కాంగ్రెస్‌ భుజం మీద తుపాకీ పెట్టి.. | Devulapalli Amar Article On TDP Congress Alliance | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 21 2018 1:24 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Devulapalli Amar Article On TDP Congress Alliance - Sakshi

కాంగ్రెస్‌ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్‌కు... బాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఆ మీడియా అధిపతికి బాబు, కేసీఆర్‌లలో ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం.

కూట్లో రాయి ఏరలేనమ్మ ఏట్లో ఏరబోయిం దన్న సామెత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడుకు సరిగ్గా సరిపోతుంది . 2014 లో అపారమైన రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తనకే అధికారం ఇవ్వాలని ఆయన కోరితే, కాబోలు అనుకుని ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆ రాష్ట్రాన్ని ఆగం ఆగం చేసిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణాను ఉద్ధరిస్తాననీ, దానితోబాటు దేశాన్నే ఉద్ధరిస్తాననీ బయలుదేరాడు. చంద్రబాబు ఎందుకు తెలంగాణలో తలదూర్చాలని అనుకుంటున్నాడు? సోనియాగాంధీ ఇటలీ దయ్యం, దేశాన్ని నాశనం చేసిందని మాట్లాడిన నోటితోనే కాంగ్రెస్‌ గానం ఎందుకు చేస్తున్నాడు అన్న విషయం మనం గతంలోనే మాట్లాడుకున్నాం. ఆయన చెపుతున్న ప్రజాస్వామ్య అనివార్యత దేశ ప్రయోజనాల కోసం కాదు, సొంత ప్రయోజనాల కోసం అనీ  మళ్ళీ మాట్లాడితే తానూ తన పార్టీ వారు, అనుయాయులూ అవినీతి కేసుల నుండి రక్షణ పొందడానికి అని అందరికీ అర్థం అయిపోయింది. ఇప్పుడు ఆయన తెలంగాణాలో ఎందుకు తలదూర్చాడో మాట్లాడుకుందాం. కాంగ్రెస్‌ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను, జాతీయ స్థాయిలో బీజేపీని కాల్చేందుకు సిద్ధం అయ్యాడు చంద్రబాబు. తెలంగాణలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కొనసాగడం అంటే చంద్రబాబు చిక్కుల్లో పడ్డట్టే .

టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించుకుని రెండు తెలుగు రాష్ట్రాలకూ ఇద్దరు నాయకులను అధ్యక్షులుగా నియమించుకుని తనను తాను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న చంద్రబాబు తెలంగాణ ఏర్పడిన కొత్తలో వేసిన ఒక తప్పటడుగు కారణంగా హైదరాబాద్‌లో పదేళ్ళు ఉండే అవకాశాన్ని వదులుకుని అమరావతికి పలాయనం చిత్తగించాల్సి వచ్చింది. ఒక్క శాసన మండలి స్థానం కోసం కక్కుర్తి పడి శాసన సభ్యులను కొనుగోలు చేసే కార్యక్రమం ఆయన చెయ్యక పోయి ఉంటె కేసీఆర్‌ టీడీపీని తెలంగాణలో ఖాళీ చేయించే పనికి నడుంకట్టి ఉండేవాడు కాదేమో. అది చంద్రబాబు స్వయంకృతం. రేపు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మళ్ళీ అధికారంలోకి వస్తే, నెత్తి మీద కత్తిలా వేలాడుతున్న ఓటుకు కోట్లు కేసులో జైలుకు వెళ్ళాల్సి వస్తుందని ఆయన భయం. అదే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ కేసును నీరు కార్చేయ్యవచ్చునన్నది చంద్రబాబు ఆలోచన. నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పట్ల, ఆ పార్టీ పాలన తీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఏ పొత్తూ లేకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధం అయ్యారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌రావు నియంతృత్వ ధోరణి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణం అయింది. చెప్పేవి శనగలు, అమ్మేవి ఆముదాలు, కొనేటివి గోధుమలు అన్న రీతిన సాగిన ఆయన ప్రకటనలు, ప్రగతి భవన్‌ పేరిట నిర్మించిన గడీకి పరిమితమై ఆయన సాగించిన ‘ఎంపిక చేసిన పాలన’  (ట్ఛl్ఛఛ్టిజీఠ్ఛి జౌఠ్ఛిటn్చnఛ్ఛి) అంటే ప్రజా బాహుళ్యానికి లాభం చేసే పనులు కాకుండా తమకు లాభం చేకూర్చే పనులు మాత్రమే చెయ్యడమని ప్రజలకు అర్థమయ్యింది. ప్రజలకే కాదు, సొంత పార్టీ నాయకులకు చివరికి మంత్రులకు కూడా అందుబాటులో లేకుండా పోయిన వైనం, ఎక్కువమంది శాసన సభ్యులు మూటగట్టుకున్న అవినీతి అన్నీ కలిసి ఈసారి టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం అన్న వాతావరణాన్ని సృష్టించాయి తెలంగాణలో. ఆయన కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, ముఖ్యంగా కొడుకు కేటీ రామారావు, కూతురు కవిత వ్యవహార శైలి టీఆర్‌ఎస్‌కు తీవ్ర నష్టం చేసే విధంగా తయారయింది. పరిస్థితిని చక్కదిద్దడానికి సలహాలు ఇచ్చేందుకు నోరు విప్పి మాట్లాడే స్థితిలో పార్టీ నాయకులు లేరు. మంత్రులే ఆ సాహసం చెయ్యలేని దుస్థితి. పేరుకు ఇద్దరు ఉప ముఖ్య  మంత్రులు, ఒకాయన దళితుడు, మరొకాయన మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. ఇరువురూ శాసన మండలి సభ్యులే.

వీరిలో ఒకాయన సీఎం దృష్టికి కొన్ని విషయాలు తీసుకురాదలచుకుని ఆయన అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించి ఎంతకూ కుదరక చివరికి ఏమైతే అది అయిందని ప్రగతి భవన్‌కు వెళ్ళాడట. ముందుగా అపాయింట్‌మెంట్‌ లేకుండా ఇంకొకసారి మీరు ప్రగతి భవన్‌కు రావద్దని పేషీలోని పీఏ స్థాయి ఉద్యోగి చెప్పి పంపేశారట. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పరిస్థితి ఇది. ముఖ్యమంత్రి బహిరంగంగానే మజ్లిస్‌ తన మిత్ర పక్షం అని ప్రకటించినా ఆయన మత విశ్వాసాలు వ్యక్తిగతం కాకుండా అధికారికం కావడం విమర్శలకు దారి తీసింది. ప్రగతి భవన్‌ ప్రారంభోత్సవం నాడు చిన్న జియ్యర్‌ స్వామిని ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చోబెట్టడం దగ్గరి నుండి మొన్న రెండు రోజులు రాజ శ్యామల యాగం చెయ్యడం దాకా ఆయన కార్యక్రమాలు వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. వీటన్నిటికి కొనసాగింపుగా ఆయన గడువు కన్నా చాలా ముందు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పుకోలేని స్థితి. ఇవన్నీ టీఆర్‌ఎస్‌కు ప్రతికూల అంశాలుగా జనం నోళ్ళలో నానుతున్న సమయంలో ప్రచారాస్త్రం కోసం వెతుక్కుంటున్న కేసీఆర్‌కు చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల రంగంలోకి రావడం మంచి ఆయుధం దొరికినట్టు అయింది. బాబుతో పాటు ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా కేసీఆర్‌ సంధిస్తున్న ప్రశ్నలకు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను ప్రజాకూటమి ఎట్లా అధిగమిస్తుందో చూడాలి.

చంద్రబాబు ఆలోచన మాత్రం ఒక్కటే. తెలంగాణలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్ళీ పెత్తనం చెయ్యడానికి అవకాశం వస్తుంది. పైగా జాతీయస్థాయిలో పలుకుబడి పెరుగుతుంది తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దుష్పరిపాలన నుండి రాష్ట్రం, దేశం దృష్టి మళ్ళించవచ్చు. తెలంగాణలోనే కాక శాసన సభ ఎన్నికలు జరుగుతున్న మిగతా నాలుగు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్‌కు ఆయన పెద్ద ఎత్తున ఎన్నికల నిధులు సమకూర్చారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉంటూనే గుజరాత్‌ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు నిధులు సమకూర్చినట్టు మోదీ అమిత్‌ షా దగ్గర రుజువులు ఉన్నాయట. కర్ణాటక ఎన్నికలలో కూడా ఇదే మాట విన్నాం. తెలంగాణాలో మళ్ళీ చంద్రబాబు ప్రవేశాన్ని కోరుతున్న ఆయన అనుకూల మీడియాకు హఠాత్తుగా ఒత్తిడి పెరిగిందనే విషయం గుర్తుకొచ్చింది .

తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో చంద్రబాబు అండ చూసుకుని తెలంగాణ ప్రభుత్వం మీద కయ్యానికి కాలు దువ్వి, ఛానల్‌ ప్రసారాలు నిలిచిపోయే దాకా తెచ్చుకుని; చంద్రబాబు అమరావతికి పలాయనం చిత్తగించాక తెలంగాణ ప్రభుత్వ అధినేతతో సంధి చేసుకుని అధికార పక్షం నడుపుతున్న పత్రిక, చానల్‌ను కూడా మించిపోయి కేసీఆర్‌ మౌత్‌ పీస్‌గా మారిన ఆ మీడియా యజమానికి తెలంగాణ ఎన్నికలలోకి మళ్ళీ చంద్రబాబు ప్రవేశించే సరికి మీడియా మీద ప్రభుత్వ ఒత్తిడి హఠాత్తుగా గుర్తొచ్చింది. నాలుగున్నర సంవత్సరాలపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌కు, తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌కు డబ్బా కొట్టిన ఈ మీడియా అధిపతికి ఇప్పుడు కేసీఆర్‌ కొంగర కలాన్‌ బహిరంగ సభ విఫలం అయిన విషయం గుర్తొచ్చింది. మిగిలిన అన్ని మీడియా సంస్థల్లాగే ఆనాడు కొంగర కలాన్‌ సభ అద్భుతం అని రాసిన, చూపించిన ఆయన ఇవాళ ఒత్తిడి గుర్తు చేసుకుంటున్నాడు. ఎంత విచిత్రం. ఎందుకీ హఠాత్‌ ఆత్మపరిశీలన, పశ్చాత్తాపం? మీడియా స్వేచ్ఛపట్ల స్పృహ అంటే ఇప్పుడిక ఆ మీడియా అధిపతికి చంద్రబాబు, చంద్రశేఖర్‌రావుల మధ్య ఎవరితో ఉండాలో తేల్చుకోవాల్సిన సమయం. చంద్రబాబును రక్షించుకోవాలి, ఆయనను రక్షించుకుంటేనే తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. (ఈ మధ్యనే ఒక విశ్రాంత చీఫ్‌ సెక్రెటరీ చెప్పారు. ఒక మీడియా సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయల లాభం చేసిందని), అది కొనసాగాలంటే.. చంద్రబాబును రక్షించాలంటే తెలంగాణలోప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకోవాలి. కాబట్టే ఇప్పుడు హఠాత్తుగా మీడియా మీద ఒత్తిడి గుర్తొచ్చింది. ఆ మీడియా అధిపతి మాటల్లోనే చెప్పాలంటే మీడియా తన మనుగడ, విశ్వసనీయత కోసం స్వతంత్రంగా పని చెయ్యవలసిన అవసరం ఏర్పడిందట.

కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు తెలంగాణ ఎన్నికలలోకి ప్రవేశించక ముందు టీఆర్‌ఎస్‌కు 80 సీట్లు తప్పకుండా వస్తాయని రాసిన అదే మీడియా అధిపతి ఇవాళ స్వరం మార్చేశాడు. మీడియా సంస్థలు రాజ కీయ పార్టీలకు అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించడం కొత్తేమీ కాదు. ఆ పని ఇష్టంతో చెయ్యడం వేరు, భయంతో చెయ్యడం వేరు అని హిత బోధ చేస్తున్న ఆ పత్రికాధిపతి నిన్నటి దాకా కేసీఆర్‌కు బాకా ఊది, ఇప్పుడు మీడియా స్వతంత్రత, విశ్వసనీయత గురించి లెక్చర్‌లు ఇస్తున్నాడు. రేపొక వేళ కేసీఆర్‌ కొత్త అస్త్రం చంద్రబాబు వ్యతిరేకత పనిచేసి టీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తే ఈయన మళ్ళీ ప్లేటు ఫిరాయిస్తాడా? తెలంగాణలో చంద్రబాబు, ఆయన వందిమాగధ మీడియా వ్యవహారాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ గమనించి జాగ్రత్త పడితే మంచిది. అధికార పక్షం టీఆర్‌ఎస్‌కు అటువంటి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాను ఎన్ని కిలోమీటర్ల లోతున పాతి పెట్టాలో బాగా తెలి సిన నాయకుడు ఉన్నాడు ఆపార్టీకి. ఆయనే చూసుకుంటాడు.

దేవులపల్లి అమర్‌
 
datelinehyderabad@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement