ఏటీఎంలో ఇలాంటి నోటు ఎపుడైనా చూశారా?
టెక్సాస్: ఏటీఎం కేంద్రాలకు సంబంధించి వింతలు, విశేషాలు మనకు తెలిసిన విషయమే. ముఖ్యంగా దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత వద్దంటే కరెన్సీ నోట్ల వర్షం, ఫేక్ నోట్లు, దొంగతనాలు, దోపీడీలు లాంటి ఘటనలు అనేకం నమోదయ్యాయి. దీంతోపాటు డీమానిటైజేషన్ కాలంలో కరెన్సీకోసం భారీ క్యూలు, ఆ క్యూలలో జనం పడిన బాధలు, గాథలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా అమెరికాలోని టెక్సాస్ ఓ ఏటీఎం కేంద్రం దగ్గర ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
కార్పస్ క్రిస్టీ లోని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఏటీఎం నుంచి ఓ వింత నోటు..కాదు కాదు..వింత అభ్యర్థన దర్శనిమిచ్చింది. కొంతమంది దీన్ని జోక్ అనుకొని కొట్టిపారేశారు. మరికొంతమంది ఈ సంగతిని అస్సలు పట్టించుకోలేదు. అయితే ఓ ధర్మాత్ముడు స్పందించి పుణ్యం కట్టుకోవడంతో బతుకు జీవుడా అంటూ ఓ ఉద్యోగి బయటపడిన వైనమిది.
"దయచేసి నాకు సహాయం చెయ్యండి..నేను లోపల ఇరుక్కున్నాను, నా దగ్గర ఫోన్ లేదు, దయచేసి నా బాస్ కు సమాచారం ఇవ్వండి" ఇదీ సదరు ఏటీఎం రిసీట్ స్లాట్ నుంచి నోటుకు బదులుగా వచ్చిన వెరైటీ నోటు (చిట్టీ) సమాచారం. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే ఏటీఏం కేంద్రాన్ని మరమత్తు చేయడానికి వచ్చి ఉద్యోగి అనూహ్యంగా ఏటీఏం సెంటర్ ఉన్న గదిలో బందీ అయిపోయాడు. మరోవైపు అతని ఫోన్ ను కూడా బయట వున్న అతని వాహనంలోనే వదిలేశాడు. దీంతో బయటికి వచ్చే మార్గం లేక..ఎంత అరిచినా ఎవరూ పట్టించుకునే నాధుడు లేక చివరికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. తనను రక్షించమంటూ వేడుకుంటూ, తన యజమాని ఫోన్ నెంబర్ సహా ఏటీఎం పేపర్ మీద రాసి, రిసీట్ స్లాట్ ద్వారా బయటికి వచ్చేలా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు తలుపులు పగుల గొట్టి అతడికి విముక్తి కల్పించారు.
ఏటీఎం మెషిన్ నుంచి వచ్చిన వాయిస్ వినిపించేంతవరకు తాము ఖచ్చితంగా నమ్మలేకపోయామని కార్పస్ క్రిస్టి పోలీస్ సీనియర్ ఆఫీసర్ రిచర్డ్ ఓల్డన్ స్థానిక మీడియాకు చెప్పారు. ఏటీఎం మెషీన్ లో మనిషి చిక్కుకోవడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని... ఇట్ వజ్ జస్ట్ క్రేజీ అంటూ కమెంట్ చేశారు.