నాలుగు రోజుల్లో జిల్లా కమిటీలు  | Congress finalise candidates in Telangana by February end | Sakshi
Sakshi News home page

నాలుగు రోజుల్లో జిల్లా కమిటీలు 

Published Tue, Feb 12 2019 3:03 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

Congress finalise candidates in Telangana by February end - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలే నియమితులైన జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, నాలుగు రోజుల్లో జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా ఆయా జిల్లాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని సూచించారు. సోమవారం గాంధీభవన్‌లో నూతన డీసీసీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ భేటీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్‌ కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, ఎమ్యెల్యేలు ఆత్రం సక్కు, రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉత్తమ్, కుంతియా మాట్లాడుతూ.. రానున్న లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని కోరారు.

ఈనెల 15లోగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని, 21 మంది కంటే ఎక్కువ సభ్యులను కమిటీల్లో నియమించకూడదని చెప్పారు. బ్లాక్, మండల, బూత్‌ లెవల్‌ కమిటీలనూ వెంటనే ఏర్పాటు చేసుకోవాలని, బూత్‌ ఏజెంట్ల నియామకం కూడా ఇప్పుడు చేయాలని సూచించారు. అలాగే కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ఏర్పాటు కోసం కార్యాచరణ రూపొందించుకోవాలని, పార్టీ కార్యకలాపాలన్నీ కార్యాలయం వేదికగానే జరగాలని, క్షేత్రస్థాయిలో అందరికీ సమాచారం ఇచ్చిన తర్వాతే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు డీసీసీ అధ్యక్షులకు అవకాశం ఉండదని సంకేతాలిచ్చారు. కాగా, ఈ భేటీకి భరత్‌ చందర్‌రెడ్డి (మహబూబాబాద్‌), వనమా వెంకటేశ్వరరావు (కొత్తగూడెం), ఈర్ల కొమురయ్య (పెద్దపల్లి) హాజరుకాలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement