ఆర్మూరు ప్రజా ఆశీర్వాద సభలో వేదికపైనుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్/నిజామాబాద్: ‘రాష్ట్రం తెచ్చింది నేను. 14 ఏళ్లు కొట్లాడిన.. 40 ఏళ్లు కాం గ్రెసోళ్లు, 17–18 ఏళ్లు తెలుగుదేశమోళ్లు పాలించారు. 58 ఏళ్లలో వాళ్లు ఏం చేశారు? నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుస్తలేదా? ఓడిపోం గానే వీళ్లేమైనా హిమాలయాలకు పోయి ఆకు పసరు తాగొచ్చారా.. పవిత్రం అయిపోయిన్రా?.. మళ్లీ నమ్మితే పంటికి అంటకుండా మింగేస్తారు. ఆగం కాకండి. ఆలోచించి కాంగ్రెస్, టీడీపీ మళ్లీ రాకుండా చూడండి’ అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానా పూర్, ఇచ్చోడ, నిర్మల్, భైంసాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలతోపాటు నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాం గ్రెస్, టీడీపీలపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లకు చేతగాక ఆంధ్రకు పోయి చంద్రబాబుని భుజాలపై తీసుకొస్తున్నారని, మళ్లీ చంద్రబాబు అవసరమా? అని ప్రశ్నించారు. ఆయా సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
బాబు హైదరాబాద్ కడితే కుతుబ్‌షా ఏమయ్యాడు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉన్నదా? ఇక్కడ క్వాలిటీ కరెంట్ ఇస్తున్నం. ట్రాన్స్‌ఫార్మర్లు కాలుతలేవు. రైతులకు 24 గంటలపాటు ఫ్రీ కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. చంద్రబాబు అయితే.. హైదరాబాద్ నేను కట్టిన అంటడు. కులీకుతుబ్‌షా ఆత్మహత్య చేసుకోవాల్న మరి? కాంగ్రెస్ ఘనాపాటీలు ఏం చేసిర్రు. అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, ఆరోగ్య లక్ష్మి, గర్భవతులకు ఇప్పుడు ఎలా ఉంది.. అప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు. కేసీఆర్ కిట్ వచ్చాక ఆరోగ్య భద్రత పెరిగింది. కల్యాణ లక్ష్మి అనే పథకం ఇండియాలో ఎక్కడన్నా ఉన్నదా? మహారాష్ట్రలో చేస్తున్నరా? సరిహద్దు ధర్మాబాద్‌లో 40 గ్రామాల సర్పంచులు మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపాలని తీర్మానం చేసిన్రు.
అట్టర్ ప్లాఫ్ ప్రధాని...
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయింది. విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ, ముస్లింల జనాభా పెరిగింది. అందుకు అనుగుణంగా ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేశాం. దీనిపై కేంద్రానికి 30 లేఖలు కూడా రాశాం. రిజర్వేషన్లు పెంచాలని కోరితే మోదీ పట్టించుకోలేదు. హైదరాబాద్‌లో ఒవైసీ సహా 17 మంది ఎంపీలను గెలిపిస్తే.. ఎస్టీ, ముస్లిం రిజర్వేషన్లు తీసుకొస్తా. బీడీ కార్మికులకు పీఎఫ్ సౌకర్యం కల్పించేందుకు ఉన్న కటాఫ్ తేదీని తీసేస్తా. దీనివల్ల అదనంగా 40 వేల మందికి మేలు జరుగుతుంది.
నిర్మల్ సభలో...
రూ.25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్‌ను కొనలేరు
రాష్ట్రంలో ఎంఐఎం మా మిత్రపక్షం. సమైక్య పాలనలో ఒవైసీ నాయకత్వంలో ఓ పార్టీ బతికుంది అంటే గ్రేట్. ఒవైసీ మేము కలసి పనిచేస్తున్నాం. అసదుద్దీన్‌ను నిర్మల్ సభకు రాకుండా చూస్తే రూ. 25 లక్షలు ఇస్తానని కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక ఎంఐఎం నేతకు ఆఫర్ ఇచ్చిండు. 25 లక్షలు కాదు కదా... రూ. 25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్‌ను కొనలేరు. కాంగ్రెస్ నాయకులు ఇలాంటి నీచ రాజకీయాలు చేయొచ్చా? ఇలాంటి వారికి ఓటుతో సమాధానం చెప్పాలి. ఇంద్రకరణ్‌రెడ్డిని బంపర్ మెజారిటీతో గెలిపించాలి. జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి పట్టుబట్టి ఆదిలాబాద్‌ను 4 జిల్లాలు చేయాలని నన్ను కోరారు. తెలంగాణ అంతటా భూగర్భ డ్రైనేజీ తీసుకురావాలనే ఆలోచన ఉంది. గజ్వేల్‌తోపాటు నిర్మల్ పట్టణం, ఓ మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయిస్తా. నిర్మల్‌కు రైలు రావాలి.. మెడికల్ కాలేజీ రావాలి. నిర్మల్‌లో 66,829 ఆసరా పింఛన్‌దారులున్నారు. వారంతా ఓటేసినా ఇంద్రకరణ్‌రెడ్డి గెలుస్తారు.
భైంసా సభలో...
3,500 మందికిపైగా గిరిజనులు సర్పంచులుగా...
గిరిజన సోదరులు మా రాజ్యం–మా పాలన అని ఆందోళన చేశారు. ముథోల్ నియోజకవర్గంలో 87 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 3,500 మందికిపైగా గిరిజనులు పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా ఎన్నికవనున్నారు. ఎన్నికల తర్వాత పాత ఆదిలాబాద్ జిల్లాలో 3–4 రోజులు ఉండి ఎక్కడి సమస్యలు అక్కడే తీరుస్తానని హామీ ఇస్తున్నా. పోయినసారి లక్ష రూపాయలు రుణమాఫీ చేసినం.. ఈసారి కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెబుతున్నాం. కాంగ్రెసోళ్లు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని అంటున్నారు. అది సాధ్యం అవుతుందా? పంచగుడి బ్రిడ్జిని విఠల్‌రెడ్డి పట్టుబట్టి పూర్తి చేయించుకున్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందని కాంగ్రెసోళ్లు అంటున్నరు. ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తే శబ్ద విప్లవంగానే కనిపిస్తోంది. నా నియోజకవర్గం లాభపడితే చాలు అంటూ విఠల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇచ్చోడ సభలో....
ఏజెన్సీలో ప్రతి రైతుకూ లాభం చేస్తాం...
గత ప్రభుత్వాలు ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఎందుకు న్యాయం చేయలేదు? ఏజెన్సీ ప్రాంతంలో మేము గిరిజనుల సమస్యల్ని కొంత మేరకు పరిష్కరించాం. ఏజెన్సీలో ప్రతి రైతుకూ లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటాం. పొరపాటున కాంగ్రెస్ ప్రభు త్వం వస్తే మళ్లీ విద్యుత్ కోతలే. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ పాలనపై ఊళ్లల్లో చర్చలు జరగాలి. మేము చేసిందేమిటో, వాళ్లు చేసిందేమిటో ప్రజలు బేరీజు వేసుకోవాలి. కేంద్ర రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించేలా లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపిం చాలి. అప్పుడే అన్ని హామీలను నెరవేర్చుకోగలం. ఢిల్లీ మెడలు వంచి రిజర్వేషన్లు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. నాది మొండి పట్టు. చివరి వరకు పోరాడతా.
ఇచ్చోడ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి జై కొడుతున్న జనం
ఖానాపూర్ సభలో...
సరైన నాయకుడిని గెలిపించాలి...
మళ్లీ అధికారంలోకి వచ్చాక అటవీ భూమిపై గిరిజనులు, గిరిజనేతరుల హక్కులతోపాటు సాగునీరు, చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఎలక్షన్లు చాలా వస్తయి. చాలా పోతయి. ఎవరో గెలవడం ముఖ్యం కాదు. ప్రజలు గెలిచే రాజకీయం వస్తేనే అందరూ బాగుపడ్తరు. అనుకున్న అభివృద్ధి జరగాలంటే సరైన నాయకుడిని గెలిపించాలి. రాష్ట్రం బాగుపడాలని తపన పడుతున్న వ్యక్తిగా చెప్తున్న. ప్రజలు గెలిచే రాజకీయం రావాలని కోరుకుంటున్నా. ప్రజల హక్కులు గౌరవించే పద్ధతి రావాలని కోరుకుంటున్నా. ఎన్నికలు అనగానే గాయి గత్తర అవ్వొద్దు. ఎన్నికలు అనగానే నోట్ల కట్టలు మందుగుండు సామాగ్రిలా తయారు చేశారు. 58 ఏళ్లపాటు సమస్యలన్నీ పెండింగ్‌లో పెట్టింది కాం గ్రెస్, టీడీపీ పార్టీలే. 58 ఏళ్లపాటు ఏం జరిగింది..ఈ నాలుగేళ్లలో ఏం జరిగిందో బేరీజు వేసుకోండి.
గెలిస్తే గట్టిగా పనిచేస్తా..లేదంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటా..
‘‘టీఆర్‌ఎస్ ఓడిపోయిందనుకో... నాకు వచ్చే నష్టం పెద్దగా ఏం లేదు. ఏముంటది? గెలిపిస్తే గట్టిగా పని చేస్తా... లేదంటే ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా. వ్యవసాయం చేసుకుంటా. నష్టపోయేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టొద్దంటూ కేంద్రానికి చంద్రబాబు 35 ఉత్తరాలు రాశాడు. అలాంటి వాళ్లు అధికారంలోకి వస్తే మన ప్రాజెక్టులు సాగనిస్తారా? ఆయన మనసు ఇటు గుంజుతాదా? కూటమిలో నాలుగు పార్టీలు ఉంటే ఏ పార్టీకి ఆ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుందట? జనాన్ని ఇంకెంత కాలం మోసం చేస్తారు?’’అని కేసీఆర్ ప్రశ్నించారు.
60 ఏళ్లా.. 61 ఏళ్లా.. రిటైర్మెంట్ వయసు పెంపుపై త్వరలో ప్రకటిస్తాం
సబబైన, సముచితమైన ఐఆర్, ఫిట్‌మెంట్ ఇస్తాం
‘‘ఉద్యోగ సోదరులకు నేను ఒక్కటే మాట చెబుతున్నా. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలా ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉందో మీ అందరికీ తెలుసు. దేశంలో ఎవ్వరూ ఇవ్వని ఫిట్‌మెంట్ ఇచ్చింది. కొంత మంది మిమ్మల్ని పెడదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కచ్చితంగా మేము ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఉంటాం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు అందరూ కలసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి ఎన్నికల తర్వాత ఉద్యోగులకు సబబైన, సముచితమైన ఐఆర్ (ఇంటీరియం రిలీఫ్), ఫిట్‌మెంట్ ఇస్తాం. దాంతోపాటు ఉద్యోగ సంఘాల నుంచి చాలా విజ్ఞప్తులు వచ్చాయి. మా రిటైర్మెంట్ వయసు పెంచాలని ఉద్యోగస్తులు అడిగారు. ఈ రోజు కూడా టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావును ఉద్యోగులు కలసి విజ్ఞప్తి చేశారు. ఈ విష యంపై మేము కూడా సీరియస్‌గా ఆలోచిస్తున్నాం. మరి అది 60 ఏళ్లు చేయాలా లేక 61 ఏళ్లు చేయాలా.. ఎంత చేయాలనేది కమిటీలో నిర్ణయం తీసుకొని త్వరలోనే ప్రకటిస్తామని మనవి చేస్తున్నా. మీరు గందరగోళానికి గురికావొద్దు. తెలం గాణ ఉద్యమంలో మీరు భాగస్వాములుగా ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములుగా ఉండా లని నేను కోరుతున్నా’’అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఇమామే జామిన్ వెనుకున్న కథ చెప్పిన కేసీఆర్
ముస్లిం సంప్రదాయానికి ప్రతీక అయిన ఇమామే జామిన్ (సీఎం తన చేతికి కట్టుకునే పవిత్ర వస్త్రం) గురించి మక్కాలో జరిగిన ఘటనగా ఓ కథను కేసీఆర్ ఆసక్తికరంగా చెప్పారు. ‘‘మక్కాలో ఓ వేటగాడు మాంసం కోసం జింకను చంపేందుకు సిద్ధమవుతాడు. అప్పుడు మక్కాలోనే ఉన్న ప్రవక్త మనవడు అతన్ని అడ్డుకుంటాడు. అప్పటికే ఏడుస్తున్న జింకను వదిలేయాలని కోరతాడు. ఆ జింకకు చిన్న పిల్ల ఉన్నదని, దానికి పాలు ఇచ్చి వస్తానని ఆ జింక వేడుకుంటూ ఏడుస్తుందని వేటగానికి చెబుతాడు. ఆ జింక రాకపోతే తానే చనిపోతానని కూడా మాట ఇస్తాడు. అందుకు వేటగాడు ఒప్పుకోగానే ఆ జింకకు తన దగ్గరున్న వస్త్రాన్ని రక్షగా కట్టి పంపిస్తాడు. ఆ తర్వాత ఆ జింక తన పిల్లకు పాలు ఇచ్చి తిరిగి వస్తుంది. ఇమామే జామిన్ అంటే సురక్షితంగా వెళ్లి తిరిగిరావడం’’అని కేసీఆర్ వివరించారు. దీని గురించి తెలియని వారు ‘దట్టి’ అంటారన్నారు.
చంద్రబాబు ‘ఊద్’ముబారక్ అన్నాడు..
గతంలో సీఎం చంద్రబాబు వద్ద తాను మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆయన నిజామాబాద్‌కు రాగా.. ముస్లిం సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో బాబు ఇబ్బందిపడ్డ విషయాన్ని చమత్కారంగా చెప్పుకొచ్చారు. ముస్లిం సోదరులకు పండుగ రోజున ‘ఈద్ ముబారక్’ అని శుభాకాంక్షలు చెప్పాలని చంద్రబాబుకు సూచిస్తే, ఆయన ‘ఊద్ ముబారక్ ’అని చెప్పారని కేసీఆర్ సభలో నవ్వులు పూయించారు.
ఆర్మూరు సభలో.. గిట్టుబాటు ధర కోసం కొత్త పథకాలు..
కాంగ్రెస్ హామీ ఇస్తున్నట్లు రూ. 2 లక్షల పంట రుణమాఫీతో ధనవంతులు, కోటీశ్వరులే లబ్ధి పొందుతారు. సామాన్య రైతులకు రూ. లక్షకు మించి రుణం ఉండదు. రూ. 2 లక్షల రుణం ఉన్న వారు ఈ సభలో ఎవరైనా ఉన్నారా? రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కడుపు నిండా నీళ్లు, ఉచిత కరెంట్.. సకాలంలో ఎరువులు లభిస్తున్నాయి. రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మంచి పథకాలకు రూపకల్పన చేస్తున్నాం. ఇందుకు అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపిస్తాం. పసుపు బోర్డు విషయంలో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఇకపై ఇక్కడ పండిన ప్రతి పసుపు కొమ్మును కొనుగోలు చేస్తాం. ఐకేపీ ద్వారా ఈ కొనుగోళ్ల ప్రక్రియ చేపడతాం. గత ప్రభుత్వాలు ఎర్రజొన్న రైతులపై కాల్పులు జరిపాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్రజొన్న రైతుల బకాయిలు చెల్లించాం. కాగా, బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ కవిత, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్, కరీంనగర్ జెడ్పీ చైర్మన్ తుల ఉమ, మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment