ పార్టీని లేకుండా చేయాలనుకున్నారు. అసలు మీ విజయంలో మలుపు తిప్పిన అంశం ఏమిటి?
జగన్‌: నా పాదయాత్రనే ఈ విజయంలో ప్రధాన పాత్ర వహించింది. మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారు. ఎదుటి పార్టీ ఎమ్మెల్యేలను రూ 20–30 కోట్లిచ్చి, ప్రలోభాలకు గురిచేసి తీసుకోవడమే కాకుండా వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.

అది చట్ట విరుద్ధం కానట్లుగా వ్యవహరించారు. పార్టీ ఫిరాయించిన వారిని అనర్హులుగా కూడా చేయలేదు. వారి చేత రాజీనామాలు కూడా చేయించలేదు. స్పీకర్‌ వ్యవస్థను దుర్వినియోగం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అన్యాయంగా వ్యవహరిస్తోందో ప్రజలు తెలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని రుజువయ్యాయి.  

సర్దేశాయ్‌: మీరేమో చంద్రబాబు అవినీతి, దుశ్చర్యల వల్ల ఆగ్రహంతో ఓట్లేశారని అంటున్నారు. మరి ఇందులో జగన్‌కు సానుకూల ఓటు లేదా? ఇంతకీ ఈ ఓటు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటా? లేక జగన్‌ అనుకూల ఓటా?
జగన్‌: ఇందులో రెండూ కలిసి ఉన్నాయి. ఎన్నికలప్పుడు ప్రజలు రెండు అంశాలు చూస్తారు. ప్రభుత్వంలో ఉన్న వారిపై వ్యతిరేకతతో పాటు తమ ఆశలను నెరవేర్చే నాయకుడు ఎవరని కూడా చూస్తారు. ఈ రెండు అంశాలు కలిసినప్పుడే సహజంగా అది అఖండ విజయం అవుతుంది. ఉన్న నాయకుడిని వద్దనుకున్నప్పుడు, మరో నాయకుడిని కావాలనుకున్నప్పుడే ప్రజలు అఖండ విజయాన్ని అందిస్తారు.   

సర్దేశాయ్‌: ఏపీలో ఎన్నికలు మీకు, చంద్రబాబుకు మధ్య హోరాహోరీగా జరిగాయి కదా. ఎన్నికల ప్రచారంలో ఆయన మిమ్మల్ని టార్గెట్‌ చేశారు. మీరు ఆయన్ను తీవ్రస్థాయిలో విమర్శించారు కదా. చివరకు వచ్చేటప్పటికి మీ ఇద్దరిలో ఒకరిని ఎన్నుకునే పరిస్థితిని కల్పించారు కదా!
జగన్‌ : మౌలికంగా ఇది ప్రాంతీయ పార్టీల సమరం. జాతీయ పార్టీలకు ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. అలాంటప్పుడు నాకు, చంద్రబాబుకూ మధ్యనే పోరాటం జరుగుతుంది కదా!  

సర్దేశాయ్‌: రాష్ట్రాన్ని 12 నెలల్లో మారుస్తానని చెప్పారు?  మీరు అనేక హామీలు ఇచ్చారు. అసలు మీ ఎజెండా ఏంటి? మోడల్‌ స్టేట్‌ అంటే ఏంటి?
జగన్‌: ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రజలు మెచ్చుకునే పారదర్శక పాలన అందిస్తా. ఏం చేస్తామో, ఎలా చేస్తామో చెబుతాం. ఒక్క ఏడాదిలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మారుస్తా. పూర్తిగా ప్రక్షాళన చేస్తా. అప్పుడు మీరే వెల్‌డన్‌ అంటారు. ప్రతీ కాంట్రాక్టును పారదర్శకంగా పరిశీలిస్తాం. అవినీతి ఉందని తెలిస్తే తిరిగి టెండర్లు పిలుస్తాం. కాంట్రాక్టర్లతో ఎలాంటి లాలూచీ ఉండదు. వాళ్లు తప్పు చేస్తే టెండర్లు రద్దు చేసి, మళ్ళీ టెండర్లు పిలుస్తాం. ఎక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ప్రక్రియను మారుస్తాం. అతి తక్కువ కోట్‌ చేసేవాళ్లకే టెండర్లు ఇస్తాం. రివర్స్‌ టెండరింగ్‌ విధానానికి ప్రాధాన్యం ఇస్తాం. చంద్రబాబు హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కాంట్రాక్టునూ రద్దు చేస్తాం.

సర్దేశాయ్‌: వచ్చే ఏడాదిలో కాంట్రాక్టర్ల వ్యవస్థలో మార్పు తెస్తారా?
జగన్‌: అవును. పెద్ద మార్పు ఉంటుంది. ఉదాహరణకు పవర్‌ టారిఫ్‌నే తీసుకోండి. సంప్రదాయేతర ఇంధన వనరులను పరిశీలిద్దాం. సౌర విద్యుత్‌ గ్లోబల్‌ టెండర్ల ద్వారా అయితే యూనిట్‌ రూ.2.65కే లభిస్తోంది. పవన విద్యుత్‌ విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన పారదర్శక విధానం అభినందనీయం. దీనివల్ల యూనిట్‌ రూ.3కే లభిస్తోంది. కానీ, మన రాష్ట్రంలో విద్యుత్‌ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84 ఉంది. పీక్‌ అవర్స్‌లో ఏకంగా రూ.6 పెట్టి కొనడానికి ఒప్పందాలు చేసుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ ఏమిటంటే, నువ్వో రూపాయి తీసుకో. నాకో రూపాయి అనే విధానం కొనసాగుతోంది. చంద్రబాబు ఆయనకు కావాల్సింది తీసుకుని ఇలాంటివి ప్రోత్సహించాడు. మేము ఈ వ్యవస్థను మారుస్తాం.

గ్లోబల్‌ స్థాయిలోకి వెళ్లి ఇప్పుడున్న ధరలు తగ్గిస్తాం. ఇదొక్కటే కాకుండా జ్యుడీషియల్‌ కమిటీ వేస్తాం. న్యాయబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో ఒక వర్గం మీడియా చంద్రబాబుకు అనుకూలంగా మారింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి వాటికి చంద్రబాబు ఎంత చెబితే అంత. వాళ్లు వేరే పక్షాన్ని మట్టిలో కలపాలని కంకణం కట్టుకున్నారు. రాష్ట్రంలో సిస్టమ్‌ను పూర్తిగా మార్చాలని చూస్తున్నాం. జ్యుడీషియల్‌ కమిటీని వేసి, సిట్టింగ్‌ జడ్జిని పెడతాం. జరిగే ప్రతి టెండర్‌ను ఆయన ముందుంచుతాం. ఆయన ఏ విధమైన మార్పులు సూచిస్తే దాన్ని అనుసరిస్తాం. వాళ్ల నిర్ణయానికి అడ్డురాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ఏ మీడియా అడిగినా ఫైళ్లు చూపిస్తాం. అసత్య ప్రచారం చేసే మీడియాపై పరువు నష్టం కేసులు వేసేందుకు కూడా వెనుకాడం.  

సర్దేశాయ్‌: మీకు కూడా సొంత మీడియా ఉంది కదా? ఇది మీడియా పోరాటం కాదా?
జగన్‌: ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ట దిగజారిస్తే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కదా! ఇది అమలు జరిగితే దేశానికే మంచి సంకేతాలు వెళ్తాయి. గుడ్‌ గవర్నెన్స్‌ అంటే ఇదీ అని అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతిపరుడని పేరు తెచ్చుకోకూడదు. కానీ, రాష్ట్రంలో ఒక వర్గం మీడియా వాస్తవాలు కాకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది.

సర్దేశాయ్‌: రాష్ట్రం ఇమేజ్, మీ ఇమేజ్‌ మీ టార్గెట్‌. మోడల్‌ స్టేట్‌గా మార్చడం మీ ప్రధాన ఆశయం.. అంతేనా? ఏడాది తర్వాత మళ్లీ మీ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. మీకు బలమైన ఎజెండా ఉంది. మోదీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తారా? ఆయన సహకారం కోరుకుంటున్నారా? కేంద్రంతో మంచిగా ఉండాలనుకుంటున్నారా?
జగన్‌: మోదీని కలిసిన ప్రతీసారి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతాను. ఆయన ప్రధానమంత్రి. ఆయన ఆశీస్సులు అవసరం. మోదీ నుంచి మనకు నిధులు రావాల్సి ఉంది. ముఖ్యమంత్రిగా నేను చెయ్యాల్సింది నేను చేస్తా.

సర్దేశాయ్‌: గతం వదిలేద్దాం. ఇప్పుడు మీరు సాధించిన ఘన విజయం తరువాత వెంటనే మీకేమనిపించింది?  
జగన్‌: అఖండ విజయం సాధించిన క్షణంలో ఒక్కసారిగా మా తండ్రిని తల్చుకున్నాను. అవి నిజంగా భావోద్వేగమైన క్షణాలు.  

సర్దేశాయ్‌: ప్రజల్లో మీ బలం ఏమిటో అంచనా వేసుకోవడానికి ఓదార్పు యాత్ర తలపెట్టారనేది కాంగ్రెస్‌ పార్టీ భావన. పదేళ్ల తరువాత ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు మీరు సొంతంగా గెలిచి ఏపీకి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలు తమ తప్పు తెలుసుకుని మిమ్మల్ని మళ్లీ ఆ పార్టీలోకి ఆహ్వానిస్తే మీరు వెళ్లే విషయం పరిశీలిస్తారా? లేక ఇక ఎప్పటికీ ఆ అధ్యాయం ముగిసినట్లేనా?
జగన్‌: (ఆవేదనగా) కాంగ్రెస్‌ పార్టీ నా విషయంలో ఏం చేసిందో నాకు తెలుసు. పగ తీర్చుకోవాలన్నది నా అభిమతం కాదు. వారిని దేవుడే చూసుకోవాలి. నేను రోజూ బైబిల్‌ చదువుతాను. నేను దేవుడిని ప్రార్థిస్తాను. దేవుడే వారికి శిక్ష వేస్తాడు.  

సర్దేశాయ్‌: అంటే ఆ అధ్యాయం ముగిసినట్లేనా?
జగన్‌: నాకు సంబంధించినంత వరకూ నాపై చేసిన దానికి ఎప్పుడో క్షమించేశాను. ఎందుకంటే క్షమిస్తే శాంతి వస్తుంది. ప్రస్తుతం నా దృష్టి అంతా నా రాష్ట్రంపైనా, నా ప్రజలపైనా మాత్రమే ఉంది. నా వ్యక్తిగత అంశాలు దేనికీ అడ్డు కారాదు. ఇవాళ నా ఆలోచన అంతా నా ప్రజల గురించే. నేను ఆలోచించాల్సిందల్లా నా రాష్ట్రానికి ఎలా మంచి జరుగుతుందనే. నేనిప్పుడు ఏపీ ప్రజల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వారికి నేను బాధ్యుడిగా ఉన్నాను. నాపై వారు పెట్టుకున్న  నమ్మకం గురించి ఆలోచించకుండా వ్యక్తిగత విషయాలను తీసుకురావడం మంచిది కాదు.  

సర్దేశాయ్‌: ఒకవేళ ఇవాళ సోనియాగాంధీ కనుక మీ వద్దకు వచ్చి... ‘జగన్‌ కమాన్‌.. మళ్లీ మన ఇంటికి వచ్చేయ్‌. మీ తండ్రి మా కాంగ్రెస్‌ వారే’ అని ఆహ్వానిస్తే స్పందిస్తారా? లేక ఆ అధ్యాయం ముగిసినట్లేనా?
జగన్‌: మీరే చెప్పారు కాంగ్రెస్‌కు అత్యల్పంగా ఓట్లు వచ్చాయని. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కడుంది? వారితో నాకు అవసరం ఏమిటి?  

సర్దేశాయ్‌: మీకు వాళ్ల అవసరం లేదు. కానీ, వాళ్లకు మీ అవసరం ఉంది.
జగన్‌: వాళ్లకు నా అవసరం ఉందంటే అది వారి సమస్య. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement