వీళ్లు తిన్నంత తినొచ్చు కానీ నో పార్సిల్స్..
అక్షర తూణీరం
ఈసారి గవర్నర్‌గారికి బొత్తిగా పోర్షన్ లేకుండా పోయింది. చిన్న డైలాగైనా లేకపోయె. అక్కడ నవ నిర్మాణ దీక్షలోనూ ఆయనకి పాత్ర లేదు. ‘‘చూడండి, ఈ దేశం వెలిగిపోతోంది. స్వాతంత్య్రం వచ్చాక ఇలాంటి స్ఫటిక స్వచ్ఛమైన, నీతి శుద్ధమైన అపార పారదర్శకమైన, ఆదర్శమైన సుపరిపాలన నా ప్రజలకు అందలేదు. భవిష్యత్తు కూడా ఇలాగే వెలుగులు విరజిమ్ముతుంది.....’’ ఎవరా అంటున్నదని ఉలిక్కిపడి చూశాను. భారతీయ జనతా పార్టీ గారు నరేంద్ర మోదీ మాస్క్ తగిలించుకుని అరుస్తున్నారు. ‘‘ఏ మాత్రం జంకు కొంకు లేకుండా, అంతలా శంఖం ఊదుకోవడం భాజపాకే చెల్లిందండీ. ఇన్ని కబుర్లు చెబుతారు. ఏది... రామ మందిరం ఏది? అసలా ప్రస్తావనే లేదు...’’ అంటూ ఓ సాధువు వేష్టపడ్డాడు.
ప్రపంచం కళ్లు తిరుగుతున్నాయి. పేరెన్నికగన్న నగరాలు మన హైదరాబాదుని చూసి సిగ్గుపడుతున్నాయి. ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడితే మీరు ఖాతరు చేయవద్దు. దద్దమ్మలు ఈర్ష్యతో అట్లాగే కూస్తారు విజయోత్సవ వేళ తెలంగాణ సందేశం. ఇక చంద్రబాబు శోక రసం నవ నిర్మాణ దీక్ష. ‘‘కట్టువస్త్రాలతో మనల్ని వీధిన పడే శారు. అప్పు నెత్తిన పెట్టారు. అయినా నేవున్నా, భయం లేదు. నాకు విజన్ ఉంది.’’ అంటూ సెంటర్లో రికార్డు వేస్తున్నారు. సెంటర్ అంటే గుర్తొచ్చింది.
బెజవాడ బెంజి సర్కిల్ పేరు మార్చాలి. మాంఛి లాభసాటి తెలుగు పేరేదైనా పెడితే క్లిక్ అవుతుంది. ఎందుకంటే ‘బెంజి’ అనేది బూర్జువాకి ప్రతీక. బంగారు తెలంగాణ ఉత్సవాలకి రెండొందల యాభై కోట్లు అయితే అయింది గాని, ఆ వెలుగు కనిపించింది. ఈసారి గవర్నర్‌గారికి బొత్తిగా పోర్షన్ లేకుండా పోయింది. చిన్న డైలాగైనా లేకపోయె. అక్కడ నవ నిర్మాణ దీక్షలోనూ ఆయనకి పాత్ర లేదు– కృష్ణరాయ బారం సీన్‌లో సహదేవుడిలాగా.
‘‘ఎన్నికల ఖర్చు మీద నిఘా పెట్టినట్టు ఇట్లాంటి పబ్లిసిటీ వ్యయాల మీద కూడా నిఘా ఉండాలి. సంబురాలు మంచిదేగాని ప్రజాధనం దీపాల చమురుకి తగలబెడితే పాపం కదండీ’’ అని ఒక చాదస్తుడు వాపోయాడు. ‘‘కనీసం పగటి పూట మద్యపానం మీద నిషేధం పెట్టే ఆలోచన చేస్తారనుకున్నా. ఒక్కడికీ దమ్ములేదు.’’ అంటూ ఒక మాజీ దేశభక్తుడు బాధపడ్డాడు. ఇంతలో ఓ ఊరేగింపు నడిచింది.
‘‘తెలంగాణ కాంగ్రెస్ పెట్టిన భిక్ష. సోనియాకి కాల్మొక్కి ధన్ వాదాలు చెప్పాలి. సోనియా గాంధీ – జిందాబాద్’’ అంటూ ఊరేగింపు నినదించింది. ఆ కాంగ్రెస్ ఊరేగింపుకి అరవై కాళ్లకంటే లేవు. మోదీ ‘గంగా జలం’ పోస్టాఫీసుల్లో అమ్మిస్తారట! బోలెడు పుణ్యం, అంటూ ఓ వెర్రివాడు వికటాట్టహాసం చేసి, మేం షారాయి, బ్రాండీ అమ్మిస్తాం. సవాల్– ఈల వేసు కుంటూ వెళ్లిపోయాడు.
మంత్రులు, సామంత్రులు, సలహాదారులు ఏది మాట్లాడినా, పెద్దాయన మాటగానే వినిపిస్తారు. న్యూస్‌రీడర్లు వార్తలు వినిపించినట్టు నిమిత్తమాత్రంగా ఉంటారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి అప్పట్నించీ ఒకే ఒక్క మాట మీద ఉన్నారు. ‘‘మా నాయకుడి అభీష్టం మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తా.’’ రెండేళ్లుగా మాట తప్పలేదు. ‘‘అదే మన తక్షణ కర్తవ్యం’’ అంటూ మిగిలిన ఢిల్లీ తెలుగు గళాలు కోరస్ పాడతాయి. ఒక చాలా సీనియర్ ఐఏఎస్ చెప్పారు– ‘‘సహచరులు సలహాదారులు బయట సలహాల నించి నేతని కాపాడడానికే. వీళ్లు తిన్నంత తినొచ్చు కానీ నో పార్సిల్స్. ఇదే మన రాజ్యాంగ నియమం.’’ ఇంకా చాలా చెప్పారు– నగ్నసత్యాలు.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ