సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం కానుంది. తొలుత ఈ రోజు (గురువారం) లేదా రేపు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుందనే వార్తలు వచ్చినప్పటికీ.. అది సాధ్యపడలేదని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులందరి జాబితాను ఈ నెల 8 లేదా 9వ తేదీన ఒకే సారి ప్రకటించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికి గురువారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. మిగతా స్థానాల నంచి మిత్రపక్షాలు బరిలో నిలవనున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పోటీ చేయనున్న 95 స్థానాల్లో నేడు 57 స్థానాల అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయాలన్న అవగాహన కుదిరిందని తెలిపారు. మిగిలిన స్థానాల్లో టీజేఎస్, సీపీఐ పార్టీల అభ్యర్థుల నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. కాగా, బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియాలు మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment