సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 10 స్థానాల్లో విజయం సాధిస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపారని చెప్పారు. అయితే, పోలింగ్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో ఎన్నికల కమిషన్ విఫలమయిందన్నారు.
ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా వ్యవహరించిందని, ప్రగతిభవన్‌ను పార్టీ కార్యకలాపాలకు వినియోగించినా, ఎన్నికల సమయంలో కేసీఆర్ బయోపిక్ రిలీజ్ చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. నిజామాబాద్‌లో బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపే అవకాశం ఉన్నా, 12 ఈవీఎం యూనిట్లు పెట్టడంతో ఓటు వేసేందుకు ఓటర్లు ఇబ్బంది పడ్డారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం ఎన్నికల కమిషన్ వైఫల్యమేనని చెప్పిన కుంతియా.. కచ్చితంగా తమ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment