సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రజాకూటమి పొత్తులను కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసింది. మొత్తం 119 స్థానాలకు గాను 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుండగా.. మిగిలిన 24 స్థానాలను టీడీపీ, టీజేఎస్, సీపీఐలకు ఇచ్చేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం ఢిల్లీలో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అధ్యక్షతన ఆమె నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది.
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోని, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, వీరప్పమొయిలీ, తెలంగాణ పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్, కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తాజా మాజీ ప్రతిపక్ష నేత జానారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిత్రపక్షాలకు 24 సీట్లు కేటాయించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. వీటిలో టీడీపీకి 14 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించగా.. టీజేఎస్‌కు 7 లేదా 6, సీపీఐకి 3 లేదా 4 సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
57 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
కాంగ్రెస్ పోటీ చేసే 95 స్థానాల్లో 62 స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై సమావేశంలో కసరత్తు చేశారు. అయితే 57 స్థానాల్లో అభ్యర్థులను మాత్రమే ఖరారు చేశారు. కాంగ్రెస్ పోటీ చేసే 95 స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో దీపావళి తర్వాత 8, లేదా 9వ తేదీల్లో ప్రకటించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం కుంతియా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీకి 14 సీట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. టీజేఎస్, సీపీఐలకు కేటాయించే సీట్లపై చర్చ జరుగుతోందని తెలిపారు.
మిత్రపక్షాలకు ఇచ్చే సీట్లను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రాథమికంగా ఆమోదించారని, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఒకే విడతలో ప్రకటించడంపై ఆయన నిర్ణయం తీసుకుంటారని ఉత్తమ్ వెల్లడించారు. కాగా, మిగిలిన 38 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 6న తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లో సమావేశం కానుంది.
8న మరోసారి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ..
కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఈ నెల 8న మరోసారి జరిగే అవకాశం ఉంది. మిగిలిన 38 స్థానాల అభ్యర్థులను ఆ భేటీలో ఖరారు చేయనున్నారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపైనా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment