rc kunthia
-
‘స్థానిక’ టికెట్లకు..‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’ విధానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణ యం తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికల్లో ‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’అనే విధానాన్ని మళ్లీ తీసుకువచ్చే యోచన చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) పనిచేసిన సమయంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనుసరించిన ఈ విధానా న్ని మళ్లీ అమలుచేయాలని భావిస్తోంది. స్థానిక టికె ట్లు గాంధీభవన్ నుంచి కాకుండా క్షేత్రస్థాయి నుంచే ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం జరిగే సమావేశంలో వీటి విధివిధానాలు రూపొందించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పోలింగ్ సరళిని సమీక్షించడంతో పాటు స్థానిక ఎన్నికల వ్యూహ రచన కోసం అందుబాటులో ఉన్న నేతలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జెట్టి కుసుమకుమార్, మహ్మద్ అజారుద్దీన్, టీపీసీసీ ముఖ్య నేతలు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య , చిన్నారెడ్డి, వంశీ చందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికలు జరిగిన తీరుపై నేతలు సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు గాను 10 చోట్ల పార్టీ అభ్యర్థులు టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చారని, కచ్చితంగా ఆరింట విజయం సాధిస్తామనే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా మల్కాజ్గిరి, చేవెళ్ల, నల్లగొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాకు వచ్చారు. పాత పద్ధతికి పోదామా..? ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించిన టీపీసీసీ ముఖ్య నేతలు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మం డల కాంగ్రెస్ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జులకు అప్పగించాలని నిర్ణయించారు.ఎమ్మెస్సార్ పీసీ సీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘సెలెక్ట్ అండ్ ఎలక్ట్’ పేరుతో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నుంచే ముం దుగా ప్రతిపాదనలు తెప్పించుకుని, ఆయా పేర్లపై చర్చించి చాలా తక్కువ స్థానాల్లోనే మార్పులు చేశారనే అంశం చర్చకు వచ్చింది. దీనిపై నేతలు కూడా సానుకూలతను వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో సమావేశాలు జరిపి, అక్కడి నుంచే మండల అధ్యక్షుల నుంచి అభ్యర్థుల ప్రతిపాదనలు తెప్పించుకో వాలని స్థూలంగా నిర్ణయించారు. అయితే, దీనిపై మరోసారి భేటీ అవుదామని, వచ్చే వారంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈనెల 15లోగా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా మండలాల్లో సమావేశాలు జరిపి అభ్యర్థుల ముసాయిదా జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాపరిషత్ చైర్మన్ల ఎంపిక మాత్రమే టీపీసీసీ స్థాయిలో చేయాలని, పార్టీ మండలాధ్యక్షులు, నియోజకవర్గాల బాధ్యులు లేని చోట్ల ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోండి: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో త్వరలోనే రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కేడర్ కష్టపడిందని, ఎన్నికల్లో పనిచేసిన నేతలు, పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం కోసం క్షేత్రస్థాయి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. కాగా, లోక్‌సభ ఎన్నికల ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద తమ పార్టీ కేడర్, వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ శుక్రవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రెండు, మూడు అంచెల్లో తమ కేడర్‌తో భద్రత ఏర్పాటు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఈ లేఖలో ఆయన కోరారు. -
10 స్థానాల్లో విజయం మాదే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందన్నారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా వ్యవహరించిందని, ప్రగతిభవన్‌ను పార్టీ కార్యకలాపాలకు వినియోగించినా, ఎన్నికల సమయంలో కేసీఆర్ బయోపిక్ రిలీజ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నా, 12 ఈవీఎం యూనిట్లు పెట్టడంతో ఓటు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం ఎన్నికల కమిషన్ వైఫల్యమేనని చెప్పిన కుంతియా.. కచ్చితంగా తమ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపారు. -
కాంగ్రెస్ మేనిఫెస్టో అత్యద్భుతం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగం గా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అత్యద్భుతమని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా కొనియాడారు. ప్రపంచంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి మేనిఫెస్టోను ప్రకటించలేదని, ఈ మేనిఫెస్టో ద్వారా దేశంలోని పేదల సమస్యలపై రాహుల్ గాంధీ యుద్ధం ప్రకటించారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి వివరించారు. ఈ మేనిఫెస్టో ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే దేశంలో ఖాళీ గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, కొత్త ఉద్యోగాల కల్పనతోపాటు యువతకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు చట్టసభలో 33 శాతం రిజర్వేషన్లు, జీఎస్టీలో ఏకరూపత లాం టి సంస్కరణలకు కాంగ్రెస్ మేనిఫెస్టో ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. కనీస ఆదాయ హామీ పథకంతో 2024 నాటికి దేశంలో పేదరికం అంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తా మో చెప్పకుండా దేశభద్రత లాంటి సున్నితమై న అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పేదరికం, రైతు సమస్యలపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చామని, 16 మందిని గెలిపించాలని టీఆర్ఎస్ కోరుతోందని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు గెలిపించాలని ప్రజలను కోరే హక్కు ఒక్క కాంగ్రెస్‌కి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, సలీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తాం: కుంతియా
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన కనీస ఆదాయ హామీ పథకం దేశంలోని పేదరిక స్థాయిలో సమూల మార్పు తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనే దేశానికి శ్రీరామరక్ష అన్నారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. కేసీఆర్‌కు జాతకాల పిచ్చి అని మోదీ, సర్జికల్ స్ట్రైక్స్ బూటకమంటూ కేసీఆర్‌లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటివరకు అన్ని విషయాల్లో బీజేపీకి మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు విమర్శిస్తోందని ఆయన ప్రశ్నించారు. -
నాలుగు రోజుల్లో జిల్లా కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే నియమితులైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాలుగు రోజుల్లో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా ఆయా జిల్లాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో నూతన డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, ఎమ్యెల్యేలు ఆత్రం సక్కు, రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతియా మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని కోరారు. ఈనెల 15లోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, 21 మంది కంటే ఎక్కువ సభ్యులను కమిటీల్లో నియమించకూడదని చెప్పారు. బ్లాక్, మండల, బూత్ లెవల్ కమిటీలనూ వెంటనే ఏర్పాటు చేసుకోవాలని, బూత్ ఏజెంట్ల నియామకం కూడా ఇప్పుడు చేయాలని సూచించారు. అలాగే కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం కార్యాచరణ రూపొందించుకోవాలని, పార్టీ కార్యకలాపాలన్నీ కార్యాలయం వేదికగానే జరగాలని, క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షులకు అవకాశం ఉండదని సంకేతాలిచ్చారు. కాగా, ఈ భేటీకి భరత్ చందర్‌రెడ్డి (మహబూబాబాద్), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), ఈర్ల కొమురయ్య (పెద్దపల్లి) హాజరుకాలేదు. -
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యం కానుంది. తొలుత ఈ రోజు (గురువారం) లేదా రేపు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుందనే వార్తలు వచ్చినప్పటికీ.. అది సాధ్యపడలేదని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థులందరి జాబితాను ఈ నెల 8 లేదా 9వ తేదీన ఒకే సారి ప్రకటించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై చర్చించడానికి గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం కుంతియా మాట్లాడుతూ.. తెలంగాణలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 95 స్థానాల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. మిగతా స్థానాల నంచి మిత్రపక్షాలు బరిలో నిలవనున్నట్టు ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పోటీ చేయనున్న 95 స్థానాల్లో నేడు 57 స్థానాల అభ్యర్థులపై స్పష్టత వచ్చిందని పేర్కొన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ 95 స్థానాల్లో, టీడీపీ 14 స్థానాల్లో పోటీ చేయాలన్న అవగాహన కుదిరిందని తెలిపారు. మిగిలిన స్థానాల్లో టీజేఎస్, సీపీఐ పార్టీల అభ్యర్థుల నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. కాగా, బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుంతియాలు మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చించిన సంగతి తెలిసిందే. -
హడావుడంతా హస్తినలోనే..
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రజాకూటమి పొత్తులపై చర్చలతో హస్తిన వేడెక్కింది. దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అంతా ఢిల్లీ బాట పట్టింది. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో బుధవారం ఉదయమే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమై పొత్తులపై నివేదించారు. బుధవారం సాయంత్రానికి రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీతోపాటు ప్రచార కమిటీ చైర్మన్ మల్లుభట్టి విక్రమార్క కూడా హస్తిన చేరుకున్నారు. వీరంతా కలిసి ఏఐసీసీ కోర్ కమిటీ చైర్మన్ ఏకే ఆంటోనీతో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో మార్పులు, చేర్పులపై చర్చించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన రాహుల్‌తో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు భేటీ కానున్నట్లు తెలిసింది. చంద్రబాబుతో ఉత్తమ్ ఇప్పటికే ఓసారి సమావేశమై పొత్తులపై చర్చించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన షెడ్యూలును ఏపీ ప్రభుత్వం విడుదల చేయలేదు. అయితే ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీయేతర, భావసారూప్య పార్టీలను ఏకం చేసేందుకు ఢిల్లీ వెళ్తున్నారంటూ ఏపీ ప్రభుత్వ సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తమ్మీద చర్చోపచర్చలు అన్నీ ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయానికి పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, మాజీ మంత్రి వినోద్ ఢిల్లీలోనే ఉన్నారు. రాహుల్ సమక్షంలో ఆయన గురువారం కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. నేడు సోనియాతో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ కాంగ్రెస్ అభ్యర్థిత్వాల వడపోత అనంతరం భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ తొలి విడత జాబితా రూపొందించి కేంద్ర ఎన్నికల కమిటీకి సమర్పించింది. దీనిపై చర్చించేందుకు కేం ద్ర ఎన్నికల కమిటీ గురువారం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీతో సమావేశం కానుంది. పార్టీ సీని యర్ నేతలు అహ్మద్ పటేల్, ముకుల్ వాస్నిక్, ఏకే ఆంటోని, అశోక్ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్ తదితరులు హాజరయ్యే ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతి యా కూడా పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపా యి. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించాయి. పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను ఈ సమావేశంలో ఖరారుచేసిన తర్వాత దానిని ఆమోదం కోసం పార్టీ అధ్యక్షుడికి పంపిస్తారు. టీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించి రెండు నెలలవడం, ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముందుండటం వంటి అంశా ల నేపథ్యంలో ప్రజా కూటమి అభ్యర్థుల మొత్తం జాబితా 119 స్థానాలకు ఒకేసారి వెలువడే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. దీపావళిలోపే 119 స్థానాలకు టికెట్లు ఖరారు చేస్తే ప్రచారంపై దృష్టి పెట్టొచ్చని కూటమి నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజస్తాన్ అభ్యర్థుల జాబితాపై బుధవారం కేంద్ర ఎన్నికల కమిటీ సోనియాగాంధీతో సమావేశమై చర్చించింది. పొత్తుల ప్రకటన తర్వాతే జాబితా.. పొత్తుల ఖరారుపై అధికారిక ప్రకటన వెలువడ్డాకే కాంగ్రెస్ జాబితా వెలువడితే రాజకీయ సానుకూలత ఉంటుందని, కాంగ్రెస్ జాబితా వెలువడ్డాక మిత్రపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తితే కూటమిలోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. ప్రజాకూటమి అభ్యర్థుల జాబితాను ఉమ్మడిగా ప్రకటిస్తే మూడు పార్టీల శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతుందని వివరించాయి. పొత్తులు, అభ్యర్థిత్వాల జాబితా తదితర అంశాలపై కాంగ్రెస్ అత్యంత గోప్యత పాటిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వాల జాబితాను ప్రేరేపించేలా, కాంగ్రెస్‌లో టికెట్ల ఆశావహులకు వల విసిరేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందన్న ఆందోళన ఆ పార్టీలో నెలకొంది. -
20లోపు కాంగ్రెస్ తొలి జాబితా సిద్ధం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ తొలి జాబితాను ఈ నెల 20లోపు ప్రకటించనున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పష్టం చేశారు. ఈ నెల 16,17 తేదీల్లో మరోసారి ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమవుతుందని వెల్లడించారు. శనివారం ఇక్కడ గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థిత్వాల ఖారరుకు కొన్ని మార్గదర్శకాలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన ఆశావహుల జాబితాను కమిటీ సభ్యులందరికీ అందించారు. అయితే, ఈ జాబితాలో ఇతర పార్టీల నేతల పేర్లు సైతం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ముగ్గురు పేర్లతో జాబితా సిద్ధం చేసి సెంట్రల్ కమిటీకి పంపించేందుకు మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. గెలిచేవాళ్లు, పార్టీ విధేయులు, జనాల్లో పాపులారిటీ ఉన్న నేతలకే టికెట్లు ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. కుటుంబానికి ఒక్క టికెట్ చొప్పున పరిశీలన ఉంటుందని, మినహాయింపు విషయంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీదే తుది నిర్ణయమని కమిటీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా పార్టీలో కోహినూర్ వజ్రాల కంటే అమెరికా డైమండ్ల హడావుడి ఎక్కువైందని కొంతమంది నేతలు మాట్లాడటం మిగతా నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలు ఎవరు ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై నేతలు బయటకు చెప్పడంలేదు. మరోవైపు ఎన్నికల కమిటీ సమావేశంపై తమకు సమాచారం లేకపోవడంతో సీనియర్ నేతలు సర్వే సత్యనారాయణ, గీతారెడ్డి అలక బూనినట్టు తెలుస్తోంది. కొంచెం సమాచారంలోపం ఏర్పడిందని, ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని, ఈ సమయంలో యూనిటీగా ఉండాలని భట్టి విక్రమార్క వారికి సర్ది చెప్పినట్టు తెలిసింది. టికెట్ల కేటాయింపులో అనుబంధ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించేలా చూడాలని నిర్ణయించారు. ముందుగా అభ్యర్థిత్వాల పోటీ లేని స్థానాలు... తొలిజాబితా వ్యవహారం వేగవంతం చేయాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. నియోజకవర్గాల్లో çటెకెట్ కోసం పోటీలేని స్థానాల అభ్యర్థులను ముందుగా ప్రకటించాలని నేతలు నిర్ణయించారు. ఈ పేర్ల జాబితాను త్వరలో సెంట్రల్ ఎన్నికల కమిటీకి పంపించి ఆమోదముద్ర వేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. మిగిలిన స్థానాల్లో ముగ్గురు పేర్ల చొప్పున స్క్రీనింగ్ కమిటీకి పంపించి ఆ తర్వాత సెంట్రల్ ఎన్నికల కమిటీకి చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి రానుందని, ఇంతలోపు షార్ట్ లిస్టు రూపొందించుకోవాలని, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచించిన పేర్లను ఏఐసీసీ సెంట్రల్ కమిటీకి చేర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి ముందు మాసబ్‌ట్యాంక్‌లోని గోల్కొండ హోటల్లో కోర్ కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల జాబితా, ప్రచార వ్యవహారాలు, ప్రచారం షెడ్యూల్ విడుదలపై కమిటీ చర్చించింది. కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఊకే అబ్బయ్య శనివారం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో సీపీఐలో ఉండగా ఇల్లెందు నుంచి, టీడీపీలో బూర్గూపహాడ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అందని కూటమి పార్టీల జాబితా మహాకూటమిగా ఏర్పాటవుతున్న తరుణంలో ఇప్పటి వరకు సీపీఐ నుంచి మాత్రమే అభ్యర్థుల జాబితా వచ్చిందని, టీడీపీ, జన సమితి, ఇతర పార్టీల నుంచి జాబితాలు రాలేదని కమిటీ దృష్టికి నేతలు తీసుకువచ్చారు. త్వరలోనే కూటమి పార్టీలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి స్థానాలు, జాబితాపై తుది కసరత్తు చేయాలని కమిటీ నిర్ణయించింది. సమావేశంలో కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, భట్టి, సీనియర్ నేతలు జానా, రేవంత్, పొన్నం, సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసకృష్ణన్, సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, పొన్నాల, పి.వినయ్‌కుమార్, వీహెచ్, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డీకే అరుణ, మర్రి శశిధర్‌రెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, కోదండరెడ్డి, నేరెళ్ల శారద, సీతక్క, సుదర్శన్‌రెడ్డి, మల్లు రవి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కటకం మృత్యుంజయం, సంభాని చంద్రశేఖర్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
కష్టపడితే విజయం కాంగ్రెస్‌దే
సాక్షి,సిటీబ్యూరో: కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే ఎన్నికల్లో విజయం తథ్యమని కాంగ్రెస్ వ్యవహారా ఇంచార్జి ఆర్సీ కుంతియా అన్నారు. హైదరాబాద్ నగరంలో అత్యధిక స్ధానాల్లో విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. బీజేపీ– ఎంఐఎం లక్ష్యం ఒక్కటేనని, మతతత్వమే వారి ప్రధాన ఎజెండా ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లోని ఇందిరా భవన్లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ ఇటూ మజ్లిస్‌తో దోస్తీ కట్టి అటూ బీజేపీతో టచ్‌లో ఉందని ఆరోపించారు. నరేంద్ర మోదీ డైరెక్షన్ తోనే ముందస్తు ఎన్నికలని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ కట్టడం ఖాయమన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసే బీజేపీకి వేసినట్లే అన్నారు. వీధి పోరాటాలకు సిద్దం మోసాల టీఆర్ఎస్ను తరిమి కొట్టేందుకు ప్రజా స్వామ పద్ధతిలో వీధి పోరాటాలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గాంధీభవన్ చుట్టు తిరగవద్దని, సమయం తక్కువగా ఉంది..నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టి కేసీఆర్ హటావో – తెలంగాణ బచావో అనే నినాదంలో విస్తృతంగా టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. కేసీఆర్ బట్టేబాజ్ నెంబర్‌వన్ అని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్ అభివర్ణించారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అబీద్ రసూల్ ఖాన్, నిరంజన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పాదయాత్ర నగరంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార పర్వాన్ని శనివారం ఉదయం 8.30 గంటలకు మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి సెక్రటరి కుంతియా, ఇన్చార్జి సెక్రటరి ఎన్.ఎస్.బోస్‌రాజు, టీపీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పూజలుచేసి ప్రారంభిస్తారని నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్‌లు తెలిపారు. పూజల అనంతరం ఖైరతాబాద్ డివిజన్లోని బిజెఆర్‌నగర్, మహాభారత్‌నగర్, మారుతీనగర్ తదితర బస్తీలలో పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. -
నేను మీ పప్పులా కాదు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలతో తెలంగాణలో రాజకీయం వేడేక్కింది. నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కౌంటర్స్ ఇవ్వడం మొదలైంది. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. ’నేను అమెరికాలో ఉన్నప్పుడు నా పనులు సొంతంగా చేసుకున్నాను. మీ పప్పులా కాకుండా సొంతంగా సంపాదించుకున్నాను. అందుకు నేను గర్వపడుతున్నాను. నీలాగా ప్రజల సొమ్ముదోచుకుని కారులో తగలబెట్టలేదు.’ అని ఉత్తమ్‌కు కేటీఆర్ చురకలింటించారు. 2014 ఎన్నికల్లో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన కారులో రూ.2 కోట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. అమెరికాలో కేటీఆర్ అంట్లూ తోమాడని ఉత్తమ్, రేవంత్ రెడ్డిలు ఎద్దేవా చేస్తూ కేటీఆర్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. Dear @UttamTPCC Garu, I may have washed dishes in my home in the US (which by the way is what every Indian in US does in their own homes) I am proud that I’ve worked & earned a decent living on my own unlike your Pappu Unlike you I didn’t loot people’s money & burn it in my car pic.twitter.com/VXrMeESfCg — KTR (@KTRTRS) September 8, 2018 ఈ నేపథ్యంలో వారి అధినేత రాహుల్ గాంధీని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అలాగే ఆపిల్ కంపెనీ వ్యవహారంలో ఏఐసీసీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా చేసిన వ్యాఖ్యలను మరో ట్వీట్లో కేటీఆర్ తిప్పికొట్టారు.‘ ఏఐసీసీ జెంటిల్మెన్.. స్కాంగ్రెస్ జోకర్ ఆజ్ఞానంతో మాట్లాడుతున్నారు. 2016లోనే ఆపిల్ కంపెనీ హైదరాబాద్‌లో తన వ్యవహారాలను ప్రారంభించింది. ప్రస్తుతం 3500 మందికి పైగా ఉద్యోగులతో అమెరికా తర్వాత అతిపెద్ద సెంటర్‌గా నిలిచింది’ అని ట్వీట్ పేర్కొన్నారు. This Gentleman who’s the AICC (aka Delhi Sultanate) incharge says something that only a Scamgress joker can say; Ignorance is bliss FYI to all, Apple started operations in Hyderabad in August, 2016 & currently employs 3,500 plus people which is their largest centre outside of US pic.twitter.com/w1AzjZDsMl — KTR (@KTRTRS) September 8, 2018 చదవండి: మరిన్ని ముందస్తు ముచ్చట్లు -
పొత్తు పెట్టుకోకూడదని ఉందా?
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా ‘‘ఆ పార్టీకి కొన్ని చోట్ల ఓటు బ్యాంకు ఉంది. అయినా ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని ఉందా? అలా పెట్టుకుంటే నేరం అవుతుందా?’’అని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పొత్తుల పరిస్థితి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని, ఉత్తర తెలంగాణలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. అక్కడ బస్సుయాత్రకు వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌పై తమకు ప్రత్యేక వ్యూహం ఉందంటూ.. సెటిలర్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని, వారంతా ఈసారి తమ వైపే ఉంటారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో సీమాంధ్రకు చెందిన కొందరు నేతలకు ఇక్కడ సీట్లు ఇస్తామని చెప్పారు. ఎంఐఎంకు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, ఈసారి ఎంఐఎం పోటీచేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని, ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి గురించి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలుంటాయని తెలిపారు. భట్టి, రేవంత్, పొన్నం తదితర నేతల పాదయాత్రల ఎలా ఉంటాయనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వివరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మాత్రం ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీనే చెప్పారని, టికెట్ కావాలనుకునే డీసీసీ అధ్యక్షులు ఆ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుంది: మల్లు రవి టీడీపీతో పొత్తు విషయంలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లురవి సై అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం. బీసీలకు కాంగ్రెస్‌లోనే న్యాయం: ఉత్తమ్ బీసీలకు కాంగ్రెస్‌లోనే న్యాయం జరుగుతుం దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత అచ్చ విద్యాసాగర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్ఎస్లో ఉద్యమకారులకు కాకుండా బీటీ బ్యాచ్‌కే పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. గొడవలు కట్టడి చేయండి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ సీనియర్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియాకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో మాజీ ఎంపీలు రేణుకాచౌదరి, వి.హనుమంతరావు, సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు దాదాపు గంటపాటు కుంతియాతో సమావేశమై పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకునే విషయంలో చొరవ తీసుకోవాలని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలని వారు కోరారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు. -
12 నుంచి రాష్ట్రంలో కుంతియా పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించ నున్నారు. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రాష్ట్రం లోనే ఉండి అన్ని మండలాల కాంగ్రెస్ కమిటీలతో మండల కేంద్రాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు ఖాయమని, ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, ఈ విషయం ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి, మనుగడ నామమాత్రమేనని, టీఆర్ఎస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పొన్నం నిరాహార దీక్షపై కుంతియా వాకబు పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో చేస్తున్న నిరాహార దీక్షపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి కుంతియా వాకబు చేశారు. సోమవారం ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ కుంతియాను కలిశారు. ఈ సందర్భంగా కుంతియా పొన్నం చేస్తున్న దీక్షపై వాకబు చేశారు. అధిష్టానం నుంచి పొన్నం ప్రభాకర్‌కు పూర్తి మద్దతు ఉంటుందని కుంతియా చెప్పినట్టు పొన్నాల మీడియాకు తెలిపారు. -
సాదాసీదాగా ‘రైతు ఆత్మగౌరవ పాదయాత్ర’
జెండా, టోపీ, కండువాతోనే పాల్గొనాలి : కుంతియా, భట్టి హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ చేపట్టిన ‘రైతు ఆత్మగౌరవ పాదయాత్ర’లో ఆర్భాటాలు చేయకూడదని టీపీసీసీకి సూచనలు అందాయి. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి, నష్టపోయిన రైతాంగానికి భరోసాను ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ రెండురోజుల పర్యటనలో సాధారణ ప్రజానీకంతో మమేకమయ్యే విధంగా ఉండాలని ఆదేశాలు అందాయి. ప్రత్యేక విమానాలు, హెలీకాప్టర్లు కాకుండా రైలు మార్గాలున్న చోట రైలులో, అవి లేకుంటే రోడ్డు మార్గాన పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని, సాధారణ అతిథిగృహాల్లోనే బసకు ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీ కచ్చితంగా సూచించినట్టుగా తెలిసింది. నిర్మల్‌లో పాదయాత్రకు అవకాశం హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో దగ్గరగా ఉండటం, గిరిజనులు ఎక్కువగా ఉండటం, ఆత్మహత్యలతో పాటు పంటనష్టం ఎక్కువగా జరిగిన నర్సాపూర్‌లో రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని తొలుత టీపీసీసీ నిర్ణయానికి వచ్చింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఏర్పాట్లు చేయడానికి మెదక్ జిల్లా నేతలు వెనుకంజ వేశారని తెలిసింది. నిర్మల్‌లో పాదయాత్ర చేస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని, ఆత్మహత్యలతో దెబ్బతిన్న రైతు కుటుంబాలు కూడా నిర్మల్‌లోనే ఎక్కువగా ఉన్నాయని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చినట్టు సమాచారం. దీంతో నిర్మల్‌లోనే పాదయాత్ర ఏర్పాటు చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో జరిగే రైతు ఆత్మగౌరవ పాదయాత్రలో పాల్గొనే ప్రతీ నాయకుడు, కార్యకర్తతో సహా అంతా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకోవాలని, టోపీ, కండువాను ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రాహుల్ టూర్ ఏర్పాట్లపై చర్చించేందుకుగాను గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సింహ్మా రెడ్డి, నేతలు కుసుమకుమార్, సి.జె.శ్రీనివాస్, దామోదర్, హరి రమాదేవి, కుమార్‌రావు, వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.