విలేకరులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. చిత్రంలో రేవంత్, భట్టి
ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం..
దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతోంది. విద్వేషం, హింసను ప్రేరేపించడం ద్వారా దేశాన్ని విభజించాలనేది ఒక సిద్ధాంతమైతే.. దేశాన్ని ఐక్యంగా ఉంచాలనేది మరో సిద్ధాంతం. బీజేపీ ప్రేరేపిస్తున్న హింస, విద్వేషాలను భారత సమాజం అంగీకరించదు. బీజేపీ ఆర్థిక విధానాలు, వ్యవస్థలను నిర్వీర్యం చేయడాన్ని మేం అంగీకరించబోం. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన బీజేపీతో పోరాడటం రెండు నిమిషాల్లో అయ్యేది కాదు. ఇందుకోసం భారత్ జోడో యాత్ర ఒక మార్గం.
26 ఏళ్ల వయసులోనే అనుకున్నా... ఇప్పుడు చేస్తున్నా
దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలన్న ఆలోచన ఎవరిదో స్పష్టంగా చెప్పలేను. యాత్ర చేయాలన్న విషయాన్ని సాధారణంగానే పార్టీలో చర్చించుకున్నాం. ఆ సమయంలో కోవిడ్ రావడంతో సాధ్యం కాలేదు. కానీ పాదయాత్ర చేయాలన్నది నా మనస్సులో నిండిపోయింది. పార్టీలోని ఇద్దరు, ముగ్గురు పెద్దలు కూడా ఇదే విషయం చెప్పారు. అంతకన్నా ముందు నాకు 25–26 ఏళ్ల వయసున్నప్పుడే పాదయాత్ర చేయాలనుకున్నా.
అప్పుడు నేను రాజకీయాల్లోనూ లేను. అప్పట్లో సాధ్యం కాలేదు. మనసులో కోరిక ఉండిపోయింది. ఇప్పుడు యాత్ర చేపట్టడం బాగుంది. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లపై రాజకీయ యుద్ధం చేసేందుకు ఇది మంచి మార్గం. కాంగ్రెస్ పార్టీకి కూడా యాత్ర మేలు చేస్తుంది. యాత్ర ద్వారా వ్యక్తిగతంగా చాలా నేర్చుకుంటున్నా. దేశ వాస్తవిక పరిస్థితులను తెలుసుకుంటున్నా.
(భారత్ జోడో యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): టీఆర్‌ఎస్ అవినీతికి, ఆ పార్టీ వైఖరికి కాంగ్రెస్ పూర్తి వ్యతిరేకమని.. టీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఏ విధంగా చూసినా టీఆర్‌ఎస్‌తో కలిసివెళ్లే ప్రశ్నే తలెత్తదని చెప్పారు. తెలంగాణలో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ నేకాదు అంతర్జాతీయ పార్టీ కూడా పెట్టుకోవచ్చని.. అమె రికా, చైనా, ఇతర దేశాల్లో పోటీచేసినా తమకు ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు. ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ.. సోమ వారం రంగారెడ్డి జిల్లా కొత్తూరులో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యవస్థీకృత స్వరూపానికి తీవ్ర నష్టం కలిగించిందని.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
తాము అధికారంలోకి వచ్చాక ఈ వ్యవస్థలకు ఆర్‌ఎస్‌ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దేశ ఐక్యత కోసం చేపట్టిన భారత్ జోడో యాత్ర కచ్చితంగా రాజకీయ కార్యక్రమమేనని చెప్పారు. ఈ సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలు ఆయన మాటల్లోనే.. ‘‘టీఆర్‌ఎస్ అవినీతి పార్టీ, ఆ పార్టీ అవలంబించే వైఖరితో మేం కలిసి పనిచేయలేం. ఆ ప్రశ్నే లేదు. తెలంగాణ ప్రజలను టీఆర్‌ఎస్ లూటీ చేస్తోంది. దళితులు, గిరిజనుల నుంచి భూములను లాక్కుంటోంది.
విద్యా వ్యవస్థను నాశ నం చేస్తోంది. మేం అన్ని విధాలా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం. ఆ పార్టీతో కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. దీనిపై మేం చాలా స్పష్టంగా ఉన్నాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ టీఆర్‌ఎస్ పార్టీనే దీనిపై గందరగోళాన్ని సృష్టిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అందరం కలిసి పనిచేసి ఎన్నికల్లో విజయం సాధిస్తాం.
కేసీఆర్ అమెరికాలో పోటీ చేయాలనుకున్నా స్వాగతిస్తాం
ఏ నాయకుడైనా తన పార్టీని కావాల్సిన విధంగా ఊహించుకోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అదే తరహాలో జాతీయ పార్టీని నడపాలని అనుకుంటున్నారు. ఆయన అలా అనుకుంటే మాకేం ఇబ్బంది లేదు. ఆయన గ్లోబల్ పార్టీ నడపాలనుకున్నా అడ్డుకోవాల్సింది ఏమీ లేదు. అంతర్జాతీయ పార్టీని నడపాలని.. అమెరికా, చైనా, ఇతర దేశాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన భావించవచ్చు. అందుకు కూడా మాకు ఇబ్బంది లేదు. స్వాగతిస్తాం కూడా.
వ్యవస్థలపై పద్ధతి ప్రకారం దాడి
కొన్నేళ్లుగా దేశంలోని వ్యవస్థల మౌలిక స్వరూపానికి చాలా నష్టం జరుగుతోంది. పద్ధతి ప్రకారం వ్యవస్థలపై దాడి చేస్తున్నారు. మీడియాతోపాటు న్యాయ, అధికార వ్యవస్థలను నా శనం చేస్తున్నారు. జాతీయ స్థాయితో పాటు క్షేత్ర స్థాయి వర కు ఇది జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థలకు ఆర్‌ఎస్‌ఎస్ కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తాం. ఈ సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తితో నడిచేలా చూస్తాం.
మేమొస్తే స్వేచ్ఛా వాతావరణం
ప్రస్తుతం దేశం ఉపాధి సృష్టించలేని దుస్థితికి వెళ్లిపోయింది. అధికార కేంద్రీకరణ, క్రోనీ క్యాపిటలిజం వంటివే దీనికి కారణం. బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ ఒకరిద్దరు పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగేలా చేస్తూ ఇతర పోటీదారులను తప్పించడం ద్వారా నియంతృత్వాన్ని తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మేం అధికారంలోకి వస్తే స్వేచ్ఛా వాణిజ్య వాతావరణాన్ని కల్పిస్తాం.
ఇతర పార్టీలవారూ యాత్రలో..
ఫిజికల్ ఫిట్‌నెస్ కావాలంటే జిమ్‌కు వెళ్లొచ్చు. ఇలా యాత్ర చేయడం కాదు. దేశాన్ని ఏకం చేసేందుకు భారత్ జోడో యాత్ర చేపట్టాం. యాత్రలో లక్షలాది మంది మాతో వచ్చి చేరుతున్నారు. వారి మనోభావాలను పంచుకుంటున్నారు. కాంగ్రెసేతర పార్టీల కార్యకర్తలు, సాధారణ ప్రజలు కలసి వస్తున్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేయాలనుకున్నాం. వీలైనన్ని రాష్ట్రాల మీదుగా యాత్ర జరిగేలా ప్లాన్ చేశాం.
బీసీల లెక్కను ప్రజల ముందు పెట్టాలి
దేశంలో ఓబీసీ జనాభా గణనను తలపెట్టిందీ, చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. బీసీల జనాభా లెక్కలను ప్రజల ముందు పెట్టాల్సిందే. దేశ జనాభా స్వరూపాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నదే నా ఉద్దేశం. అంతకు మించి వేరే ఆలోచన లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను.
ప్రజాస్వామ్యంపై వాళ్లనెందుకు అడగరు?
మాది ప్రజాస్వామ్యయుత పార్టీ. కాంగ్రెస్‌లో నియంతృత్వం నడవదు. పార్టీ అధ్యక్షుడిని కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎన్నుకున్నాం. మా పార్టీ డీఎన్‌ఏలో నియంతృత్వం అనేదే లేదు. అంతర్గత విభేదాలు సహజం. అయినా పార్టీ నేతలంతా కలసి పనిచేస్తారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌లలో ఇలాంటి ఎన్నికలు జరగవు. మీడియా కూడా ఎప్పుడూ కాంగ్రెస్ గురించి, ఎన్నికలు, విభేదాల గురించి అడుగుతుందేతప్ప.. టీఆర్‌ఎస్, బీజేపీలలో ప్రజాస్వామ్యం గురించి ఎందుకు ప్రశ్నించదో అర్థం కాదు.
ఆ పార్టీలకు అంత డబ్బు ఎక్కడిది?
బీజేపీ, టీఆర్‌ఎస్‌లు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోందన్నదే ప్రశ్న. అది అవినీతి నుంచే వస్తోంది. అందుకే విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ రెండు పార్టీలు ప్రజల సొమ్ము దోచుకుని వారికే ఎన్నికల రూపంలో పంచిపెడుతున్నాయి. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య సారూప్యత కనిపిస్తుంది.
నేనేం చేయాలో ఖర్గే నిర్ణయిస్తారు
గుజరాత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అక్కడ కాంగ్రెస్ బలంగా పోరాడుతోంది. ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారే తప్ప ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్‌లో బలంలేదు. కాంగ్రెస్ గెలిచి తీరుతుంది. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో నా పాత్ర ఏమిటనేది ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయిస్తారు.
పక్కదారి పట్టించినా దారి మళ్లం
కొందరు యాత్రను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేం భారత్ జోడో యాత్ర నుంచి దారిమళ్లదల్చుకోలేదు. ఇది క్రీడా యాత్ర కాదు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల విభజన కుట్రలపై రాజకీయ పోరాట చర్య. విద్వేషం, హింసను ప్రేరేపించడం ద్వారా దేశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు బలహీనపరుస్తున్న తీరును, జాతి వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యం. మతం, కులం, పేద, ధనిక అనే భేదం లేకుండా అందరినీ కలవడమే ప్రస్తుతానికి నా ఉద్దేశం.
ప్రజలతో మా బంధం బలపడుతుంది
కాంగ్రెస్‌కు, ప్రజలకు మధ్య బంధం బలహీనపడిందని చెప్పానేగానీ తెగిపోయిందని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ బంధాన్ని మెరుగుపర్చుకునేందుకు భారత్ జోడో యాత్ర రూపంలో ఓ మంచి అడుగు పడింది. ఈ యాత్ర ద్వారా ఏదో మ్యాజిక్ జరగాలని కూడా మేం కోరుకోవడం లేదు. దేశం ఎటు వెళ్లాలన్న దానిపై కాంగ్రెస్ పార్టీకి ఓ దృష్టి, ఉద్దేశం, లక్ష్యం ఉన్నాయి. వాటిని కాపాడుకుంటే ప్రజలతో మా బంధం నిలబడుతుంది, బలపడుతుంది.
గాంధీజీ నేర్పిన భావోద్వేగమే కాంగ్రెస్ పార్టీ
బీజేపీని ఓవైపు నుంచి రాజకీయ సంస్థలాగానే చూస్తాం. కానీ వాస్తవంగా బీజేపీ అనేది భావోద్వేగం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకుల్లో ఈ ఉద్వేగం చాలా బలంగా ఉంది.
ఆ భావోద్వేగం పరాకాష్టకు చేరడమే ద్వేషం. సావర్కర్, గోల్వాల్కర్ వంటి నాయకుల గురించి కూడా నేను చదువుకున్నాను. తరచిచూస్తే వారి భావనలో విద్వేషం కనిపించదు. కానీ భయం కనిపిస్తుంది.
ఆ భయం నుంచే విద్వేషం పుడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా భావోద్వేగమే. గాంధీజీ నేర్పిన ఉద్వేగం మాది. భయానికి వ్యతిరేకంగా ఘర్షణ పడడమే ఆయన మాకు నేర్పారు. ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాం. భయాన్ని తరిమికొట్టాలని, పిరికిపంద చర్యలకు పాల్పడవద్దని చెప్తున్నాం. దీనితోనే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది..’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.
గుజరాత్ ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదు
విలేకరుల సమావేశానికి ముందు గుజరాత్‌లోని కేబుల్ బ్రిడ్జి ప్రమాద మృతులకు రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. అయితే ఆ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. ‘‘గుజరాత్ ప్రమాద ఘటనను రాజకీయం చేయదల్చుకోలేదు. ప్రజలు చనిపోయారు. దీన్ని రాజకీయం చేయడం ఆ మృతులను అవమానించడమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు.
కాగా ఈ ప్రెస్‌మీట్‌కు ఏఐసీసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు జైరాం రమేశ్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ నేతలు మాణిక్యం ఠాగూర్, మధుయాష్కీగౌడ్, జెట్టి కుసుమకుమార్, బోరెడ్డి అయోధ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment