
హైదరాబాద్: మహాకూటమి సీట్ల సర్దుబాటులో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్‌లో విభేదాలు బయటపడ్డాయి. సీట్ల సర్దుబాటులో భాగంగా శేరిలింగంపల్లి సీటు టీడీపీకి కేటాయించే అవకాశం ఉండటంతో లొల్లి మొదలైంది.
దీనిలో భాగంగా గాంధీ భవన్ వద్ద బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ అనుచరులు.. టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే భిక్షపతి అనుచరుడు పెట్రోల్ పోసుకుని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తను ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని రోజుల క్రితం శేరిలింగంపల్లి సీటును తనకే కేటాయిస్తారంటూ ప్రచారం చేసుకున్న భిక్షపతి.. తాజా పరిణామాలతో పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయించవద్దని భిక్షపతి యాదవ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇవ్వకుండా ఎవరిని నిలబెట్టినా ఓడిస్తామని ఆయన హెచ‍్చరించారు. భిక్షపతి యాదవ్‌కు మద్దతుగా మరొక కార్యకర్త చేయి కోసుకుని నిరసన తెలిపాడు.