12 నుంచి రాష్ట్రంలో కుంతియా పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా ఈ నెల 12, 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించ నున్నారు. ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా రాష్ట్రానికి రానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్టు సోమవారం ఆయన మీడియాకు తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రాష్ట్రం లోనే ఉండి అన్ని మండలాల కాంగ్రెస్ కమిటీలతో మండల కేంద్రాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు ఖాయమని, ప్రజలు తమ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చిందని, ఈ విషయం ప్రజల మనసుల్లో ఉందని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఉనికి, మనుగడ నామమాత్రమేనని, టీఆర్‌ఎస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్న విషయాన్ని ప్రజలు గ్రహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పొన్నం నిరాహార దీక్షపై కుంతియా వాకబు
పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ కరీంనగర్‌లో చేస్తున్న నిరాహార దీక్షపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా వాకబు చేశారు. సోమవారం ఇక్కడ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్ కుంతియాను కలిశారు. ఈ సందర్భంగా కుంతియా పొన్నం చేస్తున్న దీక్షపై వాకబు చేశారు. అధిష్టానం నుంచి పొన్నం ప్రభాకర్‌కు పూర్తి మద్దతు ఉంటుందని కుంతియా చెప్పినట్టు పొన్నాల మీడియాకు తెలిపారు.