మోదీతో మిలాఖత్‌ | KCR And Narendra Modi Are Secret Friends Says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 29 2018 2:16 AM | Last Updated on Thu, Nov 29 2018 9:44 AM

KCR And Narendra Modi Are Secret Friends Says Rahul Gandhi - Sakshi

బుధవారం ఖమ్మం బహిరంగ సభలో సంఘీభావంగా చేతులెత్తిన సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, ఏపీ సీఎం చంద్రబాబు, నామా, ఎల్‌.రమణ, భట్టి విక్రమార్క, ఉత్తమ్, గద్దర్‌

సాక్షి ప్రతినిధి, ఖమ్మం/హైదరాబాద్‌: ‘రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదు. అయినప్పటికీ ఆయనతో ఎందుకు అంటకాగుతున్నారో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తేల్చి చెప్పాలి’ అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మోదీ బీ టీమ్‌ టీఆర్‌ఎస్‌ కాగా, సీ టీమ్‌ మజ్లిస్‌ అని అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లును టీఆర్‌ఎస్‌ సమర్థించిందని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్‌గాంధీ బుధవారం తొలుత కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గీలో జరిగిన సభలో మాట్లాడారు. అనంతరం ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్‌లలో జరిగిన సభల్లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని, కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్క పనీ పూర్తికాని దుస్థితి ఉందని ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించడంలో కేసీఆర్‌ పూర్తిగా విఫలమయ్యారన్నారు.

ప్రధాని మోదీ అస్తవ్యస్త విధానాలను సమర్థించడంలో తెలంగాణ ముఖ్యమంత్రే అందరికన్నా ముందున్నారని, దేశమంతా నోట్ల రద్దును వ్యతిరేకిస్తే.. కేసీఆర్‌ సమర్థించారని గుర్తుచేశారు. అలాగే లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన సమయంలో సైతం బీజేపీకి మద్దతుగా నిలిచారని, రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి అండగా నిలిచారని.. ఇంత చేసినా స్వరాష్ట్రానికి మాత్రం బీజేపీ నుంచి ఆవగింజంతైనా అభివృద్ధిని సాధించలేకపోవడాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు.  

వ్యవస్థలను నాశనం చేస్తున్నారు... 
ఎన్నికల సంఘం, ఆర్‌బీఐ, సీబీఐతోపాటు దేశంలోని అన్ని వ్యవస్థలనూ నాశనం చేయడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని రాహుల్‌ ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి, బీజేపీ కారణంగా పనిచేయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారని పేర్కొన్నారు. న్యాయమూర్తి హత్య కేసులో బీజేపీ అధ్యక్షుడి పేరు వచ్చిందని గుర్తు చేశారు. మోదీ పాలనలో ప్రజలకు వస్తాయనుకున్న అచ్చేదిన్‌.. ప్రైవేటు కంపెనీలకు మాత్రమే వచ్చాయని విమర్శించారు. మోదీ కనుసన్నల్లో మెలుగుతున్న కేసీఆర్‌ బీ టీమ్‌ను చిత్తుగా ఓడించి.. ఢిల్లీలో ఏ టీమ్‌గా ఉన్న నరేంద్రమోదీని ఓడించేందుకు సిద్ధంకావాలని పిలుపునిచ్చారు.

ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం హంగామా చేస్తోందని, కాంగ్రెస్‌ హయాంలో రూపొందించిన ప్రాజెక్టులకు పేర్లు మార్చి వేల కోట్ల రూపాయల అదనపు నిధులను ఖర్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ హయాంలో చేవెళ్ల–ప్రాణహిత కోసం రూ.50వేల కోట్లతో ప్రాజెక్టును రూపొందిస్తే.. కేసీఆర్‌ ఆ ప్రాజెక్టు పేరు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.93వేల కోట్లతో నిర్మిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి రూ.15వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అప్పగిస్తే.. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి దించిన ఘనత ఆయనదేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం మినహా ఏ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోని పరిస్థితి ఉందని, ఆయన కుటుంబం మాత్రం అనేక పదవులతో ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్‌ లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయి..? మోదీ రాష్ట్రానికి ఇస్తామన్న రూ.2లక్షల కోట్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ల్యాండ్‌ మాఫియాగా తయారైందని, భూ ఆక్రమణలు, దగాకోరు పనులకు చిరునామాగా మారిందని విమర్శించారు. 

నేనెందుకు పెత్తనం చేస్తా: చంద్రబాబు 
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి.. ఆవిర్భావానికి చిత్తశుద్ధితో కృషి చేసిన తాను తెలంగాణపై పెత్తనం చేస్తానని.. ప్రజాకూటమి వస్తే తానే రాజ్యమేలుతాననే రీతిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుర్మార్గమని ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు తాను చేసిన ద్రోహం ఏమిటో.. తనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు పదేపదే దూషిస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం ముమ్మాటికీ నిజమని.. తన హయాంలోనే సైబరాబాద్‌ నగరం రూపకల్పన జరిగిందని, హైటెక్‌ సిటీ, ఎయిర్‌పోర్ట్, ఔటర్‌ రింగ్‌రోడ్‌ వంటి అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు. ‘హైదరాబాద్‌ నేను కట్టానని ఎక్కడా చెప్పలేదు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడ్డట్టు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు.

చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ అయిందని అన్న నోటితోనే కేటీఆర్‌ తిట్టడం ఏ మేరకు సమంజసం? కేసీఆర్‌ దళితుడ్ని సీఎం చేస్తానంటే అడ్డుపడ్డానా? డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు అడ్డుపడ్డానా? మహిళలకు మంత్రి పదవి ఇవ్వొద్దని చెప్పానా? 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానంటే అడ్డుపడ్డానా’ అని చంద్రబాబు నిలదీశారు. అసలు తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్‌ ఉంటాడా..? ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం కాదా..? అని ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన చారిత్రక అవసరం ఆసన్నమైందని, అందుకే కాంగ్రెస్‌తోపాటు ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలతో కూటమి ఏర్పాటు చేస్తున్నట్లు బాబు తెలిపారు. వచ్చేనెల 10న కలిసొచ్చే జాతీయ రాజకీయ పక్షాలతో సమావేశం అవుతున్నామని వెల్లడించారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం ప్రారంభమై.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా నూతన అధ్యాయం ఆవిష్కరించబోతున్నామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 

మేధావుల హత్యతో దేశం అల్లాడుతోంది: సురవరం 
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని..  మైనార్టీలు, దళితులు, మేధావులు, రచయితలపై దాడులు పెరిగాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. దేశం మేధావుల హత్యలతో అల్లాడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం విమర్శలను తట్టుకోలేని స్థాయికి దిగజారిందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాసిన పాపానికి గౌరీ లంకేష్, కమ్యూనిస్టు మేధావిగా పేరొందిన గోవింద్‌ భన్సార్‌ను పొట్టన పెట్టుకుందని ఆరోపణలు చేశారు. ఇక సీఎం కేసీఆర్‌కు కనీస నైతిక విలువలు కరువయ్యాయని, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ ఏ సీఎం అయినా తమ ముందు తలవంచాల్సిందేనని చెప్పడానికి మించి దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నించారు.

మైనార్టీలపై ఇన్నిసార్లు దాడులు జరిగినా సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా ఖండించలేదని, ఇందుకు ఎంఐఎంతో ఉన్న మిత్రుత్వమే కారణమని సురవరం ఆరోపించారు. కేసీఆర్‌ ఫాసిస్ట్‌ పాలనలో మోసపోని వర్గం లేదని, తెలంగాణ ప్రజల అదృష్టంకొద్దీ ముందస్తు ఎన్నికలు వచ్చాయని, ఈ ఫాసిస్ట్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే నియంత కేసీఆర్‌ ఓడిపోవాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు.

ఖమ్మం సభలో ప్రజాగాయకుడు గద్దర్‌ తన ఆటపాటలతో ఆకట్టుకున్నారు. సభలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా, కార్యదర్శి సలీం అహ్మద్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, వనమా వెంకటేశ్వరరావు, శాసన మండలి ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు పోట్ల నాగేశ్వరరావు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు, ప్రజాకూటమి అభ్యర్థులు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, బానోతు విజయ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు పాపారావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement