సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/జోగిపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రాష్ట్రంలో రైతుల గోడు ఏమాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. నిత్యం రైతులతో మమేకమై వారి సంక్షేమం కోసం పనిచేయాల్సిన కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి రైతుల భూములు ఎలా లాక్కోవాలో చూస్తున్నారని, దళితులు, గిరిజనుల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.
నరేంద్ర మోదీ, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని, రైతులకు వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలకు కేసీఆర్ మద్దతు పలికారని పునరుద్ఘాటించారు. ఉద్యోగాలిచ్చే, ఉపాధి అవకాశాలను కల్పించే రంగాలను మోదీ, కేసీఆర్‌లు కలిసి నిర్వీర్యం చేశారని విమర్శించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా శనివారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం పెద్దపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
నోట్ల రద్దు, జీఎస్టీతో కుదేలు
నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో చిరు వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు కుదేలయ్యాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. బీహెచ్‌ఈఎల్, రైల్వే వంటి ప్రభుత్వ
రంగ సంస్థలను విక్రయిస్తున్న మోదీ బడా పారిశ్రామిక వేత్తలకు, బడా వ్యాపా రులకు మేలు చేస్తున్నారని ఆరోపించారు.
మోదీ, కేసీఆర్ పాలనలో దేశం, రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని చెప్పారు. సిలిండర్ ధర రూ.400 ఉందంటూ అప్పట్లో విమర్శించిన మోదీ.. ఇప్పుడు దాని ధర రూ.1,000 దాటినా, పెట్రోల్ ధర రూ.వంద దాటినా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
కేసీఆర్ రైతుల మాట వినాలి
బహిరంగ సభ వేదికపై నాగిరెడ్డి అనే రైతుతో రాహుల్ మాట్లాడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీవ్ర నష్టం చేస్తోందని నాగిరెడ్డి అన్నారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాల సబ్సిడీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని, జీఎస్టీతో ఎరువుల ధరలు పెరిగాయని, ధాన్యానికి మద్దతు ధర అందడం లేదని చెప్పారు. రాహుల్ స్పందిస్తూ.. సీఎం కేసీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి.. నాగిరెడ్డి వంటి రైతుల మాట వింటే రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు సభలో పాల్గొన్నారు.
రాహుల్‌ను కలిసిన మునుగోడు నాయకులు..
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున పనిచేసిన పార్టీ ముఖ్య నేతలు శనివారం రాహుల్‌గాంధీని కలిశారు. యాత్ర విరామ సమయంలో వారితో రాహుల్ సమావేశమయ్యారు. మండల ఇన్‌చార్జీలతో ఫొటోలు దిగారు.
వృద్ధులతో ఆప్యాయంగా..
చౌటకూర్ నుంచి దానంపల్లి వరకు నిర్వహించిన భారత్ జోడో పాదయాత్రలో రాహుల్‌గాంధీ.. వృద్ధులను ఆప్యాయంగా పలకరించడం, రోడ్డుపైనే ఫుట్‌బాల్ ఆడడం, గీత కార్మికుడు వినియోగించే లొట్టి, మోకు ధరించడం, కుండల తయారీలో పాలు పంచుకోవడం, కళాకారులతో ముచ్చడించడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment