ఇకపై గోదానాలు, సువర్ణదానాలు
అక్షర తూణీరం
ఒకప్పుడు సంపదంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు.
పెద్ద నోట్లు రద్దు! ఎక్కడ విన్నా ఇవే కబుర్లు. నోట్ల రద్దు ప్రకటన కొందరిపై పిడుగుపాటు ప్రభావాన్ని చూపింది. కొందరికి చల్లని జల్లుగా అనిపించింది. ప్రధాని మోదీ నిజంగా ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా నల్ల కుబేరులు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. డెబ్బై ఏళ్లలో మూడు తరాల నల్లకుబేరులు పుట్టి పెరిగారు. వాళ్లకి తెలియకుండా ప్రభుత్వం ఏనాడూ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఈసారి కథ అడ్డం తిరిగింది. డబ్బు కట్టల మీద హాయిగా నిద్రపోతున్న వారంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉత్త పీడకలగా కాసేపు కలగన్నారు. కానీ సొంత సెల్‌ఫోన్లు నిజమేనని ధృవీకరించాక పాముల మీద పడుకున్నట్టనిపించింది. ఏమిటి వన్నీ, కనీసం పాత వార్తాపత్రికలన్నా కాదు. కనీసం తూకానికి వేస్తే పదో పరకో వచ్చేది. ఈ రంగురంగుల కాగితం ముక్క పల్లీల పోట్లాలకి కూడా పనికిరావు. అప్పటిదాకా ఖరీదైన గులాబీ రెక్కల మీద పొర్లుతున్న ట్టుంది. ఏ పూల పరిమళాన్ని తలుచు కుంటే ఆ తావి సోకింది. ఆ కరెన్సీ మహత్యం ఉన్నట్టుండి నిర్జీవమైపో యింది. జగద్గురువు శంకరాచార్యులవారు భజగోవిందంలో చెప్పినట్టు – ఎంతటి ఆత్మీయుడైనా శవమయ్యాక భయం వేస్తుంది. పాపం! అదే జరిగింది.
మనకి స్వాతంత్య్రం రావడానికి కొద్ది ముందు కరెన్సీ చెల్లదని ఒక వదంతి వచ్చింది. బ్రిటిష్ వారెళ్లిపోతే, వారి బొమ్మలతో వచ్చిన కరెన్సీకి కాలం చెల్లుతుందన్నారు. అప్పటికి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ గురించి పెద్దగా తెలియదు. అలాగే పిచ్చి కాగితాల్లాగే వాటిని రెండేళ్లపాటు చూశారు. కానీ అనుకున్నట్టు ఆ నోట్లు రద్దు కాలేదు. తర్వాతి కాలంలో రెండుసార్లు పెద్ద నోట్లని రద్దు చేశారు గాని అవి మరీ పెద్ద నోట్లు. అసలు ఒక స్థాయి పౌరులు వాటిని దర్శించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఆ ప్రభావం సామాన్యుడిపై ఏ మాత్రం పడలేదు. ఇటీవల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాక అయిదువందల నోటుకి గొప్ప కీర్తి లేకుండా పోయింది. అసలు చాలాచోట్ల ఆ నోటిచ్చి సరుకు కొన్నాక తిరిగి చిల్లర రానే రాదు. కూరలు, పళ్లు, మందులు, పెట్రోలు ఇలాంటి నిత్యావసరాలు కొనేవేళ అది పెద్ద నోటు కానేకాదు.
చాలా మంది బ్లాక్‌వీరులు రాత్రికి రాత్రి జీరోలయ్యారు. ఇప్పుడేం జరుగుతుంద న్నది సామాన్యుడి ప్రశ్న. అద్భుతాలేమీ జరగవు. పాత వాసన పోతుంది. కొత్త వాసన నిదానంగా ఆవరిస్తుంది. స్వార్థం అవినీతి నల్లధనానికి విత్తనాలు, ఎరువులు. దీనివల్ల దేశానికి ఎంతో కొంత మేలు జరిగేమాట వాస్తవం. లంచగొండితనం రూపుమాసిపోదు. ఇకపై బంగారు, వెండి కాయిన్స్ సమాంతర ఎకానమీని నడపచ్చు. ఒకప్పుడు సంప దంటే భూరూపేణా, బంగారం లేదా గోవుల రూపేణా ఉండేది. తిరిగి ఆ రోజులు రావచ్చు. ఓ పని చేసిపెట్టినందుకు అధికారికి గోవుని ఇచ్చుకోవచ్చు. లంచమా అంటే, శివశివా గోదానం అంటూ సెంటిమెంట్‌తో సరిపెట్టవచ్చు. గోదానమనగానే మోదీ కూడా సంతోషిస్తారు. ఈ అర్థరాత్రి నిర్ణయం వల్ల గొప్పవాళ్లు ఎందరు దారికొస్తారో తెలీదు గానీ, చాలామంది రైతులు దెబ్బతిన్నారు. అమరావతి రాకతో చుట్టుపక్కల జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. రిజిస్ట్రేషన్ విలువకు చాలా రెట్ల ధర నడి చింది. బ్లాక్‌మనీ అని తెలియకుండానే రైతు గుమ్మంలోకి పెద్ద మొత్తంలో దిగింది. కొందరు వెంటనే స్థిరాస్తులు కొన్నా, కొందరు అటకల మీదే ఉంచారు. ప్రభుత్వం, ఆర్థిక మేధావులు అప్పుడే రైతులకు తగు సూచనలు చేసి ఉండాల్సింది. రైతులను నల్లకుబేరుల జాబితాలో చేర్చకూడదు. వీరికేదైనా దారి చూపాలి. పన్ను వసూలు చేసి వారి డబ్బును వదిలెయ్యచ్చు. నిజంగానే స్వచ్ఛభారత్‌లో తుక్కునోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. కొత్త నోట్లు త్రివర్ణ పతాకాల్లా రెపరెపలాడుతున్నాయి.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)
శ్రీరమణ