ఆర్.సి.కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీడీపీతో పొత్తు విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది ఏఐసీసీ నిర్ణయిస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించగా ‘‘ఆ పార్టీకి కొన్ని చోట్ల ఓటు బ్యాంకు ఉంది. అయినా ఫలానా పార్టీతో పొత్తు పెట్టుకోకూడదని ఉందా? అలా పెట్టుకుంటే నేరం అవుతుందా?’’అని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
పొత్తుల పరిస్థితి ఎలా ఉన్నా ఈసారి ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని, ఉత్తర తెలంగాణలోనూ మంచి ఫలితాలు సాధిస్తామని చెప్పారు. అక్కడ బస్సుయాత్రకు వస్తున్న బ్రహ్మాండమైన స్పందనే ఇందుకు నిదర్శనమన్నారు. హైదరాబాద్‌పై తమకు ప్రత్యేక వ్యూహం ఉందంటూ.. సెటిలర్ల విషయంలో ఏం చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామని, వారంతా ఈసారి తమ వైపే ఉంటారని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో సీమాంధ్రకు చెందిన కొందరు నేతలకు ఇక్కడ సీట్లు ఇస్తామని చెప్పారు.
ఎంఐఎంకు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం నడుస్తోందని, ఈసారి ఎంఐఎం పోటీచేసే స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించుతామని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య అభిప్రాయ భేదాలు సహజమని, ఎన్నికల్లో అందరం కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన చాలా మంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి గురించి పార్టీలో అంతర్గతంగా మాట్లాడుతున్నామని, త్వరలోనే చేరికలుంటాయని తెలిపారు. భట్టి, రేవంత్, పొన్నం తదితర నేతల పాదయాత్రల ఎలా ఉంటాయనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని వివరించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు మాత్రం ఈసారి టికెట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రాహుల్‌గాంధీనే చెప్పారని, టికెట్ కావాలనుకునే డీసీసీ అధ్యక్షులు ఆ పదవికి రాజీనామా చేయాలని పేర్కొన్నారు.
టీడీపీతో పొత్తు ఉంటుంది: మల్లు రవి
టీడీపీతో పొత్తు విషయంలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లురవి సై అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని వ్యాఖ్యానించడం గమనార్హం.
బీసీలకు కాంగ్రెస్‌లోనే న్యాయం: ఉత్తమ్
బీసీలకు కాంగ్రెస్‌లోనే న్యాయం జరుగుతుం దని పీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ నేత అచ్చ విద్యాసాగర్‌కు కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉత్తమ్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌లో ఉద్యమకారులకు కాకుండా బీటీ బ్యాచ్‌కే పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు.
గొడవలు కట్టడి చేయండి
పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కాంగ్రెస్ సీనియర్లు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియాకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మాజీ ఎంపీలు రేణుకాచౌదరి, వి.హనుమంతరావు, సీఎల్పీ ఉపనాయకుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు దాదాపు గంటపాటు కుంతియాతో సమావేశమై పార్టీ అంతర్గత అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకునే విషయంలో చొరవ తీసుకోవాలని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించి అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేయాలని వారు కోరారు. ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే సమయం కూడా ఆసన్నమైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment