శాపనార్థాలకి ఓట్లు రాలవ్‌ | Guest Column By Sree Ramana Over Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

శాపనార్థాలకి ఓట్లు రాలవ్‌

Published Sat, Jun 8 2019 4:10 AM | Last Updated on Sat, Jun 8 2019 4:10 AM

Guest Column By Sree Ramana Over Chandrababu Naidu - Sakshi

అక్షర తూణీరం

చంద్రబాబు రెండుసార్లు వైఎస్‌ చేతిలో, ఒకసారి ఆయన కుమారుడు జగన్‌ చేతిలో ఓడిపోయారు. ఇట్లా రెండు తరాలమీద ఒకే నేత ఓడిపోవడం ఒక రికార్డు. అయితే జగన్‌ చేతిలో ఓటమి చరిత్రా త్మకం. ఓటమిలో చిత్రంగా స్వయంకృతాపరాధాలన్నీ అదే అంకెలతో తలకి చుట్టుకున్నట్టు ఇప్పుడు కూడా ఇంకో అంకె తగులుకోనున్నదా? తెలంగాణ అసెంబ్లీలోంచి పన్నెండుమంది ఎమ్మెల్యేలు ఏక్‌దమ్మున టీఆర్‌ఎస్‌లోకి జంప్‌ చేసి, కడిగన ముత్యాల్లా అధికార పార్టీ సభ్యులుగా మెరిసిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో నాకు పంచతంత్రం కథ గుర్తొస్తూ ఉంటుంది. వలలో పడి చిక్కుకుపోయిన పావురాలు, కూడబలుక్కుని ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి ఎగురుతాయి. ఆ దృశ్యం బాగుంటుంది. ఒక్కసారి వీళ్లంతా గుంపుగా లేచి బెంచీలు మారిపోవడం, పావురాల వ్యూహంగానే తోస్తుంది. తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థులంటే చంద్ర బాబు అభ్యర్థులే. చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టడం టీడీపీ కూకటివేళ్లతో సహా మట్టికరవడానికి ఒక ముఖ్య కారణం.

ఇప్పుడు భవిష్యవాణి ఎలా వినిపిస్తోందంటే, అదే తీరున పన్నెండుమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఒక్క ఉదుటున వైఎస్సార్‌సీపీలో చేరిపోయి, జిందాబాద్‌ సీఎం జగన్‌! వర్ధిల్లాలి జగన్‌మోహన్‌ రెడ్డి అంటూ నినాదాలు హోరెత్తిస్తారని జనవాక్యం. ఇక మిగిలేది పట్టుమని పన్నెండు. ఇందులో నలుగురైదుగురు రాజకీయ రిటైర్మెంట్‌ తీసుకుంటారని వినికిడి. ఇక మిగిలేది ఏడుగురో, పంచ పాండవుల్లాగా ఐదుగురో, మంచం కోళ్లవలె నలుగురో? ‘మనం విమానంలో వచ్చాంగానీ ఓడలో రావల్సింది. మనవాళ్లు ఇంకా రెండు విమానాలకి సరిపడా అక్కడే మిగిలిపోయారు. పాపం వాళ్లు క్యాపిటల్‌ వంకన లండన్‌ పర్యటించాలనుకున్నవాళ్లే’ అంటూ టేకాఫ్‌ కాగానే అస్మదీయులు బాధగా నిట్టూర్చారట. ప్రపంచ ప్రసిద్ధ క్యాపిటల్‌ మహా నగరం ఒక ప్రహసనంగా చంద్రబాబు దర్శకత్వంలో సాగింది.

ఐదేళ్ల తర్వాత అంతా ‘హుళక్కి’ అని తేలింది. అదేమన్నా అంటే పైనించి డబ్బు రాలేదంటూ మోదీకి శాపనార్థాలు పెడుతూ, ఆఖరికి వాటినే మానిఫెస్టోగా చేసుకున్నారు. జనం తను తిట్టే తిట్లని బాగా ఆస్వాదిస్తున్నారనీ, ఓట్లకి కొదవ లేదనీ బాబు భ్రమలో ఉండిపోయారు. కేసీఆర్, మోదీ, జగన్‌ ఈ త్రయాన్ని ప్రతి సభలో కలిపి అవాకులు చెవాకులు పేలడం మాత్రమే ఎన్నికల ప్రచారంగా సాగింది. జన సామాన్యం ఈ ధోరణిని అస్సలు హర్షించలేదు. జగన్‌ని గెలిపిస్తే ఇంటికో రౌడీ, వాడకో గూండా వస్తాడని బాబు హితవు పలికారు. రాష్ట్రం దోపిడీకి గురైపోతుందని పదే పదే బెంగతో వక్కాణించారు. నాకు వయసుకి మించిన రాజకీయ అనుభవం ఉంది. మా అబ్బాయి తల్లి గర్భంలో ఉండగానే నా ముఖతా ఎన్నో రాజకీయ పాఠాలు విని నేర్చుకున్నాడు.

అందుకే మా బాబు దొడ్డిదారిన వచ్చీరాగానే మూడు మంత్రిత్వ శాఖల్ని ఐస్‌క్రీమంత ఆశువుగా బుగ్గన పెట్టుకుని చప్పరించి పడేశాడు. నిజమే, బాబు కొన్ని మాటలు అప్పుడప్పుడు తడబడ్డమాట నిజమే. గర్భవాసంలో ఉండగా కొన్ని స్పష్టంగా వినపడక ఆ తికమక ఏర్పడింది. జగన్‌మోహన్‌ రెడ్డికి ఎందుకు ఓటు వెయ్యకూడదో చెప్పడానికి చంద్రబాబు ఓ వంద కారణాలు సిద్ధం చేసుకున్నారు. వాటిని అన్నిచోట్లా వల్లిస్తూ జనానికి బోరు కొట్టించారు. దాదాపు పదేళ్లుగా జగన్‌ని సునిశితంగా పరిశీలిస్తున్న ఏపీ జనం చంద్రబాబు ఊకదంపుడుని ఖాతరు చెయ్యకపోగా ఓటు ఎవరికి వెయ్యాలో ఎవర్ని గెలిపించాలో అక్కడే తేల్చుకున్నారు. కాబోయే ముఖ్యమంత్రిగా జగన్‌ని ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జగన్‌పై చేసిన చౌకబారు విమర్శలు చంద్రబాబు అసహనానికి అద్దంపట్టాయ్‌. జగన్‌ పార్టీని ‘కోడికత్తి పార్టీగా’ అవహేళన చేస్తూ జనంమీద తిరగడం, జగన్‌ మౌనం చంద్రబాబు స్థాయిని దిగజార్చాయి. ఏపీ ఓటర్లు జగన్‌మోహన్‌రెడ్డికి ఒకసారి పవర్‌ ఇవ్వాలనే కాదు, బాబుని పదవీచ్యుతుడిని చెయ్యాలని బిడ్డలమీద ప్రమాణాలు చేశారు. దానికి సాక్ష్యం అన్ని సీట్లు!


శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement