అక్షర తూణీరం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనే తాను మొన్న అభిజన్ముహూర్తంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రోహిణీ కార్తెలో ఒక్కసారిగా బ్లేజ్‌వాడ చల్లబడింది. ఉత్సవానికి కొన్ని గంటల ముందు, తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. ప్రజలు ఆనందించారు. వేసవిలో వెన్నెల కాసిందని అనుకున్నారు. ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిది రుష్యశృంగ పాదమని భావించేవారు. మొన్న జనం చినుకుల్లో తడుస్తూ, మట్టివాసనని ఆఘ్రాణిస్తూ వైఎస్ అధికార పీఠంపై పాదంపెడితే వానలకి కొరత ఉండదని ఆనందంగా ఊపిరి పీల్చు కున్నారు.
సకాలంలో వర్షాలుంటే దానికి మించిన సౌభాగ్యం ఉండదు. చంద్రబాబు హయాంలో లాగా రెయిన్‌గన్‌లతో లక్షల హెక్టార్ల పంటని కాపాడలేరు. మీడియాలో నీళ్ల చిమ్మెనలు చూపిస్తే, ఎండిన నేలలు పచ్చబారవు. పొలిటికల్ ఇండస్ట్రీలో నలభై ఏళ్ల అనుభవం ఉందని పదేపదే చెప్పుకునే చంద్రబాబు అతి ఘోర పరాజయం పొందినవేళ హైవోల్టేజీ షాక్‌కి గురయ్యారు. మన పాలన ఇంత ఘోరంగా ఉందా? ప్రజల్లో ఇలాంటి స్పందన ఇంత ఘాటుగా రావడమేంటని చంద్రబాబు ఆత్మ విచారణకి దిగారు. చివరి ఆరునెలలూ పూర్తిగా ఆత్మస్తుతికి, పరనిందకి అంకితమైపోయిన మాజీ ముఖ్యమంత్రి అసలే పాజిటివ్ థింకర్ అవడంతో తానే స్టేటు తానే సెంట్రల్ అనుకున్నారు. ఊహ మంచిదే కానీ ఒక్కోసారి ఫలించదు. అంతఃపురంలోంచి బయటికొచ్చి జనవాణిని స్పష్టంగా వింటే ఎన్నికల ఫలితాలు అర్థం అయ్యేవి.
ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఆశువుగా చెప్పుకున్నారు. అదీ చక్కగా వినసొంపుగా, అలంకారాలతో జనం మాట్లాడుకున్నారు. మహిళలైతే మరింత సొగసుగా వ్యాఖ్యానించారు. ఎన్నికల వేళ ఓ పెళ్లికి చిలకలూరిపేట వెళ్లాల్సి వచ్చింది. తలంబ్రాల ఘట్టం అయ్యాక అక్కడి బాజాభజంత్రీలతో ఇష్టాగోష్టికి దిగాను. ‘ఇక్కడ ఎవరు మీకు’ అని అడిగితే ప్రత్తిపాటి పుల్లారావు గారండీ అని చెప్పారు. ‘గెలుస్తారా, మంత్రి కూడా కదా’ అన్నాను. వాళ్లంతా ఒక్కసారి మొహమొహాలు చూసుకున్నారు. ఒక్క క్షణం ఆగి, ‘మాచెడ్డ కష్టమండీ’ అన్నాడొక పెద్దాయన.
ధైర్యం పుంజుకున్న రెండో ఆయన, ‘మా పుల్లన మంచి మెజార్టీతో ఓడిపోతే ప్రభలు కట్టుకు కొండకి వస్తామని కోటయ్య సామికి మా వోళ్లంతా మొక్కారండీ’ అంటూ చేతులు భక్తిగా జోడించాడు. శృతి పెట్టెని శబ్దం చేస్తూ కట్టిపెట్టిన కుర్రాడు, ‘ఇట్టాంటి మేళాలు పదన్నా ఎళ్తాయండీ ప్రభల్తో’ అన్నాడు ఉత్సాహంగా. అబ్బా! మన మంత్రి పుల్లారావు గారికి జనంలో ఇంతటి పలుకుబడి ఉందా అని నివ్వెరపోయా. అయిదేళ్లు పగలూ రాత్రీ కష్టించి పోగు చేసుకున్న పేరు ప్రతిష్ట. జన సామాన్యపు ధోరణిని సరిగ్గా అంచనా వేసుకుంటే పార్టీ అడుగంటుతుందని నాలాంటి అమాయకుడికి కూడా అర్థం అవుతుంది. భజనల్లో కూచుంటే కాదు, జనంలో భుజకీర్తులు, కిరీటం లేకుండా తిరి గితే మన పాలన సౌడిభ్యం బాగా తెలుస్తుంది.
‘మా బెజవాడ రేవుల్లో దోసెడు ఇసుక లేదు. మొత్తం తోడేశారు. టీడీపీ రంగు, కృష్ణలో ఇసుక రంగు ఒకటే అయింది. దాంతో వాళ్లకి దానిమీద అభిమానం ఎక్కువైంది. కనక దుర్గమ్మ కొండమీంచి అంతంత కళ్లు పెట్టుకు చూస్తుంది గానీ ఆ తల్లి పలకదు ఉలకదు..’ అని ఒక పెద్దాయన బాధగా నిట్టూ ర్చాడు. ఉదాసీనంగా వూకొట్టి, బయలుదేరుతుంటే, ‘దుర్గమ్మ ఆడకూతురు కదా, ఓర్పు సహనాలు ఎక్కువ.. జై భవాని!’ అన్నాడు రోషంగా. నిజంగానే నేను ఉలిక్కిపడ్డాను. ఒక నిస్సహాయతలోంచే ఇలాంటి మాటలు సామాన్య ప్రజల్లోంచి వస్తాయి. వారి నాడి పట్టడానికి ఇదొక చిన్న శాంపిల్. కిందటిసారి ఎన్నికల తర్వాత చంద్రబాబు 23 మంది జగన్ పార్టీ ఎమ్మెల్యేలని కొనేసి సొంత దొడ్లో కట్టేసుకుంటే అంతా విడ్డూరంగా చెప్పుకున్నారు. రేట్లు కూడా చెప్పుకున్నారు.
వైఎస్ పార్టీని కుంగెయ్యాలని గట్టి ప్రయత్నం జరిగింది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల్లో స్పీకర్‌కి ముఖ్యమంత్రి కంటే, ప్రధాని కంటే ఎక్కువ అధికారం, గౌరవం ఇవ్వబడినాయి. ఈ కొనుగోలు సరుకులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇదంతా గమనిస్తున్న సామాన్య ఓటర్లకి గౌరవనీయ స్పీకర్ కోడెల ఘోరంగా ఓడిపోనున్నారని మూడు నెలల ముందే తెలుసు. ఓటేసి రాగానే కాలవల్లో, చెరువుల్లో స్నానాలు చేసి తడి వస్త్రాలతో ఇళ్లకు వచ్చామని ఓ పెద్ద రైతు సంతోషంగా చెప్పాడు. చంద్రబాబు సొంత మీడియాతోనే దెబ్బ తిన్నాడని అనుభవజ్ఞులు తేల్చారు. 23: 3: 23 దేవుడు ప్రసాదించిన నిష్పత్తిగా తేల్చారు. అయినా ఆయన మబ్బులు వీడి రాలేకుండా ఉన్నారు. నలభై ఏళ్ల అనుభవం చంద్రబాబుని వదలడం లేదు.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment