జెండా, టోపీ, కండువాతోనే
పాల్గొనాలి : కుంతియా, భట్టి
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ చేపట్టిన ‘రైతు ఆత్మగౌరవ పాదయాత్ర’లో ఆర్భాటాలు చేయకూడదని టీపీసీసీకి సూచనలు అందాయి. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించడానికి, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి, నష్టపోయిన రైతాంగానికి భరోసాను ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ రెండురోజుల పర్యటనలో సాధారణ ప్రజానీకంతో మమేకమయ్యే విధంగా ఉండాలని ఆదేశాలు అందాయి. ప్రత్యేక విమానాలు, హెలీకాప్టర్లు కాకుండా రైలు మార్గాలున్న చోట రైలులో, అవి లేకుంటే రోడ్డు మార్గాన పర్యటనకు రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని, సాధారణ అతిథిగృహాల్లోనే బసకు ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీ కచ్చితంగా సూచించినట్టుగా తెలిసింది.
నిర్మల్‌లో పాదయాత్రకు అవకాశం
హైదరాబాద్‌కు రోడ్డుమార్గంలో దగ్గరగా ఉండటం, గిరిజనులు ఎక్కువగా ఉండటం, ఆత్మహత్యలతో పాటు పంటనష్టం ఎక్కువగా జరిగిన నర్సాపూర్‌లో రాహుల్ పర్యటనకు ఏర్పాట్లు చేయాలని తొలుత టీపీసీసీ నిర్ణయానికి వచ్చింది. వివిధ జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఏర్పాట్లు చేయడానికి మెదక్ జిల్లా నేతలు వెనుకంజ వేశారని తెలిసింది. నిర్మల్‌లో పాదయాత్ర చేస్తే తగిన ఏర్పాట్లు చేస్తామని, ఆత్మహత్యలతో దెబ్బతిన్న రైతు కుటుంబాలు కూడా నిర్మల్‌లోనే ఎక్కువగా ఉన్నాయని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముందుకు వచ్చినట్టు సమాచారం.
దీంతో నిర్మల్‌లోనే పాదయాత్ర ఏర్పాటు చేయాలని టీపీసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో జరిగే రైతు ఆత్మగౌరవ పాదయాత్రలో పాల్గొనే ప్రతీ నాయకుడు, కార్యకర్తతో సహా అంతా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకోవాలని, టోపీ, కండువాను ధరించాలని ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క సూచించారు. రాహుల్ టూర్ ఏర్పాట్లపై చర్చించేందుకుగాను గాంధీభవన్‌లో గురువారం టీపీసీసీ ఆఫీసు బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు ఉద్దెమర్రి నర్సింహ్మా రెడ్డి, నేతలు కుసుమకుమార్, సి.జె.శ్రీనివాస్, దామోదర్, హరి రమాదేవి, కుమార్‌రావు, వేణుగోపాల్‌రావు, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
సాదాసీదాగా ‘రైతు ఆత్మగౌరవ పాదయాత్ర’
Published Fri, May 1 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement