రెండు పాత్రల నిష్క్రమణ
అక్షర తూణీరం
డెబ్బయ్ నాలుగు రోజులు ఆమె మృత్యువుతో పోరాడారు. ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యం, వైద్యసేవలు తమ శాయశక్తులా ఆమెను బతి కించడానికి శ్రమించాయి. అయినా జయలలిత తిరిగి మామూలు మనిషి కాలేకపోయారు. ఎన్ని మానవ ప్రయత్నాలున్నా, అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ‘ఆ కొర్రగింజంతా ఉంటే తప్ప’ మనిషికి మనుగడ ఉండదని నిర్ధారణ అయింది. చివరిరోజు వైద్యులు కూడా భగవంతుడి మీద భారం వేశారు. జయలలిత అంతిమ ఘడియలు ఒక సందేశం ఇచ్చి ముగిశాయి.
యాభై ఏళ్ల పాటు జయ జనంలో ఉన్నారు. తెలుగు, తమిళ వెండితెరలకు వెలుగులందించారు. నేపథ్యగాయనిగా ప్రసిద్ధికెక్కారు. ఎంజీఆర్ సాహచర్యంలో రాజకీయాలలో రాటు తేలారు. ఇంగ్లిష్, తమిళం, తెలుగు భాషలలో అనర్గళంగా, మాటల కల్తీ లేకుండా స్వచ్ఛంగా మాట్లా డేవారు. ఇష్టాయిష్టాలు రెండూ ఘాటు గానే ఉండేవి. గుచ్చుకున్న ముల్లుని తీసి, భస్మం చేసి పానీయంలో కలిపి సేవించే నైజం జయలలితది. అపర చాణక్యం. ఒక దశలో ఘన చరిత్రగల హిందూ పత్రికని కట్టడి చేయాలని ఆమె ప్రయ త్నించింది. గొప్ప రాజనీతిజ్ఞురాలు. కిందటి ఎన్నికలలో ఆమె గెలుపొందడం ఒక అసాధారణ విషయం. ప్రత్యర్థుల అంచనాలు తలక్రిందులయాయి. ముందస్తు సర్వేలు ఉల్టాపల్టాలైనాయి. తమిళ నాట ఒక వర్గానికి ఆమె ఆరాధ్యదేవత. బడుగు బలహీన వర్గాలకు అమ్మ పథ కాలు వరాలుగా దోహదపడ్డాయి.
జయలలిత అంతిమ సంస్కారాలను చూసేందుకే ఉన్నట్టు, అవికాగానే కడశ్వాస వదిలారు చో రామసామి. రామసామి బహుముఖ ప్రజ్ఞావంతుడు. మంచి రచయిత, నాటక రచయిత. ప్రయోక్త, పత్రికా రచయిత. అన్నిటికీ మించి గొప్ప సృజనశీలి. ఒక నాటకంలో ఆయన ధరించిన చో పాత్ర ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. అదే రామసామి పేరు ముందు చేరిపోయింది. ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’ ఆయన రచించిన నాటకం. దాన్నే తరువాత సినిమాగా తీశారు. దాన్నే తెలుగులో నాగభూషణం టైటిల్ రోల్ పోషిస్తూ సినిమా తీశారు. చో కారుకి మూడు టైర్లు. నాలుగోది ఆయన సెటైరు. దాంతో సాగుతారని సరదాగా అంటుంటారు. ‘తుగ్లక్’ పత్రికను ప్రారంభించి సమకాలీన రాజకీయ, సాంఘిక అంశాల మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ తమిళ ప్రజలకు చేరువయ్యారు. నిర్భ యంగా, నిష్పక్షపాతంగా, నిర్మొగమాటంగా తన కలం గళంతో మాట్లాడగలరు. ఆయన ఏ పార్టీకి చెందరు. అన్ని పార్టీలు ఆయనకు చెందుతాయి.
ఆరోజుల్లో జయలలిత ఇంట జరిగిన వివాహం పెద్ద విశేషం, విచిత్రం. మద్రాసు ప్రజలు నెల్లాళ్లపాటు సీరియల్‌గా ఈ పెళ్లిని చూశారు. అప్పుడే చోని మీకు పెళ్లిసందడి చూస్తుంటే ఏమనిపిస్తోందని ఒక చానల్ వారడిగారు. ‘‘నిండా సంతోషంగా ఉంది. ఆ తల్లులు (జయ, శశికళ) ఒంటి మీద ధరించిన నగలను చూస్తుంటే నాకెంతో ధైర్యం వస్తోంది. ఆ నగలతో దేశం ప్రపంచ బ్యాంకు రుణాన్ని అవలీలగా తీర్చేయవచ్చనిపిస్తోంది.’’ అని జవాబిచ్చారు రామసామి. ఆయనకు పుట్టుకతో వచ్చిన లోపం దేహం మీద ఎక్కడా వెంట్రుక మొలవక పోవడం. ఈ లోపం వల్ల ఎన్నో సమస్యలని చెప్పేవారు. దేశంలో తొమ్మిది మందిమి లెక్కతేలాం. మాదో క్లబ్ ఉందని చెప్పేవారు. చో ప్రసిద్ధ నటి రమ్య కృష్ణ మేనమామ. రమ్యకృష్ణ తల్లి చో రామసామి సోదరి. మంచి చిత్రకారిణి. తమిళనాడు ఏకకాలంలో ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కోల్పోయింది. అందుకు ప్రగాఢ సానుభూతి.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)