ఎన్నికలు జోరందుకు న్నాయ్. పూర్తిగా సెగ అందుకున్నాయ్. మనకి ఎన్నికల ప్రచారమంటే పరస్పరం రాళ్లు విసురు కోవడమే! పనికిరాని వాగ్దానాలు చేయడమే. పార్టీ మానిఫెస్టో అంటే బ్రిలియంట్ ఐడియాస్. పార్టీ నాయకులు ఎవరెన్ని మాటలైనా జారుతున్నారు గానీ, రోజుకో గంట మద్యపానం నిషేధిస్తామని కూడా మాట జారడం లేదు. మన నేతలు పూర్తి సామాజిక స్పృహతో ఉంటున్నారు. కొందరు కుల రాజకీయాలని విమ ర్శిస్తారు. ఇంకొందరు ‘పవర్ పాలిటిక్స్’ అంటూ వ్యాఖ్యానిస్తారు. శొంఠి లేని కషాయం ఉండనట్టు కులం, పవర్ లేని రాజకీయాలు ఉండజాలవు. ఉన్నా మనజాలవు.
పవర్‌లేని పాలిటిక్స్ ప్రభుత్వాన్ని నడపడ మంటే గంగాజలంతో బార్ నడపడం లాంటిదేనని ఒక పెద్దాయన వ్యాఖ్యానించారు. ‘మాకే ఓటే యండి. ఇతరులకు వేసి మోసపోకండి’– ఇదే నినాదాన్ని నేతలంతా సర్వత్రా ప్రతిధ్వనింప చేస్తు న్నారు. ఓటర్లు తడబడుతున్నారు. ఇంత వరకు పవర్ పగ్గాలు పట్టుకోని జగన్‌మోహన్‌రెడ్డి ఏ స్థాయిలో రాష్ట్రాన్ని, దేశాన్ని దోచేస్తారో చంద్ర బాబు అంకెలతో సహా చెబుతున్నారు. బహుశా గెలిచాక జగన్‌కి ఉన్న స్కోప్, అవకాశాలను పదే పదే బాబు లెక్కలు వేసుకుంటున్నట్టు డౌటుగా ఉందని మావూరి ఓటరు అంటున్నాడు. చంద్ర బాబు చెప్పడమేగానీ టెక్నాలజీని బొత్తిగా వాడు కోవడం లేదని మరో ఓటరు వాపోయాడు. ‘నేని ప్పటికి ఇరవై రెండు బాబుగారి ఎన్నికల సభలు విన్నా. నాకు స్పీచి కంఠతా వచ్చేసింది. ఒక్క పదం మారదు. నరేంద్ర మోదీని, కేసీఆర్‌ని, జగన్‌ని కల గలిపి వారిపై నోరు పారేసుకోవడం ఒకే క్రమంలో నడుస్తూ, ఆ విధంగా స్పీచి ముందుకు నడుస్తుంది. చంద్రబాబు ప్రచార సభలు ఇలాగే సాగితే ప్రత్య ర్థులకి ఎక్కువ మేలు జరుగుతుందని అనుభవ జ్ఞులు స్పష్టం చేస్తున్నారు.
నిన్నటి ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉండనే ఉంటుంది. ఇతరేతర కారణాలవల్ల చంద్ర బాబు సర్కార్ మీద మరి నాలుగింతల వ్యతిరేకత ఉంది. ఏ ఒక్క రంగానికి చెప్పుకో తగ్గ మేలు జర గలేదు. ఇక అమరావతి క్యాపిటల్ ఒక కట్టుకథ. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాధారమైన ఆనకట్టలు, దూరాల నుంచి తగ్గించి రవాణా సౌకర్యాలు పెంచే వారధులు వంతెనలు, సామాన్యుడికి అస్సలు అందుబాటులో లేని వైద్య మరియు విద్యా సదు పాయం ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు. పరి పాలన చల్లగా ఉండాలంటే బహుశా క్యాపిటల్ ఎయిర్ కండిషన్ చేయించడమని బాబు భావించి నట్టున్నారు. వీటిని సామాన్యజనం కూడా ఆ గాలి మేడలు మాకెందుకు అనేశారు.
జగన్‌మోహన్‌రెడ్డి పవర్‌లోకి వస్తే, ఇంటికో రౌడీ తయారవుతాడట. ఎవ్వరికీ భద్రత ఉండ దట. ఇవన్నీ చంద్రబాబు ఎన్నికల బూచి కబుర్లు. పుట్టని బిడ్డకు పేర్లు పెట్టడమంటే ఇదే. మొన్న ఒక సభలో రెండు చేతులూ తిప్పుతూ, ఏవో నీతి వాక్యాలు వల్లిస్తుంటే సభలోంచి ఒకాయన ‘అవన్నీ ఎందుకులే బాబూ? ప్రస్తుతం అందరం బెయిల్ దారి మేస్త్రీల మేలే’ అని ఎద్దేవాగా అన్నాడు. అంటే బెయిల్ మీద కాలక్షేపం చేస్తున్న వాళ్లమేనని ఆయన ఉద్దేశం.
ఇందాకటి ఓటర్ అనేదేంటంటే చంద్రబాబు ఈ విధంగా ఒకే లూప్ వేసుకుంటూ జనాన్ని హింసించడం కంటే, వ్యాన్ మీద ఆయన బొమ్మని నిలబెట్టి చిన్న మూమెంట్స్ సెట్ చేసి మైకులో స్పీచ్ వినిపిస్తే ఆయనకి బోలెడు టైం కలిసొస్తుంది కదా అని. ఇంకా చాలా టెక్నాలజీ టిప్స్ చెప్పాడు. జగన్ ద్వారా పరోక్షంగా కేసీఆర్ ఏపీ స్టీరింగ్ తిప్పుతాడట. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తాడట. మోదీ కూడా ఆ పనిలోనే ఉంటాడట. ఈ చంద్రబాబు ఈక్వేషన్లు ఎవ్వరికి అర్థం కావడం లేదు. అంటే, ఆంధ్రులు వెర్రిబాగుల వారా? బుర్ర తక్కువ వారా? చంద్రబాబు చెప్పింది కరెక్టే అయితే నెలలు తిరక్కుండా నాయకత్వాన్ని మార్చగల స్తోమత తెలుగువారికి ఉంది. అవసరమైతే చంద్రబాబే సారధ్యం వహించవచ్చు. ముందే ఇలాంటి ఊహా గానాలతో తెలుగువారిని అనవసరంగా భయపెట్టి గెలుపు సాధించాలనుకోవడం రాజమార్గం కాదేమో! ‘చేటపెయ్యని’ చూపించి పాలు పిండు కోవాలనుకోవడం.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
Comments
Please login to add a commentAdd a comment