గురువారం గజ్వేల్‌లో నిర్వహించిన కురుమల ఆత్మీయ సభలో డోలు వాయిస్తున్న హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: ‘ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత సిద్ధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ప్రజలకు దూరమై పదవీ కాంక్షతో కాంగ్రెస్ నాయకులు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణలో అడ్రస్ గల్లంతైన చంద్రబాబు అదను కోసం వేచి చూసి కుట్రతో కూటమితో కలిశారు. ఆ కూటమికి ఓటేస్తే సంక్షోభమే. అందుకే ఈ ఎన్నికలు అభివృద్ధికి.. అవకాశవాదానికి మధ్య జరిగే పోరాటం’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
గురువారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవపూర్ మండలం కిష్టాపురం, బయ్యారం, వర్గల్ మండలంలోని నెంటూరు గ్రామాల్లో పర్యటించారు. అనంతరం కురుమ ఆశీర్వాద సభలో హరీశ్‌రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలను తీర్చేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. బోర్లు వేసి రైతులు అప్పులపాలయ్యారని, సిద్దిపేటతోపాటు తెలంగాణలోని చాలా ప్రాంతాలు తాగునీటి కోసం తండ్లాయని అన్నారు.
తాగునీరు, సాగునీటి కష్టాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి జలాలను తరలించేందకు భగీరథ ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రజలు కష్టాల గురించి ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ నాయకులు.. ఎన్నికల పేరుతో గ్రామాల్లోకి వచ్చి ప్రజల పట్ల కపట ప్రేమ చూపుతున్నారన్నారు. ప్రజలు దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని, గత పాలకుల అభివృద్ధిని నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని బేరీజు వేసుకుని సరైన తీర్పు ఇవ్వాలని కోరారు.
తెలంగాణలో పెత్తనం కోసం బాబు కుట్ర
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన తెలంగాణ ద్రోహి చంద్రబాబు అని హరీశ్‌రావు విమర్శించారు. కూటమిలో చేరిన చంద్రబాబు తెలంగాణను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తు అపవిత్రమైందని, వారికి ఓటేస్తే రాష్ట్రా న్ని అమరావతికి, ఢిల్లీకి తాకట్టు పెట్టాల్సిన దుస్థితి వస్తుందన్నారు. పూటకోపార్టీ మారి కండువాలు కప్పుకునేవారి మాటలు నమ్మొద్దని ప్రజల కష్టాలను తీర్చేందుకు కృషిచేసిన వారిని గెలిపించాలని కోరా రు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎద్దె మల్లేశం, పార్టీ నేతలు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ కడుపు సల్లగుండ: నర్సవ్వ
కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్‌పూర్ మండలం కిష్టాపూర్‌లో ప్రజలు పడిన కష్టాల గురించి హరీశ్ నర్సవ్వ అనే స్థానికురాలితో మాట్లాడారు. ఆమె చెప్పిన మాటల్ని హరీశ్ సిద్దిపేటలో సభలో వివరించారు. ఎండాకాలం వస్తే నీళ్ల కోసం కోసుల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, బిందెలు మోసీ మోసీ గూడలన్నీ కాయలు కాసేవని నర్సవ్వ చెప్పినట్లు హరీశ్ తెలిపారు. ‘కేసీఆర్ కడుపు సల్లగుండ’ ఆయన వచ్చిన తర్వాత ఇంటి వద్ద నల్లా విప్పితే నీళ్లు వస్తున్నాయని ఆమె చెబుతుంటే సంతోషం అనిపించిందని హరీశ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment