హబ్సిగూడ రోడ్‌షోలో అభివాదం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చిత్రంలో దేవేందర్‌గౌడ్, గులాం నబీ ఆజాద్, అభ్యర్థి వీరేందర్‌గౌడ్
హైదరాబాద్: తెలుగుజాతి కలయికకు కేసీఆర్ అడ్డంకిగా మారారని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివా రం ఎల్బీ నగర్, మలక్‌పేట, ఉప్పల్ నియోజకవర్గాల్లో జరిగిన రోడ్‌షోల్లో ఆయన మాట్లాడుతూ ముందస్తు ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో కేసీఆర్‌కు నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. దేశాన్ని నరేంద్ర మోదీ, తెలంగాణను కేసీఆర్ భ్రష్టు పట్టించారని విమర్శించారు. పెద్ద మోదీ, చిన్న మోదీ(కేసీఆర్) కుమ్మక్కయి డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను సీఎంగా రాష్ట్రాలు, దేశాలు తిరిగి అందరిని మెప్పించి హైదరాబాద్‌ను దేశానికే మణిహారంలా తీర్చిదిద్దానన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో చేసిన పని ఒక్కటీ లేదన్నారు.
మా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారు..
‘గత ఎన్నికల్లో గ్రేటర్‌లో 15 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే పదవుల కోసం 10 మంది ఎమ్మెల్యేలు మూటగట్టుకుని అమ్ముడు పోయారు. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు చరిత్ర హీనులుగా మిగిలి పోతారు’ అని చంద్రబాబు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రజాకూటమికే పట్టం కట్టనున్నారని బాబు జోస్యం చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజాకూటమి అభ్యర్థి వీరేందర్‌గౌడ్‌కు మద్దతుగా హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, హెచ్‌బీ కాలనీలో రోడ్‌షోల్లో ప్రజాగాయకుడు గద్దర్, మాజీ రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్‌తో కలసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో గతి తప్పిన పాలనను గాడిలో పెట్టే నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవడానికి తాను ఇక్కడకు వచ్చానని పేర్కొన్నారు. గోద్రా అల్లర్లు చోటుచేసుకున్న సమయంలో మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొదటి వ్యక్తిని తానేనని బాబు తెలిపారు.
నన్ను తిడితే వారికే నష్టం..
అభివృద్ధిని అడ్డుకుంటున్నానని కేసీఆర్ తనను విమర్శిస్తున్నారని, అయితే ఏ విషయంలో అడ్డుకున్నానో చెప్పాలని చంద్ర బాబు ప్రశ్నించారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావటం లేదని, తనను తిడితే వారికే నష్టం కలుగుతుందన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 37 ఏళ్లు ఒకరిపై ఒకరు పోరాడుకున్నామని, ఇప్పుడు దేశం కోసం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం కలసి పనిచేస్తున్నామని తెలిపారు. మలక్‌పేట రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో బ్యాంకుల్లో, ఏటీఎంలో డబ్బుల్లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కేసీఆర్, కేటీఆర్ తనను తిట్టే పరిస్థితికి వచ్చారని, మోదీకే భయపడని తాను కేసీఆర్‌కు భయపడతానా అని అన్నారు. ఫౌంహౌస్ నుంచి పరిపాలన చేస్తున్న కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ఫాంహౌస్‌కే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పెత్తనం కోసం కాదని.. కేవలం సేవ చేయడానికే వచ్చానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment