కుళ్లు కడిగేస్తా
అక్షర తూణీరం
అంటూ ధీమాగా గర్జిస్తు న్నారు మోదీ. మంచిదే. అసలు మన దేశంలో ‘నల్ల కుళ్లు’ ఎందుకు పేరుకు పోయిందో ఏలినవారు గమ నించాలి. మన ప్రభుత్వాలు ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నాయో, అందుకై ఆ డబ్బుని వినియోగించడం లేదు. కొంత ఇంకిపోతోంది, కొంత ఆవిరై పోతోంది. ఇంకొంత డబ్బు పక్కదారి పడుతోంది. దీన్ని ఎవరం కాదనలేం. ఆదాయపన్ను, ఆస్తి పన్ను, వ్యక్తి పన్ను, వృత్తి పన్ను, సేవా పన్ను, రోడ్డు పన్ను, వాణిజ్య పన్ను... ఇలా నలభై రకాలు. ఏ పన్నుకీ జవాబుదారీతనం లేదు. గుంతల వీధులు, వెలగని వీధి దీపాలు, ప్రవహించని మురుగు ఇదే కదా మన పట్టణాల వైభవం. మహా మహా కార్పొరేషన్లలో కూడా సౌకర్యాల కొరత తీవ్రంగా కనిపిస్తూ, నిత్యం పన్ను చెల్లింపుదారులని అసహనానికి గురిచేస్తుంటాయ్.
గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మరీ ఘోరం. అసలక్కడ ప్రభుత్వంగాని, ప్రజా సౌకర్యాల ప్రసక్తిగాని లేనే లేదు. రోడ్లు, దీపాలు, మురుగు మార్గాలు మచ్చుకి కూడా కనిపించవు. అందుకే పన్ను కట్టడమంటే పోగొ ట్టుకోవడమే అనే భావన జన సామాన్యంలో ఉంది. ప్రజలంతా ఎగవేతదార్లు కారు. టెలిఫోను బిల్లులు, కరెంటు చార్జీలు, కేబుల్ టీవీ డబ్బులు చెల్లించేవారు ఆదాయపు పన్నుని ఎందుకు ఎగ్గొట్టాలనుకుంటు న్నారు? అందుకు రకరకాల వ్యూహ రచనలు చేస్తు న్నారు? పెద్దలు ఆలోచించాలి. పాపం ఉద్యోగులైతే ట్యాక్స్ చెల్లించి వేతనం తీసుకోవాలి. వృత్తి పన్నుతో నాకు ఒనగూడే ప్రయోజనమేంటని తరచూ ఉద్యోగులు బుర్ర గోక్కుంటూ ఉంటారు.
విలాసాలన్నీ నల్లకుళ్లుతోనే సాధ్యమని ఆర్థికవేత్త లంటారు. మన ఆర్థిక వ్యవస్థ జోడు గుర్రాల సవారి అనుకుంటే, అందులో బ్లాక్ మనీ చీకట్లో పరిగెత్తే గుర్రం. దానికి దారి డొంక ఉండదు. నల్లడబ్బు కలుపుగడ్డిలా మన నేలలో ఏపుగా పెరుగుతుంది. దానికి మన రాజ కీయ రంగం ఎరువులు వేస్తే, అధికార గణం నీరు పోస్తోంది. కొందరు అక్కడక్కడ దేశభక్తులు ఉంటారు గానీ, వాళ్లని చేతకాని వాళ్లంటారు. ‘పార్టీ ఫండ్స్’ మొత్తం నల్లకుళ్లులోంచే పుడతాయి. తిరుమల హుండీలో సగందాకా దానితోనే నిండుతుంది. నాడు మోదీ ప్రచార సభలకు, ఆర్భాటాలకు ఖర్చయిన కోట్లాది రూపాయలకు దారేదో, లెక్కెంతో అందాజ్‌గా నైనా చెప్పగలరా? అర్ధరాత్రి జ్ఞానోదయమైన బుద్ధుడిలా ఉన్నట్టుండి ‘కుళ్లుని కడిగేస్తా’నని మోదీ గర్జించటం ఏమాత్రం శ్రుతిశుద్ధంగా లేదు.
సుప్రసిద్ధ పారిశ్రామిక వేత్త, మేధావి జీడీ నాయుడు ఈ ప్రభుత్వానికి పన్ను చెల్లించే ప్రసక్తే లేదని శపథం చేశారు. ప్రభుత్వం మీద నిత్యం పత్రికలలో వచ్చే విమర్శలను జాగ్రత్తగా కత్తిరించి, దస్త్రాలు చేసేవారు. తనని కలిసిన వారికి వాటిని చూపించి వినోదించేవారు. జీడీ నాయుడు అతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా మోటారుకారు దగ్గర్నించి సైకిల్ టైరు దాకా రూపొందించారు. వాటికి నాటి ప్రభుత్వం అడ్డదిడ్డంగా ట్యాక్స్ వేసి ధరలు పెంచేశారు. కోయంబత్తూర్‌లో ఆయన మ్యూజియం చూస్తే గొప్ప తనం బోధపడుతుంది.
నల్లకుళ్లు కడిగేవేళ, పన్ను చెల్లించేవారికి సౌకర్యా లేమిస్తారో చెప్పాలి. ఇవ్వలేనప్పుడు పన్ను తిరిగి ఇచ్చె య్యాలి. అభద్రతా భావం ఉన్నంత కాలం దాచుకోవా లనే తాపత్రయం ఉంటుంది–ఎడారి ఒంటె నీళ్లు దాచుకున్నట్టు. ఆ సత్యాన్ని మర్చిపోకూడదు.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)