పులి సందేశం
అక్షర తూణీరం
చిరుతపులి వయసులో పదునుగా ఉంది. మాంచి కసి మీద ఉంది. కానీ దొరికిపోయింది. వందమంది కలసినా దాన్నలా నిస్సహాయంగా చేయలేరు. కానీ పులి, ‘ఇంత బతుకూ బతికి ఇంటి వెనకాల చచ్చి నట్టు’ దొరికిపోయింది. పొలంలో నీళ్ల బిందె కనిపిస్తే, దప్పిక తీర్చుకుందామని అందులో తల పెట్టింది. ఆ బిందె పులి తలకి పట్టేసింది. ఆ క్షణం నుంచి పులి బతుకు పిల్లి బతుకు కంటే కనాకష్టమైంది. ఊరు ఊరంతా తల మునిగిన పులిని కోతిని చూసినట్టు చూసి వినోదించారు. పులి తెలివి తక్కువతనం వార్త అయింది. చానల్స్ పులిరాజు గడిపిన దుర్భరమైన ఘడియలను ప్రత్యక్షంగా చూపి, ప్రేక్షకులను వినోదింప చేశాయి. గొప్పవాడు చిక్కుల్లో పడితే చూసేవాడికి సంబరంగా ఉంటుంది. ఎటుపోయి ఎటొస్తుందనే భయంతో పైకి జాలి నటిస్తారంతే.
ఇదొక చిత్రమైన సందర్భం. పులికి వేరే సమస్య లేదు. లోకం కనిపించడం లేదు. ఏమి జరిగిందో ఆ ప్రాణికి అర్థం కావడం లేదు. చీకటి తెలియని కళ్లకి చీకట్లు కమ్మాయి. దేన్నీ వాసన పట్టలేకపోతోంది. గాండ్రించడానికి కాదు కదా, మూలగడానికి కూడా నోరు లేవడం లేదు. చిరుతపులి మనసు, శరీరాన్ని నిస్సత్తువ ఆవరించింది. దిక్కుమాలిన చావు చస్తానేమోనని భయం పట్టుకుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకుంది. ‘‘అహో! నాకెట్టి దురవస్థ దాపురించినది. నేను భయపడు ప్రాణి ఈ నేలపై లేదు. నాకు భయపడని జీవి ఎక్కడా కనపడదు.
దుర్గాదేవి వాహనాన్ని. భయమనేది నా ఒంటి చారల్లో గానీ చుక్కల్లో గానీ లేదు. అడవి జంతువులను వేటాడడం మాకు శైశవ క్రీడ. నరమాంసం మాకొక వేడుక. నా పేరు చాలు, సమస్త ప్రాణకోటికి వణుకు పుట్టిస్తుంది. ఆహా! నేడు లేవగానే ఏ గాడిద మొహము గాంచితినో? ఇట్లు నా మొహమును కోల్పోతిని’’ అంటూ పరిపరి విధాల వాపోయింది. పులి మనసు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లింది. చిన్నప్పుడు అమ్మ కుందేలు పిల్లల్ని గోరుముద్దలుగా తినిపిస్తూ చెప్పిన వంశ చరిత్రలు గుర్తొచ్చాయి. ఏడు తరాల నాటి ముత్తాత, తన దూడకు పాలిచ్చి వస్తానంటే పోయి రమ్మని ఆవును పంపాడట. దయార్ద్ర హృద యులున్న వంశమని అమ్మ చెప్పేది. తరువాత కాలం పాడైపోయింది.
అయిదు తరాల క్రితం మా ముత్తాత బంగారు కడియాన్ని ఆశ పెడుతూ దారిన పోయే దానయ్యలను దగ్గరకు రప్పించుకునేవారు. ఏం చేస్తారు పాపం! వార్ధక్యం వల్ల కదల్లేని స్థితి. ఉపాయశాలురున్న వంశం నాది. పులి జాతిపై ఎవ్వరూ జాలి పడరు. పుర్రెతో సహా మా చర్మాలను పరుచుకుని తపస్సులో కూచునే స్వాములకు ధర్మమున్నదా? ఇలాంటి తలపోతలతో మరోసారి తలమునకలైంది పులి. జీవితం బుద్బుద ప్రాయమని మొదటిసారి నమ్మింది. చావు భయంలో దేవుడు గుర్తొచ్చాడు.
ఈ చీకటి గుహలోంచి నన్ను బయట పడెయ్యండి. కావాలంటే శనివారాలు ఉపోషాలుంటా. సోమవారం పూర్తి శాకాహారిగా ఉండి పోతా. అడవిలో అంకాళమ్మకి, పోలేరమ్మకి కోరినన్ని జింకల్ని లేళ్లని బలిచ్చి జాతర్లు జరిపిస్తా. ఏనుగుల్ని దిగ తుడుస్తానంటూ మనసులోనే మొక్కింది. పులికి ఒక్కసారి దుఃఖం పెల్లుబికింది. భోరున ఏడ్చింది. పుట్టగానే కూడా ఏడ్చిన జ్ఞాపకం లేదు. అయినా ‘తల తప్పేళా’ ఊడి రాలేదు. అందరూ ఆఖరికి పిచ్చిక పిల్లతో సహా తనని చూసి నవ్వుకుంటున్నాయని దాని ఊహ. మనిషి అసాధ్యుడు. నా అజ్ఞానంతో తనొక జ్ఞానం సంపాయిస్తాడు. బిందెలో నెత్తురు పోసి అవలీలగా షికారీతో పులుల్ని తోకపట్టి ఆడిస్తాడు. నేనెంత వెర్రి పీనుగుని!? గంటలకొద్దీ సాగిన నిర్వేదం తర్వాత అటవీ శాఖవారు చిరుతపులికి విముక్తి కలిగించారు.
ఇంతకీ పులి ఇచ్చిన సందేశమేమంటే- రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా పవర్‌లో ఉన్నవారు తెలిసీ తెలియకా ఎక్కడంటే అక్కడ తలదూర్చకూడదు. ఆచితూచి, మన తలకి పడుతుందా లేదా చూసుకుని దిగాలి. దీన్ని సాక్షాత్తు దుర్గామాత సందేశంగా బీజేపీ వారు భావించాలి.
- శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)