సాక్షి, హైదరాబాద్: తెలంగాణను తిరిగి ఏపీలో కలిపేందుకు సమైక్య వాదులంతా చేతులు కలిపారని మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. తెలం గాణ రాకుండా ఆఖరి నిమిషం వరకు అడ్డుకుని, వచ్చాక కుట్రలకు తెరలేపిన చంద్రబాబుతో వాళ్లు చేతులు కలపడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. మహాకూటమి లక్ష్యాలపై పలు అను మానాలు, ప్రశ్నలను లేవనెత్తారు. ‘తెలంగాణలో ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఒక పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ఎన్నికలు కాదు’అన్నారు. తెలంగాణ ఉనికిని, మనుగడను ప్రశ్నించడానికి వస్తున్న కూటమిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ‘నేను మంత్రిగా మాట్లాడ ట్లేదు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాట్లాడుతున్నా.
తెలంగాణలో తెలంగాణ పౌరులే పోటీ చేయాలి.. వారే అధికారంలో ఉండాలి. కానీ నేడు జరుగుతున్న దేంటి?’అని ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి కుట్రల కూటమి, దగుల్బాజీ కూటమి అని దుయ్యబట్టారు. అది చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అని అభివర్ణించారు. కాంగ్రెస్ నేతలు 1956లో ఉపముఖ్యమంత్రి పదవి కోసం తెలంగాణను ఏపీలో కలిపి, అధికారం కోసం ఇప్పుడు మరోసారి అదే కుట్రలకు పాల్పడు తున్నారని ఆరోపించారు. కూటమిలో మిగిలింది కాంగ్రెస్, టీడీపీలేనని విమర్శించారు. కోదండరాం, సీపీఐ చాడ వెంకటరెడ్డిల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో సాగరహారం ఫొటోలు వేయించుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
అనేక కుట్రలు చేశారు
ఇపుడు కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు వ్యతిరేకంగా అనేక కుట్రలు చేశాయంటూ ధ్వజమెత్తారు. కాకినాడ సభలో ‘ఒక ఓటు రెండు రాష్ట్రాలు’అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన బీజేపీని తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. కరెంటు కష్టాలపై నిలదీసినందుకు బషీర్‌బాగ్‌లో రైతులను కాల్చి చంపించిన చరిత్ర చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలతో విసిగిపోయిన కేసీఆర్ పదవులకు రాజీనామా చేసి ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. 2004లో కాంగ్రెస్‌తో జై తెలంగాణ అనిపించినా, కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ పెట్టించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని స్పష్టం చేశారు. 2009లో కేసీఆర్ దీక్షతో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న ప్రకటన చేయించాడన్నారు. కానీ అదే రాత్రి రాజీనామా డ్రామాలతో కుట్రలకు తెరలేపిన బాబు వచ్చిన తెలంగాణను వెనక్కి పోయేలా చేసాడని ఆరోపించారు. 2014లో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో తిరిగి తెలుగుజాతిని కలిపే శక్తి ఒక్క టీడీపీకే ఉందన్న బాబు మాటలకు అర్థమేంటని ప్రశ్నించారు. పథకం ప్రకారం.. తన కోవర్టులను ముందుగా కాంగ్రెస్‌లోకి.. ఇపుడు పొత్తు పేరిట తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వనని కరాఖండిగా చెప్పిన అప్పటి సీఎం కిరణ్‌తో చేతులు కలపడం కుట్రలో భాగమేనన్నారు.
జిల్లాలకు ఎందుకు పోవట్లేదు?
కూకట్‌పల్లి, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో తిరిగిన చంద్రబాబు తెలంగాణ జిల్లాలకు ఎందుకు పోవడం లేదని ప్రశ్నించారు. టీడీపీతో చేతులు కలిపిన కాంగ్రెస్ నేతలంతా సమైక్యవాదులేని హరీశ్‌రావు మండిపడ్డారు. పొన్నాల, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పులిచింతలను దగ్గరుండి కట్టి తెలంగాణకు తెగని అన్యాయం చేశారన్నారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలించుకుపోయిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని ఆరోపించారు. తెలంగాణలో అధికారంలోకి రాకపోతే.. తిరిగి ఆంధ్రలో కలిపేస్తామన్న బలరాం నాయక్‌ది ఏ పార్టీ అని ప్రశ్నించారు. ఆయన ప్రసంగం విని బుద్ధి చెప్పాల్సిన పెద్దలు జానారెడ్డి, ఉత్తమ్, జీవన్‌రెడ్డిలు ఎలా చప్పట్లు కొడతారని వాపోయారు. తెలంగాణ ఇచ్చి తప్పు చేశామని జానారెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. జైపాల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, భట్టివిక్రమార్క అంతా సమైక్యపాట పాడినవాళ్లేనని వార్తా క్లిప్పింగులతో సహా ప్రస్తావించారు.
7తర్వాత సమైక్యవాదం..
అధికారం కోసం ఘోరంగా దిగజారిన కాంగ్రెస్ నేతలంతా బాబు ట్రాప్‌లో పడిపోయారని ఆరోపించారు. తెలంగాణను ఆగం చేయాలన్న లక్ష్యం గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్న చంద్రబాబు దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. డిసెంబర్ 7 తర్వాత ఆంధ్రలో సమైక్యవాదం సెంటిమెంటు రగిలించి ఏపీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం బాబు చేపడతాడని ఆరోపించారు. ప్రజలు ఆలోచించి, కుట్రలను పసిగట్టి కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధి చెప్పి ఓడించాలని పిలుపునిచ్చారు.
బాబు ఫొటోలు ఎందుకు తీసేస్తున్నారు?
చంద్రబాబుతో చేతులు కలిపిన కూటమి కూకట్‌పల్లి, ఖమ్మంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసిందన్నారు. ప్రకటనల్లోనూ ఆంధ్రులు ఉన్న చోట మాత్రమే బాబు ఫొటో వచ్చేలా జాగ్రత్తలు పడుతున్న వారి కష్టాన్ని చూస్తుంటే జాలేస్తోందని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలెవరూ ఎందుకు చంద్రబాబు ఫొటో పెట్టట్లేదని, పచ్చ కండువాలు ఎందుకు కప్పుకోవట్లేదని ప్రశ్నించారు.
కోర్టు తీర్పు చెంపపెట్టు..
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేయడాన్ని హరీశ్‌రావు స్వాగతించారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు మనుగడ ఉండదన్న స్వార్థ బుద్ధితో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులపై తప్పుడు కేసులు వేశారని ఆరోపించారు. మొన్నటిదాకా వారితోనే కలసి నడిచిన రచనారెడ్డే వారి కుట్రలను బయటపెట్డడమే ఇందుకు నిదర్శనమన్నారు. పాలమూరు కాంగ్రెస్ నేతలైన నాగం జనార్దన్‌రెడ్డి అవినీతి పేరిట, వన్యప్రాణులకు హాని అని హర్షవర్ధన్‌రెడ్డిలు వేసిన కేసులు వీగిపోయాయన్నారు. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు నాగంకు కోర్టు రెండుసార్లు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. దీంతో నిన్నటి దాకా ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నీ డొల్ల అని తేలిపోయిందన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, అవినీతి జరిగిందని ఆరోపించిన రాహుల్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గోబెల్స్ బాబు పాలమూరుకు వ్యతిరేకంగా కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్ మైనార్టీ నేతలు మంత్రి హరీశ్, మున్సిపల్ చైర్మన్ గొర్రె భాస్కర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment