సాక్షి, హైదరాబాద్: మహాకూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కుదిరింది. కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు పోటీ చేయాల్సిన స్థానాల సంఖ్యపై అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీడీపీకి 15, టీజేఎస్‌కు 6, సీపీఐకి 3 స్థానాలు కేటాయించనున్నారు. మిగిలిన 95 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. ఈ సంఖ్య దాదాపు ఖరారయిందని, ఇందులో స్వల్పంగా తేడా వచ్చే అవకాశాలు తప్ప పెద్దగా మార్పులు లేవని కూటమి కూర్పులో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్య నేత ఒకరు తెలిపారు. అయితే, సంఖ్య విషయంలో సర్దుబాటు కుదిరినా ఏ స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే దానిపై మాత్రం కొంత గందరగోళమే నెలకొంది. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోకపోయినా కొన్నింటిపై మాత్రం స్పష్టత వచ్చింది. మరికొన్ని స్థానాలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశముంది.
కోదండకు బుజ్జగింపు...
కాగా, కూటమిలో కుదురుకునే విషయంలో మొదటి నుంచీ టీజేఎస్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ పార్టీ ప్రతిపాదిస్తున్న స్థానాలకు, కాంగ్రెస్ సానుకూలంగా ఉన్న స్థానాలకు చాలా తేడా ఉండటంతో కసరత్తు బాగానే జరిగింది. అయితే, స్థానాల సంఖ్య కన్నా గెలుపే ప్రధానమనే కోణంలోనే కూటమి చర్చలు జరగడం, ప్రొఫెసర్ కోదండరాం కూడా తొలుత గట్టిగానే పట్టుబట్టినా ఆ తర్వాత కొంత మెత్తబడటంతో సయోధ్య కుదిరింది. అయితే, కేవలం 6 కాకుండా కనీసం 8 స్థానాలు కేటాయించాలని ఇప్పటికీ టీజేఎస్ అడుగుతోంది. ఈ అంశంపైనే కోదండను బుజ్జగించేందుకు ఢిల్లీ పిలిపించారని, 5–6 స్థానాలతో టీజేఎస్‌ను సరిపెడతారని తెలుస్తోంది. దీనిపై చర్చించేందుకు కోదండరాం గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకోనున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాహుల్‌తో సమావేశం
అవుతారని తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం కూటమి భాగస్వామ్య పక్షాలకు కేటాయించే అవకాశమున్న స్థానాలు:
టీడీపీ: ఉప్పల్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, చార్మినార్, మలక్‌పేట, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, నిజామాబాద్ రూరల్, మక్తల్, మహబూబ్‌నగర్, అంబర్‌పేటతో పాటు వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో స్థానం. మరో స్థానం గురువారం ఖరారు కానుంది.
టీజేఎస్: రామగుండం, వరంగల్ తూర్పు, మల్కాజ్‌గిరి, దుబ్బాక, ముధోల్, చాంద్రాయణగుట్ట, కార్వాన్ (వీటిలో 5–6 స్థానాలు టీజేఎస్‌కు ఇవ్వనున్నారు.)
సీపీఐ: బెల్లంపల్లి, వైరా (గురువారం మరో స్థానం ఖరారవుతుంది.)
Comments
Please login to add a commentAdd a comment