గచ్చిబౌలి: తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని, ఐటీ కంపెనీలు కొలువుదీరిన సైబరాబాద్ సృష్టికర్త తానేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గురువారం ఆయన రోడ్‌షో నిర్వహిస్తూ మసీద్‌బండ, తారానగర్, ఆల్విన్ కాలనీ క్రాస్ రోడ్‌లో ప్రసంగించారు. సైబరాబాద్ తన మానస పుత్రిక అని, 1995 నుంచి హైటెక్ సిటీలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 100 ఎకరాల్లో ఉన్న ఒక్క మైండ్ స్పేస్‌లోనే లక్ష ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు.
సైబరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టానని, హెచ్‌ఐసీసీ, గచ్చిబౌలి స్టేడియం, డైమండ్ నెక్లెస్ లాంటి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తీసుకొచ్చానని చెప్పారు. అమెరికాలో 16 రోజుల పాటు కాలినడకన తిరిగి ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చానన్నారు. టీడీపీ, కాంగ్రెస్ జెండాలు కలిసి పని చేయడం ఓ చరిత్ర అని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిశామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఇచ్చిన హమీలు నెరవేర్చాలని నరేంద్ర మోదీని గట్టిగా అడిగానని, ఆయనతో పేద వారికి ఎంతో నష్టం జరిగిందన్నారు. నాలున్నరేళ్లలో ప్రజలకు అసంతృప్తి, బాధలు తప్ప ఏమీ మిగల్లేదన్నారు. కేంద్రం తీరుతో రూపాయి విలువ పతనమైందన్నారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చారా.. అని ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.
చార్మినార్ కట్టానని చెప్పను..
కేసీఆర్ అన్నట్లుగా తాను చార్మినార్ కట్టానని చెప్పనని, సైబరాబాద్‌ను కట్టానని చెబుతానని చంద్రబాబు అన్నారు. ఏపీని అభివృద్ధి చేస్తూ దేశం కోసం కాంగ్రెస్‌తో కలిశానన్నారు. సీబీఐ భ్రష్టు పట్టిందని, ఈడీ దెబ్బతిందని, ప్రశించిన రాజకీయ నాయకులు, మీడియా, కంపెనీలపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్, ఆర్‌బీఐ వ్యవçస్థలను నిర్వీర్యం చేశారన్నారు. యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతితో ఎక్కడికి వెళుతున్నామో ఆలోచించాలన్నారు. ‘అభివృద్ధి చేసినందుకే కేసీఆర్ తిడుతున్నాడా? తెలంగాణలో నీకేం పని అంటారు. నేను రాకూడదా? మీకు బాధగా లేదా? నగరంలో రోడ్లు బాగు పడలేదు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదు. ఇంటింటికి నీళ్లు రావడం లేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి పంచలేదు. ఎస్సీని సీఎం చేయలేదు’ అని బాబు ధ్వజమెత్తారు.
కొట్టినట్లు బీజేపీ, ఏడ్చినట్లు టీఆర్‌ఎస్ నటిస్తూ దొంగాట ఆడుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవి మంజూరు చేసింది తానేనని మండిపడ్డారు. దేశంలో బీజేపీ ఒక కూటమిగా, దాని వ్యతిరేక పార్టీలన్నీ మరో కూటమి అని.. ఇందులో నీవు ఏ కూటమో స్పష్టం చేయాలని కేసీఆర్‌ను నిలదీశారు. తెలంగాణకు న్యాయం చేయాలనుకున్న పార్టీ తమదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ గెలుపు కోసం ప్రజా కూటమి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, ప్రజా కూటమిలోని పార్టీల నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment