సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రజాకూటమి పొత్తులపై చర్చలతో హస్తిన వేడెక్కింది. దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా ఢిల్లీ బాట పట్టింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బుధవారం ఉదయమే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై పొత్తులపై నివేదించారు. బుధవారం సాయంత్రానికి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. వీరంతా కలిసి ఏఐసీసీ కోర్ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీతో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన రాహుల్‌తో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ కానున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో ఉత్తమ్ ఇప్పటికే ఓసారి సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూలును ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీయేతర, భావసారూప్య పార్టీలను ఏకం చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తమ్మీద చర్చోపచర్చలు అన్నీ ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయానికి పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, మాజీ మంత్రి వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. రాహుల్ సమక్షంలో ఆయన గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది.
నేడు సోనియాతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ
కాంగ్రెస్ అభ్యర్థిత్వాల వడపోత అనంతరం భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ తొలి విడత జాబితా రూపొందించి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది. దీనిపై చర్చించేందుకు కేం ద్ర ఎన్నికల కమిటీ గురువారం యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీతో సమావేశం కానుంది. పార్టీ సీని యర్ నేతలు అహ్మద్ పటేల్, ముకుల్ వాస్నిక్, ఏకే ఆంటోని, అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్ తదితరులు హాజరయ్యే ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతి యా కూడా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపా యి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించాయి.
పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారుచేసిన తర్వాత దానిని ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడికి పంపిస్తారు. టీఆర్‌ఎస్ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించి రెండు నెలలవడం, ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుండటం వంటి అంశా ల నేపథ్యంలో ప్రజా కూటమి అభ్యర్థుల మొత్తం జాబితా 119 స్థానాలకు ఒకేసారి వెలువడే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. దీపావళిలోపే 119 స్థానాలకు టికెట్లు ఖరారు చేస్తే ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజస్తాన్ అభ్యర్థుల జాబితాపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ సోనియాగాంధీతో సమావేశమై చర్చించింది.
పొత్తుల ప్రకటన తర్వాతే జాబితా..
పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడ్డాకే కాంగ్రెస్ జాబితా వెలువడితే రాజకీయ సానుకూలత ఉంటుందని, కాంగ్రెస్ జాబితా వెలువడ్డాక మిత్రపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తితే కూటమిలోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రజాకూటమి అభ్యర్థుల జాబితాను ఉమ్మడిగా ప్రకటిస్తే మూడు పార్టీల శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతుందని వివరించాయి. పొత్తులు, అభ్యర్థిత్వాల జాబితా తదితర అంశాలపై కాంగ్రెస్ అత్యంత గోప్యత పాటిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాల జాబితాను ప్రేరేపించేలా, కాంగ్రెస్‌లో టికెట్ల ఆశావహులకు వల విసిరేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment